చికిలింత చిగురు

అక్షర మర్మయోగి అద్భుత ప్రయోగం ‘చికిలింత చిగురు’

లైలా మజ్ను, దేవదాసు, అనార్కలి వంటి విషాదాంత సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. దానికి కారణం అవి బాగా ప్రాచుర్యం ఉన్న కథలు కావడమే. అయితే మున్నెన్నడూ వినని, చూడని కథను సినిమాగా మలిచి దానిని విషాదాంతం చేసి విజయం సాధించడమనేది చిన్న విషయం కాదు. అటువంటి సినిమాలు నిర్మించేందుకు గుండె ధైర్యం కావాలి. అలాంటిదే డి.ఎల్‌గా పేరొందిన ద్రోణావజ్ఝుల లక్ష్మీనారాయణ ‘దేవదాసు’ సినిమా తరువాత నిర్మించిన ‘చిరంజీవులు’ చిత్రం. ఈ సినిమాలోనే మల్లాది రామకృష్ణ శాస్త్రి అటు సంభాషణల రచనలోను, ఇటు పాటల రచనలోనూ విశ్వరూపం చూపించారు.

          చిరంజీవులు సినిమా గురించి తెలుసుకునే ముందు నిర్మాత డిఎల్‌ని గురించి, అతని వినోదా సంస్థను గురించి తెలుసుకోవాలి. వినోదా…నలుగురు స్నేహితులు నెలకొల్పిన చిత్ర నిర్మాణ సంస్థ. ఆ నలుగురు ప్రొడక్షన్‌ మేనేజర్‌ ద్రోణావజ్ఝుల లక్ష్మీనారాయణ (డిఎల్‌), నృత్యదర్శకుడు వేదాంతం రాఘవయ్య, రచయిత సముద్రాల సీనియర్, సంగీత దర్శకులు సి.ఆర్‌. సుబ్బురామన్‌. వీరికి తెరవెనుక అదృశ్య హస్తం బెజవాడ వినోదా టాకీస్‌ అధినేత బాబు. అక్కినేని, అంజలీదేవి జతగా వీరు తొలిసారి ‘స్త్రీ సాహసం’ సినిమా నిర్మించారు. ఆ సినిమా విజయవంతమైంది. తర్వాతి ప్రయత్నంగా శరత్‌ నవల దేవదాసును సినిమాగా మలచాలని సంకల్పించారు. అక్కినేని, సావిత్రిలతో సినిమా నిర్మాణం మొదలైంది. కానీ సినీ పండితుల సలహాల దృష్ట్యా దేవదాసును పక్కనబెట్టి ‘శాంతి’ అనే చిన్న బడ్జెట్‌ చిత్రాన్ని తీశారు. అది ఓ మోస్తరుగా ఆడింది. వేదాంతం రాఘవయ్య, సముద్రాల, సుబ్బురామన్‌ ముగ్గురూ తమ భాగస్వామ్యాన్ని వదలుకుంటామంటే సరేనని చెప్పి, డిఎల్‌ ఒక్కడే దేవదాసు సినిమా పనిపట్టారు. అయితే డిఎల్‌ సలహాను అనుసరించి ఆ ముగ్గురూ దేవదాసు సినిమాకు పనిచేశారు. సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయింది ఆ సినిమా తర్వాత గురజాడ నాటకం ‘కన్యాశుల్కం’ నిర్మించారు. దాని తరువాత వచ్చిందే ‘చిరంజీవులు’. దేవదాసు లాగే ఈ సినిమా కూడా విషాదాంతమైనా ప్రేక్షకులు ఆదరించి విజయాన్ని అందించారు.

