బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్లు తొక్కింది గోదారి గంగ

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్లు తొక్కింది గోదారి గంగ

చూపుల్లో ప్రాణాల శబరమ్మ గంగ

కళ్ళల్లో పొంగింది కన్నీటి గంగ

            సీతారామయ్య గారి మనవరాలు సినిమా  ఆంధ్రప్రభ నవలల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న చిన్న నవల ‘నవ్వినా కన్నీళ్లే’ నవల ఆధారంగా తీసింది. ఈ నవలికని స్టేట్ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకట హరగోపాల్ తన భార్య మానస పేరును కలంపేరు చేసుకుని రాశారు. ఆయన వ్రాసిన నవలను సినిమా స్క్రిప్ట్‌గా మలిచి పలువురు దర్శకనిర్మాతల వద్దకు తిరిగారు. చివరకు క్రాంతికుమార్‌ స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా కథ ప్రారంభమైంది. సినిమాలో సీతారామయ్య పాత్ర పోషించిన అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలోనే తొలిగా విగ్గులేకుండా నటించారు. ఈ పాత్రను పోషించేప్పుడు మొదట విగ్గు పెట్టుకుంటానని నాగేశ్వరరావు, లేదు విగ్గు లేకుండానే పాత్రవేయాలని దర్శకుడు క్రాంతికుమార్ అనుకునేవారు. విగ్గుతో షూటింగుకు వస్తే నాకు నా సీతారామ య్య కనిపించడంలేదండీ అంటూ క్రాంతికుమార్ అనేవారు. చివరకు ఈ సినిమా కోసం మళ్ళీ కొత్తగా మేకప్ టెస్ట్ కూడా చేయించుకున్నానని నాగేశ్వరరావు వెల్లడించారు. ఆయన భార్య అన్నపూర్ణ కూడా విగ్గులేకుండానే నటించమని సూచించడం, దర్శకుడి వాదన సహేతుకంగా కనిపించడం వంటి కారణాలతో సమాధానపడి విగ్గు లేకుండానే నటించారు.

            తూర్పు గోదావరి జిల్లా లోని ఒకానొక పల్లెటూర్లో సీతారామయ్య (అక్కినేని) అనే మోతుబరి ఉంటాడు. ఆయన ఇంట్లో పెళ్ళి జరుగుతున్నపుడు ఒక అమ్మాయి ఆ పెళ్ళికి వస్తుంది. చాలా ఏళ్ళ క్రితం భారతదేశం వదిలివెళ్ళిపోయిన సీతారామయ్య కొడుకు కుమార్తె ఆ అమ్మాయి. తండ్రీకొడుకుల మధ్య వచ్చిన అభిప్రాయ భేదం వల్ల తండ్రి కొడుకుతో మాట్లాడటం మానివేయడంతో అతడు అమెరికా వెళ్ళిపోతాడు. చదువుకొనే రోజుల్లో కూడా తండ్రి సాంగత్యాన్ని వదులుకోలేని కొడుకు రావాలని అనుకొంటూ తండ్రి పిలవని కారణంగా రాడు. ఐనా మనవరాలు పెళ్ళికి వచ్చి, తన తల్లి తండ్రులు పని వత్తిడి వల్ల రాలేక పోయారని చెప్తుంది. మనవరాలి పేరు సీత అని తన పేరే పెట్టీనందుకు తాత పరోక్షంలో మురిసిపోతాడు. తన ఎదురుగా పెరిగే వారు అలవరచుకోని సంగీత సంప్రదాయాలు మనవరాలిలో చూసి గర్విస్తాడు. వచ్చిన మనవరాలు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పెంపొందిస్తూ విడిపోయిన చిన్నత్త తాతయ్యల కుటుంబాలను కలుపుతుంది. ఆమెను విడిచి సీతారామయ్య గడపలేను అనుకొనే సమయంలో ఆయన భార్య మరణిస్తుంది. అప్పుడు కూడా రాని కొడుకు మీద కోపంతో మనవరాలిని కూడా వెళ్ళిపొమ్మంటాడు. ఆమె వెళ్ళాక కొడుకు కోడలు అంతకు మునుపే మరణించారని తమ కోసమే ఆమె కొడుకు బ్రతికున్నట్టు నాటకం ఆడిందని తెలిసి ఆమెను వెనుకకు పిలవడంతో కథ సుఖాంతం అవుతుంది.

            ఈసినిమా గొప్పతనం ఏమిటంటే ఎప్పుడు చూసినా ఎదో ఒక సీను హృదయాన్ని మీటుతుంది తద్వారా భావావేశానికి లోనుచేస్తుంది. మనం ఎంతగా కంట్రోల్ చేసుకున్నా ‘సమయానికి తగు పాటపాడేనే’ పాటలో ఎక్కడో అక్కడ మనం కళ్ళు చెమర్చకుండా ఆపలేం. ఈ పాత స్వతస్సిద్ధంగా త్యాగరాజ కీర్తన.  ఆ కీర్తన నుంచి కొంత తీసుకుని సినిమా కధకి తగ్గట్లుగా తాను పూరించుకున్నారు వేటూరి.  తనకు త్యాగరాజ స్వామి మీద కల గౌరవానికి నిదర్శనంగా సినిమా టైటిల్స్ లో ముందుగా ఈ పాటకి త్యాగరాజస్వామి కీర్తనగా చూపించిన తర్వాతే తాను రాసిన పాత్రకి తనపేరు వచ్చేలా చేసేరు. చాలా మంది సినీ సంగీతాభిమానులు సైతం ఈ పాత సాహిత్యం మొత్తం త్యాగరాజ స్వామి రచన అనే అనుకుంటారు.

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా

పరవళ్లు తొక్కింది గోదారి గంగ

పాపికొండలకున్న పాపాలు కరగంగా

పరుగులు తీసింది భూదారి గంగ

జానపదులు పాడే పద ఉచ్ఛారణతో పాట ప్రారంభమవుతుంది. భద్రాచలంలో ఉన్న రామచంద్రుడి పాదాలు కడిగేందుకు  పరవళ్లు తొక్కుతున్నాదట గోదావరి.  అలాగే పాపికొండలకున్న పాపాలు కడిగేందుకు భూదారి వైపు పరుగులు తీస్తున్నాదట.

            ‘సమయానికి తగు పాట పాడేనే’ తో పల్లవి ప్రారంభమౌతుంది.  త్యాగరాజ పంచరత్న కృతుల్లో ఒకటైన “బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా – సమయానికి తగు మాటలాడెనే – దేవకీ వసుదేవుల నేగించినటు – సమయానికి తగు మాటలాడెనే” అన్న కీర్తనలో భాగంగా వస్తుంది.  అయితే సినిమా పాటలో ఆ వెంటనే వచ్చే ‘త్యాగరాజును లీలగా స్మరించునటు’ ఈ కీర్తనకనపడదు.  ‘దేవకీ వసుదేవుల నేగించినటు’ ని మార్చి ‘త్యాగరాజును లీలగా స్మరించునటు’ గా మార్చి తన గీతం త్యాగరాజ స్వామి కీర్తనకు అనుసరణగా అన్యోపదేశంగా చెప్పేరు వేటూరి. కీర్తనలో తరువాత వచ్చే సాహిత్యం “రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు” – దీన్ని ‘ధీమంతుడు ఈ సీతారాముడు సంగీత సాంప్రదాయకుడు’ గా మార్చి కథానాయకుడు సీతారామయ్యని పాటలో ప్రవేశ పెట్టారు.  త్యాగరాజ సాహిత్యంలో తర్వాత వచ్చే “గోపీజన మనోరథ మొసంగలేకనే గేలియు జేసేవాడు” ని కూడా కధకి తగినట్లుగా “రారా పలుకరా యని కుమారుని ఇలా పిలువగ  నోచని వాడు” అని మార్చారు  సీతారామయ్యకి కొడుకుతో మాటల్లేవుకదా మరి.

