నాపేరు అగ్నిష్ట శర్మ. మా గురువుగారి పేరు గిరీశం. బుద్ధునికి బోధి చెట్టు క్రింద జ్ఞానోదయం కలిగితే మా గురువు గారికి తాటిచెట్టు క్రింద జ్ఞానోదయమైంది. మేము ఉంటున్నది ఆంధ్రుల రాజధానిగా ప్రచారంలో ఉన్నఅమరావతికి కొద్ది దూరంలో ఉన్న కనక దుర్గమ్మ గారి నివాస స్ధలమైన బెజవాడ. మా గురువు గారు మాకు విద్యా బుద్ధులు నేర్పేది, జ్ఞాన బోధ చేసేది ‘తాళప్రస్ధ మందిరంలోని కల్లు మండపంలో’ కాబట్టే మాకు కళ్లు తిరిగే జ్ఞానం లభిస్తే మాద్వారా మిగిలిన ప్రజలకు వారి వారి ప్రాప్తజ్ఞత బట్టి కళ్లు, కాళ్ళు కూడా పోయేంత జ్ఞాన సిద్ధి కలుగుతోంది. మా తాళప్రస్ధ సుందరీకరణ జరుగుచున్నందున మేము మా జ్ఞానాన్ని వేరే చోట నేర్చుకోవలసి వస్తోంది. అందులో భాగంగా మా గురువు గారికి సమకాలీన స్నేహితులైన ‘చయనులు’ గారిచే నిర్వహించబడుచున్న “సురప్రాప్తి” సమశీతోష్ణ మందిరంలో మాకు విద్యాబోధన జరుగుతోంది.