Radha Saptami – రధసప్తమి విశిష్టత

చీకట్లను తొలగించి.. సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి. విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు, జగత్తును ప్రకాశవంతం చేసేవాడు.

మాఘ మాసం లోని ఏడవరోజు అంటే మాఘ శుక్ల సప్తమి నాడు రథసప్తమి వస్తుంది. రథం అంటే గమనం అని అర్థం. సూర్యుని గమనం ఈ తిథి నుండీ మారుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం లో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భం లో ఆ సూర్య భగవానుని కాంతి, వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరిస్తుంది.

సూర్యుడు తన రథం దిశను మార్చుకునే రోజు..

రథ సప్తమికే సూర్య జయంతి, భాను సప్తమి, మిత్ర సప్తమి, జయ సప్తమి, మహాసప్తమి, భీష్మ సప్తమీ అని ఎన్నో పేర్లు ఉన్నాయి. రథ సప్తమి సూర్య భగవానుని జన్మదినం. ఈ రథ సప్తమి రోజునే సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడు. ఏడు కిరణాలుగా సప్తవర్ణాలను ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుని అశ్వాలు/ కిరణాలు ఈ రోజు ఒకే తెల్లని కాంతి రేఖగా మారుతాయి. అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారని పెద్దలు చెబుతారు. ఒకప్పుడు కాంభోజ రాజైన యశోవర్మ తనకు ఎన్నో పూజల ఫలంగా పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధుల పాలైతే రథసప్తమీ వ్రతాన్ని ఆచరించి సూర్య భగవానుని అనుగ్రహం తో తన కుమారుని అనారోగ్యం నుంచీ కాపాడుకున్నాడని ఒక చారిత్రక గాథ ఉంది.

వ్రతకథ…

పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వ కాలంలో కాంభోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండే వాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల భారీన పడేవాడు.  తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రహ్మాణులు “నీ కుమారుడు పూర్వ జన్మమున పరమలోభియైన వైశ్యుడు. రథసప్తమీ మహాత్మ్యము వలన నీకు జన్మించాడు. లోభి అయినందున వ్యాధిగ్రస్తుడయ్యెను అని చెప్పారు. దీనికి పరిహారమడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు. ఏవ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమీ వ్రతము చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని రుషులు చెప్పాగానే రాజు అలా చేశాడు.  దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది  అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలుపుతాడు.

రథసప్తమి నాడు చేయవలసిన పనులు..

సూర్యుడిని ఆరోగ్యప్రాధాతగా కోలుస్తుంటారు. రథసప్తమి రోజున ప్రాతఃకాల సమయాన గంగలో స్నానాలు, సూర్యోపాసనలవలన మృత్యుభయం పోతుందని నమ్ముతుంటారు. అలాగే మరణించిన తర్వాత సూర్యలోకానికి వెళతారని పండితులు అంటుంటారు. ఆ రోజున నదీ తీరాలలో నేయ్యి లేదా నూనెతో ప్రమిదలో దీపాన్ని వెలిగించి.. నీటిలో వదలాలి. ఆ తర్వాత తలమీద 7 జిల్లేడు ఆకులను, రేగు పళ్ళను ఉంచుకుని స్నానం చేసే నీళ్ళలో శాలిధాన్యం, నువ్వులు, దూర్వాలు, అక్షింతలు, చందనం కలిపుకొని స్నానం చేయాలి.

చిక్కుడు ఆకుల్లో నైవేద్యం…

రథ సప్తమిరోజున ఆవు నేతితో దీపారాధన చెయడం వల ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెపుతారు. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, సంకాంత్రి రోజున పెట్టిన పిడకలు, గొబ్బెమ్మలతో పోయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు. తరువాత ఆ పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది.