అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి…

అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి…

సప్తపది, 1981లో విశ్వనాధ్ దర్శకత్వంలో  విడుదలైన  సినిమా. ఇది నృత్యం ప్రధానాంశంగా వచ్చిన సినిమా. అంతకుముందు విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం అనే సంగీతప్రధాన చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలయ్యింది. ఒకమాదిరిగా విజయవంతమైంది.‘సప్తపది’ చిత్రంలో దుర్గాదేవి అష్టోత్తరం సన్నివేశానికి తగిన విధంగా చిత్రీకరించి ఆ సినిమాకు ఆ సన్నివేశమే ప్రాణంగా రూపొందించారు. పాటకు ముందుగానే కథానాయిక దుర్గాదేవిని అన్ని రూపాలలో కీర్తిస్తూ గానం చేసే ‘అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ’ కీర్తనలో పార్వతీదేవిని, లక్ష్మీదేవిని, సరస్వతీదేవితోపాటుగా ముగ్గురమ్మలగన్న మూలపుటమ్మను కీర్తించారు. ఈ పాట వింటే భక్తిరస భావం తొణికిసలాడుతుంది. అమ్మవారు అఖిలాండేశ్వరి. నవరాత్రులలో తొమ్మిది రూపాలలో పూజలందుకునే చాముండేశ్వరి. అష్టలక్ష్ములు తానేఅయిన ఆ ఇష్టకామేశ్వరి వైభవాన్ని ఆవిష్కరిస్తూ వేటూరి సుందరామ్మూర్తి గారు రచించిన నృత్య గీతాన్ని కె.వి.మహదేవన్ గారు రాగమాలిక గా సమర్పించారు. ఈ రాగమాలిక పాట “ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్ ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీమ్…అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ” మొత్తం ఐదు రాగాలలో కంపోజ్ చేయబడింది.

          వేటూరి సుందర రామ్మూర్తి గారు ఒక తెలుగు కవి. ఆయనకి తెలుగు భాషపై ఉన్న మమకారం ఇంచుమించుగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలందరికి తెలిసిన విషయం. ఆయన రాసిన పాటలలో తెలుగుదనం, తెలుగు చరిత్ర, తెలుగు సంపద ప్రతిబింబిస్తూ ఉంటాయి. వీటికి తోడు ఆయన సాహిత్యంలో వాడే కొన్ని సంస్కృత సమాసాలు గొప్ప గంభీరంగా ఉంటాయి. కొన్ని ముద్దు ముద్దుగా  ఉంటాయి.  కొన్ని చిత్రంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికి  ఆయన ఒక ప్రవాహం మాదిరిగా  సంస్కృత పదాలను వాడి తెలుగు పాటకు అందాన్ని చేకూర్చారు.  ఆయన సంపూర్ణంగా సంస్కృత పదాలతో వ్రాసిన పాట ‘సప్తపది’ చిత్రంలోని “అఖిలాండేశ్వరి  చాముండేశ్వరి పాలయమాం గౌరి పరిపాలయ మాం గౌరీ”.  ఈ పాటలో మూడు చరణాలలో ముగ్గురమ్మలను వర్ణిస్తూ వ్రాసారు.  బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అతిధిగా వచ్చిన “పాడుతా తీయగా” కార్యక్రమంలో అందులో కృష్ణ చైతన్య అనే కుర్రాడు ఈ పాట పాడగా స్వర్గీయ శ్రీ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారు ఈ పాట వ్రాసింది ఎవరన్నది నాకు అనుమానం ఉంది ఎందుకంటే ఇది కూచిపూడి సంప్రదాయంలో వచ్చిన పాట దాన్ని సినిమాలో ఉపయోగించడం జరిగింది అనుకుంటున్నాను అన్నారు.  అప్పుడు  సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ పాటలో శబ్దాలు – శర్వార్ధగాత్రి, సర్వార్ధ సంధాత్రి  ఇంకా రచనా శైలి పరిశీలిస్తే ఇదివేటూరి వారు మాత్రమే వ్రాయగలరనిపిస్తోంది అని చెప్పేరు.  అలాగే ఈ పాట మొదటి చరణంలో పార్వతి దేవిని, రెండవ చరణంలో మహాలక్ష్మి దేవిని, మూడవ చరణంలో సరస్వతి దేవిని వర్ణించి, నాలుగవ చరణంలో ముగురమ్మల మూల కారకమైన తత్వాన్ని సమన్వయిస్తారు. ఇది మల్లాది వారి రహస్యం సినిమాలోని ‘లలితభావ నిలయ’ పాత సాహిత్యానికి ఏమాత్రం తీసిపోనిదని నా అభిప్రాయం. ఇప్పుడిక పాటను విశ్లేషిద్దాం.

