ఆ.సు. కబుర్లు – జీవన్ముక్తుడు

జీవన్ముక్తుడు

ఈ శీర్షిక లో వ్రాసిన ప్రదేశాలు, పాత్రలు, సన్నివేశాలు, పేర్లు మొదలైనవి కేవలం వినోదం కోసం సృష్టించబడినవే కానీ ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కాదు. ఒకవేళ ఇందులో వ్రాసిన పై విషయాలకు సంబంధించి సరిపోలిన యెడల అది కేవలం యాదృచ్ఛికమే కానీ ఉద్దేశపూర్వకమైనవి కాదని మనవి.

ఏడుకొండలవాడా! ఆపదమొక్కులవాడా గోవిందా గోవిందా! ఇలా భగవంతుడికి మొక్కుకొని తమ కోరికలు తీరాయని తమను ఆపదలనుంచి గట్టెక్కిచ్చాడని భగవంతుడికి మొక్కులు తీర్చుకోవటం పరిపాటి.  అసలు నిజంగా భగవంతుడికి ఇలా మనం కోరిన కోరికలు తీర్చే శక్తి ఉందా? ఓ కథతో కూడిన విశ్లేషణ …. సరదా గానూ సీరియస్ గానూ…

నాపేరు వినాయకరావు. వినాయకుడి భక్తుణ్ణి. ఉద్యోగం వస్తే భగవంతుడికి నిలువుదోపిడి   ఇస్తానని మొక్కుకొని సమయానికి రైలు అందక ఇంటర్వ్యూ కి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకున్నాను.  తరువాత భగవంతుడికి నాకు మధ్య ఏమిజరిగిందో ఇక కధలో చూద్దాం.  నేనూహించినట్లుగా ఇక్కడ మేఘాలు లాంటివి ఏమీలేవు.  నేల మాత్రం మన ఆకాశంలా ఉందంతే. ఒక్కచెట్టూ కనిపించలా, కాని సంగీతంతో కూడిన సువాసనల చల్లటి గాలిమాత్రం వీస్తూంది ఎక్కడినుండో. ఆ మధుర వాసనలని పీలుస్తూ అటూ ఇటూ చూశాను ఎక్కడ మా వినాయకుడని. అడుగో ఇటే వస్తున్నాడు తొండం తిప్పుకుంటూ. ఉక్రొషంగా తల పక్కకు తిప్పుకున్నాను. అనవసరంగా చచ్చిపోయెటట్టు చేశాడు మరి, కోపం రాదూ.  రానియ్ చెబుతాను మనసులో అనుకున్నాను గట్టిగా. కొద్దిసేపటికి నా భుజం మీద ఓ చల్లటి స్పర్శ మృదువుగా తొండంలాగుంది. ఇక లాభం లేదని వెనక్కి తిరిగి చూసాను. మనోహర రూపం. తనే ముందుగా అడిగాడు “కోపం పోయిందా?” అని… తలూపాను పోలేదని.

“అసలు ఎందుకొచ్చిందీ?” అడిగాడు అమాయకంగా.

చెప్పాను ఎందుకొచ్చిందో.

“అయితే నాకు మొక్కేసుకుంటే నీకు ఉద్యొగం వచ్చేస్తుందా?”

“లేదు దాని కి తగ్గట్టుగానే ప్రిపేరు అయ్యాను.”

“మరైతే ఎందుకు రాలేదు?”

“అసలు నాకు రైలు అందితే కదా రావటానికీ పోవటానికీ!!”

“దానికి నేనేంచేసేది?”

“నీకు మొక్కుకున్నాను గా.”

“అసలు ఉదయం ఏమి జరిగింది?”

“ఎక్కడ?”  “స్టేషనులో….”

“టైం అయిపోతుంటే గబ గబా స్టేషనులోకి వచ్చాను అప్పటికే రైలు వెళ్ళిపోయింది.  ఆ బాధతో ఆత్మహత్య చేసుకొని ఇక్కడకొచ్చాను.”

“అలాక్కాదు   జరిగింది జరిగినట్టు గా చెప్పు.”

“ముందుగా టీ.సీ. ఎదురోచ్చాడు. అతన్ని అడిగాను సార్ సింహపురి ఎక్స్ ప్రెస్ వెళ్ళిపోయిందా? అని.” “ఏమి చెప్పాడు?” “ఇంకెక్కడి సింహపురి ఎప్పుడో పోయిందన్నాడు.”

“సరే మామూలు గా నీ జీవితములో నిజానికి జరగాల్సింది ఇదే. కాని నువ్వు నాకు మొక్కుకున్న విధంగా నీ కోరిక తీర్చడానికి నేను నీ జీవితాన్ని మారిస్తే ఏ విధంగా ఉంటుందో చూడు.”  సినిమాలోలా దృశ్యం మారింది, నేనూ చూడగలుగుతున్నాను.

