మహా శివరాత్రి (Maha Sivaratri)

మహా శివరాత్రి విశిష్టత

‘‘నమశ్శమ్భవేచ మయోభవేచ

నమః శంకరాయచ మయస్కరాయచ

నమః శివాయచ శివతరాయచ’’

-శ్రీరుద్ర ప్రశ్న (నమకము)

ఇహపరములు రెండింటిలోను సుఖశాంతులు ప్రసాదించు శివునికి నమస్కారం. ప్రాపంచిక ఆనందాన్ని మోక్షానందాన్ని ప్రసాదించే పరమేశ్వరునికి నమస్కారము. దివ్య మంగళ స్వరూపుడైన పరమాత్మకు వందనములు. శుభాలకు మించిన శుభమగు శాశ్వత స్థితిని ప్రసాదించు ఈశ్వరునికి ప్రణామములు. తనను పొందిన వారిని శివమయం చేసి శుభాలను కటాక్షించే శంకరునికి నమస్మృతులు. ఇటువంటి పరమశివునికి నమస్కారములు, పాదాభివందనములు’’ అని, శ్రీరుద్ర ప్రశ్న. అనగా రుద్ర సంహిత (రుద్ర నమకము) ప్రణమిల్లుతోంది.

మహాశివరాత్రి అంటే..

ఇది మహాశివరాత్రి. శివుని గురించి చెప్పుకున్నాము. మిగిలిన విశేషాలను పరిశీలిద్దాం. మహాశివరాత్రి ఒక గొప్ప పర్వదినం. అజ్ఞానానికి చిహ్నమైనది రాత్రి.. చీకటి. మరి ఇది మంగళకరమైన రాత్రి ఎట్లా అయింది. శివ అనగా మంగళకరము. శుభప్రదము అని అర్థం. శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, శివుని దర్శనమ్. బిల్వార్చన, అభిషేకము, నామ సంకీర్తన వలన అజ్ఞానం అనే చీకటి తొలగించబడుతుంది. అనగా జ్ఞాన వెలుగు ద్యోతకమవుతుంది. అందుకే ఇది శివరాత్రి. ‘శివ’ అంటే శుభప్రదమైనది, మంగళకరమైనది. రాత్రి అయినా నిద్రపోకుండా జాగరణ చేస్తాము. కాబట్టి ఇది ‘దినము’. దినమైనా రాత్రిలాగా ఉపవాసం చేస్తాము. కనుక రాత్రి, మిగతా పండుగలాగా విందు వినోదాలు ఈ పండుగకు ఉండవు. ఉపవాస దీక్షతో ఉండాలి. రాత్రంతా జాగారం చేయాలి. ‘ఉప’ అనగా సమీపము. వాసము అంటే ఉండటము. ఉపవాసమంటే, సమీపములో ఉండటము. ఎవరికి! పరమాత్ముడు అంటే ఆ రోజంతా దైవచింతనతో ఉండటం.

‘శివరాత్రి ఎప్పుడు వస్తుంది?

ప్రతి మాసంలోను శివరాత్రి వస్తుంది. దాన్ని మాసశివరాత్రి అంటారు. అమావాస్యకు ముందురోజైన చతుర్దశిని, మాస శివరాత్రి అని పిలుస్తారు. మాఘమాసంలో వచ్చే మాసశివరాత్రిని మహాశివరాత్రి అంటారు.

మాఘమాస విశిష్టత ఏమిటి? చతుర్దశి నాడే ఎందుకు చేయాలి?

