ఆ.సు. కబుర్లు – ‘కరోనా’ ను భయపెట్టిన ప్రతిబోధ భట్టు ప్రవచనం

‘కరోనా’ ను భయపెట్టిన ప్రతిబోధ భట్టు ప్రవచనం

ఈ శీర్షిక లో వ్రాసిన ప్రదేశాలు, పాత్రలు, సన్నివేశాలు, పేర్లు మొదలైనవి కేవలం వినోదం కోసం సృష్టించబడినవే కానీ ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కాదు. ఒకవేళ ఇందులో వ్రాసిన పై విషయాలకు సంబంధించి సరిపోలిన యెడల అది కేవలం యాదృచ్ఛికమే కానీ ఉద్దేశపూర్వకమైనవి కాదని మనవి.

గొప్పలు చెప్పుకోవడం, ఎవరి అనుభవాలనో విని వాటిని తమవిగా వర్తింపచేసుకుని చెప్పుకోవడం, ఎవరో వ్రాసినదాన్ని కాపీ చేసి తమవిగా చెప్పుకోవడం … ఇలాంటి లక్షణాలుండే వ్యక్తులు మనకు తరచూ తగుల్తూనే ఉంటారు. ఒప్పుకోడానికి మనసొప్పదు గానీ మనలోనూ ఆ లక్షణాలు నిండు కుండలా ఉంటాయి. అయితే ఇలాంటి లక్షణాలన్నింటికీ పరాకాష్ఠ, ఎవరెస్ట్ శిఖరం అనదగ్గ కేరెక్టర్ మన ‘ప్రతిబోధ భట్టు’.  మన ‘ప్రతిబోధ భట్టు’ గారు కాలాతీత, భాషాతీత, దేశాతీత వ్యక్తి. ప్రపంచం మొత్తంలో అతను కాలుమోపని ప్రదేశం లేదు.  ‘ప్రతిబోధ భట్టు’ గారి వయసెంతో ఎవరికీ తెలియదు. ‘వారన్ హేస్టింగ్స్’ ఇండియా గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా ‘టేక్ ది కామెంట్స్ ఆఫ్ అవర్ భట్టు’ అనేవారట పాపం.

1964 లో జవహర్లాల్ నెహ్రు మరణానంతరం కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతుండగా భట్టు గారిని ఆశ్రయించగా భట్టు గారు తాత్కాలికంగా గుల్జారీలాల్ నందాను ప్రధాన మంత్రి చేయాల్సిందిగా సలహా ఇచ్చేరు. తరువాత 1966 లో లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భట్టు గారిని సంప్రదించగా అప్పుడుకూడా  గుల్జారీలాల్ నందాను ప్రధాన మంత్రి చేయాల్సిందిగా సలహా ఇచ్చేరు.  లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రజలకు దగ్గరయే మార్గం చెప్పమని భట్టుగారిని అడగ్గా “జైజవాన్ – జై కిసాన్” నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్ళమని చెప్పేరు.  అలాగే శాస్త్రి గారి మరణానంతరం ఆయనకీ భారతరత్న ఇవ్వాలని సూచించింది మన భట్టుగారే.  ఎవరినీ ఒక పట్టాన నమ్మని ఇందిరా గాంధీ గారు భట్టుగారిని పూర్తిగా విశ్వసించేవారట. అంతేకాదు భట్టుగారి మాటంటే ఆమెకు వేదవాక్కు.  ఇంకా చెప్పాలంటే ఇందిరా గాంధీ గారిని భట్టుగారు ‘ఇందు’ అనికూడా అనగలరట.  ఆమెకు “గరీబీ హఠావో” నినాదాన్ని ఉపదేశించింది భట్టుగారే.   

