కిరాతార్జునీయం – భక్త కన్నప్ప
జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగే తల
తకిట తకతక తకిట చరిత పదయుగళ – మొదలైంది. పాట. మూలంలోని పద్యంలో ఏది ముట్టుకోవాలో దేన్ని వదులుకోవాలో వేటూరి కనుచూపు కొసలకు పెనుపాళి కొసలకు తెలిసిన విద్వత్‌తో శంకరుడు ఎరుకలవానిగా మారుతున్నాడు. వేటూరి పెనుచూపు శంకరుని తలను ఒక్కసారే నిశితంగా గుర్తు తెచ్చుకుంది. ‘తలపై నెలవంక’ను శ్రీనాథుని ‘వికట పాటల జటా మకుటికాభారంబు కరుకైన జుంజురునెరులు కాగ – జుట్టు గురించి ఎందుకులే వదిలేశాడు ‘జారు సుధాధామ శకలావతంసంబు పెడకొప్పు పైనుండు పీకె కాగ’ – శ్రీనాథుడు నెలవంకను చుట్టపీకెలా మారిందన్నది వేటూరికి నచ్చలే. సినిమా కన్ను – సినిమా పెన్ను – అందం – ఆనందం పరమావధి అనుకుంటుంది. ‘నెలవంక తలపాగ నెమలి ఈకెగ మారె’ వేటూరి సీతకు రమణ – బాపులిద్దరు శెభాషనుకున్నారు. శ్రీనాథుడు వదిలిన ‘గంగ’ను వేటూరి అందుకున్నాడు పాటలో తన ముద్ర వేయాలని ‘తలపైన గంగమ్మ తలపులోనికి జారె ‘ఘనలలాటంబున గను పట్టు కనుచిచ్చు గైరిక ద్రవతిలకంబుగాగ’… ఇది తప్పనిసరి అనుకుని ‘నిప్పులు మిసే కన్ను నిదరోయి బొట్టాయె’ శ్రీనాథుడు వదిలిన బూదిని – పులితోలును ‘బూదిపూతకు మారు పులితోలు వలువాయె’ అంటూ ఎరుకలవానికి ఆహార్యం ధరింపజేశాడు. శ్రీనాథుడు పాములను పూసల సరులుగా మార్చిన పాదాలను వలదని శ్రీనాథుడు రాసిన శంకరుండు కిరాత వేషంబు దాల్చి యగజ చెంచెతయై తోడనరుగుదేరును వాక్యాలను – ‘ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా… తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా’ మార్చాడు. శ్రీనాథుని ‘బాణినోంకార దివ్యచాపము ధరించి వచ్చె వివ్వచ్చు వరతపోవనము కడకు’లో ‘త్రిశూలం’ లేదని గ్రహించి ‘ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము’ అంటూ త్రిశూలాన్ని శ్రీనాథుని ఓంకార ధనువుగా కూర్చాడు వేటూరి – కవి కన్ను జల్లెడైన వడపోతలో త్రిశూలం దొరికింది వేటూరికి.
శ్రీనాథుని మూలంలోని ‘తాటియంత విల్లు ధరియించినాడవు – తాడి ఎత్తు గాండీవముతో ముత్తాడి ఎత్తుగా’ ఆనాటి కవులకు ఎత్తు అయితే తాటిచెట్టు లేదా హిమాలయం. అలా కిరాతార్జునీయ ఘట్టాన్ని సినీగీతాల చరిత్రలో హిమాలయం ఎత్తులో నిలిపిన వేటూరికి కొందరు నిర్మాతల – దర్శకుల – కథానాయకుల సంగీత దర్శకుల కొల‘తల’ మేరకు – కురచగా అపసవ్య సాచిగా పదాలతో ‘నాటు కొట్టడమూ’ తెల్సు. ఏమైనా సినీ కవులకు ఏం తెలుసు? శ్రీనాథ పద్యం అని వెటకారించే మలపరాయుల కనుల నలక మకిలి – కెలికి తీసేలా. వెలికి తీసేలా రచించిన ఈ గీతం సినీగీత రచయితలందరికీ గర్వంగా హత్తుకోదగిన సగర్వంగా తలనెత్తుకోదగిన సినీమణి మకుట గీతం. సినిమా పాట అని వెక్కిరించే మూకను మూకాసుర వధ చెయ్యాలని సంకల్పించి ఏకాగ్రతతో, పట్టుదలతో భావాలని భాషతో రంగరించి సినిమా పాటను విమర్శించే వారికి నోట మాటరాని విధంగా కూర్చిన సాహితీ స్రష్ట భక్త కన్నప్ప సినిమాకి వేటూరి రాసిన ‘కిరాతార్జునీయం’. ఛందస్సు పద్యాలకే కాదు పాటల్లో కూడా ఉంటుంది. మరి ఇది శివునికి సంబంధించిన పాట కూడా. తనికెళ్ళ భరణి గారో చెప్పినట్లు శివుడే ఒక ‘యతి’ ఇంక గణాలంటారా అవి ఆయన చుట్టూ ఎప్పుడు ఉండనే ఉంటాయి. ఇంకా శివుడు ‘లయకారుడు’. