బాలమురళి కృష్ణ గారి సినీ నేపధ్యం (Bala murali krishna’s cine debut)

సలలిత రాగ సుధారస సారం’ బాల మురళీ గానం’

పూర్వం గంధర్వులు,కిన్నెరులు, కింపురుషులు ఉండేవారని విన్నాం.  అసలు ఉన్నారో, లేరో, మనకు తెలియదు. పూర్వ మహా వాగ్గేయకారులను మనం చూడలేదు. మనకు తెలిసిన సంగీతమూర్తి మంగళంపల్లి బాలమురళీకృష్ణ. వాళ్ళందరూ ఇలాగే ఉంటారేమో, వారే బాలమురళిగా వచ్చారేమో, అనిపిస్తుంది. సంగీతసరస్వతికి ఒక రూపం వస్తే, అదే మంగళంపల్లి బాల మురళీకృష్ణ.  సుమారు ఎనిమిది దశాబ్దాల కాలప్రవాహంలో, సంగీతలోకం లో,మహామహుల మధ్యన నిలబడి, తన్ను తాను విభిన్నంగా, విశిష్టంగా ఆవిష్కరించుకొని, కోట్లాదిమంది సంగీతప్రియుల హృదయాలు దోచుకున్న కృష్ణుడు బాలమురళీకృష్ణ. శాస్త్రీయ సంగీతాన్ని పామరులకు కూడా దగ్గరికి చేర్చి, వారిని సైతం ఆ సంప్రదాయ సాగరంలో ముంచెత్తిన ఏకైక కళామూర్తి బాలమురళి.

సాంప్రదాయ సంగీతాన్ని ప్రజల వద్దకు చేర్చిన మహనీయుడు: – విశృంఖలంగా గమకాలు వేస్తూ, పాడుతున్న ఆ కీర్తనల లోని పదాలు,దాని భావం, వినేవాడికి ఏమాత్రం అర్ధంకాకుండా, ఒక దేహప్రదర్శనలాగా పాడే గాయకుల వల్ల దూరమవుతున్న సంప్రదాయ సంగీతాన్ని, మళ్ళీ ప్రజల వద్దకు చేర్చిన మహనీయుడు ఈయనే. వాగ్గేయకారులు రాసిన ప్రతి కీర్తనలోని ప్రతి అక్షరాన్ని అతి స్పష్టంగా పలికి,అర్ధవంతంగా,భావస్ఫోరకంగా అందించి, రసాన్ని చిలికించినవారిలో అగ్రేసరుడు బాలమురళి. ఈరోజు శాస్త్రీయ సంగీతం జనబాహుళ్యంలో చిరంజీవిగా మిగిలి ఉండడానికి పునాదులు వేసిన నాదబ్రహ్మ ఆయన. జయదేవుడు,త్యాగయ్య, రామదాసు,అన్నమయ్య మొదలు సదాశివబ్రహ్మేంద్రులు వరకూ మహనీయులైన ఎందరో వాగ్గేయకారుల కీర్తనలను రసవంతంగా పాడి, లోకానికి కానుకగా అందించిన మహనీయుడు మంగళంపల్లి. అసాధారణమైన ప్రతిభ, దానికి తోడు అపురూపమైన సృజన, నవీనత, సుమధురమైన గాత్రం, అద్భుతమైన గానం ఆధునికకాలంలో కేవలం బాలమురళి సొత్తు.