          ఒక పల్లెటూరులో శారద (బేబి శశికళ-జమున), మోహన్‌ (మాస్టర్‌ బాబ్జి-ఎన్‌.టి.రామారావు) అనే ఇరుగు పొరుగు పిల్లలుంటారు. శారద తండ్రి రాయుడు (సి.ఎస్‌.ఆర్‌) బడిపంతులు. మోహన్‌ తండ్రి రామదాసు (బి.ఎన్‌.ఆర్‌) మిఠాయి వ్యాపారస్తుడు. ఇద్దరూ మిత్రులే. శారద సవతి తల్లి గోవిందమ్మ (ఛాయాదేవి) గయ్యాళి. ఆమె తమ్ముడు రత్నం (పేకేటి) రౌడీ. శారద-మోహన్‌ల అన్యోన్యతను భరించలేడు. ఈ పిల్లలిద్దరూ బడికి వెళ్తూ, తోవలో మెట్ల మీద వున్న వేణుగోపాలస్వామికి మొక్కి నైవేద్యం పెట్టి వెళ్లేవారు. ఆ గుడి ముందు ఆడుతూ, పాడుతూ పెరిగి పెద్దవారవుతారు. పొరుగూరిలో తిరునాళ్లు జరుగుతూ వుంటే శారద-మోహన్‌లు వస్తాదు రంగయ్య (మహంకాళి వెంకయ్య) కూతురు జానకి (బాలసరస్వతి)ని వెంటబెట్టుకొని తిరునాళ్లకు వెళ్తారు. శారద-మోహన్‌లకు పెళ్లి నిశ్చయమౌతుంది. శారదకు నగలు కొనేందుకు మోహన్‌ బస్తీకి వెళ్తే, రత్నం రౌడీలను పురమాయించి మోహన్‌ను కొట్టిస్తాడు. తిరునాళ్లలో పరిచయమైన డాక్టర్‌ కృష్ణ (గుమ్మడి) మోహన్‌ను తన నర్సింగ్‌ హోమ్‌లో ఉంచి చికిత్స అందిస్తాడు. రత్నం, శారదతో మోహన్‌ పెళ్లి చెడగొట్టి కృష్ణ సంబంధాన్ని ఖాయ పరిచేలా చేస్తాడు. విధిలేని పరిస్థితుల్లో శారద కృష్ణతో పెళ్లికి ఒప్పుకుంటుంది. ఈలోగా స్పృహలోకి వచ్చిన మోహన్‌ పెళ్లి విషయం గుర్తుకొచ్చి ఆసుపత్రి నుంచి వేగంగా వూరికి వెళుతూ ప్రమాదానికి గురై చూపు కోల్పోతాడు. శారదకు వేరొకరితో పెళ్లయిందని తెలిసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోబోతుండగా మరలా కృష్ణ కాపాడి తన ఇంటికి తీసుకొని వస్తాడు. అది చూసి శారద కుమిలిపోతుంది. కృష్ణ శారద పేరును ముద్దుగా రాధా అని మార్చడంతో మోహన్‌ శారద అని తెలుసుకోలేపోతాడు. శారద మోహన్‌కు సపర్యలు చేస్తూ ఉంటుంది. కొన్నాళ్లకు మోహన్‌కు చూపు వస్తుంది. తనకు సేవలందించిన రాధ అనే శారదకు కృతజ్ఞతలు చెప్పాలని గుడికి వెళ్లిన మోహన్‌కు ఆమె మొహం చాటేస్తుంది. ఆవేదన నిండిన గుండెతో పల్లెటూరికి వచ్చేస్తాడు. సినిమా అనేక మలుపులు తిరుగుతుంది. రత్నం, శారదను కృష్ణ అనుమానించేలా చేస్తాడు. రత్నం చర్యకు భరించలేక వ్యధతో శారద ఆత్మహత్య చేసుకుంటుంది. మరోవైపు మోహన్‌ గాలివానలో చిక్కుకొని తనపై పెద్ద చెట్టు విరిగిపడగా ప్రాణం విడుస్తాడు. అటు శారద చేతిలో, ఇటు మోహన్‌ చేతిలో వున్న బొమ్మలు వారు చిరంజీవులని సూచిస్తూ మిగిలిపోతాయి. అంతటితో ఈ విషాదాంత సినిమాకు తెర పడుతుంది. ఇందులో గుమ్మడి అక్క అఖిలాండమ్మగా సూర్యకాంతం, ఇతర పాత్రల్లో బాలకృష్ణ, డబ్బాచారి నటించారు. బేబీ శశికళకు ఇదే తొలి చిత్రం. తదనంతర కాలంలో శశికళ భాగ్యరేఖ, దొంగల్లో దొర, శభాష్‌ రాముడు, వెలుగునీడలు వంటి సినిమాల్లో బాలనటిగా నటించి ఇప్పుడు లండన్‌లో స్థిరపడింది.

