“కళ్యాణి” రాగం
ఈ శీర్షిక లో వ్రాసిన ప్రదేశాలు, పాత్రలు, సన్నివేశాలు, పేర్లు మొదలైనవి కేవలం వినోదం కోసం సృష్టించబడినవే కానీ ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కాదు. ఒకవేళ ఇందులో వ్రాసిన పై విషయాలకు సంబంధించి సరిపోలిన యెడల అది కేవలం యాదృచ్ఛికమే కానీ ఉద్దేశపూర్వకమైనవి కాదని మనవి.
నాపేరు అగ్నిష్ట శర్మ. మా గురువుగారి పేరు గిరీశం. బుద్ధునికి బోధి చెట్టు క్రింద జ్ఞానోదయం కలిగితే మా గురువు గారికి తాటిచెట్టు క్రింద జ్ఞానోదయమైంది. మేము ఉంటున్నది ఆంధ్రుల రాజధానిగా ప్రచారంలో ఉన్నఅమరావతికి కొద్ది దూరంలో ఉన్న కనక దుర్గమ్మ గారి నివాస స్ధలమైన బెజవాడ. మా గురువు గారు మాకు విద్యా బుద్ధులు నేర్పేది, జ్ఞాన బోధ చేసేది ‘తాళప్రస్ధ మందిరంలోని కల్లు మండపంలో’ కాబట్టే మాకు కళ్లు తిరిగే జ్ఞానం లభిస్తే మాద్వారా మిగిలిన ప్రజలకు వారి వారి ప్రాప్తజ్ఞత బట్టి కళ్లు, కాళ్ళు కూడా పోయేంత జ్ఞాన సిద్ధి కలుగుతోంది. మా తాళప్రస్ధ సుందరీకరణ జరుగుచున్నందున మేము మా జ్ఞానాన్ని వేరే చోట నేర్చుకోవలసి వస్తోంది. అందులో భాగంగా మా గురువు గారికి సమకాలీన స్నేహితులైన ‘చయనులు’ గారిచే నిర్వహించబడుచున్న “సురప్రాప్తి” సమశీతోష్ణ మందిరంలో మాకు విద్యాబోధన జరుగుతోంది. మా తోటి విద్యార్థిగా ఆరోజు ‘సందేహనిధి’ చేర్చుకోబడ్డాడు. వాడికి ప్రధమ పాఠంగా మా గురువు గారు ‘కల్యాణి’ రాగం గురించి వివరించడానికాని ఆర్డర్ చేసేరు. వెంటనే సేవకుడు మంచి చల్లని ‘కళ్యాణి’ బీరు బాటిల్ తెచ్చేడు. అదిచూసి మా ‘సందేహనిధి’ గురువుగారు వీడు మందు తెచ్చేడు. నేనెప్పుడూ మందు కొట్టలేదు అన్నాడు. అది వినగానే మా గురువుగారు మందుని ఎవరు కొట్టరు, తాగుతారు అని చెప్పి అయ్యో! ఇప్పటికి ఎప్పుడూ మందు కొట్టిన పాపాన పోలేదా! ఎంత పొరపాటు చేశావు! కనీసం సరిదిద్దుకునే ప్రయత్నమైనా చేయలేదా? ఎంత ‘దేవతా ధిక్కారం’ చేశావు. ‘స్వర్గ’ జన్యమైన సత్సంప్రదాయాన్ని ఎలా కాలదన్నావు? అలా చూస్తారేంటి? ఇది పచ్చినిజం! దేవతలు ‘దేవతలు’ ఎలా అయ్యారు? తాగడం వల్లనేగా! సురాపానం చేసేవాళ్లు సురులు అయితే అది చేయలేని దద్దమ్మలు అసురులు. మరి తాగకపోతే ఏ(న)రకమైన శిక్షలు పడతాయో అందరూ తెలుసుకుని తీరాల్సిందే అని మాకందరికి చెప్పడం మొదలెట్టారు.
