ఆ.సు. కబుర్లు : అప్పు మంచిదే

అప్పు మంచిదే

ఈ శీర్షిక లో వ్రాసిన ప్రదేశాలు, పాత్రలు, సన్నివేశాలు, పేర్లు మొదలైనవి కేవలం వినోదం కోసం సృష్టించబడినవే కానీ ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కాదు. ఒకవేళ ఇందులో వ్రాసిన పై విషయాలకు సంబంధించి సరిపోలిన యెడల అది కేవలం యాదృచ్ఛికమే కానీ ఉద్దేశపూర్వకమైనవి కాదని మనవి.

ఆంద్ర రాష్ట్రంలో అత్యధికంగా ప్రజాదరణ కలిగిన  ‘అగ్నిహోత్రం’ దిన, వార పత్రికలకు ఎడిటర్ మన ‘భావావేశం’. ఈయన గారు  ‘గిరీశం’ వీరాభిమాని.  గురజాడ గారు ఎంత బూస్ట్ అప్ చేసినా ‘గిరీశం’ కి రావలసినంత ఆదరణ రాలేదని మన ‘భావావేశం’ గారి అభి ప్రాయం.  ‘నాతో మాట్లాడ్డమే ఒక ఎడ్యుకేషన్’ అన్న గిరీశం సూక్తిని బాగా ఒంటపట్టించుకుని తాను కూడా గిరీశం అంతటివాడేనన్నఅభిప్రాయంతో బతికేస్తున్న స్వాభిమాన జీవి.  ఇంకొక విషయం ఏమిటంటే మన భావావేశంకి తెలుగు భాషాభిమానం ఎక్కువే.  అలాగే తెలుగు ప్రజలపైన అచంచల విశ్వాసం, గౌరవం కూడా.  ‘తెలుగు వారికి తెలుగువారే సాటి’ అని వేరేవారు తెలుగువారికి సాటి రాలేరని బాగా నొక్కి వక్కాణించి చెప్పేడు.   ఇంకా చెప్పాలని ఉన్నా ‘వక్క’లు దొరక్కా, దొరికిన ‘వక్క’లని నొక్కలేక వ్యాసాలుగా రాసి విసుగెత్తిస్తూ తనవంతు ప్రజాసేవ చేస్తున్నాడు. ఈయనపైన  ప్రధాన ఎడిటర్ గా ‘సహస్ర పాపావధాని  పాపాలతృష్ణ’  పనిచేస్తున్నారు.  ఈయన కూడా తెలుగు సాహిత్యంలో పెద్ద గిత్త.  వీరితో పాటు భాషాభ్రష్ట   ‘దుర్భాష శాస్త్రి’ గారు భాషాభ్యుదయ విభాగంలో ఎడిటర్ గా పనిచేస్తున్నారు.  వీరుముగ్గురూ ఎవరికీ వారు నేను ‘గిత్త’  అంటే నేను ‘గిత్త’ అనుకుంటుంటారు. ఈ ముగ్గురిలో  ప్రధాన ఎడిటర్ ‘సహస్ర పాపావధాని  పాపాలతృష్ణ’ గారికి  భాషాభ్రష్ట ‘దుర్భాష శాస్త్రి’ గారికి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుండటంతో వారిరువురి మధ్య స్నేహం కూడా బాగానే ఉంది. ఇందుకు ఇంకొక కారణం కూడా ఉంది అదేమిటంటే ‘దుర్భాష శాస్త్రి’ గారు లౌక్యం తెలిసినవారు.  ‘పాపాలతృష్ణ’ గారికి కాస్త ముక్కోపి అని పేరున్నప్పటికీ మన ‘దుర్భాష శాస్త్రి’ గారు ముక్కోపానికి తిరుగులేని మందు తయారుచేసిన బొంకులూరు మాయాజూద  ఫార్మశీ వారి ‘ముఖప్రీతి’ మందుని ఉపయోగిస్తూ దిన దిన  ప్రవర్ధమానంగా కంపుకొడుతున్నారు. మన ‘భావావేశానికి ఇలాటి చిట్కాలేవి తెలీదు ఎదో నోటికొచ్చింది వాగెస్తుంటాడు. అయితే ‘భావావేశం’ భగవద్గీత లాంటి ‘రుణపురాణం’ మొత్తం తలక్రిందులుగా తపస్సు చేస్తూ చదివి అందులోని రుణ సూత్రాలకి తన గురువు గారు ‘గిరీశం రాసిన భాష్యం గుర్తు తెచ్చుకుంటూ ఋణానుబంధాన్ని జీవితానికి అన్వయించుకుంటూ జీవిత గమనం సాగిస్తున్నాడు.    

