గిరిజా కళ్యాణం

సంగీత సాహిత్య అవలోకనం – గిరిజా కళ్యాణం

లలితా శివజ్యోతి  పతాకంపై వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఏ. శంకరరెడ్డి నిర్మించిన చిత్రం ‘రహస్యం’. ఈ సినిమాలోని పాటలు సాహిత్య పరంగా సంగీతపరంగా ప్రజాదరణ పొందాయి. కూచిపూడి భాగవతుల నృత్య రూపకం ‘గిరిజా కళ్యాణం’.  మల్లాది రామకృష్ణశాస్త్రి సినీ జీవన ప్రస్థానంలో సాహిత్యపరంగా వన్నెతెచ్చిన చిత్రం లలితా శివజ్యోతి వారి ‘రహస్యం’ సినిమా. ఈ సినిమా కోసం మల్లాది గిరిజా కల్యాణం యక్షగానాన్ని ఒక సంగీత జలపాతంలా మలిచారు. అందుకు ఘంటసాల తనదైన రీతిలో వివిధ రాగాల అమరికతో ఆ పాటను అజరామరం చేశారు.  ఈ సినిమాకి నృత్య దర్శకులుగా వెంపటి చినసత్యం, హీరాలాల్, వేదాంతం రాఘవయ్య గార్ల పేర్లు టైటిల్స్ లో కనిపిస్తాయి.  మరి ఈ గిరిజా కళ్యాణం నృత్య రూపకానికి దర్శకత్వం వహించిందెవరంటే బహుశా ఆ నృత్య రూపకంలో కనిపించే వేదాంతం రాఘవయ్య గారే అయుంటారు.  ఇంకా ఈ పాటని, ఘంటశాల, మాధవపెద్ది, రాఘవులు, మల్లిక్, సుశీలమ్మ, పి.లీల, ఏ.పి. కోమల, వైదేహి, పద్మ, సరోజినీ గానం చేసేరు. అసలు మల్లాది వారు ఈ సాహిత్యాన్ని ‘ఉషాకళ్యాణం’ సినిమాకి గేయంగా రాసేరట.అనివార్య కారణాల వలన ఆ చిత్ర నిర్మాణం ఆగిపోయింది.  కానీ ‘జ్యోతి’ మాసపత్రికలో ప్రచురించబాడ్డ మల్లాది వారి నవల ‘కేళీగోపాలం’ లో ఈ గేయం ప్రచురించబడి తెలుగు పాఠకులను ఆకర్షించింది.  కొద్దీ మార్పులతో దాన్ని ఈ సినిమాకి వాడుకున్నారు దర్శక నిర్మాతలు.  ఇంక పాట విషయానికొద్దాం.

          తారకాసురుణ్ణి వధించడానికాని తపోధ్యానంలో ఉంటాడు మహాదేవుడు. గిరిరాజు హిమవంతుని కుమార్తెగా జన్మించిన హైమవతి (గిరిజ) (పార్వతీదేవి) మహాదేవుని భర్తగా పొందాలనితపోధ్యానంలో ఉన్న మహాదేవుని జ్ఞాననేత్రావలోకియై గమనించి దాసీ మాదిరి సేవలు చేస్తుంటుంది. ఇంద్రుడు మహాదేవుని తపస్సును భగ్నం చేయమని చెప్పి మన్మధుని పంపిస్తాడు. మన్మధుడు గిరిజాదేవి కోరిక తెలుసుకొని ఆమె కోరిక తీరుస్తానని చెప్పి గిరిజాదేవి వద్దని చెప్పినా వినకుండా మహాదేవునిపై తన సుమబాణాలు ప్రయోగిస్తాడు అది తెలుసుకున్న మహాదేవుడు ఆగ్రహోదగ్ధుడై తన ఫాలనేత్రం తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. మన్మధుని భార్య రతీదేవి, గిరిజాదేవి ప్రార్థనలకు ప్రసన్నుడై మన్మధుణ్ణి తిరిగి బ్రతికించి అతడు భార్య రతిదేవికి తప్ప మారేవానపడకుండా ఉండేలా చేస్తాడు. తదుపరి మహాదేవుడు గిరిజాదేవిని పరిణయమాడుతాడు.  ఈ కధ ఇతివృత్తంగా కూచిపూడి నాట్య రూపకం ద్వారా చూపించేరు. కూచిపూడి నాట్యానికున్న ప్రత్యేకత నాట్యంతో పాటుగా సంగీత, సాహిత్యాలను సమపాళ్లలో రంగరించుకున్న అద్వితీయ కళారూపం. ఈ రోజుల్లో కూడా తెలుగునాట  ఈ కూచిపూడి నృత్య రూపక కళ ఆదరణ కోల్పోయినా ఈ పాట తెలుగు వారి హృదయాలను అలరిస్తోందంటే అందుకు కారణం మల్లాది రామకృష్ణ శాస్త్రి సాహిత్యం, ఘంటశాల రాగమాలికలో స్వరపరిచిన అద్భుత స్వర విధానం. ఇంక పాటని విశ్లేషిస్తే….

