స్వాతంత్య్ర దినోత్సవం ప్రాధాన్యత – Importance of Independence

ఆగస్టు పదిహేను భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతోంది. 1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతరం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.

చరిత్ర

భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే వారి ప్రాభవం తగ్గుతూ వచ్చింది. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగి దానిలో సిపాయిలు, రాజులు ఓడిపోయాక 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాక దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది. బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది.జై భారత్.

తేదీ ప్రాధాన్యత

 ఇండియాలో బ్రిటీష్ ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1948లో నిర్ణయమైన స్వాతంత్ర్య దినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15న జరగాలని నిర్ణయించారు. ఇందుకు ఒక ప్రధాన కారణం రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్ర్యానికి దానిని ఎంచుకున్నారు మౌంట్ బాటన్. 

వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు అనగా 1947 ఆగస్టు 15న  రాత్రి సమయంలో నెహ్రూ ఏమని మాట్లాడేరంటే 

అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించుకున్నాం. మన నిర్ణయాన్ని పూర్తిగా, కూలంకషంగా సాధించే సమయం యిప్పుడు ఆసన్నమయింది. అర్థరాత్రి పన్నెండు గంటలు కాగానే ప్రపంచమంతా నిద్రిస్తున్న  సమయాన, భారతదేశం పునరుజ్జీవనంతో, స్వేచ్ఛగా స్వతంత్రదేశంగా ఆవిర్భవిస్తుంది

స్వాతంత్య్ర దినోత్సవ రోజు కోసం ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటాడు. మన దేశంలోని ప్రతి వ్యక్తి ఈ తేదీని గౌరవంగా, గర్వంగా భావిస్తారు.   

భారతదేశాన్ని తమ కంబంధ హస్తాల్లో బంధించిన తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన మన్యం వీరుడు అల్లూరి నుంచి సాయుధ సంగ్రామానికి సైన్యం ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ వరకు స్వాతంత్రం కోసం ప్రాణార్పణ చేసినవారే. కానీ వారందరి ప్రాణార్పణ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించలేక పోయినా ప్రతి భారతీయుని స్వాతంత్ర సంపాధన కాంక్ష ఎగసి పడేలా చేశాయి. 
 
అలాంటి సమయంలో దేశానికి స్వాతంత్రం సంపాదించాలంటే అది శాంతి మార్గంతోనే సాధ్యమని నమ్మి అదే దారిలో చివరివరకు పోరాడి దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన ఘనత మహత్ముడికే దక్కుతుంది. అయితే ఆలోచనల్లో వైరుధ్యాలున్నా, ఎంచుకున్న మార్గాల్లో తేడాలున్నా ఆ మహానుభావుల లక్ష్యం మాత్రం దేశ స్వాతంత్రమే. 
 
అలా ఆనాడు అంతమంది ఎన్నో కష్ట నష్టాలకోర్చి స్వాతంత్రాన్ని సంపాదించారు కాబట్టే భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర మహోన్నత అధ్యాయంగా నేటికీ అందరి చేతా కొనియాడబడుతోంది. అంతటి గొప్ప చరిత్రతో సాదించుకున్న దేశ స్వాతంత్రం గురించి, స్వాతంత్రమనే నిధి సాకారమైన ఆగస్టు 15 రోజు గురించి తల్చుకుంటే భారతీయుడైన ప్రతి ఒక్కరికీ మనసులో ఉద్వేగం ఉప్పొంగుతుంది. మది దాటిన సంతోషం జైహింద్ అని స్మరిస్తుంది.