న్యాయపతి రాఘవరావు
న్యాయపతి రాఘవరావు రేడియో అన్నయ్య గా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాల సాహిత్యవేత్త, బాల బాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళా కోవిదుడు, రచయిత. ఈయన 1905వ సంవత్సరం ఏప్రిల్ 13 న ఒరిస్సాలోని బరంపురం లో జన్మించాడు. తండ్రి న్యాయపతి రామానుజస్వామి ప్రముఖ న్యాయవాది. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసాడు. 1934 లో కామేశ్వరితో పెళ్ళయింది. రేడియో అక్కయ్యగా ప్రఖ్యాతిగాంచిన న్యాయపతి కామేశ్వరి ఈమెయే. రాఘవరావుకి బాల్యం నుంచి పిల్లలంటే ప్రాణం. వారికి కథలు చెప్పటమన్నా, నటించి చూపటమన్నా మహా ఇష్టం. పాఠశాలలో వక్తృత్వ పోటీల్లో కథలు చెప్పే పోటీల్లో ప్రథమ బహుమతులన్నీ అతని సొత్తే.
ఈయన డిగ్రీ అయ్యాక, మద్రాసు లో ది హిందూ పత్రికలో విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల తరువాత, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపై చేరారు. ఆ రోజుల్లో బీ.బీ.సీ లోని పిల్లల కార్యక్రామాల తరహాలో మనదేశంలో కూడ చిన్న పిల్లల కొరకు రేడియో ప్రసారలను ఆరంబించాలని అప్పటి ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంది. మద్రాసు రేడియోలో పిల్లల కార్యక్రమాలను దుర్గాబాయి దేశముఖ్ నిర్వహించేవారు. 1933 లో రాఘవరావు, కామేశ్వరి జంటకు ఆ అవకాశం లభించింది. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందారు. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్…….. పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చారు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి అండగా నిలిచి ఆ కార్యక్రమాలను విజయవంతం చేసి రేడియో అక్కయ్య గా పేరొందారు. రేడియోలో పనిని వారు ఉద్యోగంగా కాకుండా ఒక ఉద్యమంగా భావించారు.
ఆటవిడుపు కార్యక్రమానికి శ్రోతల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతోపాటే ఆ కార్యక్రమంలో పాల్గొనే పిల్లల సంఖ్య కూడా ఎక్కువ కావటంతో పది సంవత్సరాల లోపు పిల్లలకి శనివారం బాలానందం అనీ, పది సంవత్సరాలు పైబడిన వారికి మరో కార్యక్రమం పెట్టి బాలబాలికల సృజనాత్మక శక్తిని పెంపొందించే ప్రయత్నంలో ఈ రేడియో అన్నయ్య ఎంతో కృషి చేశారు. వారిని ఒడిలో కూర్చోపెట్టుకుని లాలించి, ముద్దాడి, ముద్దు ముద్దు పాటలు పాడిస్తూ, వారి పాటలకు అనుగుణంగా నోటితో రకరకాల ధ్వనులను చేస్తూ మధ్య మధ్యలో అగ్గిపెట్టితో చిత్రవిచిత్ర ధ్వనులు చేస్తూ ఆ కార్యక్రమం వింటున్న వారికి గిలిగింతలు పెట్టేవారు. వాస్తవానికి ఆ కార్యక్రమం కోసం పిల్లలకన్నా పెద్దలే ఆతృతగా వేచి చూసేవారు. రేడియో అన్నయ్య స్థాపించిన ఆంధ్ర బాలానంద సంఘం విజయభేరి మ్రోగించింది. 1956లో హైదరాబాదు లో బ్రాంచి కూడా వెలిసింది. అనంతరం ఈ విజయం గ్రహించి బాలబాలికల పత్రికల సంఘాల అవశ్యకతను గుర్తించి అనేక బాలానంద సంఘాలు ఏర్పడ్డాయి. బాలపత్రికలు ఎన్నో వెలిశాయి. జవహర్ బాలభవన్ (1966), ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ (1976) స్థాపనకు ఆయన విశేషమైన కృషి చేశాడు. ఆ సంఘంలో అనేక చక్కని కార్యక్రమాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. సంగీతం , నాట్యం, నాటకం, మేజిక్, హిప్నాటిజం రంగాల్లో కూడా శిక్షణనిస్తూ అదొక బాలల దైవమందిరంగా అలరారుతోంది.
బాలబాలికల ప్రగతికై పాటుబడిన న్యాయపతి రాఘవరావుకు సంతానం లేదు. రేడియో అన్నయ్య , అక్కయ్యల లక్షల ఆస్తిని ఆంధ్ర బాల బాలికలకే ధారాదత్తం చేశారు. బాలబాలికల ఆటపాటలకు, సహజమైన వాళ్ళ కళాకౌశలానికి ప్రోత్సాహం అందించే వేదిక ఉండాలన్న ఆయన ఆశయానికి రూపకల్పనయే ప్రభుత్వం స్థాపించిన బాలల అకాడమీ.
బాలానందం రేడియో అన్నయ్య 1984 ఫిబ్రవరి 24 న స్వర్గస్ధులైనారు.