అంబా పరాకు దేవీ పరాకు
మమ్మేలు మా శారదంబా పరాకు
అంబా పరాకు దేవీ పరాకు
మమ్మేలు మా శారదంబా పరాకు

ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా..
బహుపరాక్ బహుపరాక్…

చండభుజాయమండల దోధూయమాన వైరిగణా.. షడాననా
బహుపరాక్ బహుపరాక్…

అంటూ కళాధిదేవతయైన సరస్వతి ప్రార్ధనతో ప్రారంభిస్తూ  తలపెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తవడానికి గణపతిని, తలచిన కార్యాన్ని నిర్వహించే శక్తిని ప్రసాదించమని సుబ్రహ్మణ్యుని ప్రార్ధిస్తూ  విజయవాడకు 60 కి.మీ.దూరంలో ఉంది కూచిపూడి గ్రామం. ఒకప్పుడు దీనిపేరు కుశీలపురం. అది కాలక్రమేణా కూచెన్నపూడిగా మారి కూచిపూడిగా స్ధిరపడిందని చరిత్రకారుల అభిప్రాయం.  ఈ స్తుతిలో మనం కూచిపూడి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లోని మూర్తుల స్తుతి కూడా కనిపిస్తుంది.

మంగళాద్రి నారసింహ… బహుపరాక్ బహుపరాక్…
బంగరు తల్లి కనకదుర్గ.. బహుపరాక్ బహుపరాక్..
కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ.. బహుపరాక్…

మంగళాద్రి నారసింహ – మంగళగిరిలో వెలిసి ఉన్న నరసింహస్వామి బంగరు తల్లి కనకదుర్గ – విజయవాడలో వెలిసిన కానక దుర్గమ్మ తల్లి, కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ –  కృష్ణ నది తీరం కూచెన్నపూడి గ్రామంలో వెలిసి ఉన్న గోపాలుడిని స్తుతించడం కనిపిస్తుంది.   దైవస్తుతి అనంతరం కధా ప్రస్తావన –
అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా

లలితకళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశులయ్యే

          వచ్చిన ప్రేక్షకలోకానికి విజ్ఞాపనగా అయ్యా మాకొచ్చిన, మేము నేర్చుకొన్న విద్యను ప్రదర్శిస్తున్నాము మా విద్య చూసి మమ్మల్ని ఆదరించవలసిందిగా ప్రార్ధిస్తున్నాము.   లలిత కళల విలువలు తెలిసిన సరస హృదయులైన  ప్రేక్షకులు మా కళ  లోని సారస్యాన్ని చూసి పరవశించమంటున్నారు.  ఇక్కడ “పదింపదిగ” అన్న పదప్రయోగం అద్భుతం.  ఒక అర్ధ ఉన్న అందరు అశేష ప్రజానీకం మరొక అర్ధం చక్కగా, సంపూర్ణంగా.  ఇలాంటి పద ప్రయోగాలతో  పాటకు ప్రత్యేక గౌరవం కల్పించి పట్ట్భాషేకం చేసి సాహిత్య ప్రశస్తిని సంతరింపజేశారు.