            చిరంజీవులు సినిమాకి మల్లాది రామకృష్ణ శాస్త్రి మాటలే కాదు పాటలన్నిటినీ రాశారు. వాటిలో సాహిత్యం ఎంత విలువైనదో ఘంటసాల అందించిన సంగీతం కూడా అంతే అమూల్యమైనది. ఎన్టీఆర్‌, జమున అభినయించిన ‘చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు’ యుగళ గీతాన్ని ఘంటసాల, లీల ఆలపించారు. పల్లెపదాల తీయందాన్ని ఒలికించిన ఈ పాటలో మల్లాది భావుకత అద్భుతం. చికిలింత, గువ్వకన్నురైక వంటి పదాలు వాడి పాటకు అందం తీసుకొచ్చారు. తిరునాళ్లకు వెళ్లి బండితో తిరిగి వస్తూ పాడుకొనే పాట ఇది.

చికిలింత చిగురు సంపంగి గుబురు

చిన దాని మనసు చినదాని మీద మనసూ

మనసైన చినదానికి అందానికి…

కనుసైగ మీద మనసు

          మనసైన చినదాని మీద మనసుపడ్డ పాట రాయాలి.   మనసంటే అందరికి తెలుసు. మనసంటే ఇష్టమనే అర్ధం ఉందని కూడా మనలో కొంతమందికి  తెలుసు.  తను అలంకరించుకొని, తన గదినీ, పానుపునూ అలంకరించి విరహంతో ఎదురుచూసే అభిసారికల్లాగా సుకుమారమైన ఎండకన్నెరుగని సుందరమైన తెలుగు పదాలు మల్లాది చూపు కోసం ఎదురుచూస్తుంటాయి.  మనసు గురించి చెప్పుకుంటే ‘గిలిగింత’ ‘పులకింత’… ఇలా బిందుపూర్వక తకారంలో చిన్న చిలిపిదనం ఉంటుంది. చిలిపిలోని ‘చి’ కూడా… గారాబంలోనూ, మారాంలోనూ, ఇష్టమైన వారిముందు ఒలకబోసే సిగ్గుతనంలోనూ, ‘చి’ అక్షరం భలే ముచ్చటగా వినవేడుకగా ఉంటుందని అక్షరమర్మయోగి మల్లాదికి తెలియదా!  చికిలింత’ అంటే మనోహరమైన, తేట అయిన, స్వచ్ఛమైన అనే అర్థంలో మొదలెట్టారు మల్లాది.  గుబురు అంటే సమూహం మరో అర్ధం దాపు.  ఇక్కడ మనసును నిర్వచించడానికి మల్లాది ఎంచుకున్న పదాలు చూడండి. తనకిష్టమైన అమ్మాయి మనసు ఏ విధంగా ఉందని వర్ణిస్తున్నాడంటే నాయకుడు తాను ప్రేమించిన ఆ చిన్నదాని మనసు చిక్కిలింత చిగురు లా లేతనైనది, అతి సున్నితమైనది, సంపంగి గుబురులా గుబాళిస్తూ ఉన్నది. అటువంటి చినదాని మనసు మీద తనకు మనసయిందట. చిన్నదాని మనసు, చినదాని మీద మనసు రెండు అక్షరాలు మీద అని మాత్రం చేర్చి రెండు విభిన్న భావాలను వ్యక్తం చేస్తారు కవి.  చిన్నవాడు మనసు పడిన ఆ చిన్నదానికి, ఆ అందమైనదానికి చిలిపిగా ఆమె కోసం అతను చేసే  కనుసైగల మీదే మనసయిందట. తన కోసం ప్రియుడు ఆరాట పడుతూ, కను సైగలతో తనను పిలుస్తూ, ప్రేమని కొసరే క్షణాలకోసం ఆమె ఎదురు చూస్తుంది. ఆ విషయాన్ని ఎంత అందమైన వాక్యాలతో చెప్పిందో.అంటూ పల్లవిని పరిఢవిల్లింప చేసేరు.  ఇప్పుడింక మొదటి చరణం.