కేవలం కొన్ని వేదికలకే పరిమితమైన శాస్త్రీయ సంగీతాన్ని బాహ్యప్రపంచంలోకి తెచ్చి, బహుళప్రాచుర్యం కల్పించిన ప్రజ్ఞాశాలి. అది లలిత సంగీతమైనా,భక్తి సంగీతమైనా, శాస్త్రీయ సంగీతమైనా… అన్నింటికీ సమన్యాయం చేసి, విస్తృతంగా విహరించాడు. భీమ్ సేన్ జోషి వంటి హిందుస్తానీ సంగీతశిఖరాలతో జుగల్బందీలు చేశాడు.  నువ్వా-నేనా అన్నట్లుగా పాడి, వారిని అమితాశ్చర్యంలో ముంచి, కోట్లాదిమందిని మంత్రముగ్ధులను చేసిన ప్రతిభాభారతి బాలమురళి.  సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసి స్వరాలతో ఆడుకున్నారు . తిల్లానాలకు రససృష్టి చేశారు. బాలమురళి గాత్రం నుండి తిల్లానాలు వస్తూ ఉంటే, ఎవరైనా ఒడలు మరచి నాట్యం చెయ్యాల్సిందే. తిల్లానాలకు విన్యాసాలు అందించిన విన్నాణం కేవలం బాలమురళి సొత్తు.

