వేణువుగా వచ్చి మధురిమలెన్నో నింపి గాలిగా గగనానికెగసిన పుంభావ సరస్వతి వేటూరి సుందర రామమూర్తి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
మమతలన్ని మౌనగానం వాంఛలన్ని వాయులీనం
ఈ పాట 1993 లో వచ్చిన మాతృదేవోభవ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి గారు సంధించిన వాగ్దేవతాస్త్రం. పాట మొత్తం వేదాంత ధోరణిలో సాగినప్పటికీ నింద-స్తుతి ప్రత్యామ్నాయాలతో ఆద్యంతం పాటని వినే శ్రోతల మనసుల్ని పూర్తిగా తన వశం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని కె. ఎస్. రామారావుగారు నిర్మించగా కె. అజయ్ కుమార్ దర్శకత్వం వహించేరు. నాజర్, మాధవి జంటగా నటించారు. మాధవి నటనకి పరాకాష్ట ఈ సినిమా. ఎంతో ఆవేదనను అనుభవించే పాత్రలో మాధవి ఇమిడిపోయి నటించి ప్రేక్షకుల చేత కన్నీటి వరదలు పారించింది. ఈ సినిమాలో ఒక కుటుంబం లోని అనుబంధాలు, బాధలు, విధి వారితో ఆడుకునే కథే ఈ సినిమా. ఈ సినిమా చూసి ఏడుపు రాని వారు ఉంటే వారికి కన్నీటి గ్రంధులు పని చేయనట్టే అని అనుకోవచ్చు. ఇంకా ఈ పాట మధురగీతాల స్వరకర్తగా పేరు తెచ్చుకున్న కీరవాణిగారు స్వరపరచగా కె. ఎస్. చిత్ర గారు గానం చేసేరు.
కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం… ఇలా ఎన్నో సినిమాలు…ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు. “పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.
వేటూరి చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన ఇదే సినిమాకి రాసిన” రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే”… అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.
ఈ సినిమాలో ఈ పాట ఏ సన్నివేశం లో వస్తుందంటే… సంగీత ఉపాధ్యాయురాలయిన మాధవి, పిల్లలకి అన్నమాచార్య గీతాల్ని గురించి వివరిస్తుంది. భక్తి, రక్తి, ముక్తి, విరక్తి అన్నీటినీ తన కీర్తనలలో నింపిన అన్నమాచార్య తన ఆఖరి రోజుల్లో వేదనతో స్వామికి ఇలా విన్నవించుకున్నారట. “స్వామీ.. బ్రతుకు సంధ్యలోకి మళ్లిపోతుంది. ఇహలోకంలో నీకు సేవ చేసుకునే అదృష్టానికి దూరమైపోతున్నాను” అని. ఆ అన్నమాచార్య కీర్తనకి స్పందించిన ఒక మహాకవి హృదయం తన కవితా పదపుష్పాలతో ఇలా పరిమళించింది. అని మాధవి పిల్లలకి చెప్పి ఈ పాట పాడుతుంది. ఈ పాట దృశ్యీకరణ కూడా చాలా బావుంటుంది. కీరవాణి గారు స్వరపరిచిన ఆణిముత్యాల్లో ఈ సినిమా పాటలకు ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ పాట చిత్ర గారు పాడిన పాటలలో కూడా మణిహారంగా నిలిచిపోతుంది.
“వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి మమతలన్ని మౌనగానం వాంఛలన్ని వాయులీనం” ఈ పల్లవి తర్వాత వచ్చే రెండు చరణాలను పరిశీలిస్తే ఒక జీవితం మొత్తం కనిపిస్తుంది. రావడానికీ పోవడానికి మధ్య కొన్ని మమతలు, మరికొన్ని వాంఛలు ఏవీ శాశ్వతాలు కావు. రావడం పోవడం అన్నది ఎవరి చేతిలోనూ ఉన్నదికూడాకాదు. మనసులో ఉండేవి మమతలు అవేప్పటికీ మౌనరాగాలే. వాయులీనం పలికే స్వరాలకీ వాంఛలకు మధ్య సమన్వయము ఎవరికి వారు చేసుకోవాల్సిందే. ఇంక మొదటి చరణానికొస్తే “ఏడు కొండలకైన బండ తానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే”. దీన్ని పరిశీలిస్తే కొండలు ఏడయినా వాటన్నింటి బండరాయి ఒక్కటే. ఆ కొండలపైన ఉన్న భగవంతుడు బండగా మారాడన్న నిందార్ధము గోచరిస్తుందిక్కడ. ఏడు జన్మల వాసనలను ప్రస్తుత జన్మలో అనుభవిస్తాం. మానవ జన్మ రావాలంటే ముందు ఏడూ జన్మలు