ఆ.సు. కబుర్లు – హాస్యం

హాస్యం

ఈ శీర్షిక లో వ్రాసిన ప్రదేశాలు, పాత్రలు, సన్నివేశాలు, పేర్లు మొదలైనవి కేవలం వినోదం కోసం సృష్టించబడినవే కానీ ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కాదు. ఒకవేళ ఇందులో వ్రాసిన పై విషయాలకు సంబంధించి సరిపోలిన యెడల అది కేవలం యాదృచ్ఛికమే కానీ ఉద్దేశపూర్వకమైనవి కాదని మనవి.

మనసారా థియేటర్‌లో నవ్వుకొని కొనే్నళ్లయింది. సినిమా పుట్టి కొన్ని దశాబ్దాలు గడిచింత్తర్వాత.. ‘జంధ్యాల’ తన అక్షర విరుపుతో కలాన్ని ఝళిపించాడు. ఆ మెరుపులూ తళుకులూ సెల్యులాయిడ్‌పై సరిగ్గా మెరవక ముందే ‘అక్షరాల్ని’ మూటగట్టుకొని తన జీవితానికి ‘శుభం’ కార్డు వేసేసుకున్నాడు. సినీ చరిత్రలో ‘జంధ్యాల’ హాస్యానికి పూర్వం.. తర్వాత అన్నట్టు ‘కామెడీ’ని సృష్టించి మరపురాని పాత్రల్ని మదిలో వేశాడు.
ఇక్కడ జంధ్యాలని స్మరించుకోవటం కాదు. మరచిపోయిన హాస్యానికి సంస్మరణ. ఆ సందర్భంగా కొన్ని జంధ్యాల మాటలు. ఆయన సృష్టించిన కొన్ని పాత్రల స్వరూప స్వభావాలు.

శుంఠ పరంధామయ్యని పరిచయం చేసుకుందాం. ఇతగాణ్ణి పరిచయం చేసుకున్నా తంటానే. చేసుకోకున్నా తలనొప్పే. వాళ్లింట్లో వెండి కంచం దొంగిలించామని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ తన దగ్గరికి రప్పించుకోగలడు. ఈ ‘శుంఠ’ని ఎక్కడ చూశామంటారా? ‘శ్రీవారికి ప్రేమలేఖ’లో. కొడుక్కి పెళ్లాం చేత లేఖ రాయిస్తూ తనని తాను ‘అర్భకపు’ తండ్రిగా పేర్కొన్న వ్యక్తి. అనర్గళంగా మాట్లాడేస్తూంటే.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చోట తిట్టకుండా తిట్టేస్తూండే ఆ మహానుభావుడులాంటి వాడు జీవితంలో ఎక్కడోచోట తారసపడే ఉంటాడు. ఆ పాత్రని సృష్టించి ఇనే్నళ్లయినా, ఆ వెటకారపు తిట్లు ప్రేక్షకుల మదిలో ఆలోచనలు రేకెత్తిస్తూనే ఉంటాయి.
ఆ శుంఠ పరంధామయ్య చుట్టూ తిరిగే పాత్రల్ని ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకొందాం. వంటల్తో ‘మావయ్య’ని అస్తమానం ఆమడ దూరం పరుగెత్తించి, అదే పనిగా -దేశీ విదేశీ వంటల పుస్తకాల్ని పొయ్యిమీద మరగబెట్టే మణిపూస. ఈవిడకి చైనా వంటకమా? దక్షిణాఫ్రికా వంటకమా? అన్న జాతిభేదాలు లేవు. ఏదో ఒకనాటికి వంటల్తో ‘గినె్న’స్‌కు ఎదగాలనీ.. మావయ్యని సంతోష పెట్టాలన్న అల్ప సంతోషి. ఈ వంటలక్కని ఎప్పుడో ఒకప్పుడు ఏదోక వంట సందర్భంలో గుర్తు చేసుకోకుండా ఉండగలమా?
