లలిత భావ నిలయ
1967 లో విడుదలైన సంగీత, సాహిత్యాల అపురూప సమ్మేళనం అని చెప్పుకోదగ్గ సినిమా ‘రహస్యం’. ఈ సినిమాలో నాగేశ్వర రావు, ఎస్. వి. రంగా రావు, కృష్ణ కుమారి, బి. సరోజా దేవి నటించారు. సంగీతము అందించినది ఘంటసాల గారు. సాహిత్యం మల్లాది రామకృష్ణ శాస్త్రి. జగన్మాత లలితాదేవి నిలయంలో అమ్మవారి వైభవాన్ని లక్ష్మి, పార్వతి, సరస్వతులు కలిసి వర్ణిస్తూ, నారదుడు, ఇతర దివ్యాంగనామణులతో కలిసి స్తుతించే సన్నివేశానికి రాసిన పాట ‘లలిత భావనిలయా నవ రసానంద హృదయా, వికచారవింద నయనా సదయా జగదీశ్వరీ’ అంటూ ఈ గీతం సాగుతుంది. పల్లవిలో లలితాదేవి తోబాటు సరస్వతీ దేవిని స్తుతించారు. రెండు, మూడు చరణాలలో లక్ష్మీ దేవి, పార్వతీ దేవిని స్తుతించారు. ఘంటసాల ఈ పాటను సరస్వతి, శ్రీ, లలిత రాగాల సమ్మేళనంతో రాగమాలికగా తీర్చి దిద్దారు. లలితభావ నిలయను సరస్వతి రాగంలో, శ్రీదేవి కైవల్య చింతామణిని శ్రీ రాగంలో, నిటలలోచన నయన తార తారా భువనేశ్వరిని లలిత రాగంలో స్వరపరచడం ఘంటసాలకే సాధ్యపడింది. ఇన్ని పాటలను విశ్లేషించినా మల్లాది వారి ప్రతిభకు విలువ కట్టలేం. సముద్రాలకు పరోక్ష రచయిత మల్లాది అనే కథనం ప్రచారంలో వుంది. అందులో అబద్ధం లేదు. ఈ విషయాన్ని కొందరు సన్నిహితులు మల్లాది వద్ద ప్రస్తావిస్తే ‘నా పేరుతో వచ్చేవే నా పాటలు’ అంటూ ‘సముద్రాల నా కలం పేరు’ అని చమత్కరించారు. ప్రస్తుత దసరా నవరాత్రులు సందర్భంగా మనం ఈ పాట గురించి తెలుసుకుందాం. రహస్యం సినిమా కోసం ముగ్గురు జగన్మాతలను వర్ణిస్తూ మల్లాది వారు ఒక పాట వ్రాసి ఘంటసాల గారికి ఇచ్చి “సరస్వతీ దేవి వర్ణన సరస్వతీ రాగములో, లక్ష్మీదేవి వర్ణన శ్రీరాగములో, లలితాదేవి (పార్వతిదేవి) వర్ణన లలితరాగములో ” స్వర పరచమన్నారుట. ఆ సాహిత్యానికి ఘంటసాల మాస్టారుగారు అలా స్వరపరచిన పాట మీకోసం మల్లాది వారి సాహిత్యపు సొబగులు నాకు తెలిసినంత మేర వివరిస్తాను.
సరస్వతి రాగం:
లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
విక చారవింద నయన.. సదయ జగదీశ్వరీ
‘లలిత భావ నిలయ’ అని ప్రారంభించారు. లలితము అనగా మంగళప్రదమైన అనిఅర్ధం. మంగళము అనగా బ్రహ్మ స్వరూపం. మంగళప్రదమైన నీ రూపం ‘నవరసానంద హృదయ’ – సర్వ కాల, సర్వావస్ధలయందు నూతనమైన ఉత్తేజాన్ని, ఆనందాన్ని కలిగించే హృదయమున్న తల్లివి నీవు. ‘వికచారవింద నయన’ – వికసించిన తామర పూవులవంటి కన్నులు కల ‘ సదయ జగదీశ్వరి ‘ – అందరిపట్ల సమానమైన దయాగుణం కలిగిన జగన్మాతావు.
మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
సుమరదన విధువదన.. దేవి
అంబరాంతరంగ శారదా స్వరూపిణీ
చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే
‘మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణి’ – అమృత ధార వంటి పలుకులతో – పలుకు లేదా మాట అన్న శబ్దాన్ని వాడవచ్చు కానీ మల్లాదివారు ‘గమకమొలుకు’ అన్నారు. గమకము అంటే సంగీతంలో స్వరవిన్యాస మార్పుని తెలియచేసేది గమకము. ‘వరవీణాపాణి’ – ఎల్లప్పుడూ వీణను ధరించి ఉండునది – సరస్వతి దేవి. సుమరదన అనగా తెల్లటి మల్లె పూవుల వంటి దంతములతో విడువదనా అనగా చంద్ర బింబము వంటి మొముతో ప్రకాశించెదవు. ‘సరస్వతి’ అంటే ప్రవాహం కలిగినది. ఆ ప్రవాహం వాక్ప్రవాహం. ‘అంబీతమే, నదీతమే, దేవీతమే సరస్వతి’ అంటూ ‘సరస్వతి’ అనే పదాన్ని ‘వాక్ప్రవాహం’ అనే అర్థంలో ఋగ్వేదంలో ప్రయోగించారు. సరస్వతికి సంబంధించినది సారస్వతం. కావ్య వృత్తులలో భారతీ వృత్తి ఒకటి. కనుక సరస్వతి వాగ్దేవత. ‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ’ అని పోతనామాత్యుడు శ్రీమహాభాగవతం అవతారికలో సరస్వతీ స్వరూపమైన దేవిని స్తుతించాడు. ‘ఈ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు’ మా అమ్మ కృపాబ్ధిగా సప్రాప్తించినవని వినయ విధేయతలతో పేర్కొన్నాడు. అక్షరమాల సాహిత్యం, వీణావాదనం సంగీతం. ఈ రెండిటి సమన్వయమూర్తి సరస్వతి. ఓంకారమే వాగ్భవకూటం. వేదత్రయంలోని ప్రథమ మంత్రాల ప్రప్రథమాక్షరాలతో చేరి అది ‘ఐం’ అయింది. ఇదే మహాకాళీ బీజం, సరస్వతీ బీజాక్షరం. దీన్ని ఉపాసించే కాళిదాసు మహాకవి అయ్యాడు.
సరస్వతీదేవి పరమార్థం తాలూకు మూలం మార్కండేయ పురాణంలోని సరస్వతీ స్తుతిలో ఉంది. సరస్వతీ తత్త్వంలోని ప్రధానమైన లక్షణాలు నాలుగు. అంతకుముందు లేని వస్తువును కొత్తగా సృష్టించడం. పూర్వమే ఉన్న రసహీనమైన వస్తువును కొత్తగా మార్చి సృష్టించడం. ఆ రెండిటినీ మనోహరంగా ప్రకాశింపజేయడం. కవి సహృదయ సమ్మిళిత రూపంగా సాక్షాత్కరించడం. కావ్య సృష్టి వేళ బ్రహ్మతో సమానుడైన కవి ఆ సృష్టి తరువాత సరస్వతీ స్వరూపుడు. సరస్వతి వాగ్దేవతగా మాత్రమే కాదు, విద్యాధిదేవతగా కూడా ప్రసిద్ధి చెందింది. శబ్ద జ్ఞానాలతో దేవతాతత్త్వం సమన్వితమయినప్పుడు సమగ్రమైన సరస్వతీ స్వరూపం సిద్ధిస్తుంది. ఉపనిషద్రూపంలో ఉన్నది వేద వాగ్దేవతే. ‘మనోవాక్కాయాలు’ అనే త్రికరణాల శుద్ధిగా దేవతలకు హవిస్సులను అందించేది కూడా వాగ్దేవతే. ‘సర్వ సృష్టిని, సర్వ మానవ ప్రపంచాన్ని నడిపే అంతఃశ్శక్తి సరస్వతీదేవి’ అనే రహస్యాన్ని మొట్టమొదట గ్రహించినవారు శ్రీ శంకర భగవత్పాదులు. అందుకనే సర్వాద్వైత పీఠాలలో సరస్వతీదేవితో కూడి ఉన్న శారదా చంద్రమౌళీశ్వర