జాతులు, ఉప జాతులు

జాతులు:- జాతులు మాత్రాగణములతో, ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమములు ఉన్నాయి.

  1. కందం
  2. ద్విపద
  3. తరువోజ
  4. అక్కరలు (మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర అల్పాక్కర)
  5. ఉత్సాహము

ఉప జాతులు:- తేటగీతి

జాతులు

కంద పద్య లక్షణములు:- ఇందు నాలుగు పాదములు.   కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు.  1,3 పాదాలలో గణాల సంఖ్య = త్రీ; 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5.  1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు.  2, 4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు.  2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి. 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి.  పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి.  యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి.  ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు. 

కంద పద్యమునందు గణముల వివరణ.  గగ గణము = UU { గురువు, గురువు } భ గణము = UII { గురువు, లఘువు, లఘువు } జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు } స గణము = IIU {లఘువు, లఘువు, గురువు} నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు }.

ఉదాహరణ:

భూతలనాథుడు రాముడు

ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం

ఘాతన్ భాగ్యోపేతన్

సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్

ఉదాహరణ 2 కు గణములు లెక్కిస్తే
భూ త లనా థు డురా ము డు
గ గగ గనల
ప్రీతుండై పెండ్లి యాడెబృథుగుణమణి సం
గ గగ గగ గ
ఘాతన్భాగ్యోపేతన్
గ గనలగ గ
సీతన్ముఖకాంతి విజితసితఖద్యోతన్

ద్విపద లక్షణములు:- ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి అందుకే దీనిని ద్విపద అంటారు. ప్రతి పాదములోను మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది. మూడవ గణం యొక్క మొదటి అక్షరం యతి. ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.

అపరిమిత ప్రీతినా భగీరథుని

తపమిచ్చమెచ్చనే కందర్ప సంహరుని

గణాలు లెక్కిస్తే… అపరిమి =ఇంద్ర గణము తప్రీతి = ఇంద్ర గణము నాభగీ = ఇంద్ర గణము రథుని = సూర్య గణము

యతి అక్షరాలు అపరిమిత ప్రీతినా భగీరథుని. ప్రాస “ప” అక్షరమ్.

తరువోజ లక్షణములు:- ఈ పద్యమునకు నాలుగు పాదములుండును.  ప్రతి పాదమునకు మూడు ఇంద్ర గణములు, ఆ పైన ఒక సూర్య గణము, మళ్ళీ మూడు ఇంద్ర గణములు, ఒక సూర్య గణము ఉండవలెను. పాదములోని మొదటి అక్షరమునకు మూడు చోట్ల యతి ఉండవలెను.  పాదాది అక్షరమునకు పాదంలోని మూడవ, ఐదవ, ఏడవ గణముల మొదటి అక్షరముతో యతి నియమమున్నది.రెండవ అక్షరమున ప్రాస నుంచవలెను.  ఒక్కొక్క తరువోజ పాదము రెండు ద్విపద పద్యపాదములు కలసిన రీతిలో (అనగా ఒక ద్విపద పద్యము వలె) ఉంటుంది. ఒకే ఒక భేదమేమిటంటే ప్రతి పాదంలో మూడు చోట్ల యతి కలుస్తుంది – అంటే ద్విపద పద్యములోని రెండు పాదములకూ సాధారణంగా ఉండే యతి కాక పాదాల మొదటి అక్షరములకు కూడా యతి నుంచవలెను. అప్పుడు మొదటి అక్షరముతోనే రెండు పాదములకు మొత్తమూ యతి చెల్లించినట్టు అవుతుంది.

అక్కరలు:-అక్కరలు జాతి పద్యములు. ఇవి ఐదు విధములు. మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర,అల్పాక్కర. మహాక్కరలో పాదానికి ఏడు గణాలు ఉండును. మహాక్కర నుండి అల్పాక్కరకు వచ్చేటప్పటికి పాదానికి ఒకో గణము తగ్గుతూ అల్పాక్కరలో మూడు గణాలు మాత్రమే ఉండును. మధ్యాక్కరకు తప్ప మిగిలిన అక్కరలకు పాదము చివరిలో చంద్ర గణము రావలెన్ననియమము ఉన్నది. అక్కరలలో సూర్య గణము లేని అక్కర అల్పాక్కర, అదేవిధముగా చంద్ర గణము పాదాంతములో లేని అక్కర మధ్యాక్కర. 

ఉత్సాహము పద్య లక్షణము:- ఈ పద్యమునకు నాలుగు పాదములు ఉండును.  ప్రతి పాదమునందు ఏడు సూర్య, ఒక గురువు గణములుండును.  ప్రాస నియమము కలదు.  ప్రతి పాదమునందు 5వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము.  ఉదాహరణ

సెనగ పిండి ఉల్లిపాయ చిన్న మిర్పకాయలున్

జొనిపి యందు నల్లమింత చొనిపి ముద్దచేసియున్

అనలతప్తమైన నేతియందు వైచి వేచినన్

చను పకోడి యనెడు పేర చక్కనైన ఖాద్యమై.

ఉప జాతులు

తేటగీతి లక్షణాలు:- ఈ పద్యమునకు నాలుగు పాదములు. ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం + రెండు ఇంద్ర గణాలు + రెండు సూర్యగణాలు ఉంటాయి.   ఒకటోవ గణం మొదటి అక్షరానికి నాలుగో గణంలో మొదటి అక్షరం యతి. ప్రాసయతి చెల్లును.  ప్రాసయతి చెల్లించిన పద్యాన్ని అంతరాక్కరగా పిలుస్తారు. అయితే అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు. ప్రాస నియమం లేదు.  ఉదాహరణ

అఖిలరూపముల్ దనరూపమైన వాడు

నాదిమధ్యాంతములు లేక యడరువాడు

భక్తజనముల దీనుల పాలివాడు

వినడె చూడడె తలపడె వేగ రాడె

Scroll to Top