ఓంకార పంజర శుకీమ్… ఉపనిషదుద్యాన కేళికల కంఠీమ్..

ఆగమ విపిన మయూరీ … ఆర్యాం.. అంతర్విభావ యేత్ గౌరీమ్

          ఓంకార పంజర శుకీమ్ – ఓం అనేది ఆది ప్రణవ నాదం  ఆ నాదాన్ని నాలుగు ప్రాకారాములుగా సంచరించే సుమధుర భాషిణి – ఓంకారమనే పంజరం లో ఉండే చిలక. ఉపనిష = ఉపనిషత్తులనేటువంటి ద్ఉద్యాన = ఉద్యాన వవంలో కేళీ = ఆడుకునే – ఉపనిషత్తులన్నీ ఆ ఆది ప్రణవ శక్తి లీలల ప్రతిబింబాలే కదా! కల కంఠీమ్ = మధురమైన గొంతుక కలది అనగా సత్య, ధర్మ, శ్రేయోదాయకమైన పలుకులని మాత్రమే పలికెడిది.  ఆగమ = వేదాంతమనే విపిన = అడవిలో మయూరీం = నెమలి – అంటే వేదాంతమనే అడవిలో నృత్యం చేసే నెమలి  (A treatise on vedantamu or vedas describing religious rites, శాశ్వతమైన  ఙ్ఙానాన్ని కలిగి, అది సూచించే ప్రాకారములలోనే నిత్యానందం తో మెలిగేది. ఆర్యామ్ = పూజించదగిన అంతర్విభావ యేత్ గౌరీమ్ – అంతః + విభావయేత్ = మనసులో స్మరించుకుంటున్న ఆధ్యాత్మిక సచ్చిదానందాన్ని పొందుటకు గౌరీమ్  = గిరి రాజా తనయ అయినా పార్వతి దేవి కృప, కటాక్షాలు అవసరం. 

అఖిలాండేశ్వరి… చాముండేశ్వరి…

పాలయమామ్ గౌరీ.. పరిపాలయమామ్… గౌరి

          అఖిలాండేశ్వరి = అఖిల + అండ + ఈశ్వరి = దృశ్యాదృశ్యమానమైన ఈ విశ్వమంతటికి ఆధారభూతమైన శక్తి.  చాముండేశ్వరి =  చాముండేశ్వరి దేవి మైసూరు రాజా వంశీయుల ఆరాధ్య దేవత. ఈమెయే పార్వతి దేవి ఈమె శక్తి స్వరూపిణి.  పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సుచే పురుషుల చేతుల్లో మరణించకూడదని పరమేశ్వరుని నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరం పొందిన గర్వంతో సకలలోకాలను పీడించాడు.  ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. భయభ్రాంతులైన సకలలోకవాసులు త్రిమూర్తులను వేడుకోగా, మహిషాసురుని వధించుటకై ఒక స్త్రీశక్తిని సృష్టిస్తారు. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. 18 చేతులతో ప్రతిచేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది.  ముందుగా చండ, ముండ అనే రాక్షసులను సంహరించిన తర్వాత మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకలలోక వాసుల కీర్తనలను అందుకుంటుంది. చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళే మార్గంలోనే మహిషాసురుని విగ్రహం ఉంది. ఒక చేతిలో కత్తితో, మరొక చేతిలో పడగవిప్పిన పాముతో ఈ శిల్పం భయంకరంగా కనిపిస్తుంది. పాలయమామ్ గౌరీ = నన్ను రక్షించే ఆ గిరి రాజా తనయ గౌరీదేవి.  పరిపాలయమామ్ = ప్రపంచాన్నంతటిని రక్షిస్తుంది.  ఇప్పుడు మొదటి చరణం  పరిశీలిద్దాం.