చెంపకు చేరడేసి కన్నులున్న చిన్నది

చిన్నదాని సిగలో రేకలెన్నో

గవ్వకన్ను రైక మీద చుక్కలెన్నో

ఎన్నుకో వన్నె లెన్నుకో చిన్నె లెన్నుకో

వన్నెచిన్నె లెన్నుకో ఎన్నికైన చిన్నవాడా

          అమ్మాయి కళ్ళు చెంపకు చారెడేసి ఉంటే ఎంత అందమో చెప్పనక్కర్లేదు. ఆమె సిగలో పెట్టుకున్న మొగలి రేకులు అతన్ని మత్తుకొలుపుతున్నాయి. ఆమె వేసుకున్న గువ్వకన్ను రవిక మీద ఉన్న చుక్కలు ఎన్నో అడుగుతున్నాడు. గువ్వకన్ను రవిక అనేది కృష్ణాజిల్లాకు  సంబంధించిన ఒక వస్త్ర విశేషం అట. చిన్న చిన్న చుక్కలు అద్దిన రవిక ను గువ్వకన్ను రవిక అనేవారట.అలా రవికను వర్ణిస్తున్నాండంటే అతను ఆ గువ్వకన్ను రవికమీద చుక్కులను లెక్కపెట్టే సాకు మీద ఆమె ఒంపు సొంపులను గమనిస్తున్నాడని కవిగారు చిలిపిగా చెప్పక నే   చెప్పిన మాట. మల్లాది వారు ఇలా  కృష్ణా జిల్లా ప్రయోగాన్ని  ఇక్కడ అందంగా వేసినట్టున్నారు. ఆమె అందాన్ని వర్ణించడం అయింది.  అతను రేకలెన్నో, చుక్కలెన్నో అంటూ కవ్విస్తూ ఉంటే ఆమెకీ చిలిపిగా జవాబు చెప్పబుద్ధి అయింది. 

ఎన్నుకో…వన్నెలెన్నుకో……చిన్నెలెన్నుకో 

వన్నెచిన్నెలెన్నుకో – ఎన్నికైన చిన్నవాడా….

పైరు గాలి ఘుమ ఘుమలో చెంగావి చెంగు రిమరిమలో  అంటుంది. 

ఇక్కడ ‘ఎన్నుకో’  ప్రయోగం  ఎంత అందంగా ప్రయోగించారో చూడండి.  ముందు ఎన్నుకో….అంటే లెక్క పెట్టుకో అనే అర్థంలో. సిగలో రేకులెన్ని, రైకమీద చుక్కలెన్ని అని అడుగుతున్నందుకు అంటోంది లెక్కపెట్టుకోమని. అలాగే తనను ఎన్నుకో అనే అర్థం కూడా ఇందులో ఉంది.  వన్నెలెన్నుకో…తన చక్కదనంలో వెల్లివిరుస్తున్న అనేక వర్ణాలను – వన్నెలను  లెక్కపెట్టుకోమంటుంది.  చిన్నెలెందుకో…..తన భావాలలో మారుతూ ఉండే ఆ కళలన్నీలెక్క పెట్టుకోమంటోంది.   వన్నెచిన్నెలేలుకో అంటూ తన సోయగంలోని వన్నెలను చిన్నెలను ఏలుకోమని, స్వంతం చేసుకోమని –  ఎన్నికయిన చిన్నవాడా అంటూ తన ప్రియుడిని సంబోధిస్తుంది.  చల్లగా వీచే  పైరగాలిలో షికారు చేస్తూ పారవశ్యంతో పడుచువాళ్ళు పాడుకుంటున్న పాట ఇది.  కనుకనే పైరుగాలి  ఘుమ ఘుమలతో  చెట్టూ- చేమ, తోటా అన్నింటిపైనుంచివీచే గాలి అనేక రకాల పరిమళాలను మోసుకొచ్చే ఆ  పైరుగాలి ఎంత ఘుమఘమను పంచుతోందో. మనసును ఎంత ఉల్లాసపరుస్తోందో.  అమ్మాయి కట్టుకున్న చెంగావి  చీర రిమరిమ లాడుతూ చేసే  సవ్వడి  పైరుగాలికి  విసిరికొడుతూ ఉంటే అమ్మాయి చీర చెంగు ఆ గాలికి అలా అలా తేలిపోతూ అబ్బాయికి చక్కిలిగింతలు పెడుతుంది.  అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో  ఆ చిన్నది తన  అందాన్ని అన్ని రకాలుగా చూసి తనను ఎన్నుకోమంటోంది.  అంతేనా తాను ఎన్నుకున్నవాడు తనకి చక్కనివాడు అని వచ్చే  అర్థాలతో తాను వలచిన  ప్రియుడికి తన సౌందర్యంలోని అన్ని కళలను జాగ్రత్తగా గమనించి స్వంతం చేసుకోమని తన వలపును తెలుపుకుంటోంది

