ఆ.సు. కబుర్లు : ఇదెక్కడి చోద్యం?

ఇదెక్కడి చోద్యం?.

ఈ శీర్షిక లో వ్రాసిన ప్రదేశాలు, పాత్రలు, సన్నివేశాలు, పేర్లు మొదలైనవి కేవలం వినోదం కోసం సృష్టించబడినవే కానీ ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కాదు. ఒకవేళ ఇందులో వ్రాసిన పై విషయాలకు సంబంధించి సరిపోలిన యెడల అది కేవలం యాదృచ్ఛికమే కానీ ఉద్దేశపూర్వకమైనవి కాదని మనవి.

మధ్యాహ్నం మృష్టాన్న భోజనం చేసి బ్రేవ్ మని త్రేన్చుతూ కూర్చున్నారు జంఘాల శాస్త్రి గారు. భార్య గేనపెసూనాంబగారు ఇంకా వంటిట్లో పని చేస్తున్నారు.  జంఘాల శాస్త్రి గారు ఆలస్యం తట్టుకోలేక ఒసేయ్ ‘భోజనానంతరం తాంబూల చర్వణం అన్నారు’ విపిస్తున్నాదా కాలభైరవ పట్టి అని అరిచేడు.  ఆవిడ లోపలినుంచి వస్తున్నానండి అని తాంబూలానికి తమలపాకులు, సున్నం, వక్కలు  వగైరా పట్టుకుని వచ్చి ఇంకా మెయ్యండి  వానర పుత్ర అని అందించింది. నెమ్మదిగా   వాళ్ళు మాటల్లో పడ్డారు.  ఏమాటకామాటే చెప్పుకోవాలి కానీ గేనపెసూన ఒకరి మొహం చూస్తే పెట్ట బుద్ధవుతుంది. ఒకరి మొహం చూస్తే కొట్టబుద్ధవుతుంది అంటారు. ఎదో తండ్రిచాటు బిడ్డని, భర్తచాటు భార్యని, లోకజ్ఞానం తెలీనిదాన్నిఅదేంటో గానీ ఎన్నితప్పులు చేసినా దేవతలను పొగుడుతాం ఎన్ని ఒప్పులు చేసినా రాక్షసుల్ని తిడతాం.  దేవుళ్లకో రూలు. రాక్షసులకోరూలు.  అన్న శ్రీరాముణ్ని గుడ్డిగా అనుసరించిన లక్ష్మణుణ్ని ఆదర్శప్రాయుడైన తమ్ముడని చెప్పుకుంటాం! రాక్షసుడు కాకపోతేనేం, పాపం దుశ్శాసనుడు చేసింది కూడా తన అన్న చెప్పిన పనేగా. కానీ ద్రౌపది వస్త్రాపహరణం చేశాడని వాణ్ని నోటికొచ్చినట్లు తిడుతున్నాము.  రాక్షసుడు అంటే అసలు అర్థం దేవతలు చేసే యజ్ఞాల బారి నుంచి జంతువులను రక్షించేవాడు అని   కదండీ  అలాంటి రక్షకులను తక్షకుల్లాగా చూస్తే ఎలా? త్రేతాయుగంలోనూ ఇదే పరిస్థితి కదా! విభీషణుడు స్వధర్మాన్ని పాటించకుండా అన్న రావణాసురుడికి ఎదురు తిరిగి, రాముడి పంచన చేరి, ఆయనకు బేషరతు మద్దతునివ్వడం ఏం న్యాయం? ఇది వెన్నుపోటు రాజకీయం కాదంటారా ఎదో లోకజ్ఞానం తెలీని దాన్ని.

అంతేకాదండి ఈ దేవతల రాజకీయాలకి అంతు… పొంతూ   లేదండి. రాక్షసులకు వరాలు ఇచ్చినట్టే ఇచ్చి వారిని నిలువునా ముంచేశారు. పిచ్చమొహాలైన రాక్షసులు దేవతలను  నమ్మి నష్టపోయారు. రాక్షసులు నానా కష్టాలు పడి తపసు చేయడం, దేవతలు వాళ్లకు ప్రత్యక్షం కావడం, తమకు చావు రాకూడదంటూ వాళ్లు కోరడం, దేవుళ్లూ ఒప్పుకుని వరాలు ఇవ్వడం.. అంతా బాగుంటుంది కానీ, చివరకు ‘సాంకేతిక కారణాలతో’ ఆ వరాలు ఉపయోగంలోకి రాకుండా చేశారు దేవతలు దేవతలు రాక్షసులు అక్కచెల్లెళ్ల పిల్లలే కదా కొంచెం కూడా బంధుప్రీతి లేకుండా, జాలీ దయా కరుణా అనేవే లేకుండా రాక్షసుల్ని సంహరించారు దేవతలు. రాక్షసులకు శివుడు వరాలు ఇవ్వడం ఎందుకు? ఆ వరాల్ని ఉపయోగించుకున్న పాపానికే రాక్షసుల్ని విష్ణుమూర్తి వచ్చి మట్టుపెట్టడం ఎందుకు? భస్మాసురుడులాంటి వాళ్లు బలిపశువులు అయిపోలేదా? దేవతలది దొంగభక్తి అయితే రాక్షసులదే అసలు సిసలు భక్తి. ఏం చేసినా వాళ్లు త్రికరణ శుద్ధిగా చేస్తారు. మాటలకు చేతలకు తేడా ఉండదు. కానీ దేవతలకు అలా కాదు. ‘మూతిదారి మూతిదే. చేతిదారి చేతిదే’. దేవతల మాటలకు, చేతలకు పొంతన ఉండదు. రాక్షసులకు ఉన్న సద్గుణాలు దేవతలకు ఎక్కడ ఏడ్చాయి? ఏ తప్పూ చేయనివాళ్లని ‘నిప్పు’తో పోల్చుతారు కానీ, రుషిపత్నులతో అగ్నిదేవుడు ఎలా ప్రవర్తించాడసలు? ఈయన నిర్వాకంతో పోల్చితే ‘మనసు పడ్డాను మహాప్రభో’ అన్న పాపానికే ముక్కూచెవులూ పోగొట్టుకున్న శూర్పణఖ మంచితనం ఎవరికీ తెలీదు లోక జ్ఞానంతెలీని దాన్ని నేను చెప్పింది కరెక్ట్ కదా!

