వాక్యనిర్మాణము (Sentence Formation)

విషయాన్ని అర్థవంతముగా, సంపూర్ణముగా, స్పష్టముగా భావప్రకటనని తెలియచేసే పదముల సముదాయమును వాక్యం అంటారు.    అనగా పదసమాగమము నుండి పుట్టిన అర్ధమే వాక్యము.  వాక్యనిర్మాణమునకు “యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి” అను మూడు అంశములు ప్రధానమైనవి.  యోగ్యత అనగా పదముల మధ్య కల సంబంధాన్నిఅర్థవంతంగా కూర్చే ప్రక్రియ.  ఆకాంక్ష అనగా నిలుపుదల లేకుండ వెంటవెంటనే వచ్చు పదముల మీద ఆదరము. ఇది వినేవారికి తెలుసుకోవాలి అనే అపేక్షారూపమున ఉండును. పులి, సింహము, ఏనుగు అని పలికితే వినువారికి ఆకాంక్ష కలుగదు. కానీ ఇది పులి, ఇది సింహము, ఇది ఏనుగు అని అనగానే ఏది పులి, ఏది ఏనుగు, ఏది సింహము ఎక్కడ ఉన్నాయి అనే ఆకాంక్షకు అవకాశముంది. ఆసక్తి అనగా వాక్యములోకల పదములు సన్నిహితంగా ఉచ్చరించునపుడుగాని అర్ధము బోధపడదు. రాముడు అను పదము ఇప్పుడు సీత అను పదము మరొక గంటకు చెప్పి అడవికి వెళ్ళేరు అని రేపు చెబితే అది వాక్యము అవదు.

వాక్యనిర్మాణ ప్రాథమిక నియమాలని ఒకసారి పరిశీలిద్దాం.

1) వాక్యంలో కర్త (subject), క్రియ (verb) మామూలుగా అన్ని భాషలలాగే ఉంటాయి.

2) కర్మ (object) కొన్ని క్రియలకు మాత్రమే వర్తిస్తుంది. వీటిని సకర్మక క్రియలు (transitive verbs) అంటాము.

ఉదా:- తినుట; నేను అన్నం తిన్నాను
నేను – కర్త; అన్నం – కర్మ; తిన్నాను – క్రియ.

3) కర్మను ఆశించని క్రియలను అకర్మక క్రియలు (intransitive verbs) అంటాము.

ఉదా: నడచుట; అతను నిద్రపోయాడు.
అతను – కర్త; నిద్రపోయాడు – క్రియ

4) తెలుగులో క్రియ చాలా సార్లు కర్తని కూడ సూచించి, కర్తని వదిలేసినా నష్టం లేకుండా చేస్తుంది. అలాగే క్రియాపదం ఒక్కటే చాలసార్లు వాక్యం లోని కాలాన్ని (tense) లేదా ఆంతర్యం (mood or tone) ని సూచిస్తుంది.

ఉదా: “నడచుకుంటూ వెళ్ళిపోయాను” (I went away walking) అనే వాక్యంలో నేను (I) అనే మాట లేకపోయినా అర్థానికి ఏమీ ఇబ్బంది లేదు. అలాగే ఇది భూతకాలం (past tense) లో చెప్పిన వాక్యమని కూడా అర్థమవుతుంది.

ఉదా: “వెళ్ళిపో” (‌Go away) అన్న వాక్యం లో నువ్వు (You) అన్న కర్త, అధికారిక ఆంతర్యం (imperative mood) ఇమిడి ఉన్నాయి.  ఇలా వ్రాయడం తప్పేమీ కాదు సరికదా – కొన్ని సందర్భాలలో ఒక రకమైన శైలి (style) కూడా.

5) తెలుగులో వాక్య నిర్మాణం “ద్రవిడ భాషా మూలాల” నుంచి వచ్చింది. కాని చాలా పదాలు, సంస్కృత భాష నుంచి తెచ్చుకున్నవి. వాక్యంలో ఏ పదం సంస్కృత మూలమో, ఏది అచ్చ తెలుగు (లేదా ద్రవిడ) పదమో తెలియడం తెలుగులో మెరుగైన భాషాజ్ఞానానికి చాలా సహాయకరం, అవసరం కూడాను. కొన్ని సమయాలలో సమానమైనవైనా సరే సంస్కృత/తెలుగు పదాల వాడుక పాత్రోచితంగాను, వైఖరి లేదా ఆంతర్యాన్ని చూపించేదిగానూ వాడతారు.

ఉదా: “జీవితం మీద విరక్తి చెందాడు” (“జీవితం”, “విరక్తి” అనేవి సంస్కృత పదాలు) లేదా

“బతుకు మీద రోత పడ్డాడు” (“బతుకు”, “రోత” – అచ్చ తెలుగు మాటలు)

పై రెండు వాక్యాలకీ అర్థం దాదాపు ఒకటే. అయితే సందర్భం, పాత్ర (role or character) బట్టి, ఒక్కోసారి ఒక్కో వాక్యం ఉపయోగిస్తే బాగుంటుంది.

6) చివరగా తెలుగులో “కర్త” ప్రయోగం (active voice) సహజం. ఈ కాలంలో ఆంగ్ల, హిందీ భాషలని అనుకరిస్తూ “కర్మ” ప్రయోగం (passive voice) వాడుక పెరుగుతున్నప్పటికీ ఇది చాలా సార్లు తెలుగులో కృతకం (artificial) గా ఉంటుంది

సాధన చేయుటకు చిన్న వాక్యములు

పెద్దలు పిల్లలచేత ఈ అభ్యాసములను చదివించి వ్రాయించి సాధన చేయించవలెను.