మహాశివరాత్రి మాఘమాసంలోనే ఎందుకు చేయాలి? చతుర్దశి నాడే ఎందుకు చేయాలన్న సందేహం అందరిలో వస్తుంది. మఖా నక్షత్రంలో పౌర్ణమికి సంబంధం గల మాసం, మాఘమాసం. మానవుని అఘములను అనగా పాపములను హరించే మాసం. త్రిముక్త్యాత్మకులైనడైన సూర్యభగవానుని జయంతి మాఘంలోనే వస్తుంది. మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. సింహరాశికి అధిపతి రవి. మాఘ శుద్ధ సప్తమి నాడు, సూర్యభగవానుడు మొదటిసారిగా భూమిపై తన కిరణములను ప్రసరింపజేశాడని పురాణములు చెపుతున్నాయి. అనగా సూర్యరథ చక్రము ఉత్తరదిశగా తిరిగి పయనిస్తాయి. మనం ఉత్తరులమవుతాము. చతుర్దశి, అమావాస్యలలో సూర్యుడు, చంద్రుడు కలిసి ఉంటారు. ‘‘చంద్రమా మనసోజాతః’’ చంద్రుడు మనస్సుకు కారకుడు, అధిదేవత. చంద్రకళలు కృష్ణపక్షంలో దినదినం క్షీణించి చతుర్దశి నాడు కేవలం ఒక కళే ఉంటుంది. అలాగే మనసుకు చేరిన పదహారు మాలిన్యములలో (అష్టమదములు -8, అరిషడ్వర్గములు -6, మనసు -1) అహంకారం ఒక్కటి మిగిలి ఉంటుంది. ఆ మాలిన్యాన్ని దూరం చేసుకోవడానికి మాఘకృష్ణ చతుర్దశి శ్రేష్టమైన తిథి గాను, ఆ రాత్రి జ్ఞాన వెలుగునిచ్చే శివరాత్రి గాను, ఆ జ్ఞాన వెలుగు, మహాశివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ద్యోతకమవుతుంది.

త్రిమూర్తులు – శివతత్త్వం:

బ్రహ్మ, విష్ణు, శివులు త్రిమూర్తులు. మూర్తి అంటే ‘ఆకారం’ నిరాకారమైన పరమాత్మ తత్త్వం ఒక్కటే అదే, మూడు ఆకారాలను ధరించి ముగ్గురు దేవతలయింది. సృష్టి చేయవలసిన అవసరంతో ‘బ్రహ్మ’ అయింది. స్థితిని కాపాడే సందర్భం విష్ణువైంది. అలాగే దీనికంతటినీ లయం చేయవలసి శివుడయింది. లయానికి సంకేతమైంది శివతత్త్వం. నామ రూప క్రియాత్మకంగా భాసించి చరాచర పదార్థాలన్నీ లయమయితే, ఇక మిగిలేదేమిటి? ఏది లయం చేసికొన్నదో అది ‘‘న భూమిర్నతోయం నీతేకో నా వాయః’’ అని సృష్టి అంతా నశించినా సృష్టికి ఆధారమైన ఏ మూలతత్త్వం ఉన్నదో, అది నశించదు. నశిస్తే శవం, నశించకుంటే ‘శివం’. నశించేదానికి సాక్షి గనుక, అది సర్వదా శివమే, సదాశివమే. అదే శివతత్త్వం శివలీలా వైభవం.

లింగరూపం వైశిష్ట్యం:

నశించటానికి సాక్షి శివమే. ఇలాంటి సాక్షి అందరిలోనూ ఉంటుంది. అదే మన శరీరాన్ని, దాని చుట్టూ పరచుకొని ఉన్న ఈ ప్రపంచాన్ని నిత్యమూ గమనిస్తూ ఉండేది మన జ్ఞానం’’. దీనికే ‘చిత్’ అని పేరు, వేదాంత పరిభాషలో, తానుండి గదా దేనినైనా గమనించవలసింది. ఈ ఉండటానికే ‘‘సత్’’ అని పేరు. పరిపూర్ణమైన సత్, చిత్‌ల సమాహారమే శివస్వరూపం. అని నామరూపాలన్నింటినీ లయం చేసికొని, నిరాకారంగానే శేషించిన భావాలు కనుక లింగరూపం. రూపంగాని రూపమది. శివతత్త్వానికి ఆది, మధ్య, అంతాలు లేవని చెప్పటానికే దాన్ని లింగరూపంగా భావన చేశారు. ఇది నిరాకార తత్త్వం. ‘‘లీనంగామయతీతి లింగం’’ లింగం అండాకారం. దానికేది మొదలు ఏది తుది అని నిర్ణయించలేము. భగవతత్త్వమిలాంటిదే. నిరాకారమైనప్పుడే ఆద్యంత రహితమవుతుంది. అప్పుడేది ‘‘శివ’’. ‘‘శ్రీచక్రం శివమోర్వపుః’’ అన్నాడు శంకర భగవత్పాదులు. శ్రీచక్రంలో శ్రీ పరమేశ్వరి – వేదమాత, చక్రం బిందుచక్రము, హిరణ్యమనబడు శివుడు. కనుక, శ్రీచక్రము శివశక్తి స్వరూపము. కనుక శివలింగ స్వరూపమే అవుతుంది. ఆ చక్రము శివలింగమునకు ప్రతిరూపము.

