చందమామ… అందాల మామా!
‘మంచి మనసులు’, ‘మూగమనసులు’వంటి అమోఘ విజయం సాధించిన చిత్రాల తరువాత బాబూమూవీస్ వారు అందరూ కొత్త నటులతో ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో రంగుల్లో నిర్మించబడ్డ మూడవ చిత్రం 1965లో విడుదలైన ‘తేనె మనసులు’. ఒక అమ్మాయికి పెళ్ళిచూపులు జరిగితే, ఏ పక్కింటి అమ్మాయో వచ్చి ఎలా జరిగింది పెళ్ళిచూపుల తతంగం? అని అడిగితే సిగ్గుపడుతూ, కాబోయే ఆ పెళ్లికూతురు చెప్పే సమాధానామే ఈ పాట. కాకపోతే పక్కింటి అమ్మాయికి బదులు చల్లని చందమామ ఉంటుంది మూగగా ముసిముసిగా నవ్వుతూ ఆ మామను చూసి సిగ్గుతో చెప్పే వివరాలన్ని ఈ పాటలో ఆవిష్కరింపబడ్డాయి.
పెళ్లి చూపులు జరిగేక,అబ్బాయి నచ్చితే అమ్మాయి మనుసులో ఆతృతని తెలియ చేసే విధంగా సాగిపోతుంది ఈ పాట. ఈ సినిమాకి సంపాదకీయానికైనా సమ్మోహనపరిచే బాణి ఇవ్వగలిగే చందమామంత అందమైన మామ మహాదేవన్ సంగీతం. ఆయన… కవికి ట్యూన్ ఇవ్వడం మహాపాపం అని నమ్మిన బోళా సంగీత మహా(దేవుడు) దేవన్. పెళ్ళిచూపులయ్యాక అమ్మాయి మనసు ఎలా ఉంటుందో తెలియచేసే విధంగా పాట కావాలన్నారు ఆదుర్తి వారు. రాయాల్సిందేమో ‘మనసు కవిర్షి‘. ఆయనే ‘ఆచార్య ఆత్రేయ‘గా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులుగారు. ఆత్రేయ గురించి ఏం చెప్పను. నిముషం సుఖపడితే నెలరోజులు కన్నీళ్లు, ఒక్కసారి నవ్వితే – వందసార్లు ఏడ్పులు- రాయక నిర్మాతలను – రాసి ప్రేక్షకులను ఏడిపించడం వినడమే కాని నేను చూడలేదు కానీ – రాస్తూ – ఏడుస్తున్నప్పుడు చూశాను అంటూ ఆత్రేయ పాట నాతో సంభాషణ మొదలెట్టింది. అంతేకాదు ఆత్రేయ గారి గురించి ఇలా చెప్పింది. ‘‘దేవుడు – దయ్యము నాలో ఆవాసము సేయుచుండి అటునిటు లాగన్, జీవితమతి సంకులమై నావికుడే లేని నావ నడకలు నడిచెన్, …అని తన జీవితపు ప్రయాణ నిడివి సారాంశాన్ని చిన్ని పద్యంలో నిజాయితీగా నిర్వచించిన బ్రష్ట యోగి’’ – అంది. ‘ఆత్రేయ జీవితం ఇంత తెలిసినట్టు మాట్లాడుతున్నావు – నీవు ‘మనసు గతి ఇంతే’ పాటవా అన్నాను. ‘కాదు’ అంది. శ్రీశ్రీ రాశారని భ్రమపడిన ‘కారులో షికారుకెళ్లె’ పాటవా అన్నాను. మళ్ళీ ‘‘కాదులే’’ అంది. ‘ఎవరీ పాట’ అని నాలో ఆలోచనలు పల్టీలు కొడుతుండగా నా మీద జాలిపడి నీ ఊహకందను గానీ, తేనె మనసులు‘ సినిమాలో ‘చందమామా అందాల మామా’ పాటను అంది.