ఈశుని మ్రోల.. హిమగిరి బాల..
ఈశుని మ్రోల.. హిమగిరి బాల..కన్నెతనము ధన్యమయిన గాథ
కణకణలాడే తామసాన కాముని రూపము బాపీ..ఆ కోపీ..
కాకలు తీరీ కను తెరచి తను తెలసీ
తన లలనను పరిణయమాడిన ప్రబంధము
అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా..

          ఇప్పుడింక తాము చెప్పబోయే కధా పరిచయం చేస్తున్నారు. కన్యగా ఉన్న హిమవంతుని  కుమార్తె ఈశ్వరుని సేవించి ఏ విధంగా తన కన్నెతనాన్ని ధాన్యం చేసుకునేలా ప్రవర్తించిందో ఆ చరిత్ర చెబుతున్నామయ్య విని తరించండి అంటున్నారు. బాగా కాలిన నిప్పుల ఎర్రదనాన్ని తెలియపరిచే పదం ‘కణ కణ’.  బాగా ఎర్రగా కాలిన నిప్పులంతా రౌద్రంగా ఉన్న పరమ శివుడు – నేను ఎవరినైనా మోహావేశుల్ని  చేయగలనన్న మదించిన తామస గుణంతో ఉన్న మన్మధుని శరీరాన్ని బూడిద చేసి, ఆగ్రహం ఉపశమించి, కనులు తెరిచి తనను తాను తెలుసుకొని – తనకు సేవలు చేస్తున్న కన్యను తన లలన గా గుర్తించి – అంటే ఆ కన్య తన అర్ధాన్ని పార్వతియే అని తెలుసుకొని ఆమెను వివరినా కథను వినండయ్యా అంటున్నారు.  ఇక్కడితో కధా వస్తువు పరిచయం పూర్తవుతుంది. ఇప్పుడిక పాత్రల పరిచయం.

