గాలికి కులమేది? ఏదీ నేలకు కులమేది

గాలికి కులమేది?  ఏదీ నేలకు కులమేది

తెలుగు చలన చిత్ర సినీ సంగీతానికి 1960 నుంచి 1980 వరకు స్వర్ణయుగమనే చెప్పాలి. భావరంజితమైన గీత సాహిత్యం ఆ రోజుల్లో సినిమా కళను మరింత తీర్చిదిద్దింది. మధుర గాయనీ గాయకులు, సుమధుర సంగీత దర్శకులు, సుసంపన్న సాహిత్యాన్ని సృష్టించిన గీత రచయితలు… ఎన్నో భావరంజిత గీతాలను అందించిన ఆనాటి సినిమా లోకానికి సినారె ఒక పెద్ద సంపద. మట్టిలో, గాలిలో ఆయన పాట పెనవేసుకుపోయింది. ఆనాటి గాయకుల మధుర కంఠాలకు సినారె సాహిత్యం ఒక ఆభరణం కావడమే కాకుండా, ఆ కాలాన్ని హృదయ రంజితంగా మలచడంలో ఆయనది ప్రధాన పాత్ర. ప్రేమ, ప్రకృతి వంటి అంశాల్ని అభ్యుదయ భావజాలంతో ముడిపెట్టి రచించడం సినారె ప్రత్యేకత. రాళ్ళల్లో సైతం హృదయాన్ని చూడగల గొప్ప మనసు ఆయనది అందుకే ”ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో” అంటూ పలికిస్తా డు.  పైన కఠినమనిపించును, లోన వెన్న కనిపించును… అంటూ కవిలోని అంతర్నేత్రాన్ని మన ముందు ఆవిష్కరిస్తాడు. చాలామంది కవులు, గీత రచయితలు పూల అందాలను, పాట సౌకుమార్యాన్ని, వాటి లాలిత్యాన్ని పొగుడుతూ అనేకం రాస్తారు. కానీ బండరాళ్ళు సైతం గొప్ప అందాన్ని సంతరించుకున్నాయని సినారె చెబితేనే మనకు అర్థమయ్యింది. ఇంతకాలం మనుషులు చూడలేని రాళ్ళలో నిగూఢమై వున్న అందాల్ని చూపించాడు.  ”ఉలి అలికిడి విన్నంతనే జలజలమని పొంగి పొరలు…”  ఎంత అద్భుతమైన భావన. రాయి ఉలి అలికిడి విని జలజలమని పొంగుతుందట. బహుశా రాయిని ఇంత గొప్పగా చెప్పిన కవి తెలుగు సాహిత్యంలోనే కాదు అసలు ఏ భాషా సాహిత్యంలోనైనా ఉన్నాడా అనేది అనుమానమే. మనుషుల్లో వుండే ఏ మానసిక రుగ్మతలూ రాళ్ళకు లేవని…”కోపాలకు తాపాలకు బహుదూరములో ఉన్నవి మునులవోలెనె కారడివిలపడి ఉన్నవి…” అంటూ గొప్ప స్థితప్రజ్ఞతను చూస్తాడు సినారె రాళ్ళలో.”కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలకలేవు” అంటూనే ”జీవమున్న మనిషి కన్నా శిలలే నయమనిపించును” అంటారు.

            మనిషిలోని ఊహా ప్రపంచం ఎంతటి మధురమైనదో, అదెంత స్వేచ్ఛాపూరితమైనదో వివరిస్తాడు సినారె. ”పగలే వెన్నెలా జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులుంటే” అంటూ ఊహలకు కన్నులిచ్చి, అవి చూసిన అందాలను మనముందు నిలుపుతున్నప్పుడు నిజంగానే మన ఊహల్లోంచే సినారె ఈ అందాల్ని చూశాడా అన్నంతగా మన ఊహలతో మమేకమైపోతాడు.  ప్రకృతిలో మనం చూడలేని, దృష్టి సారించని అనేక చిన్న చిన్న విషయాలను నిశితంగా చూసి మైమరచిన ఆ అందాలను మనకు ”కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసే” కడలి కన్నెవాగును పిలిచిందట. ఆ పిలుపు అందుకున్న కన్నెవాగు పరుగు తీసిందట. ఎంత గొప్ప ఊహ!  నింగిలోని చందమామ తొంగి చూడగానే నీటిలోని కలువ భామ పొంగి పూసిందట. ఎంత మధురమైన ఊహ. ప్రకృతిని ప్రేయసీ ప్రియులలో ఆవహింపచేయడంలో సినారెను మించిన వారు లేరు.