మన భట్టు గారికి  తెలియని భాష లేదు. బంకించంద్ర చటర్జీ వందేమాతరం గీతాన్ని ముందుగా భట్టు గారికి చూపించి భట్టు గారు సూచించిన మార్పులు, చేర్పులు చేసిన తర్వాతే అది ఆమోదం పొంది ప్రచురణకి యోగ్యమైందిట.  విశ్వనాధ సత్యనారాయణ గారు మంచి కవిగా పురస్కారాలు పొందుతున్న సమయాన, ఒకానొక సన్మానసభలో భట్టు గారిని విశ్వనాధ వారు కలియటం జరిగి మాటామాటా కలిసి ఆ తర్వాత ఇరువురి మధ్య స్నేహం కుదరటం జరిగిందట. అయితే వారిమధ్య కుదిరిన స్నేహం భట్టు గారి అభిప్రాయాన్ని మార్చేసింది.  ఒకసారి భట్టు గారు, విశ్వనాధ వారు ‘కాళిదాసు’ గారి మేఘసందేశం పై చర్చించుకుంటుండగా అనుకోకుండా రామాయణం ప్రస్తావన వచ్చి భట్టు గారు విశ్వనాధవారితో రామాయణం గురించి రాయొచ్చు కదా అని అడిగేరట.  దానికి విశ్వనాథవారు వాల్మీకి రాసేడుగా అన్నారుట.  భట్టుగారు మీరు మీశైలిలో రాయండి అన్నారుట అందుకు విశ్వనాధ వారు కొంచెం వివరంగా చెప్పమన్నారుట.  అప్పుడు భట్టుగారు “రామాయణ కల్పవృక్షం” వ్రాయమని అది ఏ విధంగా ఉండాలో చెప్పేరుట.  వెంటనే విశ్వనాధ వారు భట్టు గారు  విశదీకరించిన  ప్రకారం “రామాయణ కల్పవృక్షం” వ్రాయటం అది జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచనగా ఎంపికవడం జరిగి ఆ విధంగా విశ్వనాధ వారు తొలి జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు రచయిత అయ్యారట. ఆ సన్మాన పత్రం భట్టు గారే తయారు చేసేరుట.  అందులో భట్టు గారు విశ్వనాధ సత్యనారాయణ గారి గురించి ఆంగ్ల భాషలో అనర్గళంగా ఈ విధంగా వ్రాసేరట  “As a Poet of classic vision and virility, as a novelist and play wright of deep insight and impact, as an essayist and literary critic of force and felicity, and as a stylist of rare “range” Mr. Satyanarayana has carved for himself a place of eminence amongst the immortals of Telugu Literature. His ceaseless creativity and versatility have kept him in the forefront of contemporary Telugu Literary Scene” భట్టు గారు.  తను వ్రాస్తున్న బాలవ్యాకరణం వ్రాసేటప్పుడు పరవస్తు చిన్నయసూరికి సందేహాలు వస్తే చీటిమీద వ్రాసి తన శిష్యుల  ద్వారా భట్టు గారి దగ్గరకు పంపేవారట. 

