ఆ.సు. కబుర్లు : జంఘాల శాస్త్రి – జాగిలం

జంఘాల శాస్త్రి – జాగిలం

ఈ శీర్షిక లో వ్రాసిన ప్రదేశాలు, పాత్రలు, సన్నివేశాలు, పేర్లు మొదలైనవి కేవలం వినోదం కోసం సృష్టించబడినవే కానీ ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కాదు. ఒకవేళ ఇందులో వ్రాసిన పై విషయాలకు సంబంధించి సరిపోలిన యెడల అది కేవలం యాదృచ్ఛికమే కానీ ఉద్దేశపూర్వకమైనవి కాదని మనవి.

మాది తూ.గో.జిల్లా కోనసీమ ప్రాంతం. మాదొక లంక గ్రామం. మా గ్రామం పేరు అప్రదిష్ట లంక. నాపేరు అధోముఖం. కాస్తో కూస్తో వేదం చదివేను కానీ మా గ్రామస్థులు, చుట్టుప్రక్కల గ్రామస్థులు కూడా నేను తద్దినం బ్రాహ్మణార్తానికి తప్ప ఇంకెందుకు పనికిరానని నిర్ణయించి నన్ను తద్దినం బ్రాహ్మణార్తానికి తప్ప మరి దేనికి పిలవరు. మా గ్రామంలో ఏ కార్యానికైనా పిలిచే ఒకే ఒక్క వ్యక్తి జంఘాల శాస్త్రి. మా జంఘాల శాస్త్రి గారి గురించి చెప్పాలంటే ఆయనకి తనో గొప్ప పండితుణ్ణి అని అనుకుంటుంటాడు, ఇంకా తాను మాట్లాడింది కూడా తనకి వినిపించనంత మహా చెముడు. అందువల్ల తేను అనుకున్నది మాట్లాడేస్తాడు తప్ప అవతలి వాళ్ళు ఏమిటి చెబుతున్నారో తనకి సంబంధం లేదు అసలవేవీ పట్టించుకోడు కూడా. జంఘాల శాస్త్రి భార్య పేరు గేనపెసూనాంబ. ఇక్కడ గేన పెసూనాంబ గారి గురించి కొంచెం చెప్పాలి. గేనపెసూనాంబ గారు జంఘాల శాస్త్రి గారి కంటే ఎక్కువే చదువుకున్నారు. ఆమె తండ్రి గారు సకల శాస్త్ర పారంగత అభ్యుదయ శాస్త్రిగారు. సహజంగా గేనపెసూనాంబ గారు అందగత్తె కావడంతో జంఘాల శాస్త్రి గారు అభ్యుదయశాస్త్రిగారి వద్ద విద్య నేర్చుకుంటున్నప్పుడు నెమ్మదిగా గేన పెసూనాంబగారికి లైన్ వేసే వారు. గేన పెసూనాంబకి కూడా శాస్త్రిగారి జంఘాలు ( పిక్కలు) నచ్చి శాస్త్రిగారికి పడిపోయేరు. గేనపెసూనాంబగారు కూడా తండ్రిగారి వద్ద విద్యనభ్యసించారు. కాకపోతే ఆవిడకి వచ్చినంత పాండిత్యం జంఘాలశాస్త్రికి రాలేదు. ఈ విషయం శాస్త్రి గారికి, గేనపెసూనాంబ గారికి తెలుసు. కాకపోతే ఆవిడ నలుగురిలో ఆవిడ ప్రతిభ బయటపెట్టుకోరు కాబట్టి జంఘాల శాస్త్రి మావూర్లోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోను పెద్ద పండితుడిగా చలామణి అయిపోతున్నాడు. అసలు అభ్యుదయశాస్త్రిగారు గేనపెసూనాంబ గారికి వే రే మంచి సంబంధం చూసేరు కానీ గేన పెసూనాంబ గారు జంఘాక శాస్త్రికి కమిట్ అయిపోడంతో అభ్యుదయశాస్త్రి గారికి వారిరువురికి పెళ్లి చెయ్యక తప్పలేదు.

జంఘాల శాస్త్రిగారికి మహాచెముడైనా నోటిదూల విపరీతం. అందువలన తానెన్ని చీవాట్లు, చెప్పుదెబ్బలు తిన్నప్పటికీ ఆ నోటిదూలని అదుపులో పెట్టుకోలేదు. ఇంకా గేన పెసూనాంబ దగ్గర తాను ఎక్కువ వాడిననిపించుకోవాలని విఫల ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే విధంగా ఓ రోజు మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేసి వీధి గుమ్మంలో అరుగు మీద కూర్చుని తాంబూలం వేసుకునే ప్రయత్నం చేస్తుండగా తమలపాకులకి సున్నం రాద్దామనుకుంటుండగా సున్నపు పిడత కనిపించలేదు. అప్పుడే జంఘాల శాస్త్రి గారి దగ్గరికి అయోమయ శాస్త్రి, చాదస్తపు శర్మ వచ్చి మాట్లాడుతున్నారు. వారిముందు తన పాండిత్యం ప్రదర్శిద్దామని కొంచెం నోటికి దురదెక్కువై భర్యని సున్నం తెమ్మని చెప్పడానికి ఓ పద్యం చెప్పేరు.