చిలిపిగ సదా కన్నబిడ్డవలె ముద్దు తీర్చు

చిలకంటి మనవరాలు

సదాగ లయలతెల్చి సుతుండు చనుదెంచునంచు ఆడిపాడు 

శుభ సమయానికి తగు పాట పాడెనే

            ఈ చరణం కూడా వేటూరి రాసిందే.  తాతయ్యకి మనవరాలు ముద్దు.  పైగా చిలక వంటి మనవరాలు.  రాకరాక  వచ్చింది తన ఆటపాటలతో పాటుగా కొడుకు వస్తున్నాడనే శుభవార్తను కూడా తెచ్చింది సీతారామయ్య మనసుకు ఆనందం కలిగించిన శుభ సమయానికి తగిన పాట. 

సద్భక్తుల నడతలిట్లనెనే

అమరికగా నా పూజ కొనెనే  అలుకవద్దనెనే

విముఖులతో చేరబోకుమనేనే వెతగల్గిన తాళు కొమ్మనెనే

దమశమాది సుఖదాయకుడగు

శ్రీ త్యాగరాజ సుతుడు చెంతరాకనే

            ఇది పాట చివరి చరణం.  ఇక్కడ త్యాగరాజ స్వామి సాహిత్యాన్ని యధాతధంగా ఉంచేశారు వేటూరి. బహుశా ఈ సాహిత్యం సందర్భోచితంగా ఉండడమే కారణమేమో!  త్యాగరాజ స్వామి వారి ఆధాత్మిక వేదాంత భావాలను వ్యక్తపరుస్తూ  పాడితే సీతారామయ్య కొడుకుమీద తనకున్న అలాకాని, కోపాన్ని ప్రదర్శిస్తూ పాడేరు.  ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినా తన తండ్రిమీద ఆయన తండ్రికి ఇంకా కోపం కలిగి ఉండటం బాధ కలిగిస్తుంది మానవరాలుకి. అందుకే పాడటం ఆపి, మోకాళ్లపై తల పెట్టుకుని ఏడుస్తుంది.  తాత సీతారామయ్య ఓదార్చబోతే అవి ఆనంద భాష్పాలని చెబుతుంది. సాధారణంగా పాటంటే ఎక్కడ ప్రారంభమైందో అక్కడితోనే ముగుస్తుంది.  ఇది జానపదులు పాడుకునే పదాలతోనే ముగియాలి కదా అందుకే –

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా

పరవళ్లు తొక్కింది గోదారి గంగ

చూపుల్లో ప్రాణాల శబరమ్మ గంగ

కళ్ళల్లో పొంగింది కన్నీటి గంగ

            ఇప్పుడు అందరికి సహజంగా కలిగే సందేహం గోదారి పాటలోకి శబరీ ఎందుకొచ్చింది అని. శబరీ గోదావరికి ఉపనది. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి.  కానీ శబరీ మాత్రం గోదావరిలో కలుస్తుంది. సీతారామయ్య జావితంలో అపశ్రుతి ఏమిటంటే కొడుకు చేతుల్లో తాను వెళ్లిపోవాల్సి ఉండగా కొడుకే తనకన్నా ముందు వెళ్ళిపోయాడు.  ఆ విషయం మనవరాలికి తెలుసు.  అందుకే ఆమె కళ్ళలో గంగ ఉప్పొంగింది.  నిజం తెలియని సీతారామయ్య రాముని కోసం ప్రాణాలు నిలుపుకుని ఎదురుచూసిన శబరీ లాగ కొడుకు రాక కోసం నిరీక్షిస్తున్నారు.

            ‘అరభి’ రాగంలో ఆది తాళంలో త్యాగరాజ స్వామి స్వర పరచిన ఈ కీర్తనకి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కీరవాణి. బంధించిన స్వరకల్పనలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కీరవాణి.  ముఖ్యంగా వాయులీనంతో అద్భుతం చేశారు. సినిమా కదా మొత్తాన్ని అవగాహన చేసుకున్న వేటూరి పాత్రల్లో ఒక్కపాటతో సగం కధ చెప్పేవిధంగా సాహిత్యాన్ని సృష్టించారు.  ఈ సినిమాలో మీనా చాలా బాగా సహజంగా నటించింది.  సినిమా చూసి బయటకొచ్చిన వారికి నిజంగా అక్కినేని, మీనా తాతా మానవరాల్లేమో అనిపించేంత బాగా నటించేరు.

Scroll to Top