రావో రావో లోల లోల లోలం బాలక రావో

లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి

రాజ సులోచన రాజాననా…

రావో రావో లోల లోల లోలంబాలక రావో

చెలువారు మోమున లేలేత నగవులా

కలహంస గమనాన కలికీ ఎక్కడికే

మానస సరసినీ మణి పద్మదళముల

రాణించు అల రాజహంస సన్నిధికే

          ఇప్పుడు గిరిజా దేవి పాత్రని పరిచయం చేస్తూ రమ్మని పిలుస్తున్నారు చెలులు.  ‘లోల లోల లోలంబాలక రావో’ –  లోల లోల అనగా కదులుతూ ఉన్న ‘లోలంబాలక’ అనగా లోలంబమైన అలకలు కల- అలకలు అనగా ముంగురులు.  కదులుతున్న ముంగురులు కల అని గిరిజా దేవి వర్ణన ప్రారంభించారు లోల అన్నపదాన్ని మూడుసార్లు ఉపయోగించడం అంటే అందమైన ముంగురులున్న స్త్రీ వర్ణన అన్నది నా అభిప్రాయం. లోకాలందు ఉత్తముడైన పర్వతరాజు హిమవంతుని భార్యయైన మేనకాదేవి కుమార్తె అయినా గిరిజాదేవి – పద్మముల వంటి కనులు, మొకం కలదానా – ఇవన్నీ ఆ గిరిజా దేవిని వర్ణించే సార్ధక పదప్రయోగాలు.  చెలువారు మోమున లేలేత నగవులా – చెంపల దాకా సాగిన కన్నులతో మొఖమున ఆనందాతిశయంతో వచ్చే చిన్న దరహాసంతో కలహంస గమనాన కలికీ ఎక్కడికే – ఇక్కడ సంస్కృత నామమైన వ్యుత్పత్తి పదం ‘కలహంస’ – మేఘవర్ణం కలిగిన ముక్కు, కాళ్ళు కలిగిన హంస – మధురముగా పలికెడు హంస – కలహంస – ఆ విధమైన హంస నడిస్తే ఎలా ఉంటుందో  ఆలాగ నడుస్తున్న కన్య ఎక్కడికే నీ గమనం అని ప్రశ్నిస్తారు. అందుకు సమాధానం – మానస సరసినీ మణి పద్మదళముల రాణించు అల రాజహంస సన్నిధికే – మానస సరోవరంలో మానులవలె ప్రకాశించు పద్మముల మధ్య కూర్చుని ఉన్న రాజహంస వద్దకే అని సమాధానం.  ఇక్కడ రాజహంస అనగా యోగి అనే అర్ధం కూడా ఉంది.  మానస సరోవరం వద్ద మహాదేవుడు ఉంటాడని తెలిసిన విషయమే అయితే ఇక్కడ మహాదేవుడు తపోధ్యానంలో ఉన్నాడని మందే చెప్పేరు. ఆ ప్రకారంగా చూస్తే మనసన్నది ఒక సరోవరమైతే అందు రాజహంస అంటే మహా యోగి పుంగవుడు మహాదేవుడే అనే ఒక నిగూఢ వేదాంత విషయాన్ని సూత్రీకరించేరు. ఇక్కడ తమాషా ఏమిటంటే’కలహంస’ పద ప్రయోగం చెలుల ద్వారా గిరిజా దేవికి అన్వయిస్తూ చెప్పి ‘రాజహంస’ పద ప్రయోగం మహాదేవునికి అన్వయిస్తూ సమతుల్యత సాధించి చూపేరు. అదే సార్ధక పద ప్రయోగం అంటే. 

వావిలి పూవుల మాలలు గైసేసి

వయ్యారి నడల బాలా ఎక్కడికే

కన్నారా నన్నేల కైలాస నిలయాన

కొలువైన అల దేవదేవు సన్నిధికే

          ఇప్పుడు వావిలి పూవులతో చేసిన మాలలతో, వయ్యారాలొలకబోస్తూ వెళ్తున్నావ్ ఎక్కడికో? అని ప్రశ్నిస్తే – కనులనిండా ప్రేమతో నన్ను ఏలుకోబోయే ఆ దేవదేవుని వద్దకే వెళ్తున్నానని సమాధానం ఇస్తుంది. 

తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ

అండగా మదనుడుండగా

మన విరిశరముల పదనుండగా

నిను బోలిన కులపావని తానై

వరు నరయగ బోవలెనా …ఆ…..ఆ….ఆ.

కోరిన వాడెవడైనా ఎంతటి ఘనుడైనా

కోలనేయనా సరసను కూలనేయనా

కనుగొనల ననమొనల గాసి చేసి.. నీ దాసు చేయనా

          ఇంక ఇప్పుడు మన్మధ పాత్ర ప్రవేశిస్తుంది.  మన్మధుడు గిరిజా దేవితో తగదిది నీవి మహాదేవుని కటాక్షం కోసం పరితపించక్కర్లేదు నేనున్నానమ్మా నీకు చూడు ఎం చేస్తానో అంటాడు.  ఇక్కడ మల్లాది వారి ప్రతిభ కనిపిస్తుంది చూడండి.  ఇక్కడ మన్మధుని ఔచిత్యం, అహంకారం తెలియచేస్తూ అర్థభేదం ఉన్న బిందు ‘డ’కార (౦డ) పదాలను వాడారు “అండగా మదనుడుండగా మన విరిశరముల పదనుండగా”  పర్వత రాజు కుమార్తెవైన నీవు భర్తను వెతుకుతూ వెళ్లడం తగని పనమ్మ అంటాడు మన్మధుడు.  అంతేకాదు తన ఆయుధాల పదును అంటే తాను వేసే పూలబాణాల పదునెటువంటిదో తెలియచేస్తాడు. ఆమె కోరుకునే వాడు ఎంతటివాడైనా కోలనీయనా అంటే తన షరా సంధానంతో కూలనాయనా అంటే వాణ్ని తెచ్చి నీదగ్గర  కూర్చోపెట్టనా అంటూ  కనుగొనల ననమొనల గాసి చేసి.. నీ దాసు చేయనా అంటే నా బాణపు పూల మొగ్గలతో వాణ్ని నాశనం చేసి నీ దాసునిగా చేస్తానంటాడు.

