పిబరే రామరసం

పిబరే రామరసం

పిబరే రామరసం రసమే పిబరే రామరసం

జనన మరణ భయ శోక విదూరం

సకల శాస్త్ర నిగమాగమ సారం

శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం

సుఖ శౌనక కౌశిక ముఖ పీతం

పిబరే రామరసం రసమే పిబరే రామరసం

          ‘పిబరే రామరసం’ వినే ఉంటారు. ‘జనన మరణ భయ శోకాలను దూరం చేసే రామనామం స్మరించవే నాలుకా! పతితుల్ని పరమ పవిత్రులుగా చేయగలది రామనామమొక్కటే’ అని ప్రబోధించిన ఈ కీర్తన వినని సంగీతప్రియులు లేరు. ఆది శంకరుల తర్వాత మళ్లీ అంతటి అద్వైత మూర్తి.. సదాశివ బ్రహ్మేంద్రయోగి.

          ప్రాపంచిక విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ధైర్యంగా ఉంటేనే, పారమార్థిక విషయాల పట్ల ధీరోదాత్తులుగా ఉండి గమ్యాన్ని చేరుకోగలం ఇది అంత సులభం కాదు.  అసలు మనసే లేకపోతే మనిషే లేడు. భౌతికమైన కోరికలు, క్షణికమైన సుఖం, ఆనందం పొందటానికి మనసును వాడుకోవటంతోనే మనిషి పతనం ప్రారంభం అవుతుంది. సంశయించేది మనసు. నిశ్చయించేది-బుద్ధి. బాగా ఆకలేసింది. తల్లిని అన్నం పెట్టమన్నాడు. ‘ఈవేళ భోజనం కాస్త లస్యమవుతుందిరా! నాయనా!’ ‘అలా వెళ్లి తిరిగిరా. ఈలోగా సిద్ధమైపోతుంది భోజనం’ పైగా ఈ వేళ మీ అత్తగారు ‘నువ్వొచ్చావని నవకాయ పిండి వంటలు చేస్తున్నది’ అని చెప్పింది తల్లి.  ఓపిక నశిస్తోంది.  ‘ఈ ఆకలికి ఎందుకు ఆగలేకపోతున్నాను’ ఆకలికి తాళగలిగే శక్తే ఉంటే అసలు సమస్యే లేదుగా? అని ఆలోచించాడు. ఒక్కసారి మనస్సును నిగ్రహించాడు. సత్యానే్వషణకు బయలుదేరాడు. సదాశివుడై పోయాడు. ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. శాంతచిత్తుడై చిదానంద లోకంలో అవధూతై, విహరిస్తూ, ‘పరమహంసై’ భాసిల్లి యోగులకే యోగిగా భక్తిరంజని కార్యక్రమంలో పదేపదే వినబడే ‘పిబరే రామరసం రసనే పిబరే రామరసం’ అంటూ సదాధ్యానంలో జీవించిన ఆ సదాశివ బ్రహ్మేంద్ర యోగి రాసిన కీర్తన.. డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ మొదటిసారి 1950-60 ప్రాంతాల్లో విజయవాడ రేడియో కేంద్రంలో వున్నప్పుడు పాడారు. దశాబ్దాలుగా ప్రసారవౌతూనే ఉంది. ఈ కీర్తన వినని శ్రోత లేడు. ఆనందించని వారు లేరు. ‘ఎవరీ సదాశివుడు? ఎక్కడి వాడు?’

          17-18 శతాబ్దాల్లో ఎక్కడో కుంభకోణం దగ్గర తిరువిశనల్లూర్‌లో జన్మించాడు. అసలు పేరు శివరామకృష్ణ – ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగాడు. శివరామకృష్ణ స్వతహాగా బాల్యం నుంచి చాలా చురుకుగా వుండేవాడు. వేదాధ్యయనంతో వేదాంత ధోరణి పెరిగింది. తిరువిశనల్లూర్ శ్రీ్ధర్ వెంకటేశయ్యర్ శిష్యుడై సకల శాస్త్ర పరిచయం కలిగి, ఏకసంథాగ్రాహియై వెలిగాడు. వేమనలా ఆధ్యాత్మ తత్త్వ వేదియైన దిగంబర యోగి. సర్వసంగ పరిత్యాగి. కావేరి తీరంలోని నెరూరు, కొడుముడి ప్రాంతాల పుణ్యక్షేత్రాలలో సంచరిస్తూ జీవించిన పరమయోగి. ఆయన కోరుకున్నవి మూడే మూడు. ఏకాంతం, ప్రశాంతం, నిర్జన ప్రదేశం, రుచిని నాలుకతో చూసినంత కాలమే అదంతా. మనస్సుకు రుచి మప్పితే మాధుర్యమంటే ఏమిటో తెలుస్తుంది. ఒక యోగికి ఆహారం ఎందుకు అవసరం లేదో అర్థమవుతుంది. ఒక సన్యాసి ఇల్లు ఎందుకు వద్దంటాడో అవగతమవుతుంది.  సదాశివ బ్రహ్మేంద్ర యోగియై చిదానంద స్వరూపయ్యాడు. అహం బ్రహ్మస్మి – బ్రహ్మై వాహమస్మి.. అనుకుంటూ – నిర్వికల్ప సమాధిలో నిశ్చల చిత్తంతో కూర్చోగానే కాళ్లు, చేతులు, అన్ని భాగాల కీళ్లకు తాళం వేసినట్లు, శరీరం జడ వస్తువులా మారిపోయేది. ఆ స్థితిలో కుండలినీ శక్తి జాగృతమై, సుఘుమ్నా మార్గంలో పైకి పోతున్నప్పుడు మూలాధారం నుండి సహస్రారం వరకూ ఉన్న పద్మాలన్నీ, ఊర్థ్వ ముఖాలై పూర్తిగా వికసించేవి. ఆయనకు అప్పుడు అపూర్వమైన దివ్యానుభూతులు కలిగేవి.