ఆ రోజు ఫిబ్రవరి ౩౦ ప్రపంచ రుణదినోత్సవం కావడంతో ‘అగ్నిహోత్రం’ వారి ఆఫీసులో ‘భావావేశం, పాపాలతృష్ణ, దుర్భాష శాస్త్రి సందర్భోచితంగా ‘రుణపురాణం’ మీద మాట్లాడుకోవడం మొదలుపెట్టేరు. ‘పాపాలతృష్ణ’ గారు ముందుగా మొదలుపెడుతూ ‘గుడ్డి నమ్మకం’ దేశం గొప్పతనాన్ని వర్ణిస్తూ దేశమంటే అలా ఉండాలి ఇప్పటివరకు అన్ని దేశాలకి కావలసినంత అప్పులివ్వడమే తప్ప ఎవ్వరి దగ్గరా అప్పు తీసుకోవడం తెలీదు ఆ దేశానికి.  వాళ్ళ దగ్గర ఎంత ఆస్తి ఉందొ ఏమిటో మరి.  కుబేరుడు, మన శ్రీనివాసుడు, అయ్యప్పస్వామి వాళ్ళే కాదు అనంత పద్మనాభ స్వామి కూడా వాళ్ళ దేశం ముందు ఎందుకూ పనికి రారని నాఅభిప్రాయం ఏమంటావోయ్ దుర్భరం (దుర్భాష శాస్త్రి గారికి పాపాలతృష్ణ గారు పెట్టుకున్న ముద్దుపేరు దుర్భరం).  వెంటనే శాస్త్రి గారు అయ్యా మీరేది చెప్పినా మేడిపండంత మేలిమిగా చెప్తారు.  ఇంకా అందులో అనుమానమేముంది అన్నారు. మనదేశానికయితే పిలిచి మరీ మూడు లక్షల కోట్ల ఋణం ఇచ్చేరట.  మాదేశమంటే మీకెందుకంత అభిమానమంటే మీదేశం ‘రుణభూమి’ మీ దేశంలో పుట్టినవారందరూ ‘రుణపురుషులు’గా    కీర్తింపబడుతున్నారుకదా అన్నారట. అంతే కాకుండా మీ దేశమే కదా బురిడీ బాబాలుగా ప్రపంచ ఖ్యాతి గడించిన ‘మాల్యాద్రి’, చోరవ్  సోది’ లాంటి వాళ్ళకిజన్మనిచ్చింది అని సెలవిచ్చేరట. అది విన్న వెంటనే దుర్భరం గారి హృదయం “అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ తాండవమాడిన సరళి” అన్న వేటూరి సుందర రామ్మూర్తి గారి పాట మాదిరిగా మారిపోయిందిట.  దాంతో అనేకమైన సినిమా వాళ్లకి కూడా తెలీని ఎక్సప్రెషన్స్ ఇస్తూ ఆ..హ… ఆ….హ…. అన్నారు.  ఇంకా ఆగలేకపోయాడు మన భావావేశం.  ఏమోయ్ దుర్భరం ఏమిటా ఆ..హ… ఆ….హ…లు అసలు నీకు ఆ…హ… అంటే అర్ధం తెలుసా? అని అడిగేడు. ఆ మాత్రం తెలీకుండానే ‘భాషావిభాగం’ లో పనిచేస్తున్నామేమిటోయ్ ఆ…అంటే ఆకలికి హ…అంటే హవిస్సు.  వెరశి ఆ…హ… అంటే ‘ఆకలికి హవిస్సు’ .  ఆకలికి అన్నంపెట్టే వాళ్ళు కాబట్టి ఆ దేశం గురించి అలా అన్నానోయ్ అన్నాడు. ఎడిసినట్టే ఉంది నీ తెలివి.  ‘భాషావతారం’ పేరు కలిగిన  మీ నాన్నగారు నీకేమిటి ‘దుర్భాష శాస్త్రి’ అని పేరుపెట్టెరు అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు తెలిసిందోయ్ ఆయన నీకు సరైన పేరుపెట్టేరని.  ఆ…అంటే ఆపు హ… అంటే హరికథ వెరశి ‘ఆ…హ..’ . అంటే ‘ఆపు హరికథ’ అని అర్ధం. ‘పాపావధాని’ గారు  చెప్పింది నీకు హరికధలా ఉందా? అని అడిగేడు. తన శిష్యుడిలాంటి స్నేహితుణ్ని ‘భావావేశం’ అలా అనేసరికి ‘పాపావధాని’ కి కోపం వచ్చింది.  దాంతో “ఎదో ఒక కధ లేవోయ్” నీకేదో పెద్ద తెలిసిన వాడిలా వెధవ ఫోజు కొడుతున్నావ్ అన్నాడు.

