మార్గదర్శి
ఈ శీర్షిక లో వ్రాసిన ప్రదేశాలు, పాత్రలు, సన్నివేశాలు, పేర్లు మొదలైనవి కేవలం వినోదం కోసం సృష్టించబడినవే కానీ ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కాదు. ఒకవేళ ఇందులో వ్రాసిన పై విషయాలకు సంబంధించి సరిపోలిన యెడల అది కేవలం యాదృచ్ఛికమే కానీ ఉద్దేశపూర్వకమైనవి కాదని మనవి.
అండ, పిండ, బ్రహ్మాండాలని అర్ధం చేసుకోగలిగినంత చదువు చదవాలని పరబ్రహ్మ పరివ్రాజకాచారి కోరిక. అందుకోసం గొప్ప పాండిత్యం కల కర్కశ నిష్కర్ష సోమయాజి గారిని ఆశ్రయించేడు. గురువు గారితో తన మనసులోని కోరికచేప్పి తనని సకల శాస్త్రపారంగతుడిగా చెయ్యమని కోరేడు. సోమయాజి గారికి అతిశయమెక్కువ. అండ, పిండ, బ్రహ్మాండాలని అర్ధం చేసుకోవడం ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నావా మాకు విద్య నేర్పిన గురువుకే అది సాధ్యపడలేదు అని సోమయాజులు గారు తెలియచేసేరు. వెంటనే మన పరివ్రాజకాచారికి సందేహం వచ్చింది. ఇంతకీ సోమయాజులు గారికి అండ, పిండ, బ్రహ్మాండాలని అర్ధం చేసుకోగలిగినంత పాండిత్యం ఉందా? లేదా? అని. ఒకవేళ ఆయనకే తెలియకపోతే ఇంకా నాకేం నేర్పుతాడు అనుకుని గుయువు గారినే అడిగేద్దామని నిర్ణయించుకుని గురువు గారినే అడిగేడు. అయ్యా అండ, పిండ, బ్రహ్మాండాలని అర్ధం చేసుకోవడంమీకి విద్య నేర్పిన గురువుకే సాధ్యపడలేదన్నారు కదా మేరీ వారు మీకెలా నేర్పారు మీకెలా సిద్ధించింది అని అడిగేడు. నాకు తెలుసు నీకిలాంటి ఆలోచన వస్తుందని నీ బుద్ధి వెన్న నెయ్యిగా మారేటప్పుడు ఎలాగైతే మరిగి కమ్మని నెయ్యిగా మారుతుందో నీ బుద్ధి కూడా సరిగ్గా ఆవిధంగానే మరిగి మాయతో కప్పబడిన ప్రపంచ తత్వాన్ని అర్ధం చేసుకోవాలన్న నీ ఆలోచనకి స్ఫూర్తిగా నిలిచింది. నీకిక్కడ ఒక విష్యం చెప్పాలోయ్ మనం ఏ పనిచేసినా సూక్ష్మంలో మోక్షంగా తేలిపోవాలోయ్. ప్రతి పనికి ఒక సులువుంటుంది. దాని మర్మం తెలిసినవాడు అభివుద్ది చెందుతాడు. ఈ సూక్ష్మంలో మోక్షానికి ‘మార్గదర్శి’ ఏకదంతుడోయ్ ఆయనవలనే ఈ మార్గం ప్రపంచానికి తెలిసింది. ఆయనే కనక ఫోజుకొట్టి, ప్రతిజ్ఞలు చేసి కుమారస్వామితో పోటీపడుంటే గెలిచేవాడా ‘గణ నాయకత్వం లభించేదా? సింపుల్ గా అమ్మ, నాన్నల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళకి ఓ దండం పెట్టి పెద్ద అలసటని లేకుండా కూర్చున్నాడు. ఆయన spontaneity కి ‘నోటి మాట, కంటిచూపు పోయి’ కిమ్మనకుండా కూర్చుని చప్పట్లు కొట్టేరు వాళ్ళ అమ్మా, నాన్న. అన్నగారు తాపీగా అన్ని పుణ్య నదులు సందర్శించి తాను, తన నెమలి స్నానాలు ముగించుకుని వచ్చేసరికి అన్నగారేమో అమ్మ, నాన్నలతో హేపీగా జీడిపప్పు ఉప్మాతో పెసరట్లు లాగించి మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుతూ కనిపించేసరికి నోట మాట రాక నీరసంగా కూలబడ్డాడు. అదీ ధర్మ సూక్ష్మమంటే అని చెప్పేరు సోమయాజులు గారు. దాంతో పరివ్రాజకాచారికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది తాను కూడా ఇలాంటి చదువే కావాలనీకుంటున్నాడు. ఆనందం పట్టలేక గురువుగారి దగ్గర శిష్యుడిగా చేరిపోయి తన కోరిక తీరబోతోదన్న ఆనందంతో “జయమ్ము నిశ్చయమ్మురా” అని పాడుకుంటూ బయలుదేరేడు ఇంటివైపు.
