చందమామ
ప్రారంభం : చందమామ విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించిన పిల్లల మాసపత్రిక. ఇది 1947 జూలై నెలలో మద్రాసు నుండి తెలుగు, తమిళ భాషలలో ప్రారంభింపబడి ఇప్పుడు 13 భారతీయ భాషలలో ఇంకా అమెరికా, కెనడా, ,సింగపూరు వంటి దేశాల్లో కూడా వెలువడుతోంది. చందమామ పత్రికను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయా పిక్చర్స్ నిర్మాతలైన నాగిరెడ్డి, చక్రపాణి ప్రారంభించారు.
విషయ నేపధ్యం : చందమామ కేవలము ఆరువేల సర్క్యులేషన్ తో ప్రారంభమై నేడు రెండు లక్షలు పైగా సర్క్యులేషన్ తో విరాజిల్లుతోంది. ఇది ఒక అద్భుత విజయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చందమామ ప్రకటనల మీద ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టలేదు. దీని సర్క్యులేషన్ సుమారుగా 6 నుంచి 7 లక్షలకు పెరగవచ్చని అంచనా. టెలివిజన్, వీడియో గేములు, కార్టూన్ నెట్ వర్కులు లేని రోజుల్లో పిల్లలకున్న ఏకైక వినోదాత్మక, విజ్జ్ఞానాత్మకమైన కాలక్షేపం చందమామ పత్రిక. పిల్లలే కాదు పెద్దలు కూడా ఎప్పుడెప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసే ఏకైక పత్రిక చందమామ. రామాయణ కల్పవృక్షం, వేయిపడగలు లాంటి అద్భుతమైన కావ్యరచనలు చేసిన కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి లాంటి మహానుభావులు కూడా “చందమామ పత్రిక నాచేత కూడా చదివిస్తునాది, పత్రిక రావడం ఆలస్యమైతే దుకాణంవాడితో గొడవపడుతున్నాను” అని ఒక సందర్భంలో చెప్పారంటే చందమామ పిల్లల, పెద్దల మనస్సులో ఎంత గొప్ప స్థానం సంపాదించుకుందో అర్ధం చేసుకోవచ్చు.
విషయ విశ్లేషణ : భారతీయుల్లో చదవటం వచ్చిన ప్రతివారు ఎప్పుడో ఒకప్పుడు చందమామ పత్రికను చదివారానడంలో సందేహం ఉండదు. సున్నితమైన హాస్యంతో విజ్జ్ఞాన, వినోదాత్మకమైన చందమామ కధలు చక్రపాణి గారి ఆధ్వర్యంలో కొడవటిగంటి కుటుంబరావు గారు సృష్టించిన ఒరవడిని కొనసాగిస్తూ తరాలు మారినా చందమామ కధలు అలరిస్తూనే ఉన్నాయి. ఆశ్ఛర్యకరమైన విషయం ఏమిటంటే చందమామలో దయ్యాలకధలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి కానీ అవి పిల్లల్లో మూఢనమ్మకాలని పెంచే విధంగా ఉండేవి కావు. దయ్యాలంటే పిల్లల్లో సహజంగా భయం ఉంటుంది కానీ చందమామలో దయ్యాల కధలు అటువంటి భయాల్ని పెంచి పోషించేవిగా ఉండేవి కావు. చందమామ కధల్లో ఉండే దయ్యాల పాత్రలు నహజంగా సరదా పుట్టించి అసలు అటువంటి పాత్రలు ఎక్కడైనా ఉంటాయేమో చూద్దాం అనిపించేవిగా ఉండేవి. దెయ్యాలకు వేసే బొమ్మలు కూడా సూచనప్రాయంగా ఉండేవి కానీ పిల్లలని భయపెట్టే విధంగా ఉండేవి కావు. ఈ దెయ్యాల కధల్లో దెయ్యాలు రెండు విధాలుగ ఉండేవి. మంచివాళ్లకు సాయం చేసే మంచి దెయ్యాలు, కేవలం సరదా కోసం తమాషా చేసే చిలిపి దెయ్యాలు. చందమామ పత్రిక కేవలం వినోద, విజ్జ్ఞానాలకే పరిమితం కాకుండా ఏడు దశాబ్దాల పైగా లక్షలాది పిల్లలను మెప్పిస్తూ, ఆకట్టుకుంటూ వారిలో సృజనాత్మక శక్తిని పెంపొందింప చేస్తూ వారు సత్ప్రవర్తనతో బాధ్యత కలిగిన పౌరులుగా ఎదిగే విధంగా, నిజాయితీ, నైతికత, లోకజ్ఞానం, వినయం, కృతజ్జ్ఞత, పెద్దలయందు గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, ధృడ సంకల్పం కల ఉత్తమ పౌరులుగా తమను తాము తీర్చిదిద్దుకునేలా చేస్తూ వచ్చింది చందమామ సాహిత్యం.
