జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా

కళ, కళ యొక్క ముఖ్య ఉద్దేశం రేపటి మీద ఆశ కలిగించడం. సిరివెన్నెల పాటల్లో అది కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది. చాలా సులువుగానే లోతుగా రాయడం ఆయన సొంతం. ఎన్ని అవార్డులు వరించినా ప్రేక్షకుడి పెదవి మీద కూనిరాగమే పెద్ద అవార్డు అంటారు సిరివెన్నెల.   ‘జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది’ అని ‘చక్రం’ సినిమాలో రాశారాయన. ‘ఆయువనేది ఉండేవరకూ ఇంకేదో లేదని అనకు’ అనే జీవిత సారాన్ని చాలా తేలికైన పదాలతో కమర్షియల్‌ సినిమాలో చెప్పగల శక్తి, సామర్థం ఉన్నది సిరివెన్నెలకే.  ‘సాహిత్యం అనేది అర్థం అయ్యేలానే రాయక్కర్లేదు. అర్థం చేసుకోవాలనే కుతూహలం రేకెత్తించేలా కూడా రాయొచ్చు. అలాంటి రచయిత సిరివెన్నెలగారు’ అంటారు దర్శకుడు త్రివిక్రమ్‌. 3 వేలకు పైగా పాటలు, 11 రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు. 3 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు. 1986, 87, 88 సంవత్సరాలలో వరుసగా నంది అవార్డులను అందుకొని హ్యాట్రిక్‌ సృష్టించారు.  మనసులో నాలుగు కాలాలు నిలిచిపోయేది మంచి పాట అనుకుంటే – ఎప్పుడు గుర్తు వచ్చినా కళ్ళని కాదు మనసును కూడా ఆర్ద్రతతో తడిపేది గొప్ప పాట.  అటువంటి పాట రాయగలిగిన మహా వ్యక్తి నిస్సందేహంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి.  ఆయన కవిత్వంలో ఒదగని భావం ఆయన కలం ఇంకులో ఇంకని మాధుర్యం లేవంటే అతిశయోక్తి కాదు.  మూడు నిమిషాల చిన్న పాటలో మొత్తం కథనంతా అమర్చి దాన్నొక జరిగిన కధలా వివరించి, కంటతడి పెట్టించి, మనసుని కుదిపివేసే ఒత్తిడికి గురిచేసేటువంటి పాట గురించి తెలుసుకుందాం. కళాతపస్వి విశ్వనాధ్ గారి దర్శకత్వంలో వచ్చిన “స్వాతికిరణం” సినిమాలోనిదీపాట.  నిజంగా ఈపాట ఒక హంటింగ్ మెలోడీ అని నా అభిప్రాయం.

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా

రెప్పవేయనే లేదు ఎందుచేత ఎందుచేత?

పదహారు కళలని పదిలంగా ఉంచనీ

ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుట చేత

జాబిలమ్మ జాలిగా రాత్రంతా పడుకోకుండా రెప్ప వేయకుండా చూస్తున్నాదట. ఎందుకంటే… తనవైన పదహారు కళలని తనలో నింపకుండా తీసుకెళ్లిపోయే కృష్ణపక్షం వలనట.  సినిమాలో సందర్భానుసారం చూస్తే జాబిలమ్మ పాత్ర గంగాధరంది కృష్ణపక్షమేమో ఆ పిల్లాడి గురువు అనంత రామశర్మ.  తన వయసుకి ఏమాత్రం సరికాని అసూయతో రామశర్మ ప్రవర్తిస్తున్న కారణంగా పిల్లలు లేని ఆయన భార్య జాబిలమ్మ లాంటి గంగాధరాన్ని తన బిడ్డగా చూసుకుంటూ తన భర్త అంతరంగాన్ని ఆ పసివాడికి తెలియచెయ్యలేక, పసివాడి మానసికస్ధితిని భర్తకు వివరించలేక మనోవ్యధకు గురవుతుంటుంది.  ఇటువంటి సందర్భాన్ని తెలియచేస్తూ ఆ పాత్రల మానసిక విశ్లేషణను ఇంతకన్నా అర్ధవంతంగా తెలియచేయడం సాధ్యమా?  పెద్దలైనవారు పరిణతి చెందకుండా పిల్లల మాదిరి ప్రవర్తిస్తే వారి బిడ్డలే పెద్దవారై పెద్దవారు చూపాల్సిన పరిణతి ప్రదర్శిస్తారేమో? అందుకే ఆ చిన్ని గంగాధరం అనే జాబిలమ్మ తానే పెద్దవాడై పెద్ద మనసుతో తన తల్లికాని తల్లిని ఓదారుస్తున్నాడు.  ఎలా…… ఇలా…….