‘పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్’ అని సాక్షాత్తూ మా గురువు గారిని సృష్టించిన మహాకవి గురజాడ అప్పారావు గారే కన్యాశుల్కంలో మా గురువు గారిచేత నొక్కి వక్కాణింపచేసేరు.. పొగతాగక పోతేనే అంత శిక్ష పడేట్టయితే ఇక మందు కొట్టని వాడి పరిస్థితి ఏంటి? ‘పొట్టగతులు’ ఉంటాయా! ‘మందు గురించి వినకు, మందు గురించి చెప్పకు, మందును కళ్లారా చూడకు’ అని కనీసం మహాత్మాగాంధీ కోతులైనా చెప్పలేదే! ‘తాగని నాకొడుకెందుకు లోకంలో? సొరగలోకమగపడతది మైకంలో’ అన్న సినిమా పాట కూడా ఉంది కదా! అంతకన్నా తాగడానికి పరమప్రమాణం ఏం కావాలి? పోనీ శ్రీశ్రీ మాట విన్నా చాలు. ఆయన ఏమన్నారు? శ్రీశ్రీ కాసే బ్రహ్మానందం అనడంతో పాటు ‘డోసే’ పరమానందం అన్న మహానుభావుడు. సత్కవుల్ హాలికులైననేమి అని పోతన గారు అంటే ‘సత్కవుల్ ఆల్కహాలికులైన నేమి’ అని శ్రీశ్రీ అన్నారు. సమాజంలో ఉన్నతులు ఏం చేస్తే దాన్ని ఇతరులు అనుసరిస్తారని శ్రీకృష్ణపరమాత్మ ఎప్పుడో చెప్పాడు కదా! శ్రీశ్రీ మార్గదర్శకత్వం ఇంకొకటి కూడా ఉంది. మూత్రం తాగితే వంద సంవత్సరాలు బతకవచ్చని మొరార్జీదేశాయి ప్రచారం చేసేవారు. ఆయన కొంతకాలం ప్రధాన మంత్రిగా కూడా ఉన్నారు. ‘మూత్రం తాగితే వంద సంవత్సరాలు బతకొచ్చునని మొరార్జీ దేశాయి గారు చెబుతున్నారు? మీరేమంటారు?’ అని శ్రీశ్రీని ఒక విలేకరి అడిగారు. దానికి శ్రీశ్రీ వెంటనే ‘మూత్రం తాగి బతకడం కన్నా మద్యం తాగి చావడం మంచిద’ని సిద్ధాంతీకరించారు. ఆయన ‘పదండి ముందుకు పదండి తోసుకు’ అని మహాప్రస్థానంలో రాయడానికి బదులు పదండి ‘మందు’కు పదండి తోసుకు అని రాసి ఉంటే మజా వచ్చేది!
తాగినవాడి తప్పుకు తగువు లేదని తెలుగువాడు ఎప్పుడో తీర్మానించేశాడు. కాబట్టి మద్యాన్ని చులకన చేయడానికి వీలేలేదు. మద్యం తాగడమంటే కళారూపాలను ‘కాళ్లారా’ ప్రోత్సహించటమే ఇది ‘నృత్యసత్యం’. మందు కొట్టినవాడు నడుస్తుంటే అదో రకం నృత్యం చేస్తున్నట్టే ఉంటుంది. ‘చూచు వారులకు’ చూడముచ్చటగా ఉంటుంది. ఇలాంటి అవకాశాలను కాలదన్నుకోవడం ఏం పద్ధతి? ‘వ్యతస్త పాదారవిందా!’ అని మైమరచి భగవంతుడి గురించి పాడతామా లేదా! తాగినప్పుడు ఎవరైనా తప్పకుండా ఎంతోకొంత వ్యతస్త పాదారవిందులే. ఎవరేమి అనుకున్నా మద్యప్రియులు సత్యసంధులు. అంటే వారిలో ఎంతో కొంత సత్యహరిశ్చంద్రుడి అంశ ‘తాగి’ ఉన్నట్టే లెక్క. ‘తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తుందన్నా’ అన్న పాట ఉండనే ఉంది. ఆ మాట కొస్తే అబద్ధాలను పసికట్టడానికి లై డిటెక్టర్లను ఉపయోగించే బదులు మందుకొట్టిస్తే మేలు. మందు మీద ఉన్నంత సేపూ మనిషి నిజాలు మాత్రమే చెబుతుంటాడు. నిజానికి న్యాయస్థానాల్లోనూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ‘నార్కో ఎనాలిసిస్’ పేరిట ఒంట్లోకి మందు ఎక్కించి నిజాలు కక్కించే పరీక్ష ఒకటుంది. అక్కడ వాడే మందు ఈ మందే అయితే పుచ్చుకున్న వాడికి పురుషార్థం, ఇచ్చిన వాడికి పుణ్యం బోనస్‌గా వస్తాయి. సంతోషం సగం బలం అంటారు. మందుపుచ్చుకుంటే మనిషికి సంతోషం. మరీ ఎక్కువైతే సంపూర్ణబలం వచ్చేసినట్టే. మందు-అంతటి బలవర్ధకమైన ఆయుధం అంటే ఎంతటి ధన్వంతరులైనా కాదనగలరా? మనోవ్యాధికి మందు లేదంటారు కానీ, దానికీ ‘మందే’ మందు! కదిలేదీ, కదిలించేదీ మునుముందుకు నడిపించేదీ, పరిపూర్ణపు బతుకిచ్చేదీ కవిత అని శ్రీశ్రీ అన్నా మందు అన్నది తిరుగులేని ‘కవితాత్మకమైన’ సత్యం! మందు వల్ల మనిషి తూలుతాడన్నది అసత్యం. అదే నిజమైతే నిండా మందు ఉన్నా సీసా తూలదేం?
ఇవన్నీ ఒక ఎత్తు అయితే మందు ప్రియులకు మించిన ‘త్యాగధనులు’ ఎక్కడా దొరకరు. ఏ పార్టీ ప్రభుత్వమైనా సొంత గల్లామీద నిలబడాలంటే అవసరమైంది నిధులే. వాటిని సమకూర్చడంలో మందు బాబుల ‘పాత్ర’ మామూలు పాత్ర కాదు… అక్షయపాత్ర. భార్య మెళ్లోని పుస్తెలను తెగనమ్మి మరీ ఏ మద్య దేవతకో నైవేద్యంగా సమర్పించుకో వాలనుకుంటారు మందుబాబులు. భార్యాపిల్లలు, కుటుంబం లాంటి బాదరబందీలను పట్టించుకోని ఆధ్యాత్మిక తత్వం మద్యప్రియులకు అలవాటవుతుంది. తాగేవాడే కడతాడు తాళ్లపన్ను అన్న మాటలు వింటుంటే మద్యప్రియుడు ఎంత బాధ్యతాయుతంగా ఉంటాడో తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో ‘రస’ పక్షపాతంగా ఆలోచించే వారెవరైనా ‘మద్యదేవతా నమోస్తుతే’ అనకతప్పదు’. దేవతలకు సహస్రనామాలు వల్లించి నైవేద్యం సమర్పించినట్టే, మద్య పూజలో కూడా స్వదేశీ సారా నుంచి విదేశీ విస్కీ వరకూ రకరకాల ‘బ్రాండ్’ మేళాలతో నైవేద్యం పెడుతుంటారు. అబ్బెబ్బే.. ఆ మద్యం వాసన భరించలేం బాబోయ్ అని కొంతమంది సూకిరాలు పోతుంటారు. ఇది ఒట్టిబడాయి. ఇది ‘వాసనా’ మయమైన ప్రపంచం అని ‘గుర్రమెక్కిన’ ప్రతివాడూ చాటుతూ ఉంటాడు. అది అర్థం చేసుకోరేం? అయినా మద్యం మత్తుకు దూరంగా ఉండే వాళ్లను ఎవరు బాగు చేస్తారు? ఒక్కమాటలో చెప్పాలంటే బుడ్డిమంతుడే బుద్ధిమంతుడు. సరేనా!