నలందా విశ్వ విద్యాలయం అరుగు మీద కూర్చుని మహాత్మా గాంధీకి స్వతంత్ర   పోరాటం గురించి చెబుతుండేవారట. అలాగే గాంధీగారికి రాట్నం వడకటం కూడా భట్టు గారు మప్పినదే.  గాంధీ గారు చేపట్టిన “ఉప్పు సత్యాగ్రహం” భట్టుగారు ప్రతిపాదించినదే. సరోజినీ దేవి తన కవితా సంపుటి ‘గోల్డెన్ త్రెషోల్డ్’‌కు ముందుమాట  వ్రాయమని భట్టు గారిని  కోరిందట. తీరా భట్టు గారు ముందుమాట వ్రాసి ఇచ్చిన తర్వాత ముందుమాట  ‘అసలు కవితల్నే మింగేసేట్లు’ ఉండడంతో ప్రచురించలేదట. ఘంటశాల వెంకటేశ్వర రావు గారిని కలిసినప్పుడు దేశభక్తి  పాటలు పాడమని చెప్పేరుట.  ఆసలహా విని ఘంటశాలగారు “ఆ మొగల్ రణధీరులు, అమ్మా సరోజినీ దేవి మొదలైన పాటలు పాడేరుట.   మన ‘ప్రతిబోధ భట్టు’ నేర్వని శాస్త్రం లేదు. శ్యామశాస్త్రి ని శ్యాము అని  పిలిచేవాడు. శ్యామ శాస్త్రి తాత, ముత్తాతలు సంగీతంలో తమ సందేహాలను భట్టు గారిని  అడిగి నివృత్తి చేసుకునేవారు. భీమ్‌సేన్ జోషి, హరి చౌరాసియాలతో సంగీత చర్చలు జరిపేవాడు మన భట్టు గారు. చౌరాసియాను హరీ అనే పిలిచేవాడు. రాజ్యాంగ రచనలో బాబా సాహెబ్ అంబేద్కర్‌కు పలు సూచనలు ఇచ్చాడు. మన భారతీయ పురాణేతిహాసాలలోని యుద్ధతంత్రాలను నేటి కాలానికి ఆచరణసాధ్యంగా మలచి వ్యూహరచన చేయమని జనరల్ కరియప్పను కోరాడు మన భట్టు గారు. గగనతలంలో ఈథర్ అనే పొర గురించి చేసిన పరిశోధనలో జగదీష్ చంద్రబోస్‌కు భట్టు సహకరించేడు. 1879లో సాలార్ జంగ్ చెంగిజ్ ఖాన్‌కు చెందినదిగా చెప్పబడుతున్న ఒక పురాతన గుర్రపు నాడా అమ్మకానికి రాగా అది అసలేనా, నకిలీయా అని తెలుసుకోవడానికి సలహా కొరకు భట్టు గారినిని సంప్రదించారట. భట్టు గారు చెంగిజ్ ఖాన్ గుర్రపు నాడా సైజు ఇది కాదని తేల్చేశాడు. లండన్ లో భట్టు గారు ప్రసంగిస్తున్నాడని తెలిసి, జనాలు ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చి, అన్నాలు వండుకుతింటూ ఎదురుచూశారు. ఆ సభలో భట్టు గారు అందర్నీ కళ్ళు మూసుకోమని, వయొలిన్ మీద సప్తస్వరాలను ఒక్కొక్కదాన్నే పట్టుకుని స్వరప్రస్తారం చేస్తుంటే వాళ్ళకు ఏడురంగులూ కనిపించాయి. ఆ వయొలిన్‌ను లండన్  సెంట్రల్ మ్యూజియంలో అద్దాలపెట్టెలో భద్రపరచారు. అక్షాంశరేఖాంశాలను చూసుకుని భూమిలోపల ‘పన్నెండువేలు కాదుగానీ, పదకొండువేల అడుగులవరకూ’ ఏమున్నాయో పసిగట్టి, చూసినట్లు చెప్పగలడు భట్టు గారు. ఐన్‌స్టయిన్ e=mc2 సూత్రాన్ని భారతీయ వేదవిజ్ఞానంతో సమన్వయపరచింది భట్టు గారేనేట. అందుకని అతనికి దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని జమ్‌షెడ్‌జీ టాటా సూచించాడు. అయితే భట్టు ఎప్పుడూ తనకు పేరును కాని, బిరుదులు గానీ కోరుకోడు గనుక ఆయన్ను బిరుదులకు ఒప్పించడం అసాధ్యం అన్నారట కె. ఎం. మున్షీ.