అసలు -ఇలాంటి ‘పాత్ర’ ద్వారా హాస్యాన్ని సృష్టించాలన్న ఐడియా సినిమా జీవితానే్న మార్చేసింది. ఇక- తెర మీద వచ్చే అడ్వర్టయిజ్‌మెంట్స్‌తో సహా, ఆపైన టైటిల్స్‌తోపాటు కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం.. శుభం వరకూ అలవోకగా ‘సినీ కథలు’ చెప్పే ఇల్లాలు, ఆ ఇల్లాలికి బలైపోయే పేకాట పాపారాయుడు.. అతగాడి బృందం, అస్తమానం తనలో తాను ‘మాట్లాడేసుకొనే’ మందుబాబూ, తెలుగు అనే బ్రహ్మ పదార్థం ‘బాస్’కి అర్థం కాదని ఆయన ముఖం మీదే తిట్టేసే ఆఫీసు స్ట్ఫా, చరిత్ర మాస్టారూ, మతిమరుపు మధ్యతరగతి జీవి. అసలిన్ని పాత్రలూ.. ఇన్ని మాటలూ -ఎక్కడ్నుంచి ఊడిపడ్డాయి. ‘జంధ్యాల’ పుడుతూనే అక్షరాభ్యాసం చేసేసి, హాస్యాన్ని ఉగ్గపాలతో జుర్రేసి, పలుకు తేనియల తేట తెలుగుతో అక్షరాల్ని అందంగా విడగొట్టి.. ‘సుత్తి’మెత్తని హాస్యం అంటే ఇదీ అని శిలాక్షరాల్తో ప్రేక్షకుల్ని అభిషేకించాడనిపిస్తుంది. ఇలా ఓ కథలో ఒక్కో పాత్ర ఆద్యంతం ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, మాదీఫల రసాయనంలా. ఎనే్నళ్లయినా ఆయా పాత్రలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఈ ‘ప్రేమలేఖ’కి ముందు ‘నాలుగు స్తంభాలాట’తో ‘సుత్తి’ని వీర ప్రాచుర్యం చేశారాయన. ‘న్యూటన్’ కూడా మన తెలుగువాడేననీ, పైథాగరస్‌నీ పక్కింటాయన జాబితాలో చేర్చేసే ‘సుత్తి’.. పండక్కి పెళ్లాం పట్టుచీర అభ్యర్థనని ‘ఎడమ’ చెవి నుంచీ ‘కుడి’ చెవికి బట్వాడా చేసే ఇంకో పెద్దాయన.
* * *
‘సుత్తి’ అన్న మాట ఆ దశాబ్దపు మెచ్చుతునక. అప్పటివరకూ -జానపద సినిమాల్లోనో, సాంఘిక కథల్లోనో వినిపించే ‘పంచ్’ పదాలనూ, మాటలనూ అడపాదడపా నిజ జీవితంలో ప్రయోగించే జనావళి, ఈ ‘సుత్తి’ని ఎంతగా అడాప్ట్ చేసుకున్నారంటే, ఎదుటివాడు ఆ ‘సుత్తి’ని భరించలేనంతగా.
ఒక మాటని ఎన్ని రీతులుగా పలికితే ఎన్ని సరిగమలు పలుకుతాయో, మాటల విరుపుల్లోని హాస్యాన్ని అలవోకగా వొడిపట్టేసి తెర మీదికి నడిపించిన ‘హాస్యం’ అది. ‘సుత్తి’ అన్న పదం కలియుగంలోనిది కాదనీ, త్రేతాయుగం నాటిదని చెప్పటం హాస్యానికి పరాకాష్ఠ.
