About

తొలిపలుకు

పెద్ద బాలశిక్ష అనే పుస్తకం తెలుగులో ఎన్సైక్లోపెడియా అనవచ్చు. బ్రిటీషువారు భారతదేశాన్ని పరిపాలించు కాలంలో ఆంధ్రదేశములోని పాఠశాలల్లో పిల్లలకు పెద్దబాలశిక్ష సిలబస్గా ఉండేది. పిల్లలు మొట్టమొదట తమ విద్యాభ్యాసాన్ని పెద్ద బాలశిక్షతోనే ప్రారంభించేవారు. 1832 లో మేస్తర్ క్లూలో అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన పుదూరు చదలవాడ సీతారామ శాస్త్రి చేత బాలశిక్ష అనే గ్రంథాన్ని రచింపచేశాడు. ఈయన రచనాప్రణాళికను చాలాజాగ్రత్తగా కుర్రవాళ్ళగ్రహణశక్తిని దృష్టిలోఉంచుకొని రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురంటూ ఎదురు చూస్తున్న మన ఆంధ్ర దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది.

1856లో అంటే మొదటి ముద్రణ జరిగిన 24 సంవత్సరముల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల సంఖ్య 78. ఆ తర్వాత సాహిత్య విషయాలను, చంధస్సు , సంస్కృత శ్లోకాలు, భౌగోళిక విషయాలను యిందులో చేర్చి 12 పేజీలు అదనంగా కలుపుతూ 90 పేజీలతో 1865 లో ఇది పునర్ముద్రణ పొందింది. దానిని బాలవివేకకల్పతరువు గా రూపొందించారు. అందుకనే అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలోఉన్న పుస్తకం పెద్ద బాలశిక్ష గా కొత్త పేరును దాల్చింది. ఈ పెద్ద బాలశిక్ష లో విషయపరిజ్ఞానానికి-అంటే భాషాసంస్కృతులకు కావాల్సిన పునాదిరాళ్ళనదగిన భాషా విషయాలు, అక్షరాలు, గుణింతాలు, వత్తులు, సరళమైన పదాలు- రెండు, మూడు, నాలుగు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు- నీతి వాక్యాలు, ప్రాస వాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ, అందరూ తెలుసుకోదగ్గవీ, తెలిసిన చారిత్రక, భౌగోళిక, విజ్ఞాన సంబంధ విషయాలను, వాస్తవ పరిస్థితులను ఈ పుస్తకం ఆది స్వరూపంలోనే ఆనాడు పుదూరువారు పొందుపరచారు.

ఆ తరువాత 1832 నుండి ఇప్పటివరకు పెద్ద బాలశిక్షను తెలుగు సమాజం ఆదరించగా కొన్ని మార్పుల చేర్పులతో ఎంతోమంది ప్రచురణకర్తలు ఎన్నో పండిత పరిష్కరణలతో అందిస్తూవచ్చారు. పుదూరివారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ 1916లో వావిళ్ళ వారిది. 1916 లో వావిళ్ళ రామస్వామి శాస్తులు అండ్ సన్స్ సంస్థ నుండి ఒక పెద్దబాల శిక్ష వెలువడింది. దీని విపుల పరిష్కరణను 1949లో అందించారు. ఆ తర్వాత నుండి ఇప్పటివరకు ఎన్నో పెద్ద బాలశిక్ష లను ఎందరో ముద్రించారు. ప్రస్తుతం గాజుల సత్యనారాయణ గ్రంధ్ర కర్తగా ఉండగా విజయవాడకు చెందిన వనజా ఆఫ్ సెట్ ప్రింటర్లు ద్వారా పెద్దబాల శిక్ష ముద్రణ అవుతోంది.

మహా భారతంలో 18 పర్వాలున్నట్టే నేడు పెద్దబాల శిక్ష – భాషావిజ్ఞాన పర్వం, సంస్కృతీ సంప్రదాయ పర్వం, బాలానంద పర్వం, శతక పర్వం, నీతి కథా పర్వం, సంఖ్యా శాస్త్ర పర్వం, ఆధ్యాత్మిక పర్వం, కంప్యూటర్ పర్వం, గణిత శాస్త్ర పర్వం, విజ్ఞాన శాస్త్ర పర్వం, వాస్తు శాస్త్ర పర్వం, పంచాంగ పర్వం, ఆరోగ్య పర్వం, మహిళా పర్వం, క్రీడారంగ పర్వం, ఆంధ్ర ప్రదేశ్ పర్వం, భారతదేశ పర్వం, ప్రపంచ పర్వం అను 18 పర్వాలతో మేటి పుస్తకంగా పేరు పొందినది.

గొప్ప ఘనమైన చరిత్ర గల ఈ పుస్తకాన్ని మరికొంత విపులంగా పాఠకులకు అందించాలనే మా ప్రయత్నాన్ని పాఠకులు, పెద్దలు, పండితులు, ఆదరించి తప్పొప్పులను తెలియచేసి మీ ఆదరాభిమానాలను మా ఈ పెద్ద బాల శిక్ష పుస్తకం పై  కూడా చూపిస్తారని తద్వారా మాకు ఉత్సాహాన్ని ఆనందాన్ని ఆసక్తిని కల్పించి మేము  అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఆన్లైన్ ఉంచిన https://peddabaalasiksha.com/ లో చదివి మా ప్రయత్నంలో మేము ఎంతవరకు సఫలీకృతం అయ్యేమన్నది మీ విలువైన అభిప్రాయాలను తెలియచేసి మమల్ని ప్రోత్సహించగలరని ప్రార్ధిస్తున్నాము.

– ఆదిరాజు సుబ్రహ్మణ్య ప్రసాద్

కీ||శే|| ఆదిరాజు భాస్కర శాస్త్రి – హైమవతి దంపతులు
కీ||శే|| ఆదిరాజు పద్మావతి గారు

మాకు ఈ బృహత్తర ఆలోచన కలుగుటకు మూల పురుషులైన నా తల్లిదండ్రులు కీ||శే|| ఆదిరాజు భాస్కర శాస్త్రి – హైమవతి దంపతులకు మరియు మమ్ములను ఈ కార్యమునకు ఉత్తేజపరిచిన నా సహధర్మచారిణి కీ||శే|| ఆదిరాజు పద్మావతి గార్లకు ఈ మా ప్రయత్నాన్ని అంకిత పరచుచున్నాము.