శివలింగము కింద పీఠముంటుంది. ఆ పీఠము ‘అంబ’ అని శ్రీయని, పై లింగము చిత్స్వరూపి, చక్రరూపియయిన శివుడిని శివ పురాణం తెలుపుతోంది. ‘‘ఉమాశంకర యోర్యోగోయః నా యోగో విష్ణు రుచ్యతే’’ ఉమాశంకరుల యోగము అనగా పీఠము దానిపై నున్న శివలింగమును ‘‘విష్ణువు’’ అంటారు. అనగా శివలింగమే విష్ణువు. విష్ణువే శివలింగము. తొమ్మిదిన్నర అడుగుల సాలగ్రామ విగ్రహం. కలియగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుని రూపం లింగరూపం కూడా విష్ణు రూపమే. విష్ణువు రూపం శివుడే. విష్ణువుశిమమయం. శివుడు విష్ణుమయము. ఇదీ శివలింగ వైశిష్ట్యం.

సాకారభావనలో పరమశివుడు

ఇంతవరకు నిరాకార భావనలో లింగాకారంలో శివయ్య విశేషములు చెప్పుకున్నాం. అలాకాక సాకారమని భావించినా శివమే. అప్పుడది అమూర్తమైన నిర్గుణ నిరాకార లింగం కాదు. మూర్తమైన శివ విగ్రహం. అష్టమూర్తి అది. పృథి వ్యాదులైన పంచభూతములు బాహ్యమైన రూపమైతే, మనోబుద్ధి అహంకారములు అనగా చంద్రుడు, సూర్యుడు, జీవుడు వెరసి అష్టమూర్తులు. ఇవి ఆ పరమాత్మ విగ్రహంలోనే లీనమై అందులో ఏకమై ఉన్నాయని భావం. ఎలాగో పరిశీలిద్దాం. ఆయన భస్మానులేపనం పృథ్వికి, గంగాజలాజూటం జలతజ్ఞానికి, ఫాల నేత్రం అగ్నికి, నాగభూషణత్వం వాయువుకు, దిగంబరత్వం ఆకాశానికి సంకేతమైతే, చంద్రశేఖరత్వం మనస్సుకు, వృషభవాహనం బుద్దికి, గజ చర్మధారణం అహంకారానికి చిహ్నలు. త్రిశూలధారణం, త్రిగుణాలు (సత్వ, రజ, తమో గుణాలు) తనకు అధీనమైయున్నాయని, తమ త్రిగుణాతీతుడినని తెలియపరుస్తున్నాడు. అమ్మవారు శరీరానే్న పంచుకొని ఉన్నదంటే అర్థం ఏమిటి? చిద్రూపం శివతత్త్వమైతే, సద్రూపం శక్తితత్త్వం. సత్ చిత్‌లు అవినాభూతమైనవని చూపటం ఇది. దానికి రూపకల్పనమే పరమశివుని అర్థనారీశ్వర తత్త్వం’’ సత్వజ్ఞానానందరూపా సామరస్య పరాయణా’’ అన్నది లలితా సహస్రనామం. ఇది పరమశివుని సాకార రూప విశేషాలు. అర్థనారీశ్వర తత్త్వ వైశిష్ట్యం.

శివశబ్దార్థం

‘శం’ అంటే నిత్య సుఖం, ఆనందం. ‘ఇ’ కారము పరమ పురుషుడు. ‘ద’ కారం – అమృత స్వరూపిణి యగు ‘శక్తి’., ఈ మూడింటి సమ్మేళనమే ‘శివ’ అవుతుంది. అనగా ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివశబ్దార్థము. సకల విధ కర్మలను తన వశంలో ఉంచుకునే వాడు ‘వశి’ అని పిలువ బడతాడు. ‘‘వశి’యే శివ అయింది. అనగా జితీంద్రియత్వం. కనుక, ‘శివ’ అంటే జితీంద్రియుడని పేరు. జితీంద్రియుడైన శివుణ్ని ఆరాధిస్తే, అభిషేకిస్తే, ఉపాసిస్తే, మనం కూడా జితీంద్రియులమవుతాం. ఇంద్రియాన్ని జయించే శక్తివంతులమవుతాం అని పేర్కొన్నది శివపురాణం. ‘‘శమయతీతి శివః’’ అందరినీ బ్రహ్మానందంలో శమీప జేసేవాడు వివుడు. ‘‘శామ్యతీతి శివః’’ బ్రహ్మానంద స్వరూపుడు, నిర్వికారుడుగాన శాంతించి, శమించి ఉండేవాడు శివుడు. ‘‘శేతే సజ్జన మనస్సు ఇతిశివః’’ సజ్జనుల మనస్సులలో శయనించి ఉండేవాడు శివుడు. ‘‘శివం వేదః సత్యోగత్’’. శివమనగా వేదమ. ‘‘ఓంశ్శాంతి శ్శాంతి శ్శాంతిః’’ అని ప్రపంచమునకు శాంతి మార్గాన్ని దర్శింపజేసి, శాంతింపచేయు, చేయగల వేదములు శివమవుతాయి. దాని యోగము గలవాడు శివుడు. ‘‘శివప్రదత్వాత్ శివాః’’ మంగళములను, శుభములనొసగేవాడు శివుడు. శివుని రూపములు రెండు. ఒకటి పురుష రూపం, రెండవది లింగరూపం. వీని తత్త్వాన్ని వేదములు, ఉపనిషత్తులు, పురాణములు మున్నగునవి వెల్లడించాయి.

పరమశివుని విశేషాలు

దుఃఖపడే వారిని తొందరగా ఆదుకొని రక్షించడంలో అగ్రేసరుడు పరమశివుడు. ఆర్తరక్షణ కళా సంరంభుడు. శంభుడు. పంచభూతములకు ఆత్మయైన వాడు, భూతనాథుడు. జీవులకు కారణ రూపమైన పరమాత్మ. అన్ని లోకాలను పాలించేవాడు. లోకంలోని బంధమోక్షాలకు ప్రభువు. దుఃఖించే వారిని చేరదీసే తండ్రి. బుద్ధిమంతుడు. ప్రీతితో పూజించే పరమాత్మ. సమస్తమైన సృష్టికీ, స్థితికి, లయానికీ కర్త పరమశివుడు. బ్రహ్మ, విష్ణు, శివుడనే పేర్లతో ప్రకాశించే వాడు పరమశివుడు. ప్రకృతి పురుష స్వరూపుడు. శబ్దానికీ జన్మస్థానం పరమశివుడు. లోకానికి అంతరాత్మ. సమస్తానికి ప్రాణం పరమశివుడు. ‘‘మూడు మూర్తులకు, మూడు లోకములకు, మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది న భేదమై యొప్పారు, బ్రహ్మమనగా నీవ ఫాలనయన’’ మొదట భేదంతో కనిపించినా, చివరికి అభేద స్వరూపంతో ఒప్పే స్వరూపం పరమశివుడు.

గంగావతరణం

ఆకాశం నుండి కిందకు వస్తుంటే నన్ను ధరించగల వాడెవడు, సమర్థుడెవడు? గంగాదేవి, భగీరథుని ప్రశ్నిస్తే, భగీరథుడు చెప్పిన సమాధానంతో పరమశివుని శక్తిసామర్థ్యాలు విశదపడతాయి. ‘‘ఓ తల్లీ తనలో సమస్త లోకాలనూ కలిగి ఉండటం వల్ల, అన్నిటా తానై ఉండటం వలన, పడుగు పేక ఉన్న దారాల్లో వస్త్రం ఉన్న విధంగా విశ్వమంతటా వ్యాపించిన ఆ శివుడు కాక నీ ప్రవాహవేగాన్ని భరించగల సమర్థుడెవడు? నిన్ను ధరించటం కోసం ఆ సదాశివుణ్ని ప్రార్థిస్తానన్నాడు భగీరథుడు. ఇది పరమశివుని విశేషం తెలియజేస్తుంది.