ఈశుని దాసుని చేతువా… అపసద… అపచారము కాదా

కోలల కూలెడు అలసుడు కాడూ… ఆదిదేవుడే అతడూ…

సేవలు చేసి ప్రసన్నుని చేయ..

నా స్వామి నన్నేలు నోయీ…నీ సాయమే వలదోయీ…

          తాను దైవంగా కొలిచే ఆ మహాదేవుని తీసుకొచ్చి నాకు దాసుణ్ణి చేస్తాననడం అతను చేసిన పెద్ద తప్పు అని మందలిస్తుంది. “అపసద” అంటే మ్లేచ్చుడు లేదా నీచుడు అని అర్ధం. “అలసుడు” అంటే జడుడు అని అర్ధం. “కోలలు” అంటే శరములు – బాణాలు. తన ప్రాణనాధుడు నువ్వు నీ బాణాలు ప్రయోగిస్తే కూలిపోయేవాడు కాదయ్యా ఆయనే దేవదేవుడు.  నేను ఆయనకీ చేసే సేవాఫలంగా ఎప్పటికైనా   ప్రసన్నుడై నన్ను కరుణిస్తాడు అంతేకాదు నన్ను తన భార్యగా స్వీకరించి   ఏలుకుంటాడు, నాకు నీ సహాయం అవసరం లేదు  అని చెప్తుంది. అప్పుడు ఆమె చెలికత్తెలు ఊరుకుంటారా   వాళ్లుకూడా ఇలా అంటున్నారు మన్మధునితో.

కాని పనీ మదనా.. కాని పని మదనా..

అది నీ చేతకాని పని మదనా…

అహంకరింతువ.. హరుని జయింతువ

చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా

వినకపోతివా ఇంతటితో…. నీ విరిశరముల పని సరి..

సింగిణి పని సరి..  తేజో పని సరి.. చిగురికి నీ పని సరి మదనా

          కానిపని మదనా…. నువ్వు చెప్పినది చెయ్యడగాని పనయ్య నీ చేతకాని పని మదనా – ఇదే నువ్వు చెయ్యలేని పనయ్య. మళ్ళీ ఇక్కడ  “కానిపని….. నీ చేతకాని పని” అని వర్ణ భేదంతో అర్ధ భేదం వచ్చే ప్రయోగం చేసి చూపేరు మల్లాది వారు. అహంకారంతో హరుని జయించడం అనేది కానీ పని, పైపెచ్చు నీకు చేతకాని పనికి నువ్వు పూనుకోవడం నీ అహంకారం అని తెలియచేస్తారు చెలికత్తెలు. ఆ హెచ్చరిక విన్న మన్మధుడు ‘హుఁ’ అంటూ హుంకరిస్తాడు. తన శక్తిని, పరాక్రమాన్ని వారంతా సందేహిస్తున్నందుకు. మన్మధునికి ఇంకా బోధపడలేదని గ్రహించిన చెలికత్తెలు చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా అంటారు – మన్మధుని వాహనం చిలుక.  దానిపై ప్రయాణిస్తాడు కాబట్టి అతడు రౌతు.  తట్టాడు అంటే గుర్రం.  అయ్యా  చిలుక ఎక్కడైనా గుర్రం  ఔతుందా! ఎందుకయ్యా అలా హుంకరిస్తున్నావ్ మా మాటలు వినలేదనుకో ‘వీరి శరములు’ చాలా పాదుని అంటూ బీరాలు పలుకుతున్న నీ పూల బాణాల పని ఇక్కడితో సరి.  సింగిని అంటే చిగురు ఆకులతో చేసిన విల్లు – దానిపని కూడా సరి…. తేజో పని సరి.  తేజో అన్నది గుర్రానికి పర్యాయపదం.  చిలుకను తన వాహనానికి పూంచేడు కాబట్టి – దానిపని సరి, సినీపని సరి …. చిట్టా చివరికి నీ పని కూడా సరి అంచేత ఆయనతో పెట్టుకోకు అని హితవు చెప్తారు.  అహంకార మదంతో ఉన్నవారికి మంచి మాటలు వినిపించవుగా.