అభ్యాసము-1

  1. అక్షయ స్కూలుకు వెళ్ళుటకు సిద్ధపడుచున్నది.
  2. ఆశ్రిత్ క్రికెట్ ఆడుతున్నాడు.
  3. వందన పాట పాడుతున్నది.
  4. చిత్ర నాట్యము నేర్చుకొనుచున్నది.
  5. రవి, లాస్య బడికి వెళ్తున్నారు.
  6. యశస్వి ఆశ్రిత్ మీద చాడీలు చెప్పును.
  7. సృజన అమ్మవద్ద శద్ధగా చదువుచున్నది.
  8. అక్షయ కంప్యూటరు నేర్చుకొనుచున్నది.
  9. శ్రీవిద్య వంట చేయుచున్నది.
  10.   గాయత్రి పూజ చేయుచున్నది.

అభ్యాసము – 2

  1. మున్నా కూరలు తరుగుతున్నాడు.
  2.  మహర్షి బజారుకువెళ్లినాడు.
  3.  సునీల్ సినిమాకి వెళ్లెను.
  4.  కుమార్ కి ఫోటోలు తీయడమన్న ఇష్టం.
  5.  రాజు వాళ్ళ అన్నయ్యతో పరుగెడుతున్నాడు.
  6.  ఆశ్రిత్ కి బెండకాయలు తినడం ఇష్టం.
  7.  టి.వి లో భరత్ అనే నేను సినిమా వస్తునాది.
  8.  రెడ్డి కి మన్యంపులి సినిమా అంటే ఇష్టం.
  9.  సురేష్ డాక్టరుగారు వద్దకు వెళ్ళినాడు.
  10.  ఉమ వాళ్ళ ఇంటిలో పువ్వులు కోస్తున్నాది.

అభ్యాసము – 3

  1. నేను దుకాణంలో బియ్యం కొన్నాను.
  2. పద్మ కుళాయి దగ్గర నీళ్లు పడుతున్నది.
  3.  మా తమ్ముడు రంగులరాట్నం తిరుగుతున్నాడు.
  4. అమ్మ చాకలివానికి అన్నం పెడుతున్నది.
  5. మా పక్కింటి పెరడులో జామచెట్టు ఉంది.
  6. సుమతి స్నానం చేస్తున్నది.
  7. శ్రీను స్వీట్ కొంటానని బజారుకి వెళ్ళేడు.
  8. అమల వాళ్ళ కుక్క జూలు కుక్క.
  9. మా ఇంటిలో మందార చెట్టు ఉన్నది.
  10. సరళ వాళ్ళ పిల్లి దొంగ పిల్లి.

అభ్యాసము – 4

  1. మా తాత గారితో నేను మా అక్క ‘జూ’ కి వెళ్ళాము.
  2. మా అన్నయ్య నాకు సైకిలు తొక్కడం నేర్పుతున్నాడు.
  3. నేను మా అక్క మా పక్కింటికి బొమ్మలకొలువు చూచుటకు వెళ్ళేము.
  4. ఈరోజు మా వీధికి దేముడిని పల్లకిలో తీసుకువచ్చేరు.
  5. నేను మా తమ్ముడు స్కూలుకి స్కూలు బస్సులోనే వెళతాము.
  6.   శెలవు దినాలలో నేను మా అక్క మా స్నేహితులతో ఆడుకుంటాము.
  7. మా నానమ్మ నాకు, తమ్ముడికి మా జాజి పందిరి మీద పిచుకలు చూపించింది.
  8. అమ్మమ్మ నాకు, అక్కకి కధలు చెబుతూ పడుకోపెడుతుంది.
  9. మామయ్య నాకు తమ్ముడికి కోవా కజ్జికాయాలు తెచ్చేడు.
  10. నేను, అక్క మా అత్తతో బజారుకెళ్లి మామిడిపళ్ళు కొనుక్కున్నాము

అభ్యాసము – 5

  1. మా కుటుంబం అందరమూ తిరుపతి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాము.
  2. అక్షయ ఎక్కువగా టీచర్ ఆట ఆడుతుంది.
  3. ఆశ్రిత్, భాను మంచి స్నేహితులు.  వాళ్లెప్పుడూ కారు బొమ్మతో ఆడుకుంటారు.
  4. వినాయక చవితి పండుగకు నేను, తమ్ముడు, మా అమ్మ నాన్న కలసి పూజ చేసేము.
  5. జాన్ మంచి దొంగ. మోటు జాన్ ని అనవసరంగా కొడతాడు.
  6. అరకులో సూదిగా చేసిన బాణాలు అమ్ముతారు.
  7. చింగం ఎప్పుడు రివాల్వర్ పేల్చినా కొబ్బరిబోండాలు పడతాయి.
  8. మా స్కూలు లో ప్రార్ధన చేసినప్పుడు జాతీయగీతం పాడిస్తారు.
  9. నేను భారతదేశంలో పుట్టినందుకు గర్వపడతాను.
  10. మాతృభూమి ఋణం తీర్చుకోవడం గొప్ప అవకాశం.
Scroll to Top