శుభగాత్రి గిరిరాజపుత్రి.. అభినేత్రి శర్వార్ధగాత్రి

సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి

చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్బశాంతర భువనపాలిని

కుంకుమరాగశోభిని కుసుమ బాణ సంశోభిని

మౌనసుహాసిని… గానవినోదిని.. భగవతి.. పార్వతి… దేవీ

          శుభగాత్రి = మంగళకరమైన మోము కలది; చల్లని చూపులతో తన పిల్లలను అనుగ్రహించెడిది. గిరిరాజ పుత్రి = పర్వత రాజు  ఐన హిమవంతుని కుమార్తె.  అభినేత్రి  = ఎటువంటి కార్యాన్నయినా తన చూపులద్వారా సిద్ధింప చేయగలది.  శర్వార్ధగాత్రి = శర్వుడు అంటే శివుడు కదా ఆయనలో సగమైనది అంటే అర్ధనారీశ్వర తత్వంలో విరాజిల్లునది.(శర్వ + అర్ధ + గాత్రి – శర్వార్ధగాత్రి) సర్వార్ధ = అన్ని భావములను సంధాత్రి = భరించునది అన్ని భావములను తన మోములో పలికించునది అని అర్ధం. జగదేక = ప్రపంచానికి అంతటికి ఒకే ఒక  జనయిత్రి = తల్లి – ఈ విశ్వం లోని సకల జీవ రాశులకు జన్మనిచ్చిన తల్లి. చంద్రప్రభా = చంద్రుని కళలంతటి  ధవళకీర్తి = తెల్లని అనగా ఎటువంటి కల్మషమైన పాప పంకిలములు లేనటువంటి కీర్తితో విలసిల్లేది. చతుర్బాహు = నాలుగు చేతులతో సంరక్షిత = సంరక్షించేది అనగా కాపాడునది  శిక్షిత = శిక్షించునది  చతుర్బశాంతర = నాలుగు భుజముల మధ్యన ఉన్న  భువనపాలిని = ప్రపంచమును పాలించునది. అంటే తన నాలుగు చేతులతో దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ తన నాఱుగు భుజములు అనగా నాలుగు దిక్కులు మధ్యనున్న ఈ విశ్వముని పాలించెడిది. కుంకుమరాగశోభిని = ఎర్రని కుంకుమ వర్ణముతో భాసిల్లే సర్వమంగళ మూర్తి, కుసుమ బాణ సంశోభిని = కుసుమ పుష్పముల బాణములతో శోభిల్లునది.  కుసుమ అనేది ఒక ప్రత్యేకమైన పుష్పం. దీని మొదటి ఆవాస ప్రాంతం ఐయా మత్తు ఆఫ్రికా, అలాగే మధ్యభారతం నుండి తూర్పుమధ్యధరాప్రాంతపుదాటి యుథోపియా వరకు వ్యాప్తిచెందినది.  ఇది చాలా కొమ్మలు కలిగిన ఏకవార్షిక గుల్మం. దీని ఆకులు వాడిగా ఉన్న ముండ్లు కలిగిఉంటాయి. ఈ మొక్కలు 30 నుండి 36 అంగుళాలఎత్తు వరకూ పెరుగుతాయి. కుసుమ పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఇవి ఒక్కో కొమ్మకు ఒకటి నుండి ఐదు చొప్పున వస్తాయి. ఒక్కో పువ్వులో 15-20 గింజలు ఉంటాయి. ఈ మొక్క యొక్క తల్లి వేరు దృఢంగా ఉండడం వలన కుసుమ ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకో గలదు.  ఇప్పుడు అర్ధాన్ని గమనిస్తే ఎటువంటి పరిస్ధితులనైనా తన కుసుమ బాణములతో ఛేదించి మంగళకరమైన శుభ సంపదలను ఇవ్వగలిగిన తల్లి.  మౌనసుహాసిని… గానవినోదిని.. భగవతి.. పార్వతి.  యోగ ముద్రలో అనవసరమైన వాటిని దూరం చేసి మౌనముగా మంగళప్రదమైన నవ్వుతో, సంగీతానికి పరవశించే భగవత్ స్వరూపముగా ప్రకాశించే తల్లి.  ఇప్పుడు రెండవ చరణం పరిశీలిద్దాం. 

శ్రీహరి ప్రణయాంబురాశి..