            ఎక్కువ మంది భార్యలు ఉండడం తప్పు అనీ, పరస్త్రీ వ్యామోహం తప్పు అనీ శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. ఇదే నిజమైతే ఒక్క  శ్రీరామచంద్రుడు తప్ప ఆయన పేరులో చంద్రుడితో సహా దేవతలు ఈ ఆరోపణల నుంచి తప్పించుకోలేరు! ఫలానా దేవుడి రెండో భార్య ఎవరు అంటే ఎవరైనా చెబుతారు. కానీ రాక్షసులకు ఆ అపప్రథ లేదు. హిరణ్యకశిపుడి రెండో భార్య ఎవరు? రావణాసురుడి ద్వితీయ కళత్రం ఎవరు? అంటే ఎవరూ చెప్పలేరు. వారికి లేరు కాబట్టి. ఇలాంటి విషయాలు ఎన్నింటినో తులనాత్మక పరిశీలన చేస్తే, చంద్రుడికైనా మచ్చ ఉంది గానీ రాక్షసులకు అలాంటిది కనిపించదు గాక కనిపించదు. ఇక దేవతలకు ఉన్న వివాహేతర సంబంధాలు కోకొల్లలు. ఎందెందు వెదకి చూసిన అందందే కనబడతాయి. దేవతలకు రాజు, స్వర్గాధిపతి ఇంద్రుడికి వెయ్యి కళ్ల సంగతేమిటి? తెలుసుకుంటే చాలు విషయం ‘కళ్లకు’ కట్టినట్టు అర్థమైపోతుంది.  రాక్షసులకు అన్నింటిలోనూ అన్యాయమే జరిగింది. దేవతలతో సమానంగా కష్టపడ్డా ప్రయోజనం లేకుండా పోయింది. క్షీరసాగర మథనంలో పుట్టినవన్నీ దేవతలే కొట్టేశారు. చివరకు విషాన్ని కూడా ఆ శివుడే తీసుకున్నాడు. రాక్షసులకు శ్రమదోపిడీ మాత్రమే మిగిలింది. దీనికి ఏ లేబరు కోర్టులోనూ న్యాయం జరగలేదు.

            గొప్పవాళ్లను ఇంద్రుడు చంద్రుడు అంటారే! అదే నిజమైతే తారాశశాంకం ఏం చెబుతోంది? దాన్ని ‘సీరియస్‌’గా తీసుకుంటే బృహస్పతి తాతల్లాంటి గురువైనా ఏ ‘శిష్యచంద్రుణ్నయినా’ చేరదీస్తాడా? ఇక సూర్యుడు, కుంతి సంగతేమిటి? అన్నింటికీ మించి రాక్షసులకున్న దానగుణం దేవతలకు ఎక్కడుంది? ఉదాహరణకు బలిచక్రవర్తికి ఉన్న దానగుణంలో సహస్రాంశం అయినా దేవతలకు ఉందా? లేనేలేదు. ‘వచ్చినవాడు విష్ణువు… తనను చంపడానికే వచ్చాడు’ అని బలిచక్రవర్తికి తెలిసినా భయపడలేదు వెనక్కుతగ్గలేదు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాడు.

ఆదిన్‌ శ్రీసతి కొప్పుపై తనువుపై అంసోత్తరీయంబుపై

పాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ

ర్యాదం జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే

ల్గాదె రాజ్యము గీజ్యమున్‌ సతతమున్‌ కాయంబు నాపాయమే

      అని బలిచక్రవర్తిని కళ్లారా చూసినట్టు, చెవులారా విన్నట్టు బమ్మెర పోతన భాగవతంలో చెప్పేశాడు. దీనికి అప్పీలు లేదు. ఇలాంటి వాడు దేవతల్లో ఒక్కరైనా దొరుకుతారా?

      దేవతలను సురులు అంటారు. అంటే సురను తాగేవాళ్లు అని అర్థం. రాక్షసులను అసురులు అంటారు. అంటే సురాపానం చేయని వాళ్లు. దేవతలు మంచివాళ్లని, రాక్షసులు చెడ్డవాళ్లని భూనభోంతరాలు దద్దరిల్లేట్టు ప్రచారం చేశారు. ఇంతకీ తాగని వాళ్లు మంచివాళ్లా? తాగేవాళ్లు మంచివాళ్లా? తాగేవాళ్లే మంచివాళ్లయితే మందుబాబులను ఎందుకు చిన్నచూపు చూస్తారు? చెడ్డవాళ్లుగా ఎందుకు చిత్రిస్తారు?  ఇదేమి చోద్యమండి?  గేనపెసూనాంబ  గుక్కతిప్పుకోకుండా మాట్లాడిన తీరుకి జంఘాల శాస్త్రికి నోటిమాట….కంటిచూపు పోయి నిశ్చేష్టుడై    కూలపడ్డాడు