అనుకూల – ప్రతికూల అంశాలు : చందమామ పత్రిక ధారావాహికలకు పెట్టిందిపేరు. “చిత్ర” “శంకర్” వేసే అద్భుతమైన, అపురూపమైన బొమ్మలతో ఆసక్తికరమైన కధనంతో, సరళమైన భాషలో ఒక్కొక్క ధారావాహిక కొన్ని నెలలపాటు సాగేవి. ప్రతినెలా ఒక ఆసక్తికరమైన ఘటన దగ్గర ఆపి మరుసటి నెలవరకు చదువరులు ఆసక్తితో ఎదురుచూసేలా చేసేవారు. పాత్రలు ఒక డజనుకు మించి ఉండేవి కావు. “చిత్ర” ఒక్కొక్క పాత్రకు బొమ్మ మొదటిసారి ఎలా వేసేవారో ధారావాహిక పూర్తయ్యే వరకు అదే విధంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ చందమామలో కధలుగా వచ్చాయి. ఉపనిషత్తులలో కొన్ని కధలు, కదాసరిత్సాగరం, బౌద్ధజాతక కధలు, జైనపురాణ కధలు, వెయ్యిన్నొక్క రాత్రులు (అరేబియన్ నైట్స్), ఇవే కాకుండా బాణుడు, కాళిదాసు ఇతర సంస్కృత రచయితల నాటకాలు, ఆంగ్లములోని షేక్స్పియర్ నాటకాలు, గ్రీకు పురాణాలైన “ఇలియడ్, ఒడిస్సీ” ఇతర భాషా కావ్యరత్నాలైన శిలప్పదిగారం, మణిమేఖలై మొదలైన పురాణ కధల పుట్ట చందమామ. ఈ అనుకూల అంశాలన్నీ చందమామకు అంతర్జాతీయ స్థాయి కల్పించడానికి దోహదపడ్డాయి.
సూచనలు : బాలసాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్య, సాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలుచేస్తాయి. పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాలసాహిత్యం కాదు. దేవుడి మీద భక్తినీ, మతవిశ్వాసాలనూ ప్రచారం చెయ్యటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు. కథలో నెగ్గవలసినది మనుష్య యత్నమూ, మనిషి సద్బుద్ధీ.
ముగింపు : చందమామ, మంచి ప్రాభవంలో ఉన్న రోజుల్లో వడ్డాది పాపయ్య, బాపు గార్ల రంగుల బొమ్మలతో, ప్రతి పేజీక్రింద అంచులలో దీపాల బొమ్మలతో, దీపావళికి ప్రత్యేక సంచిక ఉండేది. అలాగే, మనిషి మొట్టమొదటిసారి చంద్రుడిమీద కాలుపెట్టిన చారిత్రాత్మక సంఘటన (జులై, 1969) సందర్భంగానూ, మహాత్మా గాంధీ శతజయంతి (అక్టోబరు, 1969) సందర్భంగానూ ప్రత్యేక చందమామలు వేయబడ్డాయి. అలాగే, విజయా సంస్థ వారు హిందీలో “ఘర్ ఘర్ కి కహానీ” ప్రముఖ నటులు బల్రాజ్ సహానీతో తీసినపుడు, ఆ చిత్రం గురించి చందమామలో ప్రత్యేకంగా వ్రాసారు. ఆ చిత్రంలో కుటుంబంలో తండ్రి – పిల్లల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి చక్కగా చూపారు. అందుకనే కాబోలు, చందమామలో ప్రత్యేకంగా ప్రచురించారు. ఈ సంచికలు చందమామ ప్రతులు పోగుచేసేవారికి ఎంతో విలువైనవి, బంగారంతో సమానమైనవి. 2000సం. నుండి ప్రతి సంవత్సరం నవంబరు సంచికను పిల్లల ప్రత్యేక సంచికగా రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 14 ఏళ్ళలోపు బాలబాలికలచేత కథలు వ్రాయించి ఎంపికచేసిన బాల చిత్రకారుల్ని చెన్నై రప్పించి, ఆ కథలకు వారిచేత బొమ్మలు వేయిస్తున్నారు. ఇది అబినందించదగిన మార్పు.