శ్రీపాద విచలిత క్షీరాంబురాశి

శ్రీ పీఠ సంవర్ధిని ఢోలాసురమర్ధిని

ధనలక్ష్మి.. ధాన్యలక్ష్మి ..ధైర్యలక్ష్మి.. విజయలక్ష్మి

ఆదిలక్ష్మి.. విద్యాలక్ష్మి.. గజలక్ష్మి.. సంతానలక్ష్మి

సకలభోగసౌభాగ్యలక్ష్మి… శ్రీమహాలక్ష్మి… దేవీ…

అంబుధి, అంబు అనగా నీటికి నిధి = సముద్రం – శ్రీహరి అనురాగ సముద్రము అనెడి అనంత ప్రేమ మూర్తి. శ్రీపాద విచలిత క్షీరాంబురాశి – శ్రీ మహా విష్ణువైనటువంటి ఆ శ్రీహరి పాదములనుండి ఉద్భవించే పాల సముద్ర నిధి వంటి తల్లి.  శ్రీ పీఠ సంవర్ధిని ఢోలాసురమర్ధిని – పీఠము అనగా ఆసనము అంటే శరీరములోని ఏ భాగము కదలకుండా సౌలభ్యంగా కూర్చుండే  విధానము.  ఇక్కడ శ్రీ పీఠ అన్నారు.  మంగళదాయిని అయినా అమ్మ కూర్చునే స్ధానం శ్రీపీఠం. శ్రీపీఠమన్నా శ్రీచక్రమన్నా ఒక్కటే. శ్రీ చక్రం అమ్మ నివాస స్దానమ్.శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి. ఈ తొమ్మిది ఆవరణలను అర్చించుటయె శ్రీ చక్రనవావరణార్చన. ఇది అమ్మకు చాలా ప్రియమైన అర్చన.  శ్రీచక్రంలో అమ్మవారికి చుట్టూ ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది మాతృకలు స్థాపించబడ్డారు..వీరు అమ్మవారికి అష్టదిగ్భంధనగా ఉన్న రక్షణ కవచాలు .. వీరినే అష్టమాతృకలు అని పిలుస్తాం.. వీరిలో తూర్పువైపున బ్రాహ్మీ, దక్షిణమున మహేశ్వరి, పశ్చిమం కౌమారి, ఉత్తరం వైష్ణవి, ఆగ్నేయం వారాహీ, నైరుతి మాహేంద్రి, వాయువ్యం చాముండి, ఈశాన్యం మహాలక్ష్మి అమ్మవార్లు ఉంటారు.. అష్టమాతృకలతో శ్రీయంత్రం అష్టదిగ్భంధనగా చేయబడింది.. దీనికి తంత్రమార్గంలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది.. శ్రీచక్ర తంత్రం తెలిసిన వారు సిద్ది పొందినవారికి లోకంలో ఎటువంటి ఎదురు ఉండదు.. వారే గొప్ప శక్తివంతులు, వారిని ఎంతటి క్షుద్రప్రయోగాలు ఏమీ చేయలేవు..ఈ శ్రీచక్రంతో అష్టదిగ్భంధనం చేయబడిన గృహానికి ఆ గృహంలో నివసించే వారికి ఎటువంటి ఆపదలు, ఆర్థిక బాధలు, క్షుద్ర ప్రయోగాలు దరిచేరలేవు.. ఇలా జరగాలంటే గృహస్థు కూడా ఇంటిలో ప్రతిష్ఠించబడిన శ్రీచక్రానికి విధిగా పూజాధికాలు నిర్వహిస్తూ నైవేద్యం సమర్పించాలి.  అటువంటి శ్రీపీఠం లేదా శ్రీచక్రమునకు శ్రేయస్కరం శోభను చేకూర్చే తల్లి.  డోలా అను రాక్షసుని సంహరించిన తల్లి.   ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, ధైర్యలక్ష్మీ, విజయలక్ష్మీ, ఆదిలక్ష్మీ, విద్యాలక్ష్మీ, గజలక్ష్మీ, సంతానలక్ష్మీ అనెడి నామాలతో  అష్ట లక్ష్ములుగా రూపాలు దాల్చిన తల్లి. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం, అందుకే ఆ లక్ష్యాలు అష్టల క్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత, లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మి కటాక్ష్యం పొందినట్లేనని భావన. సకల భోగములను ప్రాప్తిమ్ప  చేయగల సౌభాగ్య లక్షి తల్లి – నీవు  నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉండే శ్రీ మహాలక్ష్మి దేవీవమ్మా.  ఇప్పుడు  మూడవ చరణం పరిశీలిద్దాం.