ఆరాధనను ప్రవేశపెట్టారు. శారదా పీఠాన్ని స్థాపించారు. ‘సరస్వతీదేవి ప్రసాదించే వాక్కులు మధుర మంజులాలు’ అని సౌందర్యలహరిలోని ఒక శ్లోకంలో శ్రీ శంకరాచార్యులు వివరించారు. ఆ దేవతను స్మరించి, ఆమెకు నమస్కరించకపోతే జీవులకు తేనె, పాలు, ద్రాక్ష లాంటి మృదుమధురాలైన వాక్కులు ఎలా సిద్ధిస్తాయని ఆ శ్లోక భావం. ‘అంబరాంతరంగ శారదా స్వరూపిణి’ – ఆకాశమంత విశాలమైన మనసు కలదానవు సరస్వతి రూపమువన్న నీవు. ‘చిదంబరేశ్వరీ శ్రీ శారదాంబికే’ – చిత్+అంబరం = చిదంబరం. ఇక్కడ మనసు అనే ఆకాశంలో ఇంచే శారదామాతవు నీవు. ఇప్పుడు మొత్తం అర్ధం చూడండి. మంగళకరమైన రూపంతో, సర్వ కాల, సర్వావస్ధలయందు నూతనమైన ఉత్తేజాన్ని, ఆనందాన్ని కలిగించే హృదయంతో తామర పూవులవంటి కన్నులతో అందరిపట్ల సమాన దయా గుణం కలిగిన జగన్మాతావు నీవు అమృత దారవంటి పలుకులతో ఎల్లప్పుడూ చేతియందు వీణను ధరించి ఉండి, తెల్లని మల్లె పూవుల వంటి దంతములతో, చంద్ర బింబము వంటి మొముతో మమ్ములను కటాక్షించుటకు ప్రకాశించుచుండెదవు. ఆకాశమంత మనసుతో అటువంటి ఆకాశంలో విహరించే శారదామాతవమ్మా నీవు.
శ్రీ రాగం:
చరణం 1:
శ్రీదేవి కైవల్య చింతామణి… శ్రీరాగ మోదిని చిద్రూపిని
బింబాధరా.. రవిబింబాంతరా..
బింబాధరా.. రవిబింబాంతరా..
రాజీవ రాజీవిలోలా… రాజీవ రాజీవిలోలా
శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని….
సరస్వతి దేవి ప్రార్ధన అయింది. ఇప్పుడు లక్ష్మి దేవి ప్రార్ధన. ‘శ్రీదేవి కైవల్య చింతామణి’ – భవబంధాలని తెంచి మోక్షం ప్రసాదించడంలో అన్ని విధాలైన సంపదల్ని ప్రసాదించే నువ్వు చింతామణి వంటి దానవమ్మా. చింతామణి అనగా -చింతలను పోగొట్టి మనోభీష్టమను నెరవేర్చే గొప్ప రత్నంగా చెబుతారు. ఆ మని లక్షి దేవి వద్ద ఉంటుందని యోగ వాశిష్టం అనే గ్రంధంలో వివరించబడినది పెద్దల మాట. అది నిజం అనేలా మల్లాది వారు కూడా ఇక్కడ లక్ష్మి దేవిని చింతామణి గా వర్ణించేరు. ‘శ్రీరాగ మోదిని చిద్రూపిణి’ – శ్రీ రాగముని ఆనందించే తల్లి చిద్రూపిణి – ఆత్మ స్వరూపిణివి. ‘ బింబాధరా సూర్యుని వంటి ఎర్రని రంగు కల పెదవులతో – రవిబింబాంతరా’ – సూర్య బింబములు ఉండి ప్రకాశించెడుదానవు. ‘రాజీవ రాజీవిలోలా’ – పద్మములలో పద్మము వాలే తిరుగడునది అంటే అమ్మ నడచి వచ్చినా వెళ్లినా తామర పూలు గాలికి కదిలి నృత్యం చేసినట్లు ఉంటుందిట. ‘శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని’…. ఉత్క్రుష్టమైన మోక్ష కాంక్షకు సంజీవని వంటి దానవమ్మా. లలితా సహస్రనామములో ఆ తల్లిని ‘మహా కామేశ నయనా కుముదాహ్లాద కౌముది’… అని వర్ణించేరు అంటే మహేశుని కళ్ళు అనే కలువలకు ఆమే చల్లని మూర్తీభవించిన వెన్నెల. ఇప్పుడు రెండవచరణం పరిసజీలిద్దాం.