‘తాతా మనవడు’ చిత్రం కోసం సినారె రాసిన పాట మనుషుల అనుబంధాల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతుంది. ”అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం… ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం…” అంటూ మనుషులు ఆత్మతృప్తి కోసమే అనుబంధాలను నిర్మించుకుంటారని ఎత్తి చూపుతాడు. సాంప్రదాయాలు పక్కదారి పట్టి సమాజం ఎంతగా దిగజారిపోతున్నదో వేదన పడుతూ ”ఇదేనా మన సాంప్రదాయమిదేనా…?” అంటూ ప్రశ్నిస్తాడు.  సామాజిక అంశాల్ని సమాజంలోని అసమానతలను అనేక గేయాల ద్వారా ఆయన వివరించాడు. ”గాలికి కులమేది ఏదీ? నేలకు కులమేది?” అంటూ ఒక ప్రశ్నను సంధిస్తాడు. ”వీరులకెందుకు కులబేధం అది మనసుల చీల్చెడు మతబేధం” అంటూ ప్రకృతికి లేని కులమత బేధాలు మనుషులకెందుకని ప్రశ్నిస్తాడు.

            మనిషిలోని కన్నీటినీ, మున్నీటినీ, అంగారాన్ని, శృంగారాన్ని కలిపి రంగరించిన సినారె కలం రెండువైపులా పదున్న కరవాలం. ఇటు అగ్గిని కురిపిస్తుంది.. అటు అమృతాన్నీ చిలికిస్తుంది. చిన్నవిత్తనం మట్టిపొర చీల్చుకుని వటవృక్షంగా ఎదిగినట్టు.. మిణుకుమిణుకు తార ఇంతింతై పూర్ణబింబమైనట్టు.. పరమాణువు అంతకంతకూ ఎగసి మహాపర్వతంగా మారినట్టు.. సినారె ఒక విశ్వ కవనమూర్తి. జన హృదయాంతరాల్లో చైతన్య జలపాతాల ఉరవడిని వినిపించిన ఆయన కలం సాహితీలోకంలో చెరగని సంతకం. కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని అద్దిన ఆయన కవనం ఎప్పటికీ ఇగిరిపోని గంధం. తెలుగు సినీ రంగాన్ని అద్భుతమైన గీతాలతో మెరుగులు దిద్దిన కొద్దిమందిలో సినారె ప్రముఖులు. సినారె మరణంతో తెలుగు చిత్రసీమ, తెలుగు శ్రోతలు ఒక అందమైన అద్భుతమైన సాహితీ దిగ్గజ కలాన్ని కోల్పోయింది.