‘పాపావధాని’ కీర్తన విన్న ‘భావావేశం’  తోకతొక్కిన తాచు మాదిరిగా కస్సున లేచేడు ‘పాపావధాని’ మీద.  మీరెవరితో మాట్లాడుతున్నారో కొంచెం చూసి మాట్లాడండి.  ‘రుణపురాణం’ రాసింది ఎవరైనా ‘రుణపురాణం’ కి భాష్యం రాసింది మా గురువు ‘గిరీశం’ గారు.  రుణపురాణాన్ని దాని భాష్యాన్ని కూలంకషంగా చదివి ఆచరిస్తున్న వాణ్ని నన్ను పట్టుకుని ‘నీకేం తెలుసు’ అంటారా?   ఆ మాటకోస్తేమీకు తెలిసి సచ్చిందేమిటి కనుక నోటికొచ్చిన అబద్దాలు తప్ప.  “అప్పు తీసుకోవడం జన్మహక్కు తీర్చాలనుకుంటేనే ఎంతో చిక్కు”అంటూ ‘గుడ్డినమ్మకం’ అప్పిచ్చిన దేశాల్లో మనదేశంలేద’ని ఢంకా బజాయించి చెప్పాడు. పాపావధానేమేనా ఊరుకుంటాడా ‘అంత గట్టిగా ఎలా చెప్పగలవు? ఆధారం ఏంటి?’ అని  దబాయించాడు. ‘మన దేశం ఏయే దేశాల దగ్గర అప్పులు తీసుకుందీ ఆ లిస్టు నా దగ్గర ఉంది, చూడండి అని దస్తా కాగితాల లిస్టోకటి  పాపావధాని ముందు పెట్టేడు.  మనదేశం అప్పు తీసుకున్న దేశాల జాబితాలో  ‘గుడ్డినమ్మకం’ దేశం  పేరు లేదు కాబట్టి ఆ దేశం మనకి అప్పివ్వనట్లే’ అన్నాడు ‘భావావేశం’ ఆవేశంగా.  కాదనడానికి పాయింటు లేక పాపావధాని గమ్మున ఊరుకున్నాడు.  

పాపావధాని వెనక్కి తగ్గి ఉరుకునేసరికి భావావేశానికి విజయగర్వం వచ్చింది దాంతో రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడ్డం ప్రారంభించేడు.  అసలు మా గురువు ‘గిరీశం’ ని సృష్టించిన గురజాడ వారు అప్పుడే ‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’‌ బదులు ‘దేశమంటే అప్పులోయ్‌’ అని ఉంటే అదిరిపోయేది. ఏరకంగా చూసినా మనుషులు రుణగ్రహీతలే. మనిషి అంటే అప్పుల అప్పారావు. ‘అప్పిచ్చువాడు’ ఉండే ఊళ్లోనే ఉండమని కవి ఎంచక్కగా చెప్పాడు! అతడి రుణం తీర్చుకోలేం! ఆ జీవుడైనా, దేవుడైనా ‘అప్పుకు లోకం దాసోహమే’. అంతెందుకు? వేంకటేశ్వరస్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవడం, దాని పరిణామాలు ఎవరికి తెలియవు… వెంకన్న వడ్డీకాసులవాడు ఎలా అయ్యాడు? అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నారు. దాంతోపాటు ‘అందరికీ అప్పులే అంతరాత్మ’ అని కుబేరుడు, ఆయన అనుచరులు అన్నారు. ఇవన్నీ రుణ పురాణంలోని విశేషాలు.  ఆస్తులున్నవాడికే దొంగ భయం ఉంటుంది. కానీ అప్పులున్నవాడిని ఏ భయమూ వెంటాడదు. పైగా ‘ఆత్మ’కు ఉన్నట్టి రక్షణ ఉంటుంది. ఆత్మను కత్తితో కోయలేం, అగ్నితో దహించలేమని శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో నమ్మకంగా చెప్పాడు కదా! కాబట్టి అప్పులు తీసుకున్నవాడు గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రమాత్ర వేసుకోకుండానే నిద్రపోవచ్చు.అప్పులేని వాడే అధిక సంపన్నుడు’ అన్నది కవి మాట! అది నిజం కాదు. అప్పులున్నవాడే అధిక సంపన్నుడు. ఎందుకంటే ఇతరులు కష్టపడి సంపాదించిన డబ్బును వీళ్లు తమ సొంతం చేసుకుంటారు. ‘అప్పు తీసుకోవడం వరకే నీ చేతిలో ఉంటుంది. అది తీర్చడం నీ చేతిలో లేకపోవచ్చు. కొండొకచో నీ వారసుల చేతిలోనూ ఉండకపోవచ్చు’ అని కృష్ణపరమాత్ముడు చెప్పకపోయినా మా గురువు ‘గిరీశం’ గారు ఇది పచ్చినిజం అని ‘రుణపురాణ భాష్యం’ రాసినప్పుడు చెప్పేరు. అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే  ‘ఓన్‌ హౌస్‌లన్నీ లోన్‌ హౌసులే’నని.