ఇంటికొచ్చి ఆలోచించగా భగవద్గీతలో కృషుడు ఉపన్యాసం గుర్తొచ్చింది. అంత లెంగ్త్ అవసరం లేదనిపించింది. సింపుల్ గా తెగ్గొడితే కృష్ణుడు అర్జునుడికి చెప్పిందేమిటని ఆలోచించాడు ఏదీ సూక్ష్మంలో తెలియటంలేదు. తన గురువుని తల్చుకున్నాడు అంతే పెద్ద మెరుపులా మెరిసింది బుర్రలో కృషుడు అర్జునుడికి చెప్పిందేముంది “నీ పని నువ్వు చెయ్యి బిడ్డా ఫలితం గురించి నీకెందుకు” అని. అర్జునుడు గెలిచేడు కదా అనుకున్నాడు. నరకాసురుని కృష్ణుడు చంపేడా ఏమిటి. ఆయన విజయం వేదిక ఉండాల్సిన సత్యభామ మదం ముందుకొచ్చి యుద్ధం చేయబట్టి కదా కృష్ణుడికి కూడా క్రెడిట్ దక్కింది అనుకున్నాడు. ఇంకా ఆలోచించగా ‘‘కవనార్థంబుదయించితిన్.. సుకవితా కార్యంబె నావృత్తి భవమద్దాన జయింతు!’’ అన్నారు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు. ఆయన దిగ్గజ అవధానులైన తిరుపతి వేంకటకవుల్లో ఒకరు. అన్నట్టు ప్రతి కార్యసాధకుడూ తనదైన రంగంలో అవధాని అవక తప్పదు. చిత్త ఏకాగ్రతే అవధానమన్నారు పెద్దలు. విజయం వైపు నడిపించడానికి ఒక గురువు కావాలి. తనకు సోమయాజులు గారి రూపంలో సద్గురువు దొరికేడు. అంతమాత్రాన ఉత్తర ప్రగల్భాలు పనికిరావు. స్వస్వరూప జ్ఞానం లేకపోతే అడ్డంగా దొరికిపోతాం. ‘స్వీయ లోపంబు లెరుగుట పెద్ద విద్య’ అన్నారు పెద్దలు. విజయసాధనకు గురువన్నా ఉండాలి. గురి అన్నా ఉండాలి. ఎటొచ్చీ గురువు ఉన్నా గురిలేకపోతే ప్రయోజనం లేదు. గురువు లేకపోయినా గురి ఉంటే చాలు. ఏకలవ్యుణ్నే చూడండి.. గురువు దగ్గరలేకపోయినా గురివల్ల విజయం సాధించాడు. ఏకంగా తన పేరు మీద ఏకలవ్య శిష్యులు అన్న వర్గాన్నే సృష్టించుకున్నాడు అని తనకు తాను సమాధానం చెప్పుకుని ఒక వేళా తన గురువు ఎప్పుడేమైనా ఫర్వాలేదని కూడా తీర్మానించుకున్నాడు. మనిషన్న తర్వాత మతాలు ఉంటాయి. అభిమతాలు ఉంటాయి. మనోభావాలూ ఉంటాయి. ‘నడిపించు నా నావ నడిసంద్రమున దేవ… రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభూ జయము’ అనే నిరాశలు మధ్య మధ్యలో వస్తుంటాయి. ఓటమి వచ్చినంత మాత్రాన వీరుడు లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోడు, తప్పుకోకూడదు అని స్వీయ బోధన చేసుకున్నాడు. అయితే విజయం వరించినంత మాత్రాన అందుకు సంబంధించిన ప్రతిష్ఠ అంతా అప్పనంగా వచ్చి ఒళ్లో పడుతుందని కలలు కనడానికి వీల్లేదు. ఖ్యాతిని ఎగరేసుకు పోవడానికి ఎంతోమంది పొంచి ఉంటారు. ‘విజయానికి ఎందరో తండ్రులు కానీ, ఓటమి అనాథ’ అని మానవ తత్వాన్ని కాచి వడబోసిన వాళ్లెవరో చెప్పారు. దీనిని ‘స్కాచితో వడబోసినవారు’ కూడా కాదనలేదు.
