ఆ.సు. కబుర్లు : కోకు “అసలు మాది కిష్కింధ”

కోకు “అసలు మాది కిష్కింధ”

ఈ శీర్షిక లో వ్రాసిన ప్రదేశాలు, పాత్రలు, సన్నివేశాలు, పేర్లు మొదలైనవి కేవలం వినోదం కోసం సృష్టించబడినవే కానీ ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కాదు. ఒకవేళ ఇందులో వ్రాసిన పై విషయాలకు సంబంధించి సరిపోలిన యెడల అది కేవలం యాదృచ్ఛికమే కానీ ఉద్దేశపూర్వకమైనవి కాదని మనవి.

‘కోకు’ గా ప్రసిద్ధికెక్కిన కొడవటిగంటి కుటుంబరావుగారు తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకున్న రచయిత. ఆయన రచించిన కథలు, నవలలు మధ్య తరగతి జీవితానికి దర్పణలు వంటివి. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన కుటుంబరావుగారు బాల్యం నుంచే రచనా వ్యాసంగంపై మక్కువ చూపారు. గురజాడ తర్వాత వ్యావహారిక భాషలో రచనలను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లిన రచయితలల్లో కుటుంబరావుగారు ప్రముఖులు. ఆయన రచనలలో మధ్యతరగతి జీవితాలు ప్రతిబింబిచడతంతోపాటు, సామాజిక స్పృహ, దృక్పధం కొట్టొచ్చినట్టు కన్పిస్తాయి. ఆయర రాసిన నవల ‘తారా’కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆధునిక సాహిత్యం, మార్క్సిజంలతో ప్రేరణ చెందిన కుటుంబరావుగారు నవ్య సాహిత్య పరిషత్తు, అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం ఇలా పలు సంఘాలలో సభ్యులుగా ఉన్నారు.  మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యమూ మారాలి … పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి ఉండడమంటే మోసం చెయ్యడమేగా కోకు భావించేవారు. యువతరాన్ని ఆకర్షించే సాహిత్యం ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకున్న కోకు ‘యువ‘ అనే మాసపత్రికను చక్రపాణిగారితో కలిసి ప్రారంభించారు. ఆయన ఆంధ్రపత్రిక, ఆంధ్రవారపత్రిక, భారతి మున్నగు పత్రికలలో పనిచేసి వాటి అభివృద్ధికి కృషి చేశారు. నేటి పత్రికలలో కన్పిస్తున్న అనేక శీర్షకలు ఉదాహరణకు, రాజకీయ వ్యంగ్య వ్యాసాలు, కార్టున్లు, సినిమా స్టిల్స్, పిల్లలకు ప్రత్యేక శీర్షికలు, అనువాద నవలలు మొదలు పెట్టినది కుటుంబరావుగారే. భౌతిక శాస్త్రంలో పట్టభధ్రులైన కుటుంబరావుగారు ఏ రచన చేసినా అందులో శాస్త్రీయ దృక్పధం, హేతువాదం కన్పిస్తాయి. ఆయన 1952లో బాలల పత్రిక ‘చందమామ’లో చేరారు. చనిపోయేవరకు ఆయన చందమామకు సంపాదకత్వం వహించారు. తెలుగు సాహిత్యరంగానికి ఎనలేని కృషి చేసిన కొడవటిగంటి కుటుంబరావు గారు దాదాపు 18 నవలలు, 159 కథలు, 75 గల్పికలు, 12 నాటికలు అనేక వ్యాసాలు రాశారు. ఆయన రాసిన అనేక కథలలో ప్రజల మూర్కత్వానికి అద్దం పట్టే కథ అసలు మాది కిష్కింధ ఇక్కడ మీ కోసం…

