నడిరేయి ఏ జాములో

నడిరేయి ఏ జాములో

“అనుకున్నవన్నీ జరగాలంటే అమ్మవారిని నమ్ముకోవాలి” అన్నది తెలుగు సామెత. అయ్యగారు అధికారహోదాలో ఉండి కొరకరాని కొయ్యగా ప్రవర్తించే మనిషి అయితే ఆయన ద్వారా ఏమైనా పనులు జరిపించుకోవాలంటే అమ్మగారిని అదేనండి సదరు అధికారి గారిభార్య గారిని జాగ్రత్తగా కాకాపట్టి మంచి చేసుకుంటే ఎంత క్లిష్టమైన పనయినా జరిగి పోతుంది.  ఇదే కదా మన సామెతకి అర్ధం.  బహుశా పురాణం కాలం నాటి వారు కూడా ఇందుకేమి మినహాయింపు కాదేమో!  అసలు వారు కూడా అలా ఉండబట్టే మనకి ఈ సామెత ఉద్భవించిందేమో.  తరతరాలుగా మానవాళి జీవితంలో ఒక అనుభవం ఎంత ప్రయోజనకరమైన అద్భుతమైన సామెతగా తయారైందంటే, ఈ అమ్మగారిని నమ్ముకుని పని పూర్తి చేసుకునే భావన ఈ నాటికీ తెలుగు సినిమాల్లో, సాహిత్యంలో పదేపదే ప్రస్తావించబడుతోంది. ఈ విషయాన్ని బహుశా చాలా అర్ధవంతంగా ఆకళింపు చేసుకున్నారేమో మన దాశరధి కృష్ణమాచారి గారు.  అందుకే సుమారు 53 సంవత్సరాల క్రిందట ఈ మేటి సందేశాన్ని ఒక తెలుగు సినిమా పాటలో ప్రయోగించారు,

చంద్రమోహన్,విజయనిర్మల, వాణిశ్రీ, అంజలి, త్యాగరాజు మొదలైనవారు నటించగా 1967 లో వాహినీ పిక్చర్స్ సంస్ధ B.N. రెడ్డిగారు స్వీయ దర్శకత్వంలో నిర్మించి విడుదల చేసిన చిత్రం “రంగుల రాట్నం”. ఇంకా మల్లంపల్లి చంద్రశేఖర్ రావు అనబడే  కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించిన ఈయనని “చంద్ర మోహన్” పేరుతో తెలుగు సినిమా రంగానికి పరిచయమైనది ఈ సినిమాతోనే.  “నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో” దాదాపు తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరి నోటా ఈ పాట బహుశా నానుతూనే ఉంటుంది. “భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తీ” అన్న ప్రకటన ఏ విధంగా అందరి నోళ్ళలో నానుతుంటుందో ఈ పాట కూడా అంతే. భగవంతుడిని ఏదైనా అడిగి ఆ కోరిక తీరేలా చేసుకోవాలంటే, ముందు ఆయన్ని అడుగుతాం ఇంకా ఎప్పటికీ ఆయన పట్టించుకోకపోతే ఇంకా చేసేదేమిలేక ఆయన భార్యగారికి  మొరపెట్టుకోవడం కంటే మించిన సులభమైన మార్గం మరొకటి లేదని ఈ పాత సినిమా గీతం చెబుతోంది. ఈ పాట సగటు మనిషి గుణాలను దేవుడికే ఆపాదించి అలరించిన ఈ గీతం తెలుగు సినీ గీత సాహిత్యంలో వెల్లివిరిసిన ఓ అనర్ఘరత్నం.

ఇంక పాటలోకి వస్తే “నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో  తిరుమల శిఖరాలు దిగి వచ్చునో” “మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ” అమ్మా అలివేలు మంగమ్మ, మమ్మల్నందరిని కంటికి రెప్పవలె కాపాడుతున్నావు కాదమ్మా మరి నువ్వే మా కష్టాలన్నీ కూడా తీర్చాలికదమ్మ. “పతిదేవు ఒడిలోన మురిసేటివేళ  స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ  విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా”.  అర్దరాత్రి ఏ జాముకి మా స్వామి కొండదిగి నీ దగ్గరకొస్తాడో! అప్పుడు– నువ్వు స్వామి ఒడిలో మురిసిపోతున్నప్పుడు –స్వామి నీవైపుచూస్తూ చిరునవ్వులు చిందిస్తూ పరవశించిపోతన్నప్పుడు– అప్పుడు స్వామి వారికి మా మనవి తెలియచేసి మా కష్టాలు తీర్చమని చెప్పమ్మా. 