‘‘అజిశ్చ బహురూపశ్చ గంధధారీ కపర్ష్యపి’’ అన్నది శివసహస్రనామ స్తోత్రం. పుట్టుక లేని వాడు, విశ్వమందలి రూపములన్నీ తానే అయిన వాడు, గంధము, కుంకుమ, కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములను ధరించువాడు రుద్రుడు కనుకనే శివలింగానికి సుగంధ ద్రవ్యములతో కూడా అభిషేకము చేస్తారు. ‘‘కపశ్చాసౌబుద్ధశ్చకపర్ణీ’’ అని సమాసము. ‘‘కం జలం పిబతీతి కపః’’ ఋతుధాతువునకు ఐశ్వర్యమర్థము ఋతమునిచ్చువాడు బుద్ధుడు. నీటి గ్రహించి, ఐశ్వర్యాన్నిచ్చేవాడు. స్వర్గము నుండి పడుతున్న గంగాదేవిని గ్రహించి, తరువాత భగీరథుని ప్రార్థనతో నీటిని ఐశ్వర్యమును ఇచ్చిన వాడు.

అభిషేకములు, బిల్వార్చన

ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక నమక చమకములతో మహాన్యాస పూర్వాక ఏకాదశ రుద్రాభిషేకం, వివిధ రకములైన అభిషేక ద్రవ్యములతోనూ, పంచామృతములతోనూ ఆచరిస్తారు. ‘‘త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మపాప సంహారం ఏక బిల్వం శివార్పణం’’ అంటూ బిల్వార్చన చేస్తారు. మానవులను ప్రభావితం చేసే సత్పరకో తమో గుణములకు, త్రికాలములకు త్రితాపములకు, త్రిదళములతో కూడిన బిల్వపత్రము బిల్వ దళము శ్రీ మహాలక్ష్మీ కటాక్షం. పుష్పించకుండా ఫలించే వృక్షం మారేడు వృక్షం. ఈ శరీరమే ‘బిల్వ దళము’. త్రిగుణముల ఏకత్వాన్ని సాధించినప్పుడే భగవంతుని అర్పణకు అర్హతను పొందుతుంది. ఏకత్వాన్ని తెలియపరచేదే ఈ బిల్వదళం. మూడు దళములే కాక, ఐదు, ఏడు, తొమ్మిది, పనె్నండు దళములతో కూడిన మహాదళములు కూడా ఉన్నాయి. వాటితో చేసే అర్చన విశేష ఫలితాల్నిస్తుంది. ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు వెరసి పదకొండు తత్వాలు, మానవుని విషయ వాసనల్లోకి దింపి, బంధములకు కారణభూతులౌతాయి. వాటిని మన ఆధీనంలో ఉంచుకోవటానికే ఏకాదశ రుద్రాభిషేకం.

జాగరణ: అంటే నిద్రను జయించటం. ఏవిధంగా జయించాలి? నిరంతన భగవత చింతన, నామసంకీర్తనములతో రాత్రి అంతా సత్కాలక్షేపము, సద్గోష్ఠితో గడుపుటయే జాగరణ. లక్ష్మణుడు అరణ్యవాస దీక్షను జాగరణతోనే గడిపాడు.

భస్మధారణం ఏం చెపుతుంది?

మనిషి భూమి మీదకు వస్తూ తెచ్చిందేమీలేదు. పోయేటప్పుడు తీసుకొనిపోయేదేమీ లేదు. పుట్టుక, మరణం మధ్య జీవితం ఒక నాటకం. చివరకు మానవుడు రూపాంతరం చెందేది ‘‘్భస్మంగాక’’ ‘‘నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము’’ అన్నాడు గదా అన్నమయ్య. స్వార్థ రహితంగా, త్యాగ బుద్ధితో నలుగురికీ ఉపయోగపడే మంచి పనులు చేస్తూ, బ్రతికి కొంతకాలం మంచిగా జీవించి ఆదర్శంగా ఉండమని చెప్తోంది.

స్మశాన వాస్తిత్వం ఎందుకు?

