న్యాయపతి కామేశ్వరి (Nyayapati Kameshwari)

న్యాయపతి కామేశ్వరి

రేడియో అక్కయ్యగా పేరుపొందిన న్యాయపతి కామేశ్వరి గారు  విజయనగరంలో 1908లో జన్మించారు. ఈమె తండ్రి పేరిని జగన్నాధ దాసు. వీరిది పండితుల, విద్వాంసుల కుటుంబం. ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత విశాఖపట్నంలోని క్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాలలో చదివారు. మరల విజయనగరం వచ్చి మహారాజా కళాశాలలో డిగ్రీ 1932లో పూర్తిచేశారు. ఆ కాలంలో బి.ఎ. పాసైన మొట్టమొదటి మహిళ మన కామేశ్వరి గారు.  తరువాత కొంతకాలం నూజివీడు సంస్ధానం లో కపిలేశ్వరపురం జమిందారిణి జగదీశ్వరమ్మ గారికి ఇంగ్లీషు నేర్పారు. 1934లో న్యాయపతి రాఘవరావు గారితో వివాహం జరిగింది. తరువాత 1937లో మద్రాసులోని వెల్లింగ్టన్ టీచర్ ట్రైనింగ్ కాలేజీ లో ఉపాధ్యాయ శిక్షణ (ఎల్.టి.) పూర్తిచేశారు. ఇద్దరి అభిప్రాయాలు కలియడంతో భర్తకు తోడుగా, చెన్నై రేడియో కార్యక్రమాలలోను, బాల పత్రిక నిర్వహణలోను చురుగ్గా పాల్గొన్నారు.

      చెన్నై ఆకాశవాణి కేంద్రం వారు ఆటవిడుపు పేరుతో పిల్లల కార్యక్రమ నిర్వహణ చేపట్టి, ఆ కార్యక్రమ నిర్వహణ వీరికిచ్చారు. ఈమె ఆ విధంగా రేడియో అక్కయ్యగా స్తిరపడిపోయారు. రాఘవరావుగారు ఈమె భర్త అయినా, ఈమెతో పాటుగా రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తూండటంతో, అతనికి రేడియో అన్నయ్యగా పేరొచ్చింది.  తరువాత ఈ కార్యక్రమం బాలానందంగా రూపాంతరం చెంది ఆకాశవాణి హైదరాబాదు కేంద్రము నుండి అనేక సంవత్సరములు వీరిద్దరిచే నిర్వహించబడినది.  రేడియో లో ప్రసారమయ్యె స్త్రీల కార్యక్రమాలతో తృప్తిచెందక గ్రామీణ స్త్రీల కోసం 50 మహిళా సంఘాలనూ ప్రారంభిచారట. తన భర్తతో కలసి బాలానంద సంఘాన్ని ఏర్పరిచారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా ఈ సంఘంలో అతని చిన్నతనంలో సభ్యుడు.  మంచి వ్యవహార జ్ఞానం గల విదుషీమణి రేడియో అక్కయ్య అక్టోబరు 23, 1980లో పరమపదించారు.

Scroll to Top