“ఏడేడు శిఖరాల నే నడువలేను ఏపాటి కానుకలందించలేను  వెంకన్న పాదాలు దర్శించలేను  నేను వివరించి న బాధ వినిపించలేను”.  ఎందుకంటే నేను ఆ ఏడుకొండలు ఎక్కి స్వామి దగ్గరకి నడచి రాలేనమ్మా స్వామి పాద దర్శనం చేయలేనమ్మా.  వివరంగా నా బాధలు వివరించి చెప్పుకోలేనమ్మా.  మాకు తల్లివి నీవే కాబట్టి మా తరపున మా బాధలన్నీ  నువ్వే స్వామికి తెలియచేసి మమ్మల్ని కరుణించమని చెప్పవమ్మా అంటూ అమ్మ వారిని వేడుకుంటారు. రెండో చరణానికి వచ్చేసరికి ఎంత వేడుకున్నా, ఎలా వేడుకున్నా, ఎవరిద్వారా వేడుకున్న కనికరించని ఆ దేవదేవుని  మీద  చికాకు కోపం తన పరిస్థితిపై నిరాశ నిస్పృహలతో కూడిన వేదనలో మరోసారి తన తల్లి దగ్గరికి వెళ్లి అడుగుతాడు “కలవారినేగాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ”.  ఏమమ్మాస్వామి బాగా అన్ని సంపదలు కలిగి ఉన్నవారిని తప్పా ఏమీ లేనివారిని కరుణించలేడమ్మా!కన్నీరుతో బ్రతికే మాలాంటి వారి బ్రతుకులని చూసి ఆడుకులేనప్పుడు స్వామికి “కరుణామయుడు” అన్న బిరుదు ఎందుకమ్మా.  అడుగు తల్లి అంటూ భావావేశాలని ప్రదర్శించే ఈ పాట సాహిత్యానికి అక్షర లక్షలు ఇచ్చినా తక్కువే అని చెప్పొచ్చు.  ఇలాంటి అద్భుతగీతాలు నాటి తెలుగు సినిమా పాటల  సాహిత్యంలో శిఖరాగ్రంలో నిలిచి తరాల కతీతంగా శ్రోతల హృదయాలను రంజింపజేస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.

ఈ సినిమాకి దాశరధి గారితో పాటు భుజంగరాయ శర్మ గారు  ఒక పాట రాసేరు.  ఆయన రాసిన “కలిమి నిలవదు లేమి మిగలదు కలకాలం ఒకరీతి గడవదు నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా వాడిన బ్రతుకే పచ్చగిల్లదా ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులరాట్నం” పాట కూడా చాలా గొప్ప సాహిత్య విలువలు కలిగినది, పూర్తిగా ఆర్ద్రతతో నిండినది.  అలాగే  ఈచిత్రంలో  దాశరధి గారు రాసి సుశీలమ్మ పాడిన  “కనరాని దేవుడే కనిపించినాడే కనిపించి అంతలో కన్నుమరుగాయె” పాట కూడా చాలా ప్రాచుర్యం పొందింది. అలాగే ఈ సినిమాలో మరో అద్భుతమైనపాట B.. వసంత, A.P. కోమల పాడిన “పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణా”.  ఈ సినిమాకి సంగీతం రసరాజశేఖరుడు సాలూరు రాజేశ్వరరావు అనే చెబుతారుకాని ఈ సినిమాకి సంగీతం నిర్వహించింది  సాలూరు రాజేశ్వరరావు  గారితో పాటు బి. గోపాలం గారు కూడా. మరి ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకుల నిర్వహణలో మరో ఇద్దరు దిగ్గజాలైన ఘంటసాల మాస్టారు జానకమ్మతో కలిపి పాడిన ఈ సందేశాత్మక గీతం ఎందుకు ప్రజాదరణ పొందదు?ఈ సినిమా 1967లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ తెలుగు సినిమాగా ఎన్నికచేయబడింది.