ఇలా -ఆ హాస్య వాక్ప్రవాహంలోంచి జాలువారినదే ‘చూపులు కలిసిన శుభవేళ’. కథని పక్కనబెట్టి.. కేవలం ‘కామెడీ ట్రాక్’ని చూట్టానికి కుదర్దు. ఆయా పాత్రలన్నీ మన చుట్టూ తిరుగుతూ -సెటైర్లు వేస్తూంటాయి. ఈ ఫలానా పాత్ర మన పక్కింటాయనదే. ఆయనా అంతే. తిట్టిన తిట్టు తిట్టకుండా.. అందర్నీ ‘పింజారీ వెధవల్ని’ చేస్తాడనో.. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని ఊళ్లనూ కలిపి.. ఎలా వెళ్లాడో చెప్పే బాపతు వ్యక్తి పక్క వీధిలో ఉంటాడనో.. ఇలా ఆలోచనల్లోకి రాని పాత్ర ఉండదు. వీటి చుట్టూ హాస్యం తిరుగుతుంది ఆరోగ్యకరంగా.
* * *
‘నాకేంటి?’ అనే పినాసి.. ‘కోడి’ని తలకిందులుగా వేలాడదీసి -ఈరోజు మా ఇంట్లో కోడికూర అనే అంట్ల వెధవ.. -కలెక్టర్ కావాల్సిన వాణ్ణి ‘పిచ్చివాణ్ని’ చేసిన దౌర్భాగ్యుడు.. ‘అరగుండు’తో పనె్నండు రూపాయల జీతానికి చేరిన పనోడు.. ఇలా ఒక్కో పాత్రా కథకి అవసరమైందే.
* * *
ఒక దశాబ్దం పాటు తన హాస్య చెణుకులతో ‘మాటల్ని’ వొలికించిన ‘సెల్యులాయిడ్’ ఒక్కసారిగా మూగవోయింది. జంధ్యాల ‘మాటల మూట’ సర్దుకొని వెళ్లిపోయింత్తర్వాత.. ఇవివి. కొన్నాళ్లు ‘కితకితలు’ పెట్టాడు. మాటల్తో చెడుగుడాడాడు. ‘కోస్తా బిడ్డా’ అంటూ కత్తి పుచ్చుకొని తిరిగే ఫ్యాక్షనిస్టుకి సైతం ‘నేను కోస్తా బిడ్డనే’ అన్న విరుపుతో హాస్యాన్ని పుట్టించటం జంధ్యాల తర్వాత ఇవివికే చెందుతుంది. అదొక ‘హాస్య’ యుగం.
* * *
ఆ దశాబ్దంలో వచ్చినవన్నీ ‘హాస్యపు’ ఆణిముత్యాలే. అన్నీ నవ్వుల పువ్వులు పూయించినవే. ఆ యుగాన్ని దాటుకొని.. ఇవివి వరకూ వచ్చినా.. ఆయన ‘హాస్యం’ కూడా కొద్దికాలంపాటే కొనసాగి అర్థంతరంగా ఆగిపోయింది.
* * *
ఈ కలికాలంలోకి వద్దాం. పూర్తిస్థాయి కామెడీ కథలకు ఎప్పుడో తెర పడింది. అడపాదడపా వచ్చినప్పటికీ.. ‘ట్రాక్’లో వెళ్లిపోయాయి. కామెడీ అనేది హీరో పనికాదు, పక్కనున్న ఫ్రెండ్ పని. కాలేజీలో ఫ్రెండ్‌గానో.. ఆఫీస్‌లో బాయ్‌గానో -లేకుంటే బామర్దిగానో.. ‘సైడ్’ని నిలబడి -ఆ ట్రాక్‌ని నడిపిస్తూంటాడు. ఆయా హాస్యపు సన్నివేశాలు ఏవీ ప్రేక్షకుల వెంట రావు. థియేటర్‌లో కాసేపు నవ్వించి, బయటికి అడుగు పెట్టడంతోనే ‘షార్ట్ టర్మ్’ మెమరీ లాస్‌లా మర్చిపోతారు. పట్టుమని పది రోజులపాటు ఆ హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల ఆలోచనల్లో మెదలవు. జంధ్యాల, ఇవివి వారసత్వాన్ని ‘త్రివిక్రమ్’ పుణికి పుచ్చుకుని మాటల మాంత్రికుడిగా పేరుబడ్డాడు. ఈ మధ్యలో ఎవరూ రాలేదా? అంటే వచ్చినా, ఒకటి రెండు సినిమాల్తో ఫుల్‌స్టాప్ పెట్టేశారు. త్రివిక్రమ్ సినిమా అంటే -జీవిత సత్యాల్తోపాటు.. మనసుని పిండేసే మాటలుంటాయి. ఇతడిది సెపరేట్ ట్రాక్.