దిరెసిన పువ్వు మీద చిలుకూ ముగ్గులు

చిన్నదాని బుగ్గ మీద చిలిపి సిగ్గులు

మల్లెల దొంతరలు మరు మల్లె దొంతరలు

మనసే మరుమల్లె దొంతర

మన ఊసే విరజాజి దొంతర

పాల వెన్నెలలో ..మురిపాల వెన్నెలలో..

          నాజూకైన ఆమె సౌందర్యాన్ని దిరిసెన పువ్వుతో పోలుస్తాడు.  దిరిసెన పువ్వు ఎంతో సుకుమారమైన తెలుపు, పసుపు వర్ణాల మిశ్రమంతో  నాజూకుగా సహజ నవకంతో గొప్ప సువాసనతో అందరిని ఆకర్షించే  పువ్వు. తన ఫై ముఖ సౌందర్యాన్ని అటువంటి పువ్వుతో పోలుస్తూ ఆమె బుగ్గలలో తొణికిసలాడే సిగ్గులను దిరిసెన పువ్వు వర్ణాలతో పోల్చుకుని ఆనందిస్తాడు. అంతేనా పసుపు, తెలుపు వర్ణాల మేళవింపైన ఆమె మొఖంలో సిగ్గులు ఆమె బుగ్గలపై ముగ్గులు వేస్తుంటే ఆ సందర్భం అతనికి మల్లెపువ్వుల్ని వరుసపెట్టి పేర్చినట్లుందిట.

          అమ్మాయి అందం మల్లెల సోయగంగా అబ్బాయి ఆస్వాదిస్తుంటే తన మనసు వ్యక్తపరుస్తున్న ఆనందాన్ని అమ్మాయి మల్లెల పరిమళంతో పాటు వారి మధ్య ఏర్పడే బంధం జాజుల సౌకుమార్యంగా భావిస్తుంది.  స్వచ్ఛమైన పాల వెన్నెల కాంతిలో తాము అనుభవపూర్వకంగా పంచుకునే మురిపాల వెన్నెలలు తలచుకుంటోంది. ఇద్దరు పడుచుదనంలోని యువతీ యువకుల మనోభావాల్ని చిలిపిగా పంచుకునే సందర్భాన్ని ఎంత అందమైన మాటల్లో పొడిగారో కదా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు.  అందుకే ఆయన్ని అక్షర  మర్మయోగి అంటారు. నిజమే కదా. సాధారణంగా పాట అంటే పల్లవి చరణాలు ఉంటాయి. ప్రతి చరణం చివర పల్లవిని తిరిగి ఆలపించడం సర్వ సాధారణం. కానీ ఈ పాటని స్వరపరచినప్పుడు ఘంటసాలగారు  పాట ప్రారంభంలో  కనిపించే ఆ పల్లవిని తిరిగి పాటని ముగించడంలో మాత్రమే వాడారు. చరణాల మధ్యలో ఎక్కడా పల్లవి వినిపించదు. ఇది ఘంటశాల వారి చమత్కారం.

Scroll to Top