‘ఔరా’ అనుకున్నాను. ‘పెళ్లిచూపుల్లో ఎందుకు నచ్చాడో ఆ నచ్చిన తనతో నా సహజీవనమెపుడు…’
అనే భావనను చందమామ కేంద్రబిందువుగా చెప్పాలన్నది ఆత్రేయ ఉద్దేశ్యం. ఆత్రేయ కన్నుపెన్ను సున్నితపు త్రాసు వంటివి. కుప్పలు కుప్పలుగా గుప్పించదు. ఒక్కో అక్షరాన్ని తన నెత్తురులోనో- కన్నీళ్లలోనో అచ్చుబోసి తీసి పదాలుగా పేర్చడం ఆత్రేయ అలవాటు. మెదడులో అల్లుకుని – తెంపేసి – మళ్లీ మళ్లీ… ఇలా కాగి కాగి… ఆగి ఆగి… వేగి వేగి… రాస్తాడు. పాట కోసం తపిస్తున్నాడు ఆత్రేయ… నీ ఎదుట నేనున్నాను. నన్ను నువ్వుచూడట్లేదు. నా గురించి ఒక్కసారి నీ మనసు పెట్టి ఆలోచించావంటే నువ్వు రాయగలవు. నన్ను చూడు పాటని నాతో మొదలెట్టు అని చందమామ ప్రోత్సహించేడు. అంతే ఆశ్చర్యం!!క్షణంలోఅల్లుకుపోయాడు.
‘‘చందమామ… అందాల మామా!
నీ ఎదుట నేను – వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు…’’
తెనుగు సినీ పాటల పూదోటలో ఇలాంటి సన్నివేశానికి ఇంతకంటే అపురూపమైన పల్లవి మరొకటి లేదని నా అభిప్రాయం. చంద్రుడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, అటు ప్రేయసికి, ఇటు ప్రియునికి దగ్గరగా కనిపిస్తాడు. ‘అటు తన ఎదురుగా, ఇటు నా ఎదురుగా ఉన్న నువ్వు మా ఎదురుగా ఎప్పుడుంటావు?’ అని అడుగుతుంది కథానాయిక. ‘‘మేమిద్దరం ఎప్పుడు కలుస్తాము’’ అనే విషయాన్ని సినిమాలో ఇంత అందంగా ఇంత కవితాసుందరంగా చందమామను అడగడం నిజంగా చందమామంత అందంగా ఉంది కదూ!
పెళ్లిచూపులకు వారొచ్చారు
చూడాలని నే ఓరగ జూశా
వల్ల మాలిన సిగ్గొచ్చింది
కన్నుల దాకా కన్నులు పోక
మగసిరి ఎడదనే చూశాను
తలదాచుకొనుట కది చాలన్నాను
ఇక తొలి చరణం ఎంత మహాద్భుతంగా, మహిళా మనస్సును ఎంత సున్నితంగా రాశాడో చూడండి. చాలామంది యువకులకు తెలియనిది ఏంటంటే, యువతులు… ఆత్రేయ కాలంలోనైనా ఈ కాలంలోనైనా యువకుల సౌందర్య సాంద్రత కన్నా వారిచ్చే ‘భద్రత’ను ఎక్కువ కోరుకుంటారనేది. ఆ విషయాన్ని స్త్రీ హృదయాన్ని ఆపాదించుకుని గమనిస్తే ‘గీత రచయితలు’ పాత్ర హృదయంలోకి వెళ్లి ఎలా పాటని ఆవిష్కరించారో తెలుస్తుంది. ‘పెళ్లిచూపులకు వారొచ్చారు (ఇప్పుడైతే వాడొచ్చాడని రాస్తాం). చూడాలని నే ఓరగ చూసా వల్లమాలిన సిగ్గొచ్చింది – కన్నుల దాక కన్నులు పోక (కళ్లలో కళ్లుపెట్టి చూళ్లేకపోయా) మగసిరి ఎడదనె చూశాను – జీవిత గమనంలో ప్రయాసలు – పరుగులు – అలసటలు – ఆవేదనలు – ఆశాభంగాలు – ఆటుపోట్లుంటే ఏమి… తలదాచుకునేటంత విశాలంగా ఉంది అతని మగ ఠీవి చూపే ఛాతీ. తలదాచుకొనుటకది చాలనుకున్నాను’- అని ముగిస్తాడు.
