ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
ముక్కంటి, ముక్కోపి, తిక్క శంకరుడు
వాన బొట్టు ఆల్చిప్పలో పడితేనే ముత్యం అవుతుంది. అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది అలా సాక్షాత్తు సరస్వతీ దేవి తెలుగు తెరకు అందించిన అపురూప ఆణిముత్యం సీతారామశాస్త్రీ తన తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రీ ప్రస్థుతం తెలుగు సినిమా సాహిత్యానికి పెద్దదిక్కుగా నడిపిస్తున్నారు. ఆయన కలం అన్ని భావాలను అవలీలగా పలికిస్తుంది. సీతారామశాస్త్రీ గారి పాటల్లో జీవిత సత్యాలు ఆలోచింప చేస్తాయి కొత్త జీవన మార్గాన్ని చూపిస్తాయి కోటేశ్వీరుణ్ణి కూటికి గతిలేని వాణ్ణి ఒకే బండి ఎక్కిస్తాయి. ఒకే గమ్యాన్ని చేరుస్తాయి. సంధేశాత్మక మాటలతో పాటలే కాదు, చిన్న చిన్న పదాలతో ఆకట్టుకునే పాటలు కూడా రాయగలరు సిరివెన్నెల. అలా ఆయన రాసిన అల్లరి పాటల్లో కూడా నీతి బోదలే కనిపిస్తాయి. అందుకే ఆయన సిరివెన్నెల అయ్యాడు. ప్రాసలు, గమకాలతో కూడా ఆయన ఆడుకోగలడు అందుకే ఆయన పాటల్లో శాస్త్రీయత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తెలుగు పాటకు పంచామృతాల పవిత్రతను కల్పించిన సిరివెన్నెలగారు వెండితెర మీద చేయని ప్రయోగం లేదు. సీతారామశాస్త్రి గారి కలానికి అన్ని వైపులా పదునే ఉంటుంది. అందుకే ఆయన ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగలరు. అద్భుతమైన భక్తి పాటలను రాసిన ఆయన ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి రోమాంటిక్ సాంగ్తో కూడా మెప్పించ గలరు. ఓ మంచి రచయితకు సరైన సందర్భం దొరికితే ఎలాంటి పాట వస్తుందో సీతారామశాస్త్రి గారు చాలా సార్లు నిరూపించారు. పవిత్రబందం సినిమాలో ఆయన రాసిన అపురూపమైనదమ్మ ఆడజన్మ పాట అలాంటి పాటల్లో ఒకటి. అచ్చమైన తెలుగు పదాలతోనే కాదు ఆయన పల్లెపదుల జానపదాలతోనూ ప్రయోగాలు చేయగలడు. రుద్రవీణ సినిమాలో ఆయన రాసిన నమ్మకు నమ్మకు ఈ రేయిని పాట ఆయనకు తెలుగు భాషమీద ఉన్న పట్టుకు ఓ నిదర్శనం. సీతారామశాస్త్రి ఓ రచయిత మాత్రమే కాదు సమాజంలోని తప్పులను ప్రశ్నించే ఓ సమాజ సేవకుడు కూడా. అందుకే దశాబ్దాల క్రితమే ఆయన ఈ సమాజంలోని సిగ్గులేని జనాల్ని నిగ్గదీసి అడగమంటూ పిలుపునిచ్చారు. దేశంలోని రాజకీయ సామాజిక వ్యవస్థల మీద కూడా సీతారామశాస్త్రి గారికి మంచి అవగాహన ఉంది. అందుకే ప్రస్థుత రాజకీయ సామాజిక వ్యవస్థను ప్రశ్నిస్తూ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యమందామా అంటూ ప్రశ్నించాడు. పదాలతో ఎలాంటి ప్రయోగాలు చేసినా ఆయనలో లోతైన తత్వవేత్త కూడా ఉన్నాడు. అందుకే ఆయన జగమంత కుటుంబం నాది అంటూనే ఏకాకి జీవితం నాది అంటూ నిట్టూరుస్తాడు. సంసార సాగరం నాదంటూనే సన్యాసం శూన్యం నాదంటాడు. ఆయన చెప్పిన తత్వం ఆయన మాత్రమే చెప్పగలిగిన వేదాంతం. సీతారామశాస్త్రి పాటలలో బరువైన పద ప్రయోగాలు ఆకట్టుకుంటాయి. మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాకా అన్న పదం ఆయన తప్ప ఇంకెవరు