ఎవరి నమ్మకాలు వారివి. వాటికి బోలెడన్ని ‘అమ్మకాలు’ కూడా ఉన్నాయి. నడిచొచ్చే కాలానికి కలిసొచ్చే బిడ్డలు అని నమ్మేవాళ్లూ ఉంటారు. అయితే ఈ భాగ్యం ఇప్పటి వరకు యావత్ సృష్టిలో ఎవరికైనా కలిగిందో లేదో తెలియదు. విజయం వరించనంత మాత్రాన డీలాపడాల్సిన అవసరమూ లేదు. గెలిచినంత మాత్రాన కళ్లు తలకెక్కనవసరం లేదు. విజయమో, వీరస్వర్గమో అన్నమాటను మన పెద్దవాళ్లు ఏనాడో చెప్పారు. కార్యసాధనకు కృషి చేస్తూ మరణించడం కూడా అత్యంత గౌరవప్రదమే. యుద్ధంలో వెనుదిరిగి వచ్చిన భర్తకు ‘గుణపాఠం’ చెప్పే పనిచేసి, అతణ్ని తిరిగి కదనరంగానికి పంపిన చానమ్మ అనే మగువ తెగువ అందరికీ తెలిసిందే. గురువు భార్య రూపంలోనూ ఉండవచ్చని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ‘భార్య దేవోభవ’ అన్నా తప్పులేదు. విజయానికి కూడా నిర్వచనాలు ఒకరకంగా ఉండవు. ఒకరి విజయం ఇంకొకరికి అపవిజయం. ఒకరు విజయం అనుకున్నది ఇంకొకరు అపజయం అనుకోవచ్చు. ఒక్కొక్కడి మనస్తత్వం ఒక్కోరకంగా ఉంటుంది. ఆడబిడ్డ పుడితే అపజయం పాలయినట్టు కుంగిపోయే మగవాళ్లూ ఉన్నారు. అందుకు భార్య ఒక్కతే కారణమన్నట్టు తిట్టి, కొట్టి సతాయించేవాళ్లూ ఉన్నారు. పుత్రుడు పుట్టే వరకు ఫుల్‌స్టాప్ పెట్టకూడదన్న తదేక దీక్షలో దశాధికమైన అమ్మాయిల్ని కన్నవాళ్లూ ఉంటారు. అప్పటికీ అబ్బాయి కంటపడక దేవుణ్ని తిట్టేసుకుంటారు. వీళ్ల ముందు జాగ్రత్త అలాంటిలాంటిది కాదు. పుత్రుడు లేకపోతే పున్నామ నరకం అనుభవించక తప్పదని భయం! ఇది చచ్చిన తర్వాత సంగతి! పాపం! మేం బతికి ఉండగానే మీ పుత్రులు ఎన్నెన్ని నరకాలు చూపిస్తారో మీకేం తెలుసు? అని పుత్ర సంతానం ఉన్న కొంతమంది వాపోతుంటారు. ఇలాంటివి చెవినపడ్డా, కంటే కూతుర్నే కను అని ఎవరు చెప్పినా వారు వినరు.
విజయసాధకులకు వినాయకుడికి మించిన గురువులేడు. గణాధిపత్యం కోసం కుమారస్వామితో జరిగిన పోటీలో వినాయకుడు ఎలా నెగ్గుకొచ్చాడు? ‘విజయ సూక్ష్మాన్ని’ విఘ్ననాయకుడు ఈ ప్రపంచానికి నేర్పించాడు. గణాధిపత్యం కోసం కుమారస్వామి నానాశ్రమ పడ్డాడు. మరి వినాయకుడో.. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి విజయాన్ని కైవసం చేసుకున్నాడు. సూక్ష్మంలో మోక్షం ఏమిటో వినాయకుడి దగ్గరి నుంచి నేర్చుకోవాలి. ఇందుకోసం ఎవరి ‘బుర్ర’ కథ వారికి ఉండాలి.