ఇన్ని మాటల తర్వాత.. సినిమాల్లో అసలు హాస్యమనేదే కరువవుతోందా? ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్న సినిమాల్లో కామెడీ లేదా? అంటే- ఉంటుంది. కానీ -అవన్నీ ‘మర్చిపోలేని’ స్థాయిలో ఉండటం లేదు. ఆ పాత్రల్ని గుర్తుపెట్టుకోవటానికి మనసు అంగీకరించటం లేదు. ఆయా ఛానెళ్లలో వెరైటీ టైటిల్స్‌తో వచ్చే కామెడీ ప్రోగ్రాముల్లో చూస్తే.. మళ్లీ మళ్లీ హాయిగా నవ్వుకొనే పరిస్థితి లేదు. ఆయా పాత్రలు నిజ జీవితంలో తారసపడవు. ఆ మేనరిజం ఎక్కడో సగం దూరం వచ్చి ఆగిపోతుంది. కొన్నికొన్ని సందర్భాల్లో హాస్యం పేరిట జరుగుతున్న ‘జుగుప్సా’కర సంఘటనలు వెగటు పుట్టిస్తున్నాయి. ఇక్కడ ఎవరినీ తప్పు పట్టడంలేదు. వారివారి ఆలోచనల్నిబట్టి కథల్లో ‘హాస్యాన్ని’ ఇరికిస్తూనే ఉన్నారు. అంటే- పధ్నాలుగు రీళ్ల కథలో ‘ఒక్క’ రీలుతో ‘ట్రాక్’ నడిచిపోతుంది. ఇక జ్ఞాపకం పెట్టుకొనే అవకాశం ఎక్కడ?
రేలంగోడు వచ్చాడురోయ్.. రాజబాబు.. పద్మనాభం వచ్చార్రోయ్.. అని చెప్పుకొనే రోజుల్ని దాటి.. కథతో కామెడీ ‘ఇన్‌వాల్వ్’ అయి.. నడిచిన పరిస్థితుల్ని దాటి -కథతో సంబంధం లేకుండా సెపరేట్ ‘ట్రాక్’ అయిన తర్వాత సినిమాల్లో పూర్తిస్థాయి కామెడీని ఆశించటం వెర్రితనమా?
అసలు -హాస్యాన్ని ఆస్వాదించే పరిస్థితుల్లో ప్రేక్షకుడు ఉన్నాడా? నవ్వటం మర్చిపోయి.. ఏం చూస్తున్నామో తెలీని అయోమయ స్థితిలో పడిపోయాడా? ఫుల్‌లెంగ్త్ కామెడీకి ఎప్పుడూ రోజులే. ప్రేక్షకుడికి నవ్వటం తెలుసు. హాయిగా ఫీల్ అవటం తెలుసు. కాసిన్ని ‘పంచ్’ డైలాగ్స్‌తోపాటు.. మరిన్ని నవ్వుల్ని పూయిస్తే ఎందుకు ప్రేక్షకుడు ఎందుకు పరిగెత్తుకుని రాడు? వస్తాడు. అలా రప్పించగలిగేవాళ్లే ఇప్పుడు పరిశ్రమకు రావాలి?

Scroll to Top