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే పై రెండు పాదాలు ఇంచుమించుగా సీస పద్య పాదాలే – యతి మైత్రితో సహా. ఈ పాటలో చాలా చోట్ల సీస పద్య లక్షణాలే కనిపిస్తాయి. వేటూరి వారికి ‘ఛందో ధర్మాలు ఎంత బాగా తెలుసు అన్నదానికి ఈ పాట ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఎలాంటి గణాలు వేస్తే పాటకి ఎలాంటి నడక వస్తుంది, భావానికి తగిన నడక ఎలా రప్పించాలో అన్న విషయాల మీద ఎంతో శ్రద్ధ, పరిజ్ఞానం ఉంటే కాని ఇలా రాయడం జరగదు. తాండవానికి తగిన తాళం “తకిటతక తకతకిట”తో మొదలుపెట్టారు పాటని. ఇది అయిదు మాత్రల గణాలు, 3-2/2-3 విరుపుతో సాగుతుంది. దీన్ని సంగీత భాషలో ఖండ చాపు అంటారనుకుంటా. నేను తెలుసుకున్న విషయమిది. సరియైనదిఅవునా కాదా అన్నది సంగీతం తెలుసున్నవాళ్ళెవరైనా చెప్పాలి.
ఈ పాటలో వేటూరి తన విశ్వరూపం చూపించారు. శివుడు కైలాసంలో తాండవమాడుతూంటే ఒక్కసారి ఆ కైలాసగిరి కంపించింది. అర్ధనారీశ్వర తత్వాన్ని ఎల్లవేళలా పాటించే ఆది దంపతులకి భావాలు కూడా కలసి మెలిసి ఉంటాయా? ఆ దంపతులిరువురు అత్యంత పరవశంతో కైలాసంలో నృత్యాభినయం చేస్తుండగా అకుంఠిత దీక్షతో, మంచు కొండలను సైతం కరగించగలిగాడు అర్జునుడు. అతని లక్ష్యం పాశుపతాన్ని సాధించడం. పశుపతిని పొంగించి పబ్బం గడుపుకోవడం ఆయన గురించి తెలిసిన భక్తులకు పరిపాటి కదా! మహాదేవా నీవు తప్ప మాకింకెవరు దిక్కుఅంటూ నిష్టగా కొలిస్తే ఆ ముక్కంటి మూడు నేత్రాలు ఆర్ద్రత వర్షిస్తాయి. మనసు కరిగి కరుణామృత వర్షం కురిపిస్తాడు. పాండవ మధ్యముడే పట్టుబట్టి ప్రాణాయామం చేస్తుంటే ఆ ఓంకార ధ్వనికి తనువంతా పులకరించి మోమున చిరునవ్వు సాక్షాత్కరించింది. ఇదేమి తెలియని జగన్మాతకు మహాదేవునికి కలిగిన ఆ ప్రకంపనలకు కారణమేమిటని అతనిలోనున్న ఆమె సగ దేహంలో సందేహం కలిగింది. ఇదీ సందర్భం. ఇకపై కలం వేటూరిది గళం బాలూది. అదృష్టం మనది. ఇహ చిత్తగించండి.
తకిటతక తకతకిట చటిత పదయుగళా
వికట గంగాఝరిత మకుటతట నిగళా
హరిహరాంచిత కళా కలిత నిలగళా
సాంద్రచ్ఛటా పటల నిటల చంద్రకళా
జయజయ మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ అభయంకరా
అని దేవతలు శివుని కొనియాడా
పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా
కంపించెనింతలో కైలాసమావేళ
కనిపించెనంత అకాల ప్రళయజ్వాల
జగములేలినవాని సగము నివ్వెరబోయె
సగము మిగిలినవాని మొగము నగవైపోయె
ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ!