పర్వతశ్రేష పుత్రిక పతి విరోధి
అన్న పెండ్లాము అత్తను కన్నతండ్రి
ప్రేమతోడుత కన్నట్టి పెద్దబిడ్డ
సున్నంబుతేగదే సన్నుతాంగి

అని తన నోటిదూలని మహా ఫోజుగా ప్రదర్శించారు. అదిచూసి అయోమయశాస్త్రి, చాదస్తపు శర్మ ఆ…హ ఓ…హోం అంటూ జంఘాల శాస్త్రిని ఆకాశమంత ఎత్తుకి పొగిడేస్తూ భజన ప్రారంభించేరు. ఇక్కడ జంఘాల శాస్త్రి పద్య అర్ధాన్ని పరిశీలిద్దాం.


పర్వత శ్రేష్ట పుత్రిక – హిమవంతుని కుమార్తె పార్వతియొక్క
పతి – భర్తయైన శివునియొక్క
విరోధి -శత్రువైన మన్మధునియొక్క
అన్నపెండ్లాము – అన్నగారైన బ్రహ్మదేవుని భార్య సరస్వతియొక్క
అత్తకు – అత్తగారైన లక్ష్మీదేవిని
కన్నతండ్రి – కన్నతండ్రైన సముద్రుని
ప్రేమతోడుత బిడ్డా – పెద్దకుమార్తె యైన జ్యేష్టాదేవి
సున్నంబు తేగదె సన్నుతాంగి – సున్నము తీసికొనిరా ( సన్నుతాంగి అనేది ఉత్తుత్తి సంబోధన)

ఏతా వాతా దీని భావమేమిటంటే- “ఓసి దరిద్రపుగొట్టు పెద్దమ్మా! సున్నం పట్టుకురా” అన్నాడు.” ఈ సమయంలో గేన పెసూనాంబ గారు ‘వడియాలు’ పెడుతున్నారు. ఆ వడియాలకి చోవి కొంచెం పల్చనైపోవడంతో వడియాలు సరిగా రావటంలేదు. ఆ సమయంలో జంఘాల శాస్త్రి పద్యం చెప్తూ సున్నం తెమ్మని పిలిచేసరికి ఆవిడకి బాగా చిర్రెత్తుకొచ్చింది. పెడుతున్న వడియాల పిండి దగ్గరలోనున్న జంఘాల శాస్త్రి ఫొటోకేసికొట్టి సున్నపు పిడత పట్టుకుని వెళ్లి తనుకూడా ఓ పద్యం చెప్పి అందించింది సున్నం.

శతపత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ సూనిని మామన్
సతతము తలదాల్చునాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో

గేన పెసూనాంబ గారి పద్య అర్ధాన్ని పెరిశీలిద్దాం.

శతపత్రంబుల మిత్రుని – సూర్యుని
సుతు – కర్ణుని
చంపినవాని – చంపిన అర్జునుని
బావ – శ్రీకృష్ణుని
సూనుమామన్ – కుమారునకు మేనమామయైన చంద్రుని
సతతము – నిత్యము
తలదాల్చునాతని – నెత్తిమీదమోసే శివునియొక్క
సుతు – కుమారుడైన వినాయకుని
వాహన – వాహనమైన ఎలుకకు
వైరి – శత్రువైన పిల్లికి
వైరి- శత్రువైన ఓ కుక్కా
సున్నంబిదిగో – ఇదిగో సున్నం తీసుకో.

గేనపెసూనాంబ భర్తని, తక్కిన వారిని చూసి భర్త జంఘాలశాస్త్రిని సంబోధిస్తూ… “ఓరి కుక్కా! సున్నమిదిగో అని వాత పెట్టింది. గేనపెసూనాంబ కోపం ఎలావుంటుందో తెలిసిన జంఘాల శాస్త్రి ఇది విని వెంటనే చేతిలోనున్న తమలపాకులు చాదస్తపు శర్మకిస్తూ మీరు వేసుకోండోయ్ తాంబూలం అంటూ అక్కడనించి లేచి ఇంటి లోపలి కి వెళ్ళేరు.