పింగళి నాగేంద్ర గారని ఓ సినీకవి గారు మా గురువు గారికి నాకంటే ముందుతరం శిష్యుడు లెండి ఆయన ఒక పాట రాస్తూ   ‘అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా! గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా!’ అన్నాడు తప్ప ఆస్తులు సంపాదించి పప్పుకూడు తినమనలేదు. ఆస్తులు మనకు భయాన్ని ప్రసాదిస్తే, అప్పులు మొండి ధైర్యాన్ని ప్రసాదిస్తాయి. అప్పులున్నవాడు ‘అప్పులవాడు చస్తేనేం, పత్రాలు కాలితేనేం’ అని ధీమాగా ఉండవచ్చు. రుణం తీర్చకపోవడం దారుణం, అన్యాయం అని కొందరంటారు కానీ అదేమీ న్యాయసమ్మతం కాదు. ఇన్ని సంవత్సరాలలోపు రుణం తీర్చకపోతే, మధ్యలో చెల్లు వెయ్యకపోతే ప్రామిసరీనోటు కుంకుమపొట్లం కట్టుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రాదని అంటారు. అలాంటప్పుడు రుణాల గురించి దిగులు పడటం ఎందుకు?  ఇవన్నీ ఆలోచించి అప్పులిచ్చేటప్పుడే జాగ్రత్తపడేవాళ్లు ఉన్నారు. దానికో చిన్న కథ ఉంది. ఒకాయన అప్పు అడిగాడు. ఇంకో ఆయన అప్పు ఇచ్చాడు. అంతవరకు తప్పు ఏమీలేదు. ఎటొచ్చీ ‘భాష’ వల్లనే ముప్పు వచ్చింది. ‘మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనండీ’ అన్నాడు అప్పు తీసుకున్న మహానుభావుడు. దాంతో రుణదాత రాగల ముప్పును గ్రహించాడు. ఈ జన్మలో రుణం తీర్చకపోతే ఎంత ప్రమాదం అనుకున్నాడు. వెంటనే ఇచ్చిన రుణాన్ని వెనక్కి తీసుకున్నాడు. ‘తెలివితేట’లంటే అవీ.   అయినా.. ఏ ఒక్కరికీ రుణం ఉంచుకోకుండా తీర్చేయ్యాలని కోరుకోవడం ఎంత ఛాదస్తం! తల్లి రుణం తీర్చుకోగలమా? తండ్రి రుణం తీర్చుకోగలమా? గురువు రుణం తీర్చుకోగలమా? మనందరినీ కన్న దేశం రుణమైనా తీర్చుకోగలమా? ఈ రుణాలే తీర్చుకోలేనప్పుడు ఇతరుల అప్పు తీర్చుకోవాలనుకోవడం ఎంత తప్పు.

‘ఆస్తులనమ్మితే ఏమి ఉందిరా.. అప్పుల నమ్మితే ఫలితముందిరా’ అని మంచివాళ్లు ఎవరైనా పాడుకోవచ్చు. అప్పు తీసుకోవడం అనేది బహుళార్థక, బహుళార్థ‘బోధక’ ప్రాజెక్టు.  అప్పు అంటే పరపతి. పరపతి అంటే పలుకుబడి. అందరి దగ్గరా అప్పులు తీసుకున్నవాడు ఏ పార్టీ తరఫున అయినా, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా గెలవడం గ్యారంటీ. అప్పులు ఇచ్చినవాళ్లంతా కలిసి నడుంబిగించి, ప్రాణాలకు తెగించి అయినా ప్రచారం చేస్తారు. గెలిపిస్తారు. గెలిస్తేనన్నా తమ అప్పులు తీరుస్తాడన్న ‘మూఢనమ్మకం’ వారిచేత ఆ పని చేయిస్తుంది. దీనిని దైవసేవగా కూడా భావిస్తారు. అప్పు తీసుకునేటప్పుడు ఇచ్చిన వాడిలో దేవుడు కనిపిస్తాడు. తీర్చేటప్పుడు తీర్చేవాడిలో కనిపిస్తాడు.అప్పు అనే రెండక్షరాల పదం ఏ ముప్పునైనా ఎదుర్కొనే శక్తి. అది దైవశక్తికి మూలం.  ‘హరియను రెండక్షరములు పలికిన హరియించును పాపమంతయినా’ అన్నారు. మరి ఎవరూ పాపం చేయకపోతే ఆ హరికి పనేముంటుంది? అప్పు తీసుకుని ఎగ్గొట్టడం ఎన్నో పాపాలపెట్టు. దొంగల్లో కూడా ఈ మధ్య ఈ మేరకు చైతన్యం వచ్చేసింది. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా రిస్కు తీసుకుని బ్యాంకుల్లో చోరీలు చేయడమేంటి? పట్టుబడితే చచ్చేట్టు దెబ్బలు తినే ప్రమాదమూ ఉంది. అలాంటి సందర్భాల్లో ప్రాణాలు కూడా పోవచ్చు. పోనీ అంతపని జరగకపోయినా, పోలీసుల చేతిలో పట్టుబడి జైలుపాలూ కావచ్చు. అంచేత పట్టపగలు కోట్లు వేసుకొని దర్జాగా కొన్ని బ్యాంకుల్లో కొందరు ఉన్నతాధికారుల ముందు వాలితే, వారిని ‘ఏదో’ విధంగా ప్రసన్నం చేసుకుంటే కోట్లకొలది డబ్బు అప్పుల రూపంలో తీసుకోవచ్చు. ఇందుకు అవసరమైతే పోలీసు స్టేషన్లనో, కోర్టులనో, జైళ్లనో తాకట్టుపెట్టవచ్చు. బ్యాంకు ఉన్నతాధికారులు అతిథి సత్కారాలను సైతం అందించి, వీనులవిందుగా మాట్లాడి,  కారు డోరు సైతం తీసి వీడ్కోలు చెబుతారు. నక్కను తొక్కితే డబ్బురావడం కాదు, కోటు వేసుకొని బ్యాంకు మెట్లు ఎక్కినా కోటీశ్వరుడు కావచ్చు. 

అప్పు’ వల్ల ఇంకా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. విదేశీయోగం అందులో ఒకటి. తీసుకున్న అప్పు తీర్చాలని బ్యాంకులు గొంతు మీద కూర్చుంటే, చెల్లని చెక్కులు వాళ్ల మొహాన పడేసి, ఎంచక్కా విదేశాలకు చెక్కేయవచ్చు. ఒకవేళ దర్యాప్తు సంస్థలు ‘విచారించి, విచారించి’ కోర్టుల ద్వారా స్వదేశానికి రప్పించాలని చూస్తే ‘‘మీ జైళ్లు విల్లాల్లాంటి భవనాల్లా ఉండి… విలాసాలన్నీ ఉన్నాయా?’’ అని దబాయించవచ్చు. అంతటి వాడు ఖైదీగా రావడమే మహద్భాగ్యమనిపించవచ్చు. అసలు అక్కడిదాకా పోక ముందే ‘పాపం ఇప్పటికీ  కోటీశ్వరుడే కానీ, నిండా అప్పుల్లో మునిగిపోయాడు’ అని దయతలచి బ్యాంకులు- ప్రభుత్వాలే ఆ అప్పుల్ని రద్దుచేసి పారేయవచ్చు. అప్పుడు ఎంచక్కా ఆ పాత బ్యాంకుల్లోనే కొత్త అప్పులు తీసుకోవచ్చు.       ఇప్పుడు చెప్పండి.. అప్పు మంచిది! అవునంటారా? కాదంటారా