అతడే అతడే అర్జునుడు
పాండవ వీర యశోధనుడు
అనితరసాధ్యము పాశుపతాస్త్రము
కోరి యింద్రగిరి చేరి శివునికై
అహోరాత్రములు చేసెను తపస్సు
ఇది సృష్టించెను దివ్య మహస్సు
నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె
తలలోని గంగమ్మ తలపులోనికి జారె
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు
జగములేలినవాని సగము నివ్వెరబోయె
సగము మిగిలినవాని మొగము నగవైపోయె
ఈ రెండు వాక్యాలు చదివిన వారిలో కొద్దిపాటి సాహిత్య పరిచయం ఉన్నా అర్ధమైపోతుంది ఇది అర్ధనారీశ్వర తత్వానికి సంబంధించినది అని. ఎంత క్లుప్తంగా అర్ధనారీశ్వర తత్వాన్ని చెప్పేరు. ఆశ్చర్యం జగన్మాతది. ఆనందమైన అవలోకనం మహాదేవునిది. అతను బయలుదేరాల్సిన అవసరాన్ని ఆమెకు తెలియపరచి భూలోకానికి పయనమౌతాడు మహాదేవుడు. శంకఅని రుడు భక్తవరదుడే కానీ ఫల్గుణుడు. ఇవ్వాల్సిందేమో పాశుపతం. అతని ప్రతాపమెంతటిదో పరీక్షించనిదే పాశుపతం ఇవ్వడం కుదరదు ఆలోచించి ఏంచేశాడు?
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా
తల్లి పార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు
సర్వ జ్ఞాన సంపన్నుడైన ఆ మహా మహితాత్ముడు మారు వేషాన్ని ఆశ్రయించగా మాత పార్వతి కూడా ఆయన్నే అనుసరించింది. ఇంక ఆ ఆది దంపతుల ముస్తాబు చూడండి – వేటూరివారే దగ్గరుండి స్వయంగా వారికి ముస్తాబు చేసేరా అన్నట్లు వర్ణించేరు. మహేశ్వరుని తలపై ఉండే ఆ నెలవంక నెమలి ఈకగా మారిపోయిందిట. ఆయన జటా ఝూటంలో ఉండే గంగమ్మ కాస్తా ఆయన ఆలోచనల్లోకి జారుకుందిట. నిప్పు కణాలను చిమ్మే ఫాలనేత్రము ఆయనకి బొట్టుగా మారిపోయిందిట. ఎల్లపుడు భస్మ లేపనతో ఉండే శరీరం కాస్తా పులితోలు వలువగా మారిందట. ఆయన త్రిశూలం ధనస్సుగా మారిందట. ఎం వర్ణించారండి. మనం ఊహించుకున్నదే రూపం. నిరాకార నిరామయుడాయన. ఒళ్ళంతా బూడిద పూసుకున్నా కమనీయ రూపం అతనిది.
శివుని ఆనతిని శిరమున దాల్చి
మూకాసురుడను రాక్షసుడూ
వరాహరూపము ధరించి వచ్చెను
ధరాతలమ్మే అదిరిపోవగా
చిచ్చరపిడుగై
వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు
మట్టుపెట్టగా
పట్టె బాణమూ ధనువొక చేతను అందుకొనీ
చూసిన కంటను చూడకనే గురి
చూసినంతనే, వేసినంతనే
తలలు రెండుగా విలవిలలాడుచు
తనువు కొండగా గిరగిర తిరుగుచు
అటునిటు తగిలిన రెండు బాణముల
అసువులు వీడెను వరాహమూ
కొట్టితి నేనని అర్జునుడూ, పడ
గొట్టితి నేనని శివుడూ,
పట్టినపట్టును వదలకనే తొడ
గొట్టిన వీరముతో నపుడు
వేట నాది, వేటు నాది
వేటాడే చోటు నాది,
ఏటి తగవు పొమ్మని విలు
మీటి పలికె శివుడూ
చేవ నాది, చేత నాది
చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మని కను
సైగ చేసె అర్జునుడు
గాండీవ పాండిత్య కళలుగా బాణాలు
కురిపించె అర్జునుడు కానీ, అపుడతడు
వేయిచేతుల కార్తవీర్యార్జునుడూ