          మనస్సు భూమధ్య స్థానం చేరుకోగానే పరమాత్ముని ప్రత్యక్ష దర్శనమయ్యేది. సమాధి స్థితిలోనే ఉండిపోయేవాడు. ఇదీ ఆయన దినచర్య. ఓసారి కొడుముడి సమీపంలో కావేరీ నది మధ్యలో ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయిపై కూర్చుని రోజుల తరబడి సమాధిలో ఉండిపోయాడు. అకస్మాత్తుగా వరదలొచ్చాయి. సదాశివుడు ఆ వరదలో కొట్టుకుపోయి ఎక్కడో ఇసుకలో కూరుకుపోయాడు. కనిపించకుండా పోయిన యోగి ఏమయ్యాడో? అని ఆ ఊరి జనానికి ఈయన ఆచూకీ తెలియకపోవడంతో కలత చెందారు. వరదలు తగ్గాయి. అలా ఆరు మాసాలైంది. ఇసుక తవ్వేందుకు ఎడ్లబళ్లతో జనం రావటం మొదలుపెట్టారు. ఓ రైతు పారతో ఇసుకను బాగా లోతుగా తవ్వనారంభించాడు. ఒక్కసారిగా రక్తం పైకి చిమ్మింది. ‘సదాశివ బ్రహ్మేంద్రుల శిరస్సు తెగి కనిపించింది. ఖంగారుపడుతూ, భయంతో వణుకుతున్న జనం, నిర్మలంగా తపోనిష్టలో ఆ యోగిని చూడగానే నిశే్చష్టులయ్యారు.  ఒక్కసారి కళ్లు తెరిచి చిరునవ్వు నవ్వి, చకచకా వెళ్లిపోయాడు. అష్టసిద్దులను వశం చేసుకున్నా ఏమీ తెలియనివాడిలా, దిగంబరంగా తిరిగే ఆ యోగి చుట్టూ పిల్లలు చేరి గేలి చేస్తూ ఉండేవారు. అంతేకాదు ‘పిచ్చి కుప్పుస్వామి’ అని పిలుస్తూండేవారు. వారి పాండిత్యానికి పరిమితి లేదు. వారి మహిమలకు హద్దులు లేవు.
ఓసారి, చుట్టూ చేరి అల్లరి చేస్తున్న పిల్లల్లో ఒకడు, స్వామి దగ్గరకు చేరి శ్రీరంగంలో రంగనాథునకు జరిగే నీరాజనోత్సవం చూడాలని ఉందన్నాడు. వీపు మీద ఎక్కించుకున్నాడు. కన్నులు మూసుకోమన్నాడు. అంతే మరుక్షణంలో ఆ పిల్లలు నలుగురూ శ్రీరంగంలో ఉన్నారు. కొంతసేపు తిరిగాక, ఆ పిల్లల్ని మళ్లీ కళ్లు మూసుకోమన్నాడు. యథాస్థానానికి తిరిగి వచ్చారు. 

          ఓసారి ధాన్య రాసులతో నిండిన పొలంలో తపోసమాధిలో కూర్చున్న సదాశివ బ్రహ్మేంద్రులను చోరుడుగా భావించి, ఆ పొలం కాపలాదారు కర్ర ఎత్తి కొట్టబోయాడు. అలాగే స్థాణువై నిలిచిపోయాడు. కదలలేడు, మెదలలేడు. మరునాడుదయం పొలం యజమాని నిశ్చలంగా ఉండిపోయిన కాపలాదారుని చూసి విస్తుపోయాడు. ప్రక్కనే సమాధి స్థితిలో వున్న సదాశివ బ్రహ్మేంద్రుని పాదాలపై బడి క్షమాపణలు కోరాడు. ఒక్క చిరునవ్వు నవ్వి లేచి అక్కడ నుంచి వెళ్తూ కాపలాదారుడికేసి ఒక్క చూపు చూశాడు. అంతే, ఆ మనిషి మామూలు స్థితికి వచ్చాడు.
యిటువంటివి ఆయన జీవితంలో చాలా జరిగాయి. గురువుల్ని మించిన శిష్యుడై అసమాన తపోశక్తితో వెలిగిపోతున్నాడు. మంత్రోదేశం చేసిన బోధేంద్రుల వారు, తిరువిశైనల్లూర్ శ్రీ్ధర వెంకటేశయ్యర్‌లు ఇద్దరూ సదాశివ బ్రహ్మేంద్రుని తపోనిష్టకు ఆశ్చర్యచకితులైన సందర్భాలు అనేకం.