రాయగలరు. అందుకే ఆయన తెలుగు సినిమా సాహిత్యాన్ని శాసించగలుతున్నారు. భారీ పద ప్రయోగాలు, బరువైన మాటలే కాదు ఆయన చిన్న చిన్న పదాలతో ఈ తరానికి అర్ధమయ్యేలా అలరించేలా కూడా పాటలు రాయగలరు. ఖడ్గం సినిమాలో ఆయన రాసిన ముసుగువేయోద్దు మనసు మీద అన్న పాటలో ఎంత ఆధునికత ఉందో అంతే జీవిత సత్యం కూడా ఉంది. ఎలాంటి సందర్భం మీదైనా ఎలాంటి విషయం మీదైనా పాట రాయగలిగిన సీతారామశాస్త్రి ఆయన ఇష్టదైవం పరమేశ్వరుని మీద పాట అంటే మరింత ప్రేమగా రాస్తారు. ఆ అవకాశం ఆయన తొలి సినిమాలోనే వచ్చింది. ఆ అవకాశమే “ఆదిభిక్షువు వాడినేమి అడిగేది” అంటూ పాటగా ప్రవహించింది. ‘సిరివెన్నెల’ ఈ చిత్రంలో అన్ని పాటలు సీతారామశాస్త్రి గారే రాశారు. అన్నీ అద్భుతాలే. ముఖ్యంగా “విధాత తలపున” పాట ఇప్పటికీ రచయితలకి ఒక సవాల్. అందులో అంత గొప్ప సాహిత్యం ఉంటుంది కానీ, ఆ పాటను కాదని “ఆది భిక్షువు” పాట కి “నంది” పురస్కారం ఎందుకొచ్చిందో? ఇది ఆయనకు దక్కిన మొదటి నంది. ఈ పాట మొత్తం శివుని నిందిస్తునట్టు ఉంటుంది. ఇలాంటి వాటిని ‘నిందాస్తుతులు’ అని అంటారు. కానీ, ఒక రకంగా కీర్తిస్తునట్టు కూడా ఉంటుంది. అది ఈ పాట గొప్పతనం.
ఆదిభిక్షువు వాడినేది కోరేది?
బూడిదిచ్చేవాడినేది అడిగేది?
ఏది కోరేది? వాడినేది అడిగేది?
ఈ పాట ప్రారంభమే చాలా చమత్కారంగా ప్రారంభించేరు. మొదటిలోనే అసలు అంత లోతు భావంతో కూడిన ప్రాసని వింటే, మిగతా పాట వినకుండా ఎవరూ వదిలిపెట్టరు. బహుశా అందుకేనేమో మహదేవన్ గారు ప్రారంభంలో ఎటువంటి సంగీతం పెట్టకుండా, పాట మొదలవగానే ఈ రెండు పంక్తులు వచ్చేలా చేశారు. ఇప్పుడు మొదలవుతుంది అసలు సంగతి. ప్రకృతి పరంగా ఒక కోకిలని, చిలుకని పోల్చమంటే పోలుస్తాం గానీ కోకిలని మేఘాన్ని పోల్చమంటే? అసలు ఒకటి ప్రాణం ఉన్నది, ఇంకొకటి ప్రాణం లేనిది. ఒకదానికి ఒకటి అస్సలు సంబంధం లేదు. అయినప్పటికీ వాటిని జత కలిపి ఘనమైన అర్ధం స్ఫురింపజేసిన ఘనత సీతారామశాస్త్రిగారికే చెల్లింది.
“తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది?
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది?”
తియ్యటి శ్రావ్యమైనటువంటి పాటలు పాడే కోకిలకి నలుపు రంగేంటి? భయపెట్టే విధంగా గర్జనలు చేసే ఆ మేఘాలకి మెరుపులు అద్దడం ఏంటి? ఇటువంటి తింగరిపనులు చేసే శివుని ఏం అడుగుతాం? అంటూ ఆ రెంటిని శివునితో ఏకంచేసి రాసారు. సరే, ఇప్పుడు ఇంకొకటి. పువ్వుని, రాయిని పోల్చమంటే? ఏమని పోలుస్తాం? మీరు ఈ పాట ఇంతకు ముందు వినకపోతే కనుక, ఒకసారి ఆలోచించండి మీ బుర్రకి పని చెప్పండి. నేనైతే, పువ్వు రాయి మీద పడితే రాయికి ఏమి కాదు, కానీ రాయి పువ్వు మీద పడితే పువ్వు నలిగిపోతుంది అని చెప్పేవాడిని. అంతకుమించి తట్టదు. కానీ, ఇక్కడ సీతారామశాస్త్రి గారు ఎలా ఆలోచించేరో చూడండి. పువ్వుల ఆయుష్షుని లెక్కవేసి మళ్ళీ శివుని తిట్టారు.
“తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది?
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది?”