“సార్ సింహపురి వెళ్ళిపోయిందా?” అడిగాడు వినాయకరావు అదే టీ.సీని, తన నుదుటికి పట్టిన చెమట తుడుచు కుంటూ.

“లేదయ్యా అరగంటలేటు.” చెప్పి వెళ్ళిపోయాడు ఆ టీసీ.

ఒక్కసారిగా రిలీఫ్ గా గాలి పీల్చుకుని కౌంటరు వైపు నడిచి టికెట్ తీసుకుని బెంచీ మీద కూర్చున్నాడు ఇంటర్వ్యూ కి పోతున్న వినాయకరావు. కొద్దిసేపటికి  వచ్చి ఆగింది సింహపురి భారంగా.

గుంపులోదూరి ఓ మూల సీటు సంపాదించాడు, రైలు బయలుదేరింది.

మధ్యలో అడిగాడు ఎదురుగాకూర్చున్న ఓ పెద్దాయన.

“ఎక్కడిదాకా బాబు?

“హైదరాబాదు.”

“ఎమీలేదూ… రైల్లొ కూడా చదువుతుంటేనూ.”

“ఇంటర్వ్యూ కదండీ.”  ఇంకో మాటకు అవకాశము ఇవ్వకుండా పుస్తకములో కి తల దూర్చాడు వినాయక రావు. కొద్దిసేపటికి అటుగావచ్చిన వేరుసెనగ కాయల అమ్మాయి దగ్గర ఓ రెండు రూపాయలిచ్చి కాయలు కొనుక్కొని తింటూ ఆలోచించసాగాడు తనకి ఈ ఉద్యొగం ఎంత ముఖ్యమోనని.

అంతటితో ఆగిపోయింది  ఆ దృశ్యము.

“ఏమన్నా అర్ధము అయిందా నాయనా?” అడిగాడు వినాయకుడు, నన్ను..

“ఊహూ..” తల ఊపాను అర్దమవనట్లుగా..

నీ ఒక్కడి కోరిక వల్ల నేను  ఇలా  ఎందరి జీవితాలు మార్చాలో చూశావా. ముందుగా టీ.సి., నిజానికి టీ సి, నీతో మాత్లాడవలసిన మాట “ఇంకెక్కడ ఎప్పుడో పోయిందని.”.  కాని ఇప్పుడు మాట్లాడింది  “అరగంట లేటు.” అని. నీ కోరికవల్ల  ఇతని జీవితం నేను మార్చాలి.అలాగే టికెట్ కౌంటర్లో నీ సంభాషణ,లోపల పెద్దయనతో నీ సంభాషణ తరువాత నీవు తింటానికి కొన్న పల్లీలకు రెండు రూపాయలిచ్చావు.ఆ రెండు రూపాయల కాయిను తన జీవిత కాలములో ఇంక ఎందరి చేతులు మారుతుందో వారందరి జీవితాలు మార్చాలి.అంతెందుకు అసలు రైలులో ఉన్న వారందరి జీవితాలలో ఓ అరగంట మార్పులు జరుగుతాయి.ఆ మార్పులు వారికి మంచి చేయవచ్చు.

లేదా తీరని నష్టం కలిగించవచ్చు.

“నష్టలా? ఎలా స్వామీ?” అడిగాను అయోమయంగా

“చూడు మరి.”

మళ్ళీ దృశ్యం మారింది.

కీచుమని శబ్ధం తో రైలు ఒక్కసారిగా ఆగటముతో

తల తిప్పి కిటికీ నుంచి బయటకు చూశాడు వినాయకరావు. ఎక్కడ చూసినా యునిఫారములో ఉన్న చిన్న పిల్లల శవాలు.మరొపక్క రైలు దెబ్బకు తునా తునకలైన స్కూలు బస్సు.అన్-మాన్డ్ లెవెల్ క్రాసింగ్ వద్ద యాక్సిడెంట్.రైలు వేళ తప్పి రావడము వల్ల ,సమయానికి బ్రేకు పడకపోవడమువల్ల జరిగిన ఘోరం .అప్పటికే చాలామంది మరణించారు.

ఆ దృశ్యం చూచిన వినాయకరావు స్పృహ తప్పి తిరిగి వినాయకుడి ముందు కళ్ళు తెరిచాడు.

“నీవల్ల చూడు ఎంతమంది పిల్లలు చనిపొయారో?”

“నేనేం చేశాను స్వామి?” అన్నాను కొంచం కంగారు మిళితమైన స్వరం తో.

“నీ మొక్కువల్లే కదా రైలు లేటై   బస్సుని గుద్దేసింది.”

“చెప్పు నీకోసం నేను ఇంతమంది జీవితాలని మార్చాలా?”

“వద్దు స్వామీ వద్దు ఈపాపం నాకొద్దు.”