మా వూరికో కోతి వచ్చింది. ఓ రోజు పొద్దున్నే మావూరి పిల్లకాయలు దాన్ని ఆంజనేయస్వామి ఆలయం గోడ మీద చూశారు. అది పేలకోసం వెతుక్కుంటుంటే నవ్వారు. కాని అది కనిబొమలు పైకెత్తి నుదురు ముడతలు పది దీర్ఘాలోచనల ఉన్నప్పుడు పిల్లకాయలకి ఆశ్చర్యం వేసింది.  పెద్దవాళ్ల జోక్యం కలిగించుకోకబోతే కోతి ఏమయి ఉండేదో మరి. పిల్లకాయలు కోతిని చూసి గంటసేపైనా ఆనందించారో లేదో ఈలోపుగా ఆ దారినే పోతూ, పురాణం చెప్పే శాస్తుల్లుగారు గుదిముందాగి, మనోజంమారుత తుల్యవేగం… “ శ్రీరామ దూతం శిరసా నమామి ” అంటూ దో గొణగొసాగాడు. కోతి కాస్తా ఆయన కెదుగుగా వచ్చి నుంచుని కిచకిచలాడింది.  సాయంకాలానికల్లా కోతి మావూరికి అతిధి అయిపోయింది. రామకోటి రెండోసారి రాస్తున్న రామదాసుగారూ, ఆ మధ్యనే చచ్చి బతికిన గుప్తగారూ, పురాణం చెప్పే శాస్త్రులుగారు, హనుమదుపాసి గౌరిశంకర పార్వతీ పరమేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర్లుగారూ వగైరాలంతా కోతికి భక్తులయినారు.  పిల్లలు పుట్టనివాళ్లు, పిల్లలు దక్కనివాళ్ళూ పొద్దుపోని వితంతువులూ వగైరాలు ఆరోకాలం కింద తయారయింది.

కోతి కలిసొచ్చిందని పుకారు పుట్టింది. కోతి వచ్చిన తరవాత మా వూరికి కలరా రాలేదు. మా వూళ్లో ఇల్లేనకాలలేదు, మా వూరికి ఉప్పెన కూడా రాలేదు. (మావూరికి సముద్రం పాతికమైళ్ల దూరము ఉంటే ఏం. మా తాత అయిదేళ్ల వాడై ఉండగా వచ్చిన బందరు గాలివానకి వరదవచ్చి మావూరి బయటవున్న తాళ్లెక్కితే అంత దూరాన స్పష్టంగా కనిపించిందిట. ఇది మా తాత స్వయంగా చూసిన విషయం)  కోతి బలిసింది మరి. అది ఏ ఇంటో జొరబడి అందిన ఆహారం పుచ్చుకోవటానికైనా హక్కుంది. మా వూరికి పురపాలక సంఘంలేదు గాని ఉంటే ఈ హక్కు తీర్మాన రూపంలో ఇవ్వబడి ఉండేదే.  బీదలూ, సాదలూ, అలగా జనమూ చాటుబాటున కోతిని కొడుతున్నట్లు ఊళ్లో తెలియగానే ఊరంతా అట్టుడికిపోవటమేగాక ఊళ్లో పౌరసభ కూడా ఒకటి జరిపి అందులో కోతిని కొట్టిన వాళ్ల మీద భయంకర నిరసన తీర్మానం కూడా చెయ్య బడింది.  క్రమంగా కోతి తనబలం తెలుసుకోసాగింది. అది మొదట్లో చిన్న పిల్లల్ని మాత్రమే భయపెట్టుతూ ఉండేది. రానురాను అది పెద్దవాళ్లను కూడా భయపెట్టసాగింది. ఎటువంటి విచక్షణా లేకుండా అందర్నీ అటకాయించి పిలకలూ వగైరా పీకసాగింది.