ఆ వరాహము చనిపోయిన తర్వాత నేనే దానిని కొట్టేనని అర్జునుడు కాదు నేనే పడగొట్టేనని శివుడు వాదులాడుకున్నారు. ఆ వాదనలో ఎవరి వీరత్వం గురించి వారు చెప్పుకున్నారు. నేను కిరాతకుణ్ణి, వేట నా వృత్తి, ఆ వరాహాన్ని పడగొట్టేలా వేసిన బాణమో నాది, నేను వేసినా బాణం వలన తగిలిన దేవకే అది కింద పడిపోయింది. నేను సంచరించే ఈ అరణ్య పేరెంతమంతా నాది అంటే నేను వేటాడిన చోటు కూడా నాదే. కాబట్టి నాతో నీకు తగవు అనవసరం నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పొమ్మని చెబుతాడు అర్జునునితో శివుడు ఎలాగ? పౌరుషాహంకార గుర్తుగా వింటి నారిని మ్రోగించి చెప్పేడట. మరి అర్జునుడు కూడా ప్రతాప వంతుడు కదా అందుకే అర్జునుడు ఆ కిరాతకుని తో (శివునితో ) ఇలా అన్నాడు – చేవ అంటే పాటవం అని అర్ధం ఇక్కడ. ఆ వరాహాన్ని పడగొట్టడంలో పాటవం అనగా నేర్పరితనం నాది. దానిని సంహరించే పని కూడా నేను ప్రారంభించినదే. చెడిపోవడం అంటే ఎరుగనిది నా విలువిద్యా ప్రజ్ఞ (ఇక్కడ ఈటె అనగా ఆయుధం) – అర్జునుని ఆయుధాలు ధనుర్బాణాలు కదా. నీకు నిజంగా చేవ ఉంటె అనగా నాతో పోరాడగలిగినంత ప్రజ్ఞ ఉన్నవాడవైతే నాతో తలపడ్డానికి రమ్మని కనుసైగ చేసేడట.కిరాతుడు రూపంలో ఉన్న శివుడు వింటి నారిని మ్రోగించి పౌరుషం కలిగేలా రెచ్చగొట్టడానికి ప్రతిచర్యగా అర్జునుడు కనుసైగతో కిరాతుణ్ణి రెచ్చగొట్టేడు. రెచ్చగొట్టి ఉరుకున్నాడా! గాండీవ పాండిత్య కలలో నిష్ణాతుడైన అర్జునుడు శర సంధానంలో తన ప్రావీణ్యాన్నంత ప్రదర్శిస్తూ శరసంధానం చేసేదుట. ఆ సమయంలో అర్జునుడు ఎలా ఎన్నాడంటే సహస్ర బాహువులు కలిగిన ‘కార్తవీర్యార్జునుడు. వలె ఉన్నాడట.
ఇక్కడ కార్త వీర్యార్జునుని గురించి కొంచెం తెలియచేస్తాను. కార్తవీర్యార్జునుడు హైహయ వంశజుడైన కృతవీర్యుని కుమారుడు. ఇతడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిష్మతీపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి. ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగితే గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిస్తాడు. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము ఉంది దానిని అగ్ని కాల్చివేస్తాడు. మైత్రావరుణుని కుమారులకు కోపము వచ్చి కార్త వీర్యార్జునుని బాహువులు పరశురాముడు ఖండించునని శపిస్తారు. ఈ కదా ఇంకా వుంది కానీ స్ధలా భావం వలన ఇక్కడితో ఆపేస్తున్నాను.
ఓంకార ఘనధనుష్టంకారములతోడ
శరపరంపర కురిసె హరుడూ, అయినా
నరునికాతడు మనోహరుడూ
చిత్రమేమొ గురిపెట్టిన బాణమ్ములు మాయమాయె
విధి విలాసమేమో పెట్టిన గుఱి వట్టిదాయె
అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె
సవ్యసాచి కుడియెడమై సంధించుట మఱచిపోయె!
ఇక్కడ “ఘన” అంటే గొప్పది అనే అర్థమే కాకుండా మేఘం అన్న అర్థం కూడా వస్తుంది. మేఘంలాంటి ధనుస్సుతో ఉఱుములా ధ్వనిస్తూన్నా బాణ వర్షాన్ని కురిపించేదట శివుడు. అర్జునుని పరిస్ధితి ఎలావుందిట! చిత్రంగా అర్జునుడు గురిపెట్టిన బాణాలు మాయమైపోతున్నాయట – విధి నిర్ణయమేమిటో కానీ అతని పెట్టిన గురి నిష్ఫలమౌతున్నాదిట. ఈ పరిస్ధితి ఇప్పటివరకు అర్జునుడు అనుభవించని స్ధితి. అతని అస్త్రాలేవి లక్ష్యాన్ని ఛేదించటం లేదు. శస్త్రములన్ని ఎందుకూ పనికిరాకుండా పోయేయి. ఇటువంటి పరిస్ధితిని కనీసం ఊహించని అర్జునుడు చివరికి బాణం వెయ్యటం కూడా మరిచిపోయేడట.