కాటుక కంటినీరు పెదవులనంటనీకు

చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు

నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా

నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా

అమ్మా! నీ కాటుక పెట్టుకున్న కళ్ళనుండి వచ్చే కన్నీరుని పెదవులని అంటనీయకమ్మ.  నీ మోమున దీపకళిక మాదిరి వెలిగే చిరునవ్వుని చిన్నబోనీయకమ్మ అంటూనే నీ ముఖాన వెలిగే జ్యోతి వంటి నీ కుంకుమ బొట్టు ఎప్పటికి అస్తమించదమ్మా. గురువుగారు ఎప్పుడు చల్లగా ఆనందంగా ఉంటారమ్మ అని అనునయిస్తాడు గంగాధరం తల్లిలాంటి గురుపత్నిని. ఇందులోని ఇంకో భావం గురువు గారి మార్గానికి అడ్డు తగలకుండా నేను తప్పుకుంటానమ్మా అని తన మనసులోని విషయాన్ని తెలియపరుస్తున్నాడు. నీ బుజ్జి గణపతినమ్మా నేను చెబుతున్నాను అని బుజ్జగిస్తూ చెబుతాడు.  ఇక్కడ ‘బుజ్జి గణపతిని’ అన్న పదప్రయోగం ఎందుకు చేసేరో ఈక్రింది చరణంలో వివరిస్తారు సీతారామ శాస్త్రి.

సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి

సంతసాన మునిగింది సంతు లేని పార్వతి

సుతుడన్న మతి మరచి శూలాన మెడ విరిచి

పెద్దరికము చూపే చిచ్చుకంటి పెనిమిటి

            నా ఉద్దేశ్యంలో ఈ చరణంలోనాలుగు లైన్లలో కధని, కధలోని పాత్రల ఔచిత్యాన్ని మ కళ్ళ ముందు ఆవిష్కరించారు.  తాను వంటికి నలుచుకున్న సున్నిపిండికి ప్రాణం పోసి కొడుకని మురిసిపోయింది సంతానం లేని పార్వతి దేవి అలాగే తాను కన్న కొడుకు కాకపోయినా వేదోక్తంగా దత్తత తీసుకుని గంగాధరాన్ని కొడుకులా పెంచుకుంటోంది రామశర్మ గారి భార్య. అలా ప్రేమగా పెంచుకుంటున్న బిడ్డపైన అసూయ, ద్వేషం పెంచుకుని వారి జీవితాలలో చిచ్చును పెట్టాడు ‘చిచ్చుకంటి పెనిమిటి రామశర్మ.  ఇక్కడ తన జీవితంతో పాటుగా, తన భార్య, గంగాధరంల జీవితాల్లో కూడా చిచ్చుపెట్టి పెద్దరికం చూపిస్తుంటాడు రామశర్మ. భావపరంగా, కథాపరంగా ‘చిచ్చుకంటి పెనిమిటి అన్న పదప్రయోగం అద్భుతంగా తోస్తుంది.  సాంబశివుడు నిజంగా చిచ్చుకన్ను కలవాడు. కధలో అటువంటి కన్నులేకుండానే చిచ్చు పెడతాడు రామశర్మ.

ప్రాణపతినంటుందా?  బిడ్డ గతి కంటుందా?

ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి

కాలకూటము కన్న ఘాటైన గరళమిది

గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది

            ఈ చరణంలో భార్యగా, తల్లిగా ఒక స్త్రీ పడే హృదయవేదన కనిపిస్తుంది.  భర్తను అనగలదా అంటే అనలేదు పోనీ బిడ్డ గతి చూసి ఉండగలదా అంటే ఉండలేని పరిస్ధితి.  ఈ పరిస్ధితి ఎటువంటిదంటే ఆమె రెండు కళల్లో చితి మంటలు మండుతున్నాయి.  ఈ పరిష్టితి ఎటువంటిదంటే ‘కాలకూటమనే’ విషం కంటే ఘాటుగా ఉంటుంది.  అంతేకాదు గొంతునులిమే గుర్తులాగా వెన్నంటి ఉంటుందట.

ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి

ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి

నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా

కంచి కెళ్ళిపోయేవే కథలన్నీ

            జీవితమంతా ఇలాంటి ఆటుపోట్లు తప్పవు కదమ్మా.  ఇలాంటి ఘటనలన్నీ జీవితంలో ‘ఆటవిడుపు’ కలిగించే ఆటలు కదమ్మా.  ఆదిశక్తి ప్రతిరూపమైన అమ్మవు నువ్వు నిన్నివేవి అంటవు తల్లి నువ్వు కేవలం నిమిత్తమాత్రురాలవు అని బుజ్జి గణపతిలా బుజ్జగిస్తూ తన కధ కంచికి వెళ్లబోతుందని సూచిస్తాడు. ఈ పాట విన్న తర్వాత మనవి కాటుక కళ్ళయినా కాకపోయినా కన్నీళ్లు రావడం తధ్యం.  నా దృష్టిలో ఇది ఒక సాధారణమైన అసాధారణమైన పాట.