జోల పాటలు
- హాయీ హాయీ ఆపదలు గాయీ
- కస్తూరి రంగ రంగా
- చందమామ రావే
- జో అచ్యుతానంద
హాయీ హాయీ ఆపదలు గాయీ
హాయీ హాయీ ఆపదలు గాయీ
చిన్నవాళ్ళను గాయీ శ్రీవెంకటేశా..
వేంకటేశ్వరుని కొండ వేడుకల కొండా
మొక్కి తిరుపతి కొండా ఎక్కి చూద్దాము
ఉళుళుళు చిలకల్లు చెలరేగి జీడి కొమ్మెక్కు
అబ్బాయి చెలరేగి మామ భుజమెక్కు
మామ భుజమెక్కి ఏమేమి అడుగు?
పాల్ త్రాగు గిన్నడుగు పాడావునడుగు ..ఉళుళుళు
హాయీ హాయీ ఆపదలు గాయీ
చిన్నవాళ్ళను గాయీ శ్రీవెంకటేశా..
ఆడితే పాడితే అవ్వలకు ముద్దు
చప్పట్లు తట్టితే తాతలకు ముద్దు
చిట్టి ముత్యము పుట్టె సీత కడుపునా
స్వాతి వానలు కురిసె సంద్రాల మధ్య..ఉళుళుళు
హాయీ హాయీ ఆపదలు గాయీ
చిన్నవాళ్ళను గాయీ శ్రీవెంకటేశా..
అందరి మామల్లు చందమామల్లు
అబ్బాయి మామల్లు రామలక్ష్మణులు
బూచివాడా రార బుట్టల్లుకోరా
బుట్టలో బాబును పట్టుకొని పోరా
నిద్రకు వెయ్యేండ్లు నీకు వెయ్యేంఢ్లు
నీతోటి బాలురకు నిండు వెయ్యేండ్లు..ఉళుళుళు
హాయీ హాయీ ఆపదలు గాయీ
చిన్నవాళ్ళను గాయీ శ్రీవెంకటేశా..
ఆయమ్మబాయమ్మ అక్కఛెల్లెల్ల్లు
తొలిఒక్క జన్మాన తొడికోడళ్ళూ ..ఉళుళుళు
హాయీ హాయీ ఆపదలు గాయీ
చిన్నవాళ్ళను గాయీ శ్రీవెంకటేశా..
కస్తూరి రంగ రంగా
కస్తూరి రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా
శ్రీ రంగ రంగ రంగా నినుబాసి నేనెట్లు మరచుందురా
కంసునీ సంహరింప సద్గురుడు విష్ణువే కృష్ణావతారమెత్తినప్పుడు
ఆదివారము పూటనూ, అష్టమి దినమందు జన్మించెను
తలతోటి జనన మయితే, తనకు బహుమోసంబు వచ్చుననుచు
ఎదురు కాళ్ళన బుట్టెను, ఏడుగురు దాదులను చంపెనపుడు
నెత్తురుతోటిండియు యాబాల కావు కావున ఏడ్చెను
ఇకనైన ఎత్తుకొనవే నా తల్లి దేవకీ వందనంబు
వడలెల్ల హీనంబుతో ఈ రీతినున్నావు కన్న తండ్రీ
నిన్ను నే నెత్తుకోనీ ఏ త్రోవ పోదునే చిన్నబాలా
నీ పుణ్యమాయె కొడక నీవొక్క నిమిషమ్ము తాళరన్న
గంగనూ ప్రార్ధించెను జల నిధుల గంగతానుప్పొంగెను
గంగానదీలోనప్పుడు దేవకీ జలకంబులాడగానూ
నీ పుణ్యమాయె కొడక నీవొక్క నిమిషమ్ము తాళరన్న
కామధేనువునప్పుడు దేవకీమదియందు తలచగానూ
పాల వర్షమె కురిసెను, అప్పుడు ఆ బాలపై చల్లగాను
తడివస్త్రములు విడిచి, దేవకీ పొడివస్త్రములు కట్టెను
పొత్తుళ్ళమీదనపుడు ఆ బాలుడు చక్కంగ పవళించెను
వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠ వాసుడమ్మా
సీతా కళాస్తుడమ్మా ఈ బిడ్డ శ్రీరామ చంద్రుడమ్మా
వీపునా వింజామరా, నా తండ్రి బొడ్డునా పారిజాతం అరికాల తామరాలు, భుజమందు శంఖుచక్రములు కలవు
చందమామ రావే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగు పూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
వెండి గిన్నెలోన వేడిబువ్వ తేవే
చందమామ రావే జాబిల్లి రావే
పైడి గిన్నెలోన పాలబువ్వ తేవే
అన్నన్ని తేవే
అందాల పాపకు/బాబుకు అందిచ్చి పోవే
చందమామ రావే జాబిల్లి రావే
తేరు మీద రావే తేనెపట్టు తేవే
పల్లకిలో రావే పానకాలు తేవే
పరుగెత్తి రావే పట్టుబట్టలు తేవే
అన్నన్ని తేవే
అందాల పాపకు/బాబుకు అందిచ్చి పోవే
జో అచ్యుతానంద
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా..జో జో
తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించీ
నాలుగూ వేదముల గొలుసులమరించీ
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా..జో జో
బలువైన ఫణిరాజు పానుపమరించీ
చెలుల డోలికలలొన చేర్చి లాలించీ..జో జో
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా..జో జో
ముల్లోకములనేలు ముమ్మూర్తులారా
అడ్డాలలో నేడు బిడ్డలైనారా ..జో జో
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా..జో జో
ఏ జన్మలో ఏమి నోము నోచినానో
ఈ జన్మలో నాకు బిడ్డలైనారూ..జో జో
జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా..జో జో