ఎంతటివారైనా ఏదో ఒక రోజు స్మశానానికి చేరవలసిందే. తనతో వచ్చిన వారందరూ వెళ్లగా దుఃఖిస్తుంది సూక్ష్మప్రాణి. ఒంటరి అయిన నీకు, ఈ స్మశానంలో నేనున్నానని అభయాన్నివ్వడానికే స్మశానవాసిగా ఉంటాడు పరమశివుడు. తన ఉనికి అశాశ్వతమని గుర్తుంచుకొని, అహంకారాన్ని రూపుమాపుకుని వినయాన్ని విస్మరించక, వివేకంతో పరిమిత జీవితాన్ని ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోవాలని హెచ్చరిస్తున్నాడు స్మశానవాసి యైన పరమశివుడు.

శివతాండవం: అనంత విశ్వంలోని నిరంతర చైతన్య స్వరూపమే మహాశివుడిని దర్శింపజేస్తుంది. కనుకనే అది ‘‘ఆనంద శివతాండవం’’. చీమ నుండి బ్రహ్మ వరకు సర్వమూ సర్వేశ్వరుని లీలా విలాసమే. ఆనంద శివతాండవంలో పరమశివుడు నటరాజస్వామిగా దర్శనమిస్తాడు. ఇది ప్రకాల పూజ. దోషము అంటే రాత్రి. రాత్రికి ముందు సమయము ప్రదోషకాలం. ప్రదోషకాల పూజ శివునికి అత్యంత ప్రీతికరం.

నంది వాహనంలోని ఆంతర్యం:

పరమశివుడు సర్వాంతర్యామి గదా, మరి ఆయనకు నంది వాహనమెందుకు? పరమాత్మ తత్త్వానికి లింగము ఎలా చిహ్నమో, జీవతత్త్వానికి నంది చిహ్నము. పశుత్వముతో కూడిన జీవతత్త్వము. ప్రకృతి వైపున తన దృష్టిని తిప్పక, ఈశ్వరుని వైపు తిప్పటంతో భగవంతుని ఈ సన్నిహిత సంబంధాన్ని పొందింది నంది. నందికి ఈశ్వరలింగానికి మధ్యలో ఎవరూ అడ్డు తగలకూడదు. నంది ధర్మానికి ప్రతీక. నంది శృంగముల మధ్య నుండి ఈశ్వర లింగాన్ని దర్శించాలని చెప్తారు. పశుత్వము నుండి బయటపడి, ధర్మాన్ని ఆచరిస్తూ దైవత్వాన్ని చింతించటం ద్వారా, నంది ఈశ్వరుడుగా మారి, నందీశ్వరుడుగా ఏకమవుతాడు. మనలోని పశుత్వాన్ని అణచుకొని, దృష్టిని ఈశ్వరుని వైపు మరల్చి ధర్మమార్గంలో నడవాలని హెచ్చరిస్తున్నాడు నందీశ్వరుడు.

శివరాత్రి మహాత్మ్యం:

మహా శివరాత్రి పర్వదినంలో, మృగములను వేటాడే నిమిత్తం ఒక వేటగాడు చెట్టుపైకెక్కాడు. చెట్టుకు సమీపంలో వలను వేసి పెట్టాడు. ఎంతరాత్రి అయినా ఒక్క మృగము కూడా ఆ దిక్కుకు రాలేదు. ఈ జాగరణలో చెట్టు ఆకులను త్రుంచి కింద వేయసాగాడు. అతను ఎక్కి కూర్చున్నది ఒక బిల్వ వృక్షము. అతనికి తెలియకుండానే శివరాత్రి రోజున శివలింగానికి బిల్వార్చన చేశాడు. తెల్లవారింది. ఇంటికి వెళ్లాడు. అతని భార్య కూడా భర్త రాక కోసం ఎదురుచూస్తూ జాగరణ చేసింది. ఉపవాసంతో. దీని ఫలితంగా భార్యాభర్తలిద్దరూ శివ సాన్నిథ్యాన్నందుకున్నారనే గాథ. శివరాత్రి మహాత్మ్యానికి స్ఫూర్తినిస్తుంది.