లలిత రాగం:
చరణం 2:
నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
అరుణవసన.. అమలహసనా
అరుణవసన.. అమలహసనా
మాడినీ.. మనోన్మణి
నాదబిందు కళాధరీ భ్రామరీ…
నాదబిందు కళాధరీ భ్రామరీ… పరమేశ్వరీ
నాదబిందు కళాధరీ భ్రామరీ… పరమేశ్వరీ
‘నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ’ – కోపముతో ప్రజ్వలిల్లే ఆ నిటలాక్షుడి మాధవ కంటి శక్తి జగన్మాతడే అలాగే ఆయన కోపాన్ని చల్లబరిచే చిరునవ్వు కూడా ఆ తల్లిదే. నక్షత్ర లోకానికి రాణియై ప్రకాశించేది ఆవిడే. ఆ ఈశ్వరుడి శక్తి ఆవిడే, కంటిలో దీప్తీ ఆవిడే… అందుకే ఆవిడని ‘శివశక్తైక రూపిణి ‘ గా అభివర్ణించారు. ‘ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ’ – ప్రణవధామా అనగా ఓంకారమే నివాసముగా కల తల్లి. ప్రణయదామా అనగా ప్రేమైక్యభావన హారముగ్ కలది అంటే అందరిపట్ల సమానమైన ప్రేమ భావము చూపునాది. సుందరీ అనగా సుందరమైనదానవు అని ఒక అర్ధం. గాలిత్యము కలిగిన అని మరొక అర్ధం లాలిత్యము కలిగిన అంటే అమ్మ లలితా దేవే. అందుకే కాళిదాసు ‘అశ్వధాటి స్త్రోత్రము” లో ” రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ‘” అని వర్ణిస్తారు. అంటే ఆవిడని మించిన సౌందర్యము మరొకటి లేదు, అందుకే ‘రుపాధికా శిఖరి ‘ – అధికమైన అందానికి శిఖరం ఆవిడ.. సౌందర్య లహరే ఆ తల్లి. కామేశ్వరీ అనగా ఈశ్వరునికి కోరిక కలిగించి ఆ కోరికను తీర్చునది. ‘అరుణవసన.. అమలహసనా’ – అరుణవసన అనగా ఎర్రని వస్త్రములు ధరించునది, అమలహాసనా అనగా మలినం లేని స్వచ్ఛమైన నవ్వు కలది. మాడినీ అనగా శివునిలో ప్రియమైనది. శివుడిని మురుడేశ్వరుడి గా కొలుస్తారు. ఆయన భార్య మాడిని. బ్రామరీ అనగా భ్రమరాంబ. భ్రామరీ అంటే తిరిగేది/ తిప్పేది. ప్రపంచాన్ని తిప్పితూ తిప్పు.. చివరికి తిరగడానికి వీలు లేని అంటే ‘స్థానువు ‘ (శివుడిలోకి) లోకి ఐక్యం చేసే శక్తి ఆవిడే. శివుడు మల్లికార్జునుడిగా అవతారమెత్తి శ్రీశైలంలో ఒక మల్లె పువ్వుగా మారిపోయారుట, అప్పుడు ఆవిడ బ్రామరి అంటే నల్ల తుమ్మెదగా మారి ఆయన చుట్టూ తిరిగిందిట. ఈ రోజుకీ శ్రీశైలములో భ్రమరాంబ గుడి వెనుక తుమ్మెదల రొద వినపడుతుంది. ఇక్కడ ఆవిడని భ్రమరముగా పోలిస్తే శివతాండవ స్త్రోత్రములో మాత్రం ” రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం ” రసప్రవాహముగా ఉన్న ఆవిడ ముఖము దగ్గరకు విజృంభించిన మధువ్రతము అంటే తుమ్మదగా ఆ పరమేశ్వరుడు వచ్చాడుట.
శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీమ్