బాలభాష (Baala bhasha)

బాలభాష

తెలుగు సాహితీలోకంలో లబ్ధప్రతిష్ఠులు, పండితులు, పరిశోధకులు, ప్రాచీన వాఙ్మయ ప్రియులు అయిన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తెలుగు దేశంలో బాలబాలికలు పాడే పాటలు, పలికే మాటలు, చెప్పుకునే కథలు కొన్నింటిని సేకరించి ‘భారతి’ (1930) లో ‘బాలభాష’ అనే పేరుతో ప్రచురించారు. వారి సంపూర్ణ రచనలను ప్రచురించే ప్రణాళికలో భాగంగా ప్రభాకర పరిశోధక మండలి వారు పై గేయాలను మొదటిసారిగా 1956 లో పుస్తక రూపంలో ఆర్యశ్రీ ప్రచురణాలయము ద్వారా ప్రచురించారు. ప్రభాకరశాస్త్రిగారి కుమారులు, ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి సంపాదకులు, స్వయంగా తమకూ సాహిత్యలోకంలో ఒక స్థానం గల వేటూరి ఆనందమూర్తి గారిని కలిసి ‘ఆంధ్రభారతి’ గూర్చి తెలిపి, ప్రభాకర శాస్త్రిగారి కొన్ని గ్రంథాలను యిందులో ఉంచటానికి అనుమతి కోరినంతనే అనుమతించటమేకాక వారివద్దనున్న అమూల్య గ్రంథాలను మాకిచ్చి మమ్ములను, మా యీ ప్రయత్నాన్నీ ఆశీర్వదించినందులకు మా హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనములు. అంతేగాక తమ రచనలను కూడా కొన్నిటిని ‘ఆంధ్రభారతి’లో వాడుకొమ్మని తెలిపారు. మున్ముందు వీటన్నిటినీ సాహితీప్రియులకు అందుబాటులోకి తీసుకొని రాగలము.బాలభాష పేరిట శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు రచించిన బాల గేయాలు.

చిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార

చిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార!

    అయ్య రారా! చక్కనయ్య రార!

అల్లారు ముద్దుల పిల్లవాఁడా రార!

    అప్ప రారా! కూర్మికుప్ప రార!

రత్నాల చిటిముల్లె రార! నవ్వుంబువ

    తోట రారా! ముద్దుమూట రార!

ముత్యాల క్రోవి రా! ముచ్చట్లదీవి రా!

    పల్కు వెన్నెల చిన్ని చిల్క రార!

కన్నకాచి రార! గారాలకూచి రా!

    నాన్నరార! చిన్నియన్నరార!

ఆడ రార! నవ్వులాడ రారా! పల్కు

    లాడ రార! కుల్కులాడ రార!

శ్రీ సూర్యనారాయణా మేలుకో హరి సూర్యనారాయణా మేలుకో

పుట్టేటి భానుడు  పుష్యరాగపు ఛాయ      

పుష్యరాగము మీద పొంగు బంగరు ఛాయ         

శ్రీ సూర్యనారాయణా మేలుకో

హరి సూర్యనారాయణా మేలుకో

జామెక్కి భానుడు  జాజి పువ్వుల ఛాయ     

జాజిపూవులమీద సంపెంగ పువు ఛాయ  

శ్రీ సూర్యనారాయణా మేలుకో

హరి సూర్యనారాయణా మేలుకో

మధ్యాహ్న భానుడు మల్లెపూవుల ఛాయ  

మల్లెపూవులమీద మంచి వజ్రంపు పువు ఛాయ

శ్రీ సూర్యనారాయణా మేలుకో

హరి సూర్యనారాయణా మేలుకో

మూడు జాముల బాముడు మునగ పూవుల ఛాయ       

మునగపువ్వులమీద ముత్యాలపొడి ఛాయ  

శ్రీ సూర్యనారాయణా మేలుకో

హరి సూర్యనారాయణా మేలుకో

క్రుంకేటి భానుడు  గుమ్మడీ పువు చాయ       

గుమ్మడీపువుమీద కుంకుమా పువు చాయ

శ్రీ సూర్యనారాయణా మేలుకో

హరి సూర్యనారాయణా మేలుకో

ఆయురారోగ్యములు ఐశ్వర్యములనిమ్ము

        శ్రీసూర్యనారాయణా!

మేలుకొలుపు

చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి!

చుక్కల్లో చంద్రుడూ చూడవచ్చాడు.

తెల్లవారొచ్చింది కోడి కూసింది,

చూచేటిఅక్కల్లు చూడరారమ్మ.

ఆడేటి అక్కల్లు ఆడరారమ్మ,

ఆడుకోరారమ్మ అక్కల్లు మీరు.

ఆడేటివారికి అచ్చావుపాలు, పాడేటివారికి పాలు పంచదార.