కోతిక్కోపం వచ్చింది. ఉపశాంతికోసం ఓ యజ్ఞమో సప్తాహమో చేతామనుకున్నారు. మావూరి కోటయ్య శ్రేష్టి, యగానికి కావలసిని వస్తువులన్ని తను సరఫరా చేసే షరతుమీద ఓ వంద చందాకూడా వేస్తానన్నాడు. కాని అదిపడలేదు. చందాలు బాగా పోగుకాలేదు.  ఆఖరుకు ఊరిబయట మరో పౌరసభ జరిగింది. అందులో కోతి ఊరికి హానికరమని దాన్ని వదిలించేటందుకు సాంఘిక సేవకులంతా నడుములు కట్టుకోవలసిందని తీర్మానం జరిగింది.  ఈ సభకు వెనుక కమ్యూనిస్టులున్నట్టు వదంతి పుట్టింది. వెంటనే ఊళ్లో మరోసభ చేసి పెద్దలు, కోతిమీద కుట్ర చేస్తున్నందుకు కమూనిస్టుల మీద ఒక నిరసన తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి వోటు చెయ్యటానికి కిసాను పార్టీని, కాంగ్రెసు పార్టీని, హిందు మహాసభనూ, జస్టిసు పార్టీని ఇంకా తదితర హంగులను సభకాహ్వానించారు.  కోతి యథాప్రకారం స్వైరవిహారం చేస్తున్నది.  ఓనాడు షేక్ మస్తాన్ గుడిపక్కగా ఖాళీ ఒంటెద్దు బండి తోలుతూపోతూ పురాణం చెప్పే శాస్తుల్లుగార్ని చూసి, కోతి మాచెడ్డా గడ్బచ్ గాహుంది, చాస్తుల్లుగారు! అన్నాడు.

“ఆ కమ్యూనిస్టులు నీకేమన్నా గడ్డి పెడుతున్నారా ఏం? వాళ్లమాటవిని మాదేముణ్ణి తిడితే నీకు పాకిస్తానిస్తామనుకున్నావుగామాలు?” అన్నాడు శాస్తుల్లుగారు నిప్పులు కక్కుతూ.  “ఈ కాబోతే ముడ్డికింద యేసుక్కూకొంది మారాజ్!” అంటూ మస్తాన్ ఎద్దునదిలించాడు.

ఇంతట అకస్మాత్తుగా కోతి మాయమైంది.  మళ్లీ పౌరసభ జరిగింది. కోతిని మాయం చేసిన వాళ్లమీద నిరసన తీర్మానం చేయబడింది.  కోతిని మాయం చేసింది కమ్యూనిస్టులే అనే తీర్మానం ప్రతిపాదించి, బలపరిచి క్షణంలో నెగ్గించారు. మావూరి పంతులు మాట్టాడుతూ కమ్యూనిస్టుల వల్ల మావూరికి జరుగుతున్న అపచారాలను గురించి ఉపన్యసించి నిర్మాణ కార్యక్రమం గురించి అరగంటసేపు చెప్పి కూచున్నాడు.  కోతి మాలపల్లి చేరగా అక్కడ పోలిగాడు వగైరాలు దాన్ని పట్టుకొని బస్తీకి తీసుకుపోయి అక్కడక్కడ నడుస్తున్న సర్కసువాళ్ల కమ్మినట్టు వదంతిగా ఉన్నదని ఎవరో లేచి అన్నారు.  వెంటనే సభాధ్యక్షుడు లేచి ఇటువంటి దుర్వార్తలు పుట్టిస్తున్నది కమ్యూనిస్టులేనని, మావూరి పౌరులు హరిజనులమీద ఇటువంటి నిందలు ప్రచారం చేయ్యటం ద్రోహమనీ అన్నాడు.  మావూరి పంతులు మళ్లాలేచి హరిజనోద్ధరణ మీద మరో అరగంట మాట్లాడాడు. హరిజనుల్లో కూడా ఇప్పుడిప్పడే కొందరు కమ్యూనిస్టుల మాటలు విని చెడిపోతూ ఉన్నట్టు తెలిసి తన హృదయం దహించుకుపోతున్నదన్నాడు.  అప్పటికే కాలాతీతమైనప్పటికీ, హరిజనులను చెడగొట్టుతున్నందుకు కమ్యూనిస్టుల్ని నిరసించుతూ ఒక పెద్ద తీర్మానం చెయ్యబడింది.“నేను రహస్యంగా అధ్యక్షుడితో, కోతిని వెతికి పట్టుకొచ్చేటందుకొక తీర్మానం చేసి దానికిగాను చందాలు వసూలు చేస్తే ఏం ?” అన్నాను.

“కాలాతీతమైపోయింది,” అన్నాడధ్యక్షుడు.

(ప్రథమ ముద్రణ: మార్చి 1945, పెంకిపిల్ల మాసపత్రిక)

Scroll to Top