పుచ్చిన జ్ఞానదంతం
ఈ శీర్షిక లో వ్రాసిన ప్రదేశాలు, పాత్రలు, సన్నివేశాలు, పేర్లు మొదలైనవి కేవలం వినోదం కోసం సృష్టించబడినవే కానీ ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కాదు. ఒకవేళ ఇందులో వ్రాసిన పై విషయాలకు సంబంధించి సరిపోలిన యెడల అది కేవలం యాదృచ్ఛికమే కానీ ఉద్దేశపూర్వకమైనవి కాదని మనవి.
నా పేరు అధికారికంగా ప్రసాద్ కొంతమంది ప్రసాదరావ్ అంటారు ఇంకా ముద్దొచ్చిన వాళ్ళు పెయ్యన్న అంటారు బాగా ముద్దొచ్చినవాళ్లు పెయ్యిగా అనికూడా అంటారు. ఇంతకీ ఈ పెయ్యి కథేమిటని కదా మీ అనుమానం. చెబుతా మీ అనుమానాలన్నీ తీర్చడమే కదా నాకున్న పని. నేను అయిదేళ్ల వయసప్పుడు ఆవు దగ్గర పెయ్యి పాలు తాగితే ఏమి చెయ్యనప్పుడు మనం తాగితే ఏమి అని నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది అంతే అప్పటినుంచి ఆవు దగ్గర ఎప్పుడు పాలు తాగుదామా అని ఎదురుచూస్తునాను. నేను ఎదురుచూసిన రోజు రానే వచ్చింది.
ఒక రోజు మధ్యాహ్నం వీధిలో ఇళ్ళదగ్గర పారేసిన ఆకులు, కాయలు వగైరా తింటూ ఆవు కనిపించింది అంతే ఎప్పుడు దాని పాలు తాగుదామా అని చూస్తున్న నాకు నా ఆలోచన అమలు చేయాలనిపించింది. వీధిలో ఎవరూ కనపడలేదు సరే నా టైము బాగుందని మెల్లగా ఆవు పొడుగు దగ్గర కూర్చుని నెమ్మదిగా దాని శిరాలు అందుకోవాలని ప్రయత్నం చేసేను ముందు అందలేదు కానీ తీరా అంది నేను నోట్లో పెట్టుకున్నానో లేదో ఫెడీమని వెనక కాలుతో ఓ తన్ను తన్ని ముందుకు వెళ్ళిపోయింది. నేను క్రింద పడి పన్నూడి నోట్లోంచి రక్తం వస్తుండగా ఇంట్లోకి వెళ్లిపోయెను. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ ప్రహసనం అంతా ఒక వ్యక్తి సినిమా చూసినట్టు చూసేడు. అతని పేరు సిర్రావూరి శర్మ. అదిగో అతడే నాకు పెయ్యన్న, పెయ్య అనే నామకరణాలు చేసేడు. అప్పటినుంచి నాపేరు పెయ్యన్నగా స్ధిరపడి నేను ఇంటర్మీడియట్ కి వచ్చేవరకు కొనసాగి అప్పటినుంచి నా అసలు పేరుతో పిలవడం ప్రారంభించారు. కానీ సదరు సిర్రావూరి శర్మ మాత్రం ఆయన జీవిత పర్యంతం నన్ను పెయ్యన్న అనే పిలిచేడు. మరికొంతమంది పెద్దలు కూడా అలాగే పిలిచేవాళ్ళు ఇంకా ఒకరిద్దరు నన్ను ఆవిధంగానే పిలుస్తుంటారు. ఇదంతా నా చిన్నప్పటి ముద్దుపేరు ముచ్చట. నా పేరు ముచ్చట అయింది కదా ఇప్పుడు అసలు విషయానికొద్దాం.