‘గాలికి కులమేది…

నేలకు కులమేది…

మింటికి మరుగేది…

కాంతికి నెలవేది…’  అంటూ ఈ గీతం ‘మహారధి కర్ణ’ (తమిళ మాతృక) కోసం సినారె రాశారు. అంతేవాసితో సంగీత యశస్వి ఎమ్.ఎస్.విశ్వనాథం స్వర రచన చేస్తే, పి సుశీల కమ్మని గళంతో ప్రాణం పోశారు. తేట తేటతెనుగు పదాలతో పెదాలు కలిపిన నట అభినయిత్రి దేవిక అభినయం బహుధా ప్రశంసనీయం. నడిగర్ తిలకం పద్మశ్రీ శివాజీగణేశన్ హావభావ ప్రకటనం మధురం… మధురాతి మధురం.  ఈ పాటకి స్వర రచనంలో ఎంతకి సంతృప్తిచెందని నిర్మాతా దర్శకులు వినూత్నమైన బాణీలు కూర్చమని ఎమ్‌ఎస్వీవిపై ఎక్కువ వత్తిడే తెచ్చారు. చివరాకరికి వారనుకున్న విలువలను రాబట్టారు దర్శక స్రష్ట బిఆర్ పంతులు.
          ఇక గీత వైశిష్ట్యాన్ని చెప్పాలంటే… మహారధి కర్ణుడికి… అర్జునుడితో బలప్రదర్శన చేయాలంటే, తలపడాలంటే… కులం అడ్డుగోడగా నిలుస్తుంది. దాంతో మనస్తాపానికి గురైన కర్ణుణ్ణి ఓదారుస్తూ అతని అర్ధాంగి ఈ గీతాన్ని సోదాహరణంగా ఆలపిస్తుంది. అతని మనసుని ఊరట పరుస్తుంది.

గాలికి కులమేది?

ఏదీ… నేలకు కులమేది

మింటికి మరుగేదీ… ఏదీ

కాంతికి నెలవేదీ..

అందరిని హాయిగా ఆహ్లాద పరుస్తూ పలకరించే గాలికి కులం ఉన్నదా? అనంత ప్రాణికోటికి ఆలవాలమై అవి చేసే మంచి, చెడుల్ని భరిస్తూ ఎంతో సహనంగా ఉండే నేలకి కులం ఉన్నదా?  నువ్వుండే నీ నివాస భవనానికి ఎక్కడైనా దాపరికం ఉందా? ప్రసరించే కాంతికి మార్గం ఉంటుందా?

చరణం 1 : 

పాలకు ఒకటే…ఏ..ఏ…ఆ… ఆ…ఆ..

పాలకు ఒకటే తెలివర్ణం

ఏదీ ప్రతిభకు కలదా స్థలభేదం

వీరుల కెందుకు కులబేధం

అది మనసుల చీల్చెడు మతభేదం

పాలు అన్నింటికీ ఒకటే తెలుపు రంగు. మరి ప్రతిభకేమైనా తేడాలుంటాయా? అది ఏ రంగమైనా ప్రతిభే కదా!  వీరత్వం కల వారికెందుకు కుల భేదం అదే కాదయ్యా మానవులంతా ఒక్కటే అన్న విశ్వ మానవ సందేశానికి తూట్లు పొడిచే వర్గీకరణ, 

చరణం 2 :

జగమున యశమే..ఏ… ఏ…

జగమున యశమే మిగులునులే

అది యుగములకైనా చెదరదులే

దైవం నీలో నిలుచునులే

ధర్మం నీతో నడచునులే

గాలికి కులమేది?

జగమున కీర్తి మిగులుతుంది… అది యుగాలకైన స్థిరంగా నిలిచిపోతుంది. దైవము నీలో నిలుచునులే… ధర్మము నీతో నడుచునులే అంటూ సాహసానికి, వీర లక్షణాలకి దైవము, ధర్మము ఎప్పటికి వెన్నంటి ఉంటుంది- స్థిర కీర్తి చిరంతరం నిలిచిపోతుంది అంటూ. ఇది ఒకరకంగా ప్రభోద గీతం. కులవ్యవస్థలో, మతమౌధ్యంలో కూరుకుపోయే మానవాళికి చైతన్యగీతం.  ఈ గానామృతం స్వరాలకి వ్రాసిన పదప్రవాహం లలితమై, మధురమై, స్వరమాధుర్యమై పి సుశీలమ్మ గళంలో, దేవిక అభినయంలో ప్రకాశవంతమైంది. ఈ గీతం నిర్మాణంలో పాత్ర వహించిన వారందరు శ్లాఘనీయులే సుమా!!