పురుషుని మానసిక వయస్సు కన్నా స్త్రీ ఎక్కువ పరిపక్వత కలిగి ఉంటుందని మానసిక శాస్త్రవేత్తల పరిశోధన. ఆ పరిణతి చెందిన స్త్రీ మనస్సును సాధారణ సంభాషణా రూపంలో చరణం రాసి జనాన్ని తన చరణాగతులను చేస్తాడు.
పెళ్ళిచూపులలో బిగుసుకొని
పేరేమి, చదువేమి
నను ప్రేమిస్తావా వయసెంతా?
అని అడిగారా అసలొచ్చారా
నాలో వారు ఏం చూశారో నావారయ్యారు
నాలో వారు ఏం చూశారో నావారయ్యారు
అందులకే మా ఇద్దరి జంట అపురూపం అంటా
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు
చల్లని వెన్నెల దొరవంటారు తీయని నవ్వుల సిరివంటారు
ఆ వెన్నెలలోని వేడిగాడ్పులు నవ్వులలోని నిప్పురవ్వలు
అనుభవించి అనమంటాను
వయసుకు వైరివి నీవంటాను
నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు
‘పెళ్లిచూపులను కలుసుకొని ఊరేది? పేరేది? నను ప్రేమిస్తావా వయసెంత?’లాంటి పదాలు చందమామ ముందు ఆ అమ్మాయి చూ చూపించిన భావప్రకటన ఎంతో ముచ్చటగా ఉంటుంది. ‘‘నాలో వారు ఏం చూశారో నావారయ్యారూ అందుకనే మా ఇద్దరి జంట అపురూపం అంట’’ లాంటి మాటల్లో అంతటి గొప్పవాడు. నాలాంటి సామాన్యురాలిని ఇష్టపడటం ఏ జన్మపుణ్యమో కదా అన్న ఆలోచన బయటపడుతుంది. ఇది పాటో, మాటల మూటో అర్ధంకాని అద్భుతమే ఈ పాట! చిన్ని మాటలతో పాటలల్లే ప్రేమ సాహితీ సుగంధం ఆత్రేయ కలంనుండి జాలువారిన మంచిముత్యం ఈ పాట! తెరపై సంధ్యారాణిపై చిత్రీకరించిన ఈ పాట‘చందమామ.. అందాల మామా’అన్న సాకీతో ప్రారంభమవుతుంది. థియేటర్ అంతా నిశ్శబ్దం అయిపోతుంది. నాకెంతో ఇష్టం! మామ మహదేవన్ ఏ పూనకం వచ్చి స్వరసమర్పణ చేసాడో తెలియదు కాని, అంత మధురాతి మధురం ఈ పాట! తన గొంతు కండరాల్లో ఏ అమృతం నింపుకుని పుట్టిందో తెలియదు కాని ఆ సుశీలమ్మ గానం ఈ పాటకు ఊపిరిపోసింది. అంతా కొత్తవారైనా గాని ఈ చిత్రం ఆదుర్తి, మామ, సుశీల, ఘంటసాల, ఆత్రేయల సాహితీ సంగీతాల సంగమానికి ఒక అపురూపమైన ఉదాహరణగా నిలిచింది. కొత్త నటిని అన్న జంకు లేకుండా సంధ్యారాణి సిగ్గు ఒలకబోసే అభినయం ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. అందుకే ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టమని అనుకుంటాను.