ఛందస్సు (Chandassu)

ఛందస్సు

షడంగములలో ఛందశ్శాస్త్రమొకటి. ఛందస్సు అనగా పద్య లక్షణము. పద్య లక్షణమును తెల్పు శాస్త్రమును ఛందశ్శాస్త్ర మందురు. కొన్ని అక్షరములు చేరి గణములగును. కొన్ని గణములు చేరి ఒక పద్యమగును.

గురు లఘువుల కలయికచే గణము లేర్పడును. ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు, లఘువు. గురువుని ‘U‘ తోటీ, లఘువుని ‘|‘ తోటీ సూచిస్తారు.  హ్రస్వాక్షరములు లఘువులు (తేల్చి పలుకునవి).  దీర్ఘాక్షరములు గురువులు (ఊది పలుకునవి).  ఒక క్షణములో నాల్గవ భాగము మాత్ర.  ఒక మాత్ర కాలము లఘువు.  రెండు మాత్రల కాలము గురువు.  మూడు మాత్రల కాలము ప్లుతము.

గురువుల గుర్తించు విధానము:-

  1. దీర్ఘములన్నియు గురువులు. కా – రా – పా మొదలైనవి. 
  2. బిందువుతో కూడినవి గురువులు. కం – రం – పం మొదలైనవి.
  3. విసర్గముతో కూడినవి గురువులు.  కః – దుః – మొదలైనవి. 
  4. పొల్లుహల్లులతో కూడి ఉన్నవి గురువులు. కన్ – రన్ – మన్ మొదలైనవి. 
  5. ఐ – ఔ లతో కూడి ఉన్నవి గురువులు.  కై – రై – రౌ – పౌ మొదలైనవి. 
  6. ద్విత్వాక్షరమునకు ముందున్నవి గురువులు.  అద్దము – గుఱ్ఱము.  ఇందు అ – గు – గురువులు. 
  7. సంయుక్తాక్షరమునకు ముందున్నవి గురువులు.  రక్తము – ధర్మము.  ఇందు – ర – ధ గురువులు.  మిగిలినవి లఘువులు. 

సిద్ధసమాసము లందు మాత్రము ఉత్తర పదము మొదట నున్న హల్లుల సంయోగము, పూర్వపదము తుది అక్షరమునకు గురుత్వము కల్గింపగలదు. శక్ర శ్రీ కిన్ – ఇది సిద్ద సమాసము.  ఇందు ఉత్తరపదము మొదటి అక్షరమగు శ్రీ అనుహల్లుల సంయోగము పూర్వ పదాంత అక్షరమగు క్ర అనుదానికి గురుత్వము కల్గింప జాలినది.  సాధ్య ఆది అన్యసమాసమునకు అట్లు కాదు.  శక్రుని శ్రీకిన్ – ఇది సాధ్య సమాసము.  ఇందు ఉత్తర పదాధ్యక్షరమగు శ్రీ అను హల్లుల సంయోగము పూర్వ పదాంతాక్షర మగు ‘ని’ అనుదానికి గురుత్వము కల్గింపదు.  చెట్టు ప్రకాండము – ఇది మిశ్ర సమాసము. ఇందు ‘ప్ర’ హల్లుల సంయోగము ‘ట్టు’ అను దానికి గురుత్వము కల్పింపదు.  ఋ అచ్చుతో ఉన్న అక్షరాలూ, వాటి ముందరి అక్షరాలూ (కృ, మొదలగున్నవి) లఘువులు మాత్రమే.  ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే. అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.   

అక్షరాల గుంపును గణము అని అంటారు.  ఇవి నాలుగు రకాలు

  1. ఏకాక్షర గణాలు
  2. రెండక్షరాల గణాలు
  3. మూడక్షరాల గణాలు
  4. నాలుగక్షరాల గణాలు

1. ఏకాక్షర గణాలు:- ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది గురువు లేదా లఘువు కావచ్చు. ఉదా: శ్రీ, (U), సై,(U), లం (U).

2. రెండక్షరాల గణాలు:- రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1. లలము 2. లగము (వ గణం) 3. గలము (హ గణం) 4. గగము.  లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు.  లగ లేదా వ IU ఉదా: రమా; గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ; గగ UU ఉదా: రంరం, సంతాన్. 

3. మూడక్షరాల గణాలు:- ఇవి మూడక్షరాల కలయికతో ఏర్పడేవి.  ఈ వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. “య మా తా రా జ భా న స ల గం” యగణం కావాలంటే వాక్యంలో ‘య’ తో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. ‘య’ తో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా – లఘువు, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా – UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు.

4. నాలుగక్షరముల గణములు:- నగణముపై లఘువు – నలము ||| + | = సరసము. నగణముపై గురువు – నగము ||| + U = సరసుడా; నగణముపై లఘువు – పలము ||U + | = రఘురామ.

అన్ని గణాలు:-  ఆది గురువు  గణము UII, మధ్య గురువు  గణము IUI, అంత్య గురువు  గణము IIU, సర్వ లఘువులు  గణము III, ఆది లఘువు  గణము IUU, మధ్య లఘువు  గణము UIU, అంత్య లఘువు  గణము UUI, సర్వ గురువులు  గణము UUU.

ఉపగణాలు:- ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు

  1. సూర్య గణములు
  2. ఇంద్ర గణములు
  3. చంద్ర గణములు

1. సూర్య గణములు:- 1. న = న = III; 2. హ = గల = UI

2. ఇంద్ర గణములు: – 1. నగ = IIIU; 2. సల = IIUI; 3. నల = IIII; 4. భ = UII; 5. ర = UIU; 6. త = UUI

3. చంద్ర గణములు:- 1. భల = UIII; 2. భగరు = UIIU; 3. తల = UUII; 4. తగ = UUIU; 5. మలఘ = UUUI; 6. నలల = IIIII; 7. నగగ = IIIUU; 8.నవ = IIIIU; 9. సహ = IIUUI; 10. సవ = IIUIU; 11. సగగ = IIUUU; 12. నహ = IIIUI; 13. రగురు = UIUU; 14. నల = IIII

పద్యములు:- పద్య లక్షణములను బట్టి  పద్యములను మూడు రకములుగా విభజించారు.  అవి

  1. వృత్తములు
  2. జాతులు
  3. ఉప జాతులు