ఇందువదనే.. కుందరదనే… వీణాపుస్తకధారినే

శుకశౌనకాది ..వ్యాసవాల్మీకి ..మునిజన పూజిత శుభచరణే

సరస సాహిత్య… స్వరస సంగీత.. స్తనయుగళే

వరదే అక్షరరూపిణే….శారదే దేవీ

          ఇందువదనే  = చంద్రుని వంటి ముఖము కలదానా; కుందరదనే  = కుంద పుష్పం అనగా తెల్లని పువ్వు -మల్లె పువ్వు అనుకోవచ్చు. రోదనము అంటే దంతములు తెల్లని మల్లెల వంటి దంతములు  కలిగిన తల్లి. ‘మల్లాది వారు రహశ్యం సినిమాలో ‘లలిత భావ నిలయ’ పాటలో కూడా జగన్మాతను వర్ణిస్తూ ‘సుమరదన విధువదన…దేవి’ – తెల్లని దంతములు కల చంద్ర బింబము వంటి మొఖం కల తల్లి అని వర్ణించేరు.  వీణా పుస్తక దారినే వీణా అనగా కళలను పుస్తక అనగా విద్యలను దారినే – ధరించియున్న తల్లి – కళలను, విద్యలను ఇచ్చెడి తల్లి.   శుకశౌనకాది ..వ్యాసవాల్మీకి ..మునిజన పూజిత శుభచరణే – శుకుడు, శౌనకుడు, వ్యాసుడు, వాల్మీకి మొదలగు ముని గణములు చేత పూజించబడెడి తల్లి.   సరస సాహిత్య… స్వరస సంగీత.. స్తనయుగళే – లలితమైన ఆనందం కలిగించే సాహిత్యంతో స్వరములను పలికించగల సంగీతం అనే స్తనములు కలిగి తనబిడ్డలకు వాటిని అందించి వారి ఆకలి తీర్చి ఆనందాన్నిచ్చే జగన్మాత.  వరదే అక్షరరూపిణే….శారదే దేవీ – కరుణా మూర్తిగా నాశనము లేని కళలను, విద్యలను, సంపదలను కటాక్షించే చల్లని తల్లి.

వింధ్యాతటీవాసినే… యోగసంధ్యాసముద్భాసినే

సింహాసనస్తాయినే.. దుష్టహరరంహక్రియాశాలినే

          వింధ్యాతటీవాసినే = వింధ్య పర్వతపు  పాదాల సమీపమున నివసించెడిది.   వింధ్య పర్వత శ్రేణి ఉత్తరభారథాన్ని, దక్షిణ భారథాన్ని  విడదీస్తున్నాయి. ఇవి అతి ప్రాచీన ముడుత పర్వతా శ్రేణులు.  ఈ పర్వతశ్రేణులు ప్రధానంగా మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. వీటి పశ్చిమ భాగాలు గుజరాత్ లోనికి తూర్పుభాగాలలో (గుజరాత్ ద్వీపకల్పంలో) చొచ్చుకుపోయి ఉన్నాయి. వీటి తూర్పు భాగాలు మిర్జాపూర్ వద్దగల గంగానది వరకూ వ్యాపించియున్నాయి.  వీటి దక్షిణ వాలులు నర్మదా నది, అరేబియా సముద్రం వరకూ వ్యాపించిఉన్నాయి. వింధ్య భౌగోళికంగా విభిన్న పర్వతావళిగా విస్తరించి ఉంది. ఈ పర్వతావళిని సామూహికంగా వింధ్య అని పిలుస్తారు. వింధ్యపర్వతాలు నిజానికి పర్వత చీలికలతో, కొండలతో, పర్వతాలతో, పీఠభూములతో ఏర్పడిన పర్వతాల గొలుసు. “వింధ్య” అనే పేరుతో సాంప్రదాయకంగా పిలువబడుతుంది. వింధ్యపర్వతాల ఖచ్చితమైన ఎత్తు వివిధ సమయాలలో మారుతూ ఉంటుంది.  గతంలో “వింధ్య” అనే పదం విస్తృత అర్ధంలో ఉపయోగించారు. ఇండో-గంగా మైదానాలు, దక్కన్ పీఠభూమి మధ్య కొండల సరిహద్దుగా భావించినట్లు పాత గ్రంధాలలో పేర్కొన్న వివిధ వివరణలు తెలియజేస్తున్నాయి. వింధ్యపర్వతాలు ఉత్తరంగా గంగా నుండి దక్షిణంగా గోదావరి వరకు విస్తరించాయి.  కొన్ని పురాణంలో ప్రత్యేకించి వింధ్య అనే పదం నర్మదా, తపతి నదుల మధ్య ఉన్న పర్వత శ్రేణిగా వివరించబడింది. ఇప్పుడు ఆప్రాంతం సాత్పూరా శ్రేణులు అని పిలువబడుతుంది. వరాహ పురాణం సాత్పురా శ్రేణిని వింధ్య అనే పదం ( “వింధ్య పాదాల”) ఉపయోగించింది.