జగతికి సుగతిని సాధించిన తల
దిగంతాల కవతల వెలిగే తల
గంగకు నెలవై, కళ కాదరువై
హరిబ్రహ్మలకు తరగని పరువై
అతి పవిత్రమై, అఘ లవిత్రమై
శ్రీకరమై శుభమైన శివుని తల
అదరగా, సృష్టి చెదరగా
తాడి యెత్తు గాండీవముతో ము
త్తాడి యెత్తుగా ఎదిగి అర్జునుడు
చండకోపమున కొట్టినంతనే
తల్లిదండ్రుల చలువ తనువైన(?) దేవుడు
కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు
ఎదుట నిల్చెను శివుడు, ఎదలోని దేవుడు
పదములంటెను నరుడు భక్తితో అపుడు
అర్జునుని కోపం పెరిగిపోతోంది. తనవంటి శస్త్ర విద్యా పారంగతుడు ఈ భూమ్మీద లేదు అటువంటి తనకు ఒక కిరాతునితో పోరులో పరాభవమా? అర్జునుని గాండీవం తాటిచెట్టంత ఎత్తులో ఉందిట. మరి అర్జునుడు మూడు తాటిచెట్లన్తా ఎత్తు పరిమాణంలో ఉన్నాడట తన కోపాన్నంతా షరా సంధానంలో చూపిస్తూ బాణాన్ని కొట్టేది. అవతలున్నది ఎవరు? జగతికి సుగతి సాధించే తల- దిగంతాలకవతల వెలిగే తల – యావత్ ప్రపంచానికి మోక్షాన్ని ప్రసాదించే వాడు, ప్రళయ కాల సమయంలో పంచ భూతాలో ఏకమౌ వేళ ఏర్పడిన కారుచీలట్లలో ఎనిమిది దిక్కులకు ఆవల ఉంది సృష్టి లయ కారకాన్ని తిలకించే వాడు గంగకు నెలవై కళాకాదరువై – గంగా దేవి ఎప్పుడూ ఆయన శిరస్సుపైనే కదా ఉండేది. కల అంటే ఇక్కడ చిత్రా కల అంటే అతని తలపై ఉండే చంద్రుని కళలకు ఆధారమైన వాడని అర్ధం. అతి పవిత్రమై, అఘ లవిత్రమై – అతి పవిత్రమై అనగా మరి ఆయన పరమ పావన మూర్తి కదా, లఘు లవిత్రమై అంటే లవిత్రము అనగా కొడవలి. కొడవలి గడ్డిని కోసినట్లు పాపాలను కోసేవాడని అర్ధం. శ్రీకరమై శుభమైన శివుని తల – మంగళకరమైన, సర్వ శుభములను కలుగ చేసే శివుని తల అదరగా, సృష్టి చెదరగా – ఆ మహాదేవుని తల అర్జునుని శరా ఘాతానికి ఒకసారి అదిరింది! అంతేనా యావత్ సృష్టి చెదిరింది. వేటూరి చమక్ అంటే ఇదిచూడండి ఇప్పుడు ఏమిటంటారో – తల్లిదండ్రుల చలువ తనువైన(?) దేవుడు. శివ పార్వతులు ఆది దంపతులు కదా వారి చల్లని చూపులతోను, వారి ప్రేమానురాగాల వలెనే కదా ఆవిర్భవించింది ఈ సృష్టి అందుకు తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు అన్నారు. అంటే ఇప్పుడు తన అసలు శరీరాన్ని శివుడు బయల్పెట్టెడన్నమాట. ఎదుట నిల్చెను శివుడు, ఎదలోని దేవుడు – పదములంటెను నరుడు భక్తితో అపుడు. శివుడు తన సహజ రూపం సాక్షాత్కరింప చేయడంతో ఆ కిరాతుడెవరో తెలిసి తాను ఎవరికొరకు తపస్సు చేసేదో ఆ మంగళ మూర్తి ప్రత్యక్షమయ్యేటప్పటికీ అర్జునునితో భక్తి భావము పొంగి ఆ మహాదేవుని పాదాలకు నమస్కరించేడు.
కర చరణ కృతంవా కర్మవాక్కాయజంవా
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం
విహిత మవిహితంవా సర్వమేతత్ క్షమస్వా
శివశివ కరుణాబ్ధే, శ్రీ మహాదేవ శంభో!
నమస్తే, నమస్తే, నమస్తే నమః!