కళ్యాణం: శ్రీరాముడు జన్మించినరోజునే కళ్యాణం చేస్తాము. ఇది ఆగమ శాస్తర్రీత్యా జరుపుతారు. అలాగే లింగోద్భవ కాలంలోనే శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అత్యంత శుభప్రదమైన శివపార్వతుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించిన వారికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి. లింగోద్భవ సమయంలో శివలింగానికి జరిగే అభిషేకాదులతో విశ్వశాంతి కలుగుతుంది.

పంచభూతలింగ క్షేత్రములు

‘‘పంచభూత రూపుడిను నేనే’’ అని తెలియజేయటానికి, పరమశివుడు దక్షిణ భారతదేశంలో ఐదు క్షేత్రములందు ఆవిర్భవించి భక్తుల కోర్కెలను, జగన్మాతా సమేతుడై తీరుస్తున్నాడు.

చిదంబరం: ఇక్కడున్న నటరాజస్వామి ఆలయంలో ఉన్నదే, ఆకాశలింగం. సృష్టిలో మొదటిది ‘ఆకాశం’. శివుడు, ఆకాశ రూపంలో ఇక్కడ వెలసి ఉన్నాడు.

శ్రీకాళహస్తీశ్వరాలయం: ‘శ్రీ’ అంటే సాలె పురుగు. ‘కాళ’ అంటే పాము. హస్తి అంటే ఏనుగు. మూడూ కలిసి శివలింగాన్ని పూజించి, ముక్తిని పొందటం చేత ఆ పేరు వచ్చింది.

అరుణాచలం: అగ్నిలింగం. ‘‘అరుణాచల నాథం స్మరామి అనిశం, అపీత కుబాంబా సమేతం, అప్రాకృత తేజోమయ లింగం’’ అంటూ అగ్ని లింగాన్ని కీర్తించాడు దీక్షితార్.

జంబుకేశ్వరం: జలలింగం శ్రీరంగ పట్టణంలో కలిసే ఉంటుంది. పరమశవిని లింగరూపం కింద ఉన్న పీఠంలోంచి నిరంతరం నీరు (జలం) బొట్లుబొట్లుగా కారుత ఉంటుంది.

ఏకామ్రేశ్వర నాథుడు: పృథ్విలింగం. ‘‘చింతయమాకంద మూలకందం చేతః శ్రీ సోమాస్కందం’’ మాకంద అనగా మామిడిచెట్టు. దానికింద స్వయంభువైన పృథ్విలింగం. ఇవి పంచభూత లింగా క్షేత్రములు.

పంచారామములు: తారకాసురడనే రాక్షసుడితో కుమారస్వామి యుద్ధం చేస్తూ తారకాసురుడు ధరించిన ప్రాణలింగాన్ని తన శూలంతో ఛేదించగా ఆరు ముక్కలై ఆంధ్రప్రదేశ్‌లో ఐదు చోట్ల పడిందని పురాణ గాథ. అది ప్రాణలింగం కనుకనే, పడిన ఐదుచోట్లా, సంపూర్ణలింగములుగా ఆవిర్భవించాయి.

  1. గుంటూరు జిల్లా అమరావతిలోని అమరారామం, అమర లింగేశ్వరస్వామి,
  2. పశ్చిమ గోదావరిజిల్లా భీమవరంలోని ‘‘సోమారామం’’,
  3. తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం,
  4. సామర్లకోటలోని భీమారామం,
  5. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీరారామం.

ఇవి పంచారామములు. ఇవికాక, ద్వాదశ జ్యోతిర్లింగములు, ఇంకా అనేక శివాలయాలలో భారతదేశమంతటా (విదేశాలలోను) అభిషేకాలు, అర్చనలు చేస్తారు.

మహాశివరాత్రి సందేశం:

నాలుగు పురుషార్థాలలో, అర్థ కామాన్ని ధర్మంతో అనుభవించాలని, అపుడు మనిషి పశుత్వం నుంచి విముక్తుడై, పశుపతి తత్త్వాన్ని అందుకోగలడని, పాశుపతమైన ఈ దీక్ష ఉంటే, పశుపతి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని, సర్వమానవ సౌభ్రాతృత్వంతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలని, అదే శివతత్త్వమని, మహాశివరాత్రి బోధిస్తోంది.

Scroll to Top