ఎత్తాలన్న వాదం కూడా ఉంది. మొత్తం మీద ఏడుజన్మల తీపి ఈ జీవితం. “నీ కంటిలో నలత లో వెలుగునే కనక నేను మేననుకుంటే ఎద చీకటే హరీ….. హరీ….. హరీ……… నా స్ధితికి నీ కంట్లో కూడా బాధ ఉంది. కానీ నీ కంటిలోని ఆ లోపలి వెలుగు నాకు కనిపించదు. అలా కనిపించనంత మాత్రాన నిన్ను మరిచిపోయి నేను నా శరీరం అని అనుకుంటే నా ఎద చీకటిఅవదా స్వామి ఇదికూడా మొదట నింద తర్వాత స్తుతి. ” రాయినై ఉన్నాను ఈ నాటికీ… రామ పాదము రాక ఏ నాటికీ” రామా నువ్వు రాయివి కాదు కానీ నేను మాత్రం రాయిలా పడి ఉన్నాను. ఎం చేయగలను? ఎన్నాళ్ళకీ ఆ రామపాదం నా దగ్గరకు రానప్పుడు వేరే దారేముంది? రామ పాదం తాకడంతో రాయి అహల్యగా మారడం ఒక అద్భుతమైతే, అటువంటి అద్భుతాలేవీ జీవితంలో జరగనప్పుడు రాయిగా మిగిలిపోవడం తప్ప జీవితంలో చేయగలిగిందేమైనా ఉంటుందా? జీవన పోరాటంలో అలసిపోయి రాళ్లుగా మారిపోయిన వారినందరినీ మార్చాలంటే ఎన్ని రామపాదాలు రావాలో కదా! ఆవిధంగా జీవితాన్ని, జీవన పోరాటంలో కష్ట సుఖాల అర్ధాన్ని విశదీకరిస్తూ మొదటి చరణం సాగుతుంది.
ఇక రెండవ చరణానికొస్తే కథానాయిక జీవితం అనూహ్యంగా మారిపోతుంది. ఇందుకు సుందర రామ్మూర్తి గారు వ్రాసిన “నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె నిప్పు నిప్పుగ మారె నా గుండెలో” భవబంధాలను తెంచుకోవడానికి మరణంతో పోరాడే మనిషి హృదయానికి అద్దం పట్టే విధంగా ఉంటుంది. నా శరీరంలోని నీరు అంతా కన్నీరు రూపంలో ఉబికి వస్తోంది. తేలికగా ఉండవలసిన ఊపిరి బరువుగా శ్వాసిస్తోంది. నిప్పు అగ్నిహోత్రంగా మారిపోయింది నా గుండెలో అనిచెప్పటంలో పంచ భూతాలు ఒక్కొక్కటిగా ఏవిధంగా శరీరాన్ని విడిచిపెడతాయో తెలియచేసేరు. ఇంకా “ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు పుట్టిల్లు చేరె మట్టి ప్రాణాలు హరీ……… హరీ……… హరీ……… ఈ భూమ్మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చానో అదే విధంగా శూన్యమైపోతున్నాయి. బంధాలన్నీ ఆకాశంలోకి అనంత వాయువుల్లో కలవడానికి వెళ్లిపోతున్నాయి. మట్టిలో పుట్టిన ప్రాణాలు ఆ మట్టిలోనే కలిసిపోతున్నాయి. సినిమా పరంగా చూస్తే ఇక్కడితో కథానాయిక జీవితం ముగిసిపోయింది కాబట్టి పాట అయిపోయినట్లేనా అంటే సాధారణంగా అయితే పాట అయిపోయినట్లే కానీ ఈ పాట రాసింది వేటూరి గారు కదా అలా పాటని అవనివ్వరు. అందుకు ఇది చదవండి. “రెప్పనై ఉన్నాను నీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి” అన్నారు. కర్మ సిద్ధాంతం మరణంతో జీవితం ముగిసిందంటే ఒప్పుకోదు. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాలి మళ్ళీ ఎక్కడో పుట్టాలి. మరణశయ్య మీద ఉన్నవారికి, వారి సన్నిహితులకు మళ్ళీ పుట్టడం అన్నభావన ఉపశమనం ఇస్తుంది. నేనెక్కడికి వెళ్లిపోవడంలేదు ఇన్నాళ్లు మీ కంటికి రెప్పవలె ఉన్నాను మళ్ళీ మీ ఇంటికే మీ పాపగా వస్తాను అని జీవితంనుంచి నిష్క్రమిస్తూ తన పిల్లలికి చెబుతూ వారిని ఓదారుస్తోంది ఆ తల్లి. అనివార్యమైన బాధను తగ్గించుకోవడానికి ప్రతిపాదించుకున్న సిద్ధాంతమే పునర్జన్మ. అటువంటి గొప్ప ఆలోచనతో పాటని ముగించడం ఎంతమందికి తెలుసు?
- Credits:
- Venuvai Vachanu Song
- Movie: Matru Devo Bhava,
- Starring: Madhavi, Nassar, Y. Vijaya, Charuhasan, Subbaraya Sarma, Sarathi, Maharshi Raghava, Tanikella Bharani, Baby Seena,
- Director: K. Ajayakumar,
- Music: M.M. Keeravani,
- Producer: K. S. Rama Rao,
- Release date(s): 1993.