          యోగసంధ్యాసముద్భాసినే= యోగమనే సంధ్యా కాల సమయములో ఉదయం అనగా రాత్రి తరువాత వెలుగు కనిపించే సమయం, సూర్యోదయం మధ్య కాలాన్ని, అలాగే సూర్యాస్తమయం, రాత్రి మధ్య కాలాన్ని సంధ్య లేదా సంధ్యాసమయం అంటారు.  తెలుగులో ఉదయ సంధ్య, సాయంసంధ్య, అసుర సంధ్య, గోధూళివేళ వంటి పదాలు వాడుకలో ఉన్నాయి.అటువంటి సమయ పాలనలో యోగమనే జ్ఞానముతో భాసిల్లెడు తల్లి. సింహాసనస్తాయినే = యావత్ ప్రపంచాన్ని తన సింహ ఆసనంగా మార్చుకొని ఈ జగత్తును పాలించే తల్లి. దుష్టహరరంహక్రియాశాలినే.  ఇది ఒక గొప్ప చమత్కార ప్రక్రియతో ఉపయోగించిన శబ్ద రత్నాకరం. దుష్టహర = దుర్మార్గమును దుర్మార్గాన్ని పాటించే దుర్మార్గులను హరించివేయు నది  రంహ అనగా శాంతిపచేయు అని అర్ధం ఇప్పుడు మొత్తంగా చూస్తే ‘దుష్టహరరంహక్రియాశాలినే’ = దుర్మార్గులలోని దుర్మార్గాన్ని నశింప చేసి వారిని సన్మార్గంలో తీర్చిదిద్దగల ప్రతిభ కల తల్లి.

విష్ణుప్రియే.. సర్వలోకప్రియే .. సర్వనామప్రియే .. ధర్మసమరప్రియే..

హే.. బ్రహ్మచారిణే… దుష్కర్మవారిణే..

హే.. విలంబితకేశపాశినే….

మహిషమర్దనశీల.. మహితగర్జనలోల..

భయతనర్తనకేళికే… కాళికే..

దుర్గమాగమదుర్గ పాహినే… దుర్గే దేవీ…..

          విష్ణుప్రియే.. సర్వలోకప్రియే .. సర్వనామప్రియే .. ధర్మసమరప్రియే..శ్రీ మహావిష్ణువుకు ప్రియమైనది, అన్ని లోకములకు ప్రియమైనది, అన్ని నామములు తానెయైన తల్లి, ధర్మ సంస్ధాపన కొరకు యుద్ధము చేసైనా ధర్మ రక్షణ కావించేది.  హే.. బ్రహ్మచారిణే అంటే పరబ్రహ్మ తత్వాన్ని ఉపాసిస్తూ ఎల్లవేళలా పరబ్రహ్మ ధ్యాన నిమగ్నయై ఉండెడిది. దుష్కర్మవారిణే = చెడు కర్మలను నివారించునది.  హే.. విలంబితకేశపాశినే = తాడు వంటి జడ కలది. మహిషమర్దనశీల అజ్ఞానికి ప్రతిరూపమైన ‘మహిషి’ అను రాక్షసుని చంపినది  మహితగర్జనలోల = ప్రపంచంలో ఎవరు ఎలా పిలిచినా – గర్జించి పిలిచినా వారిని కరుణించి తన చల్లని చూపులతో కటాక్షించే తల్లి. భయతనర్తనకేళికే = భయోత్పాతాన్ని సృష్టించే నాట్యం చేయగల తల్లి.  కాళికే.. – మహా శక్తి కాళికా మాత.  దుర్గమాగమదుర్గ =   రావడానికి కానీ పోవడానికి కాని మార్గమే లేనటువంటి కోటలో కొలువై ఉండే దుర్గే దేవీ…..

మంగళం మహత్

Scroll to Top