ఆ.సు. కబుర్లు : కుక్కల పంచాయితీ

కుక్కల పంచాయితీ

ఈ శీర్షిక లో వ్రాసిన ప్రదేశాలు, పాత్రలు, సన్నివేశాలు, పేర్లు మొదలైనవి కేవలం వినోదం కోసం సృష్టించబడినవే కానీ ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కాదు. ఒకవేళ ఇందులో వ్రాసిన పై విషయాలకు సంబంధించి సరిపోలిన యెడల అది కేవలం యాదృచ్ఛికమే కానీ ఉద్దేశపూర్వకమైనవి కాదని మనవి.

నేనుంటున్నది హైదరాబాద్ కూకట్ పల్లి  ప్రాంతం.  మా కాలనీలో విద్యార్ధులకేమి లోటులేదు. L.K.G నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న వాళ్ళున్నారు.  మా కాలనీలో కుక్కలు కూడా ఎక్కువే. మాతో సమాన సంఖ్య కాకపోయినా ఏ రోజుకైనా మాతో సమానమవుతామన్న ధీమాతో ఉన్నాయి. అయితే ఇప్పుడు అసలు విషయమేమిటంటే హైదరాబాద్ లోని అన్ని కాలనీల్లాగే మా కాలనీలో కూడా అన్నీ అపార్టుమెంట్లే. 

మా అపార్టుమెంటులో స్థూవర్టుపురం సున్నాచారి గారి కుటుంబం ఉంటోంది. సున్నాచారి గారు వారి తాత, తండ్రుల నుండి వంశపారంపర్యంగా వస్తున్న ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు.  తానొక ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడినని ఆయన నమ్మకం. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి మనకి వాటి జోలికెళ్ళే హక్కులేదు.  కానీ సున్నాచారి గారు మాత్రం తనకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కలేదని బాధపడుతూ కనిపించిన వాడికల్లా కనీసం ఒక గంటసేపు చెబుతుంటారు. ఇదిలా ఉండగా ఒకరోజు సున్నాచారి గారి కొడుకు అఖండ తిమిరాచార్యులుని మావీధిలో ఉండే కుక్క కరిచింది.  కుక్కకాటు గురించి నా ఖర్మ కొద్దీ అరవై వస్తున్నా, ఆనోటా ఈనోటా వినడం పేపర్లలో చదవడమే కాని ప్రత్యక్ష జ్ఞానం మాత్రం ఇప్పుడే కలిగింది. తిమిరాచార్యులు ఇంజనీరింగ్ చదువుతున్నాడు.  సున్నాచారి తాను ఆయుర్వేద వైద్యుడయినప్పటికీ, తన వైద్యం మీద అపార నమ్మకం ఉన్నప్పటికీ తన కొడుక్కి మాత్రం ఇంగ్లీషు డాక్టరు గారిదగ్గరికి తీసుకెళ్లి వాక్సిన్ ఇపించేడు.   వాక్సినేషను అవీ వేయించాక సున్నాచారి ఈ విషయాన్ని మా కాలనీ పంచాయితీ పెద్దలకి తెలియచేసేడు. అంతే కాకుండా “ఇవాళ మా తిమిరం అయ్యేడు, రేపు మీ పిల్లలు కావొచ్చు.  కాలనీలో కుక్కలు బాగా పెరిగిపోయాయి.  వాటిలో కొన్ని పిచ్చి కుక్కలని కూడా అంటున్నారు.  కార్పొరేషను వాళ్లకి ఓ రెప్రజెంటేషనిద్దాం” అని ప్రతిపాదించేడు. 