సామగ సాగమ సాధారా.. శారద నీరద సాకారా

ధీనా ధీనా ధీసారా … సామగ సాగమ సాధారా

ఇవె కైమోడ్పులు …  ఇవె సరిజోతలు

వినతులివే అరవిందోజ్వలా…

ఇదె వకుళాంజలి మహనీయా

ఇదె హృదయాంజలి… ఈశా మహేశా

          సామగ సాగమ సాధారా.. దీనికి అర్ధం … సామగ…  అనగా సామగానమునకు … సాగమ అనగా   ఆగమమనకు… సాధారా…  అనగా ఆధారభూతుడవు.   శారద నీరద సాకారా… శరత్కాల చంద్రుని ప్రక్కన ప్రకాశించే తెల్లని మేఘం వంటి రూపం కల వాడవు…ధీనా ధీనా ధీసారా …దీనుల పాలిటి నీ బుద్ధి బలంతో దిక్కైనవాడవు అంటూ పార్వతి దేవి మహాదేవునికి నమస్కరిస్తూ పరి పరి విధాలా పూజిస్తూ ప్రార్ధిస్తుంది.  అనేక విధాలుగా తన ప్రాణ విభుని అర్చించి తన హృదయాన్ని అంజలిగా సమర్పణ చేస్తుంది.  ఆ సమయంలోనే తన శక్తి, పరాక్రమాలను తన మన్మధాస్త్రం వేసి ప్రదర్శించి పార్వతి దేవికి సహాయపడాలన్న ఉద్దేశ్యంతో మన్మధుడు తేన చెఱకు వింటి నుండి సుమ బాణాలను సంధిస్తాడు.  మహాదేవునికి తగిలిన ఆ వీరి శరములు అతని తపోత్యాన భంగం చేస్తాయి. తన తపోభంగానికి కారణం తెలుసుకుని మహాదేవుడు ఆగ్రహోదగ్ధుడై తన ఫాలనేత్రం తెరిచి మన్మధుని భస్మం చేస్తాడు. జరిగిన విషయం తెలిసి వచ్చిన మన్మధుని భార్య రతీదేవి తన భర్తను రక్షించి బ్రతికించమని మహాదేవుని వేడుకుంటుంది. ఆమె ఈవిధంగా వేడుకుందో చూడండి.

విరులన్ నిను పూజ సేయగా… విధిగా నిన్నొక గేస్తు జేయగా

దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ…

కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా

మరుడేపున రూపున వర్థిలుగా…

రతి మాంగల్యము రక్ష సేయరా ప్రభూ… ప్రభూ… పతిభిక్ష ప్రభూ….

          ఎం నిన్ను పూవులతో పూజించి నిన్ను ఒక గృహస్థునిగా చేయడం కోసం పూనుకున్న నా భర్త అయినా మన్మధుని చిచ్చర కాంతితో అంటే మాడుతూ ఉండే నీ మూడవ కాంతితో నాశనం చేస్తావా!  గిరి రాజా పుత్రిక మీద మీరు కరుణ చూపించి మీ భార్యగా చేసుకున్నారు. నా భర్త పరిస్ధితి ఏమిటి?  నా మాంగల్యం సంగతేమిటి అని ప్రశ్నించి తమని రక్షించమని తనకు పతిభిక్ష పెట్టమని వేడుకుంది.

అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో

జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో

మనమే నీ మననమై… తనువే నీ ధ్యానమై

నీ భావన లీనమైన గిరిబాలనేలవో

శరణం భవ శరణం భవ శరణం భవ స్వామీ…

పరిపాలయ పరిపాలయ పరిపాలయ మాం స్వామీ..

          జరుగుతున్నదంతా గమనిస్తున్న జగన్మాత పార్వతీదేవి కల్పించుకుని మన్మధుడు దహించబడుతున్నపుడు అంబా అంబా అని నాన్ని పిలిచాడు కదా, నేను అతనికి అమ్మనైనపుడు మీరు తండ్రిగా అతనిని క్షమించి, ప్రాణం పోసి తిరిగి బ్రతికించమని కోరుతుంది. ఇక్కడ అసమ శరుడు అన్న పద ప్రయోగం చేసి చిరుహాన చమత్కారాన్ని కొనసాగించారు మల్లాది వారు. మన్మధుని పుష్పబాణాలు ఐదు సరిసంఖ్య కాదుకదా అందుకని అసమమైన సంఖ్య గల బాణాలు కలవాడని వ్యుత్పత్తి అర్ధాన్ని వాడి చమత్కరించారు. ఇంకా పార్వతి తన మనసు, తనువు ఎల్లవేళలా లీనం చేసి ఉన్నానని, గిరిరాజ్ పుత్రినైన తనను చేపట్టి పరిపాలించమంటుంది.  ఆమె కోరికను మన్నించి మన్మధుని బ్రతికించి పార్వతిని పరిణయమాడుతాడు.

బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి.. జయమంగళం

జగమేలు తండ్రికి.. జయమంగళం…

విరులచే వరునిచే కరము చేకొనజేయు జగమేలు తల్లికి.. జయమంగళం

కూచేన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవా శ్రీ వేణుగోపాల.. మంగళం..

త్రైలోక్య మందార శుభమంగళం…

          బిడియం నటించి, పూర్తిగా సేవలు చేయించుకుని మన్మధ బాణాలు తాకాయన్న నెపంతో తపోభంగం చేసుకుని అప్పుడు పెళ్ళికి ఒప్పుకున్నాడు మహాదేవుడు. ఆ మాటలని ఎంత రమ్యంగా  చెప్పారో చూడండి మల్లాది వారు.  జగన్మాతా, జగత్పితల  కళ్యాణం లోక కళ్యాణంగా భావించి ఈ నృత్య రూపకానికి మంగళం పాడుతారు సంప్రదాయబద్ధంగా.  అలాగే కూచెన్నాపూడి లోని గోపాలదేవునికి జయమంగళ వచనాలు పలికి నాటకాన్ని పరిసమాప్తి చేస్తారు.

కూచిపూడి సంప్రదాయ రూపకానికి తగిన వివిధ ఘట్టాలకు తగిన రాగాలను సమకూర్చి రాగమాలికలో స్వరపరచి తన సహజసిద్ధమైన భావయుక్తమైన గానంతో మల్లాది వారి సాహిత్యాన్ని పరిపుష్టం చేసేరు. అందుకే ఇన్నేళ్లయినా ఇంత పెద్ద పాటయినా ప్రతి తరం వారి హృదయాలను గెలుచుకుంటోందీ పాట.

          ఈ తరం యువత తెలుగు సాహిత్యం లోని పోతన, శీనాధుడు, నన్నయ, తిక్కన, ఎఱ్ఱన మొదలైన వారి పద్యాలు సేకరించి వాటిని ఆధునిక పద్ధతుల్లో నిక్షిప్త  పరచి వాటిలోని పదప్రయోగాల్ని తెలుసుకుని ముందుంతరాల్స్ వారికి అందించాలి. తాళ్ళపాక అన్నమయ్య ని చదవనిదే తెలుగు రాదు అన్నారు వేటూరిప్రభాకర శాస్త్రి గారు. మల్లాది వారి పాట అర్ధమైందంటే మనకి తెలుగు వచ్చినట్లే అని నా అభిప్రాయం.