మకరంద మాధుర్యాన్ని ఇచ్చే పువ్వులకి మూడే రోజులు ఆయుష్షు ఇచ్చిఎటువంటి చలన గమనము లేకుండా అచేతనంగా పడుండే బండరాళ్ళకు చిరాయువును ప్రసాదించాడే అటువంటి వాడిని ఏం కోరుతాం? ఇదంతా చదివాక మీకు అనిపించచ్చు ఇక్కడ శివుడిని తిట్టారు కదా అని కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన తిడుతూ కూడా అవన్నీ చేసింది ఆయనే అని చెప్పకనే చెప్పారు. కోకిలని, మేఘాన్ని, పువ్వుని, రాయిని యావత్ విశ్వాన్ని సృష్టించింది ఆయనే అని తెలియచెప్పేరు. ఒక భక్తుడు తిట్టినా కూడా అది ఆర్తితో కూడినదే అయ్యుంటుంది రామదాసు “ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా” అని పాడుకున్నట్టు దీనికి ఈశ్వరుడు ఏమి అనుకోడు. “విధాత తలపున” పాట పండితులు సైతం నిఘంటుసహాయం కోరేలా రాస్తే ఈ పాటని పదవ తరగతి ‘తెలుగులో విఫలం అయినవాడికి కూడా అర్థమయ్యేలా రాశారు. అందుకే అత్యంత ప్రజాదరణ పొంది “నందిని తెచ్చిపెట్టింది. కాదు కాదు ఆ ఈశ్వరుడే ఆయనను తిట్టించుకుని, తిట్టినందుకు గాను ఆయన ‘నందిని బహుకరించాడు.
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప
దరిజేరు మన్మధుని మసి చేసినాడు
వాడినేది కోరేది
వర గర్వమున మూడు లోకాల పీడింప
తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది…
ముఖప్రీతి కోరేటి ఉక్కు శంకరుడు
వాడినేది కోరేది…
ముక్కంటి, ముక్కోపి తిక్క శంకరుడు
ఏది కోరేది వాడినేది అడిగేది
పార్వతిని తనకిచ్చి వివాహం చేయాలనే సత్సంకల్పంతో వచ్చిన మన్మథుడిని బూడిద చేశాడు అటువంటి వాడిని ఏమిటి కోరేది? సాక్షాత్తు ఆ పరమశివుడు ఇచ్చిన వరగర్వంతో లోకాలను పీడిస్తున్న రాక్షసులను మాత్రం కరుణించాడు అటువంటి వాడిని ఏమిటి అడిగేది? ముఖస్తుతికి మురిసిపోయే ఆ బోళాశంకరుడిని ఏమి కోరుకుంటాం. అసలే ఆయన ముక్కోపి, ముక్కంటి అంటూ నిందించాడు. మన్మధుడిని మసి చేసి, మళ్లీ ప్రాణం పోశాడు. రాక్షసులకు వరం ఇచ్చాడు, ఆ తరువాత అంతం చేశాడు. ఎవరిని ఎప్పుడు ఎలా చూడాలో ఆయనకు తెలుసు అని అంతర్లీనంగా స్తుతించాడు. నిందాస్తుతిలో సాగిన ప్రత్యేకమైన పాట, సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గా చేసిన పాట.
ఆదిభిక్షువు వాడినేది కోరేది. ఈ పాట అందరికి తెలిసినదే. ఈ పాటను సీతారామ శాస్త్రి గారు రాసుకుంటే దానిని సిరివెన్నెల చిత్రానికి వాడడం జరిగింది. ఆయన రాసుకున్న పాటలోని అన్ని చరణాలు సినిమా పాటలో లేవు. క్రింద నేను ఆ పాటలోని అన్ని చరణాలను మీతో పంచుకుంటున్నాను.
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
||ఆది భిక్షువు ||
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండ రాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
పగటి వెలుగును వేడితోటి రగిలించి పనికి ఫలితమ్ముగా చమట చిందించి
నిదురించు నిశిలోన శశి కాంతినించి చల్లదనమును కల్ల కలలుగా మిగిలించు
||ఆది భిక్షువు ||
ముల్లోకముల జ్ఞాన జ్యోతి వెలిగించగల మూడవ దృగింద్రియము మూసి ఉంచిన వాడు
తడబాటుతో తడుములాటతో వెతుకుటకు దారి చూపగలేని రెండు కళ్ళిచ్చాడు
||ఆది భిక్షువు ||
కారుణ్య చంద్రికల కురిపించు జాబిలికి కాలుష్యమొసగేటి ఆ కళాధరుడు
పురివిప్పి ఆడేటి నెమలి గాత్రమ్మునకు గావుకేకల పాట కూర్చేటి కవివరుడు
||ఆది భిక్షువు ||
మిన్నేటి ప్రళయమును ప్రణయమనుకున్నాడు బడిత పూజకు మురిసి పాశుపతమిచ్చాడు
తికమకలుగా జగతి గతి నడుపుతున్నాడు అసలు సంగతి మతికి అందనీకున్నాడు
||ఆది భిక్షువు ||
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుడిని మసిజేసినాడు
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
||ఆది భిక్షువు ||
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు
ముక్కంటి, ముక్కోపి, తిక్క శంకరుడు
||ఆది భిక్షువు||