          జీవసమాధికి కొద్ది రోజుల ముందు జరిగిన సంఘటనను ఎంతో విశేషమైనదిగా చెప్పుకుంటారు. దిగంబరుడై వున్న సదాశివ బ్రహ్మేంద్రుల యోగనిష్టలోనే నడుచుకుంటూ ఒక మహమ్మదీయ రాజ దర్బారులోకి ప్రవేశించాడు. ఒక్క రాజుకు తప్ప అక్కడున్న సైనికులెవరికీ యోగి కనిపించటం లేదు. కోపంతో రాజాగిపోతూ సదాశివుణ్ణి పట్టి బంధించమన్నాడు. వారికి కనిపిస్తేగా? దిగంబరుడై తనను సమీపిస్తున్న యోగిని నిగ్రహిస్తూ కత్తితో రెండు చేతులూ నరికేశాడు – రక్తం పారుతోంది. సదాశివునికి ఏమీ తెలియటం లేదు. కాస్సేపటికి స్పృహ వచ్చి కళ్లు తెరిచి లేచి అలాగే నడిచి వెళ్లటం చూసిన రాజు భయంతో వణికిపోతూ, పాదాలపైబడి క్షమించమన్నాడు. ఎడమ చేతితో కత్తి తీసుకుని, రక్తమోడుతున్న ఆ చేతిని సదాశివ బ్రహ్మానికిచ్చాడు. ఒక్క చిరునవ్వు నవ్విన మరుక్షణం ఆ చేయి యథాస్థానంలో అతుక్కుంది. ఆ ముస్లిం రాజు దాసోహమంటూ శిష్యుడై పోయాడని ఒక కథ.

          దిగంబరంగా సమాధి స్థితిలో వుండి దేశాటన చేయటం భారంగా కనిపించిన సదాశివ బ్రహ్మేంద్రులు నెరూరు చేరుకున్నారు. తన అవసాన క్షణాలను ముందుగా తన శిష్యులైన పుదుక్కోటై మహారాజు, మైసూర్ మహారాజు, తంజావూరు మహారాజులకు తెలియజేశాడు.పవిత్రమైన స్థలానికి చేరుకున్నాడు. సమాధిలోకి వెళ్లిపోయాడు. విభూతి, ఉప్పు, పసుపు, ఇటుకలతో ఆ సమాధిని కప్పేశారు. 9వ రోజున ఆ సమాధిపై బిల్వ వృక్షం మొలిచింది. ఆపై శివలింగాన్ని ప్రతిష్టించారు. 1750లో జీవసమాధై తన స్థూల, సూక్ష్మ, ప్రాణ శరీరాలను వెరూరు, మానామధురై, కరాచి (పాకిస్తాన్)లో ముస్లిం శిష్యుడు ఉపేక్షించారని శృంగేరి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివ అభినవ నరసింహ భారతీయ మహాస్వామి వెల్లడించారు.

          సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు కేవలం పాతికలోపే వున్నాయి. శివ మానసిక పూజ, అద్వైత తారావళి, బ్రహ్మ తత్త్వ ప్రకాశిక, యోగ సుధాకర, పతంజలి యోగ సూత్రాలకు భాష్యం, ఆత్మవిద్యా విలాసం, నవ మణిమాల, శివయోగ దీపిక వంటి సంస్కృత గ్రంథాలు రచించిన మహనీయుడు. ఈ కీర్తనలెక్కువగా స్వర పరిచినది వోలేటి. దేనికదే సాటి. పిబరే రామరసం, స్థిరతా నహి నహిరే, ఖేలతి మమ హృదయే, చింతా నాస్తికిలా తేషాం, స్మరవారం వారం, భజరే యదునాధం వంటి ఎన్నో కీర్తనలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వంటి కర్ణాటక సంగీత విద్వాంసులెందరో పాడారు. ముఖ్యంగా విజయవాడ రేడియో కేంద్రంలో వోలేటి స్వరపరచిన నహిరే నహి శంక, సర్వం బ్రహ్మమయం, ఖేలతి మమ హృదయే, బ్రహ్మై వాహంఖిల, జయతుంగ తరంగే, గాయతి వనమాలీ, బ్రూహి ముకుందేతి వంటి కీర్తనలు బహుళ ప్రసిద్ధమయ్యాయి. ఈ కీర్తనలు వోలేటి, పెమ్మరాజు సూర్యారావు, ఎం.వి.రమణమూర్తి రేడియో కోసం పాడారు.