“ఇప్పటికైనా అర్ధమయిందా? జరిగేది ఎవరూ తప్పించలేరని.”

“అయింది కాని నాదో చిన్న అనుమానం స్వామీ, జరిగేది జరిగితే మరి మానవుడు కర్మ చేయకుండా కూర్చోవచ్చు  గదా,మరి కర్మ స్వేచ్చ వుందంటారు..”

నవ్వి చెప్పాడు “జీవికి ఉండేది కర్మ స్వేచ్చ కాదు. భావ స్వేచ్చ. భావ స్పందన.. భావ స్వేచ్చ ద్వార ఆలోచించి భావ స్పందన ద్వారా నిర్ధారించబడిన కర్మ చేస్తాడు.”

“అంటే?”

“ఓ చెట్టు మీద కాయ ఉంటే దాన్ని కోయాలంటే ముందు ఆకలో కోరికో కలగాలి ఆ కోరికతో ఆ మనిషి చెట్టు ఎక్కుతాడు. అక్కడ పాము కరుస్తుంది. డాక్టరుకి నాలుగు వేలు ఇస్తాడు. ఆ నాలుగు వేలతో దాక్టరు కొడుకు షికారుకి పోతాడు. అక్కడ ఆక్సిడెంటు అవుతుంది. ఇక్కడ పాము కరవటమూ, ఆక్సిడెంటు అనేవి ఒకదానితో ఒకటి లింకులు.ముందే నిర్ణయించబడినవి.  కానీ ఈరెండూ జరిగింది  కేవలము ఓ కాయ కావాలన్న చిన్న కోరిక తోటే. మానవుడు కర్మ మానేస్తాడనే ఈ    కోరికలూ, కోపం, బాధ, అసూయ, జాలి, దయ లాంటి మానసిక భావాలు పెట్టింది. వాటి ద్వారా తను చేయవలసిన కర్మ వైపు నెట్టబడుతాడు.ఆ కర్మ కలుగ జేసిన ఫలితాలకు  స్పందించి మరికొందరు కర్మలు  చేస్తారు.ఇలా భావం, స్పందన, కర్మ వలయాకారాలు. అలా అంటుకుంటూ పోతుంటాయి.

అదే ప్రపంచ గమనం. ఓ గాంధీ అయినా  గాడ్సే అయినా మీ భాష లో అయితే జీనోంకోడు ప్రకారము పనిచేసినవారే. రాజీవ్ మరణానికి  ఉగ్రవాదులే కారణం కావచ్చు. కాని చావు కి బీజం వేసింది తన ఇంటి ముందు తచ్చాడిన ఇద్దరు కానిస్టేబుల్స్ . వారిద్దరినీ  చంద్రశేఖర  ప్రభుత్వం  తన మీద నిఘా  వుంచిందని ఆగ్రహించిన రాజీవుడు మద్దతు వుపసంహరించుకోవడమూ  ఎన్నికలు రావడమూ ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన దాడిలో మరణించడమూ ఒకదాని కొకటి లింకులు. నిఘా  అన్న మిష తోటి మరణం వైపు నెట్టబడ్డాడు. అర్ధం అయిందా ఈ గమనం?” అడిగాడు వినాయకుడు.

“బాగా అర్ధం అయింది స్వామీ ఇంకెప్పుడూ మొక్కుకోను.”

“సరే ఇంకో ముఖ్య విషయం ఇది ఎవరికీ చెప్పకూడదు.”

“చెబితే?” బెదిరిస్తున్నట్లుగా అడిగాను,

నవ్వి అన్నాడు.”నీ కోడు లో ఈ రహస్యం ఎవరికీ చెప్పే పోగ్రామ్ రాసి లేదు. అందుకే నీకు చెప్పాను.”

బిక్కముఖంతో అడిగాను. మరి ఇదంతా ఎవరు రాస్తారని.

దగ్గరకు తీసుకుని చిన్నగా చెవిలో చెప్పాడు ఎవరు వ్రాస్తారో.

చేతి దగ్గర చుర్రుక్కుమనటం తో  కళ్ళు తెరిచాను.

“ఇంకేం భయం లేదు కోలుకుంటాడు…. తాగింది నకిలీ పురుగులమందు, ఏమీ కాదు. భయంతో స్పృహ తప్పిందంతే.”

హస్పిటల్ లో డాక్టరు గారి భరోసాతో వినాయకరావు తల్లి కన్నులలో వెలుగు.

మత్తుగా కళ్ళు తెరుస్తున్న నాకు మాత్రం ముందుగా కనిపించింది ఎదురుగా గోడ మీద  నోటిమీద వేలితో “ష్…ష్…ఎవరికీ ఏమి

చెప్పద్దు.” అన్నట్లు బుజ్జిబాబు  సైలెన్స్ క్యాలండరు.