టెలిస్కోప్
నాపేరు అర్జున్. నేను 10 వ తరగతి చదువుతున్నాను. మాకు గత వారం మా సైన్సు టీచరు టెలిస్కోప్ పాఠం చెప్పేరు. ఈరోజు ఆపాఠంపై మాకు ఏమి అర్ధమైంది, ఎంతవరకు అర్ధమైంది ఒక వ్యాసంగా వ్రాసుకుని రమ్మన్నారు. అంటే నేను రేపు స్కూలుకి వెళ్ళినప్పుడు వ్యాసం మాటీచరు గారికి చూపించాలి. అందుకని ఇప్పుడు నాకు టెలిస్కోప్ గురించి తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఇటలీ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో తొలి దూరదర్శినిని 1609 సంవత్సరం లో కనిపెట్టెను. పిమ్మట టెలిస్కోపుతో అంతరిక్షాన్ని విశేషంగా పరిశీలించి చంద్రుని ఉపరితల భాగం పర్వతములను, లోయలను కలిగి ఉన్నదని నునుపుగా లేదని తెలియచేసెను. అంతేకాకుండా పాలపుంత (milky way) అనేక నక్షత్రాల సముదాయమని, గురు గ్రహమునకు నాలుగు ఉప గ్రహములు కలవను సిద్ధాంతమును మానవాళికి తెలియచేసెను. కానీ ఈ సిద్ధాంతమును అప్పటి అధికారులెవరూ అంగీకరించలేదు. అతనిపై మతపరమైన ఆరోపణలను మోపి అతని చేతనే అతని సిద్ధాంతము తప్పు కావొచ్చునని చెప్పించి, జీవితకాలం తన సిద్ధాంతం గురించి మాట్లాడకుండా ఉండే విధంగా శిక్ష విధించారు. ఇంచుమించుగా గెలీలియో టెలిస్కోప్ కనుగొన్న సమయానికే కెప్లర్ అను శాస్త్రవేత్త కూడా టెలిస్కోప్ ను కనుగొనెను. ఇప్పుడు మనం వాడుతున్న బైనాక్యులర్సు వీటి నమూనాగా తయారుచేయబడినవే. అయితే ఖగోళ వస్తువులను చూడటానికి ఇప్పుడు వాడుతున్న టెలిస్కోప్ 1670 లో న్యూటన్ నిర్మించిన పరావర్తక దూరదర్శినిపై ఆధారపడినవే. ఒక పెద్ద పుటాకార దర్పణం వస్తువు నుంచి వచ్చే కిరణాలను పరావర్తనం చేసి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. మరో అక్షి కటకం దీన్ని ఇంకా పెద్దదిగా కనబడేలా చేస్తుంది. ఈ ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది కానీ ఖగోళ వస్తువులను చూడడానికి దీనివలన అంత ఇబ్బంది ఉండదు అంతరిక్ష రహస్యాలను కనుగొనడానికి మానవుడు అనేకమైన పనిముట్లను వాడాడు. వీటన్నింటిలో ముందుగా వాడుకలోనికి వచ్చినది నిట్రాట. దీనినే ఆంగ్లంలో(gnomon) అంటారు. ఈ నిట్రాట ప్రసరించే నీడని బట్టి మన పూర్వీకులు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. నిట్రాట తరువాత చెప్పుకోదగ్గది సూర్యఫలకం లేదా సూర్య యంత్రం లేదా నీడ గడియారం. దీనిని ఇంగ్లీషులో సన్‌డయల్ (sundial) అంటారు. ఇప్పుడు కాలాన్ని కొలవటానికి చాల సున్నితమైన గడియారాలు ఉన్నాయి. కాలాన్ని అతి నిక్కచ్చిగా కొలిచే శ్రేష్టమైన గడియారాన్ని క్రోనోమీటర్(chronometer) అంటారు. ఆ తరువాత చెప్పుకోదగ్గ పనిముట్టు దుర్భిణి. టెలిస్కోపులను ఆరు విధాలుగా వర్గీకరించారు అవి 1) గామా కిరణ దుర్భిణిలు, 2) ఎక్స్-రే టెలిస్కోపులు, 3) అతినీలలోహిత టెలీస్కోప్, 4)ఆప్టికల్ టెలిస్కోపు, 5) ఇన్ఫ్రారెడ్ టెలిస్కోపు, 6) రేడియో టెలిస్కోప్.