ఇప్పుడు నా వయసు 58 సంవత్సరాలు. ప్రస్తుతం నా బాధ ఏమిటంటే నాకు పళ్ళు ఊడటం ప్రారంభమైందని నా అభిప్రాయం. ఒక దంతం కొంచెం కదుల్తూ బాధ పెడుతోంది. నమిలి తినడానికి కుదరటం లేదు. సరే డాక్టరు దగ్గరికి వెళదామని దంత వైద్యులు గురించి విచారించగా మా వూర్లో “జ్ఞానామృతం” అనే దంత వైద్యుడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంటే ఆయన దగ్గరికి వెళ్లి నా బాధ చెప్పుకున్నాను. మీకు జ్ఞానదంతం పుచ్చింది సార్ తీసేయాలి అన్నాడు డాక్టర్. ఆ మాటలు విని అప్రయత్నంగా నోరు తెరిచాను. డాక్టర్ గారికి కొంచెం సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడల్లే ఉన్నాడు నవ్వుతూ కంగారు పడకండి సార్ జ్ఞానదంతానికి జ్ఞానానికి సంబంధం లేదు అన్నాడు. అంతే కాకుండా నేనిప్పుడు ఫ్రీగానే ఉన్నాను మీరు సరే అంటే జ్ఞాన దంతాన్ని ఇప్పుడే పీకేద్దాం అన్నాడు. నాక్కూడా ఇదేదో బాగానే ఉందనిపించింది ఆలస్యం అమృతం విషం కాకుండా. ఇంతలోనే మళ్ళీ సందేహం జ్ఞానదంతమేమిటి, పుచ్చిపోవడమేమిటి, ఇప్పుడు తీయించుకోకపోతే నష్టమేమిటి అని. నా సందేహాలతో సంబంధం లేకుండా డాక్టరు గారు తన యంత్ర సామగ్రి రెడీ చేసుకుంటూ నాకొక హెచ్చరిక వదిలాడు మాట్లాడాల్సిన ఫోన్లేమేనా ఉంటె మాట్లాడీమని. నా పళ్ళు సిగరెట్లు ఎక్కువగా కాల్చడంవల్ల బాగా గారపట్టిన విషయం గుర్తొచ్చి ఎలాగూ నోరు తెరుస్తున్నాం కదా అని పనిలో పనిగా స్కేలింగ్ గా పిలవబడే యంత్ర దంతధావనం కూడా కానిచ్చేయమన్నాను. జ్ఞానదంతాల గురించి చెప్పడం మొదలెట్టేరు. అసలు జ్ఞానదంతాలు మొత్తం నాలుగుంటాయి. ఇవి ఏ వయసులోనైనా పెరగొచ్చు, పుచ్చిపోవచ్చు కూడా. అలాంటప్పుడు వాటిని తీసేయడం మినహా వేరే మార్గం లేదు, అవి ఉండటం వలన పెద్దగా ఉపయోగం కూడా లేదు, అవి ఒకసారి పుచ్చిపోయాయంటే అలా బాధ పెడుతూనే ఉంటాయి అని చెబుతూ గ్లౌజులు, మాస్కు వగైరా ధరించి నా నోట్లోకి టార్చిలైటు వేసి చూడసాగాడు. అప్పుడు కృష్ణుడు-యశోద కాబట్టి, యశోదకి భూగోళమే కాక ఇంకా అనేక గోళాలు కృష్ణుడి నోట్లో కనిపించాయి. ఈ డాక్టరుకి నా నోట్లో ఎం కనిపిస్తాయి? కేవిటీస్ తప్ప. నా నోట్లోని పళ్ళన్నీ వరుసగా చెక్ చేసి, జ్ఞానదంతం గురించి నన్ను చీరప్ చేస్తూ, మత్తు ఇంజక్షన్ రెడీ చెయ్యమని నర్సుకు చెప్పేరు డాక్టర్ గారు. ఆ ఇంజక్షన్ ఎంత బాగుందంటే, చెంపతో మొదలుపెట్టి మొత్తం మొహం అంతా స్పర్శ లేకుండా అయిపొయింది. క్షణాల్లో యంత్ర దంతధావనం కానిస్తూ పళ్ళు మరీ అంత పాడైపోలేదని ఓ కాంప్లిమెంటిచ్చేరు డాక్టరు గారు. ఏ మాటకామాట చెప్పుకోవాలి నాకైతే ఇంత పాజిటివ్ గా మాట్లాడే డాక్టర్ గారు అరుదనిపించింది. కాసేపట్లో పన్ను పీకే కార్యక్రమం కూడా విజయవంతంగా జరిగిపోయింది. అది మొదలు గంట వరకు నేను నోరు విప్పడానికి వీల్లేదని చెప్పేరు డాక్టర్ గారు. ఆ తర్వాత మా సంభాషణ అంతా పేపరు మీద వ్రాతమూలంగా జరిగింది.
గంట తర్వాత రెండు ఐస్క్రీములు తిని తీరాలని ఆదేశించారు డాక్టర్ గారు. నచ్చావోయ్ దొంగ అని వీరబొబ్బిలి దొంగాడిని మెచ్చుకున్నట్లు మెచ్చానోయ్ డాక్టరు అని మనసులో అనుకున్నా. తర్వాత ఓ ఐదు రోజులకి మందులు, వాటి షెడ్యూలు, తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు చెప్తూ చేతికో ఇంజక్షన్ ఇచ్చారు. ఒకటికి రెండు ఐస్క్రీములు అధికారికంగా పథ్యంలో భాగంగా తినమని చెప్పిన డాక్టరు ఒకటేమిటి ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చినా భరించవచ్చనిపించింది. బోలెడన్ని మందులు, మౌత్ వాష్ చేతులోపెట్టి ఆఖరి జాగ్రత్తలు చెప్పేరు డాక్టరు గారు. చివరిగా నాతో ఓ ఐదు రోజులపాటు మీరు గట్టిగా మాట్లాడకూడదని చెప్పేరు. అది వింటే నాకు నవ్వొచ్చింది. వెంటనే నేను పెళ్లయినవాణ్ణని కాగితం మీద రాసి చూపించాను. ఈసారి డాక్టరుగారు పైకి నవ్వలేదు కానీ చిన్న స్వరంతో నాతో చెప్పేరు ఇలాంటివి మా ఆవిడ చూస్తే ప్రమాదం అని కాగితాన్ని నావైపుకి నెట్టేసేరు. ఆయన భార్య కూడా దంత వైద్యురాలు, పక్క కేబిన్లోనే ఉంటుంది. లోకానికి పళ్ళ డాక్టరైనా భార్యకు భర్తే కదా అన్న విషయం జ్ఞానదంతం తొలిగించాక నాకు తెలిసిన తొలిజ్ఞానం.