కేవలం గానగంధర్వుడిగానే కాదు రంగస్థలం మీద కూడా రాణించిన నటుడుగా బాలముళి కీర్తిగడించారు. క్రమంగా వెండితెర మీద కూడా దర్శనమిచ్చారు. ఒక సంగీత విద్వాంసుడి నేపథ్యంలో నిర్మించిన ‘సంధ్య గిదేన సిందూరం’ అనే మళయాల చిత్రంలో హీరోగా దర్శమిచ్చిన బాలమురళి ‘చచందనిర్‌’ అనే బెంగాలి సినిమలో, ‘మేఘసందేశం’ తెలుగు సినిమలోనూ కొంచెం సేపు దర్శనమిచ్చారు. ‘భక్తప్రహ్లాద’ సినిమాలో నారదుడిగా ప్రధాన పాత్ర పోషించారు.  ఎ.వి.మెయ్యప్ప చెట్టియార్‌ ఈ సినిమా నిర్మించ తలపెట్టినప్పుడు నారద పాత్రకు గాత్రదానం ఇవ్వలసిందని కోరగా బాలమురళి ఆ పాత్రను తనే వేస్తానని అడిగి మరీ నటించారు. అందులో ‘ఆది అనాదియు నీవే దేవా..నింగియు నేలయు నీవే కావా’, ‘వరమొసగే వనమాలీ నా వాంఛితమ్ము నెరవేరునుగా’, ‘సిరిసిరి లాలి చిన్నారి లాలి నోముల పంటకు నూరేళ్ల లాలి’ పాటలను సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో బాలమురళి ఆలపించారు. నేపథ్య సంగీత విషయానికొస్తే కొన్ని తెలుగు, తమిళ, కన్నడ, మళయాల సినిమాలలో పాటలు పాడారు. బాలమురళి మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు 1957లో అలనాటి నటీమణి ఎస్‌.వరలక్ష్మి, కడారు నాగభూషణం దర్శకత్వంలో ‘సతీసావిత్రి’ సినిమా నిర్మించింది. ఆమె కొంతకాలం బాలమురళి వద్ద సంగీతాభ్యాసం చేసింది. ఆ చొరవతో సత్యవంతుడుగా నటించిన అక్కినేని నాగేశ్వరరావుకు నేపథ్యగానం చేయవలసిందిగా బాలమురళిని కోరింది. ఆ సినిమాలో వరలక్ష్మితో కలిసి బాలమురళి మూడు యుగళ గీతాలను, ఐదు పద్యాలను పాడారు. ‘ఒహో విలాసాల కోవెల..వినోదాల నావలా’, ‘రావేలనో చందమామా దాగదవేలా’, ‘ఎందుకో ఈ ఆనందం ఏనాదితో అనుబంధం’, అనే మూడు పాటలకు స్వరకల్పన చేసి పాడడం విశేషం. 1962లో విడుదలైన ‘స్వర్ణగౌరి’ సినిమాలో నారదపాత్ర పోషించిన వల్లం నరసింహారావుకు ‘జయజయ నారాయణ ప్రభో పావన’ అనే పాటను ‘పాలించు ప్రభువుల పసిపాపలను జేసి’, అనే పద్యాన్ని వెంకట్రాజు సంగీత దర్శకత్వంలో ఆలపించారు. 1963లో రాజ్యం పిక్చర్స్ ‘నర్తనశాల’ సినిమా కోసం సంగీతదర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి ఎన్టీఆర్‌ పోషించిన బృహన్నల పాత్రకు బాలమురళి చేత ‘సలలిత రాగ సుధారస సారం’ పాటను పాడించారు. ఈ పాట నేటికీ రసజ్ఞులను అలరిస్తూనే ఉంది. ‘కర్ణ’ డబ్బింగ్‌ చిత్రంలో సుశీలతో కలిసి ‘నీవూ నేనూ వలచితిమి నందనమే ఎదురుగ చూచితిమీ’ అనే యుగళ గీతాన్ని కూడా ఆలపించారు. బాలమురళి సినిమాల కోసం ఆలపించిన పాటల్లో ‘ఏటిలోని కెరటాలు యేరు విడచివోవు’ (ఉయ్యాల జంపాల), ‘పలుకే బంగారమాయెనా అందాలరామా’ (అందాలరాముడు), ‘మేలుకో శ్రీరామా మేలుకో రఘురామా’, (శ్రీరామాంజనేయ యుద్ధం), ‘మౌనమే నీ భాష ఓ మూగమనసా’ (గుప్పెడు మనసు), ‘పాడనా వాణి కల్యాణిగా’ (మేఘసందేశం), ‘తెరతీయరా తిరుపతి దేవరా’ (శ్రీవేంకటేశ్వర వైభవం) బాగా పాపులర్‌ అయినవిగా చెప్పవచ్చు. ఎన్టీఆర్‌ నిర్మించిన ‘శ్రీమద్విరాట పర్వము’ సినిమాలో బాలమురళి చేత బృహన్నల పాత్రకు ‘ఆడవే హంస గమనా’, ‘జీవితమే కృష్ణ సంగీతమూ’ పాటల్ని పట్టుబట్టి పాడించారు. స్వాతి తిరుణాల్‌ అనే మళయాళ సినిమాలో పాడిన భజన గీతానికి ఉత్తమ గాయకుడిగా బాలమురళి అవార్డు అందుకున్నారు. కె.విశ్వనాథ్‌ రూపొందించిన ‘శంకరాభరణం’ సినిమాలో బాలమురళి పాడాల్సింది. కానీ విదేశీ పర్యటనలో ఉండడంతో ఆ అవకాశం బాలుకి దక్కింది. జి.వి.అయ్యర్‌ నిర్మించిన కన్నడ చిత్రం ‘హంసగీతె’కు తొలిసారి సంగీత దర్శకత్వం నిర్వహించిన బాలమురళీకృష్ణకు ఉత్తమ గాయకుడిగా, ఆ తరువాత వచ్చిన మరో కన్నడ చిత్రం ‘మధ్వాచార్వ’కు ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారాలు లభించటం ఆయన విశిష్ట ప్రజ్ఞకు నిదర్శనాలు. తెలుగులో ‘తోడు’ అనే చిత్రానికి మాత్రమే బాలమురళి సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఇక లలిత గీతాల విషయానికొస్తే రామదాసు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, ‘ఏమీ సేతురా లింగా’, ‘వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట’ వంటి తత్వ గీతాలు బాలమురళి స్వరపొదిలో ఎన్నున్నాయో చెప్పలేం.

Movie: Bhaktha Prahlada

Song :Aadiya Naadiyu

Cast:SV Ranga Rao, Anjali Devi, Roja Ramani

Singer and actor:Bala murali krushna

Music:Saluri rajeswar rao

Movie:Nartanasala

Song:Salalita Raaga Sudharasa

Cast:NTR, Savitri

Singer:Bala murali krushna

Music:Susarla dakshina murthy