      మా కాలనీ ప్రెసిడెంటు గారు వెంటనే అత్యవసరంగా మీటింగు పెట్టి అందులో ఈ విషయాన్ని చర్చకి తీసుకొచ్చేరు.  మీటింగులో మా ప్రెసిడెంటు గారు తన అమూల్యమైన ఉపన్యాసాన్ని  ప్రారంభించి నిన్న మొన్నటి పంజాగుట్ట లో బాలికపై కుక్కల దాడి మొదలుకొని తనకి గుర్తున్న విషయాలన్నీ చెప్పి నెమ్మదిగా మా అపార్టుమెంటు తిమిరాచారి ని కుక్క కరిచిన విషయానికొచ్చాడు.  మా కాలనీ ప్రెసిడెంట్ గారికి మరీ చాదస్తం కాకపోతే వీధి కుక్కల బెడద గురించి కంప్లైంట్ ఇద్దాం అంటే ఎవరు మాత్రం వద్దంటారు? ఇంత ఉపన్యాసం ఇవ్వాలా? అని మనసులో అనుకున్నాను. కానీ నా అభిప్రాయం తప్పని ఆ వెంటనే తెలిపోయింది.  కొంతమంది లేచి కుక్కలవల్ల తప్పేమీ లేదని, కుర్రాడి ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లే కుక్క కరిచిందనే వాదన మొదలెట్టి “కుక్కలూ – వాటి ఆవశ్యకత” గురించి బోలెడంత జ్ఞానం పంచేరు. ఆ వాదన విన్న సున్నాచారి గారికి అతని మిత్రులకు ఎక్కడో కాలినట్లుంది వెంటనే “కుక్కలూ – దుష్పలితాలు” అన్న విషయంపై అనర్గళంగా వరుసగా ఉపన్యాసాలు దంచేసేరు. అందులో వైద్య  ఖర్చులు దానికి పడే ఇబ్బందులు మొదలుకొని కుర్రాడు అనుభవిస్తున్న శారీరక ఇబ్బందులు, చదువుకి కలుగుతున్నాయి ఇబ్బందులు లాంటివన్నీ ఏకరువుపెట్టి “వీటికన్నింటికీ సిద్ధంగా ఉన్నారా?” అని ప్రశ్నించేరు.  కాలనీకి దొంగల బెడద లేకుండా కుక్కలు ఫ్రీగా కాపలాకాస్తూ సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నాయనే కౌంటర్ ఆర్గ్యుమెంట్ మొదలయి ఇదేదో “బొబ్బిలి భూమి తగవు” లా మారేటట్లుంది అనిపించింది.  కుక్కలవలన ప్రయోజనాల గురించి మాట్లాడే వాళ్ళెవరూ కుక్క కాటు గురించి మాట్లాడడం లేదు.  నా చుట్టుపక్కల మా ఆపార్టుమెంట్ లోనే ఇంతటి జీవకారుణ్యం ఉన్న వాళ్ళున్నారు అన్న విషయం నాకిన్నాళ్ళు తెలియనందుకు ఆశ్చర్యపడుతూ ఈ జీవకారుణ్యం వెనక అసలు కధ ఏదో ఉంటుందని అనుమానిస్తూ మా పక్కింటాయన్ని వీళ్ళింతలా కుక్కల మీద  కారుణ్యం చూపించటానికి కారణమేమిటని అడిగాను. నాకైతే “తిమిరాచారి” కుక్కలమీద కారుణ్యం ఉన్న వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళా ఆడపిల్లల్ని ఏదో అని ఉంటాడనిపించింది. కానీ మా పక్కాయన చెప్పిన విషయం కొత్తగా ఉంది. సున్నాచారి గారికి ఈ మధ్య షేర్ మార్కెట్లో డబ్బులొచ్చాయట దాంతో   సున్నాచారి కారు కొని, భార్యకి నగలు చేయించేడు.  సున్నాచారి గారికి  అలా జరగడం మా అపార్టుమెంటులో కొందరికి నచ్చలేదట అందుకు వాళ్ళు సున్నాచారి గారికి వ్యతిరేకంగా కుక్కలని సపోర్ట్ చేస్తునారుట. “ఔరా” అనుకుంటుండగా అందరికి “టీలు” వచ్చాయి.  అవి సేవిస్తుండగానే ఒకాయన “కుక్కల్లేకపోతే  సెక్యూరిటీ ఏముందండీ?” ఇళ్లలో పెంచాలంటే బోలెడంత ఖర్చు, ఏదో మనం పడేసినవి తిని మనకి విశ్వాసంగా సేవ చేస్తున్నాయి అని ఉపన్యాసం చెప్పేస్తున్నాడు. 

      వాడిగా, వేడిగా జరుగుతున్న మా సమావేశంలో రిప్రజెంటేషన్ ఇవ్వాలా వద్దా అనే విషయం మీద ఓటింగ్ జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వలన్న వాళ్లదే మెజారిటీ అయింది.  కాసేపటికి ఎప్పటిలాగే “ఎజెండా” లో విషయాలు పక్కకి  పోయి ఎవరి స్వంత గొప్పలు వాళ్ళు చెప్పుకోవడం మొదలైంది.  సమూహం కాస్తా చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయింది.  కుర్రాణ్ణి సపోర్ట్ చేసే వాళ్ళు, కుక్కలని సపోర్ట్ చేసే వాళ్ళు, ఎవరికి వారు  వైరి వర్గందే తప్పని ఆరోపణలు చేసుకుంటున్నారు. రహస్యంగా, కాసేపటికి అసలు విషయం చర్చకు వచ్చింది. మొత్తానికి ప్రెసిడెంట్ గారు మరికొందరు   వెళ్లి కంప్లైంట్ ఇచ్చి వచ్చి ప్రోగ్రెస్ ఏమిటన్నది కాలనీ “వ్వాట్సాప్ గ్రూపు” లో అందరికి తెలియచేసేలా నిర్ణయం జరిగింది. తుదకి వ్వాట్సాప్ మెసేజ్ ఏమిటని వచ్చిందంటే “తెలంగాణ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సుమారుగా పది లక్షల వీధి కుక్కలున్నాయని అంచనా. వాటన్నింటికీ కుటుంబ నియం త్రణ ఆపరేషన్లు చేయించడానికి కుక్కకి వెయ్యి రూపాయలు చొప్పున అవుతుందని అంచనా.  ప్రభుత్వం నుండి నిధులు రాగానే ఆపరేషన్లు మొదలవుతాయి.  అప్పటివరకు ప్రజలు సహకరించాలని”.  వాకింగ్ స్టిక్ సపోర్ట్ చేసుకుని కాలేజీకి వెళుతున్న తిమిరాచారిని చూస్తే జాలి వేయడమే కాకుండా “ఇంకా ఇలా ఎంతమందో కదా”  అనిపించింది.  ఏమైనా మేము జరిపిన కుక్కల పంచాయితీ ద్వారా మంచి నిర్ణయం తీసుకున్నామన్న సంతృప్తి మిగిలింది.