భట్టు గారు పరిష్కరించలేని సమస్య లేదు. సబర్మతి ఆశ్రమంలో జిన్నాతో సంప్రదింపులు అనగానే భట్టు గారి పేరు మొదట వినిపించేది. ఎడ్వర్డ్ చక్రవర్తి పట్టాభిషేకం సండర్భంగా సత్కరించ అర్హులైన భారతీయుల పేర్లు చెప్పమని బ్రిటీష్ మహారాణి భట్టు గారిని కోరినప్పుడు భట్టు గారు  పెట్టిన షరతు ‘ఎట్టి పరిస్థితుల్లోనూ తనపేరు అందులో ఉండగూడదని’. బ్రిటన్ నుంచి సరకులు, వంటవారితో వస్తున్న ఓడ రాక ఆలస్యమైంది. 1,20,000 మంది అతిథులకు విందు. పరువు పొయ్యేలా ఉంది. వైస్‌రాయ్‌కి దిక్కుతోచక భట్టు గారిని  హుటాహుటిన రప్పించి సహాయం చెయ్యమని కోరగా. అలెగ్జాండ్రియా ఓడ డెక్‌పై అంతమందికి అప్పడం, వడియం, లడ్డూ, పులిహోరతో సహా విందుభోజనం సిద్ధం చేశాడు మన భట్టు. అలహాబాద్ హైకోర్టులో ఒక క్లిష్టమైన కేసువిషయంలో డిఫెన్స్ లాయరు మోతీలల్ నెహ్రూ. గారు  కేసు ఎలా నడపాలో అంతుచిక్కక భట్టు గారిని  పిలిపించారట  మోతీలాల్ నెహ్రు  గారు. భట్టు గారు అయిదే ఐదు నిమిషాల్లో చిక్కు విడగొట్టి ‘ఉండచుట్టేశాడు’. యూరీ గగారిన్ అంతరిక్ష యాత్రకు ముందు, అతనికి మనో నిబ్బరం కలిగించడానికి భట్టు గారిని  రష్యాకు పిలిపించారట. టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ అధిరోహణ మొదలుపెట్టే సమయానికి అక్కడే ఉన్న భట్టు గారు నార్కేకు పర్వతారోహణలో మెలకువలు, తీసుకోవలసిన జాగ్రత్త్తల గురించి చెప్పాడు. ఫ్రాంక్‌ఫర్ట్ యూనివర్సిటిలో జరిగిన అణుశాస్త్ర సమావేశంలో న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలెక్ట్రాన్లు త్రిమూర్తులకు ప్రతీక అని ప్రతిపాదిస్తూ తూర్పు జర్మనీ భాషలో గంటా పన్నెండు నిమిషాలు అనర్గళంగా ప్రసంగించాడు భట్టు గారు. నిజాం తన రాజ్యాన్ని భారతదేశంలో కలిపేట్లు నచ్చచెప్పవలసిందిగా సర్దార్ పటేల్ భట్టు గారిని  అభ్యర్థించాడు. కానీ ఇవన్నీ బయటకు చెప్పుకోవడం భట్టు గారికి  ఇష్టం ఉండదు.

సమాజంలో ఉన్న దుర్మార్గాలను ఇతివృత్తంగా సమాజ శ్రేయస్సు కోరుతూ యువతకు సందేశం ఇవ్వాలని వేటూరి సుందర రాంమూర్తి   గారు సంకల్పించి పాట రాద్దామని మొదలుపెడితే “ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతలోకంలో అని వ్రాసేక  మరి ముందుకు వెళ్లలేదట వేటూరి గారు నెల రోజులు ఆలోచించినా సరైన పద లయ   దొరకలేదట.  ఇంక ఇది భట్టు గారి వలన మాత్రమే పూర్తవుతుందని వెళ్లి భట్టు గారిని కలిసి విషయం చెప్పేరుట.  అంతా విన్న భట్టు గారు ఒకే ఒక నిమిషం ఆలోచించి వేటూరి గారితో ఉ… సరే… సుందర్రాముడు రాసుకో అని “రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో  మరో మహాభారతం… ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం”…. అని అనర్గళంగా చెప్పి పాట ముగించేసేరు. ఈ పాట సాహిత్యం తాను చెప్పినట్లుగా ఎప్పుడు, ఎక్కడ మాట్లాడొద్దని కూడా వేటూరి గారికి చెప్పేరుట.  వేటూరి గారికి ఆపాటకి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. 

ఈ మధ్య కాలంలో చైనాలో పుట్టి ప్రపంచ యాత్ర చేస్తున్న ‘కరోనా’ వల్ల వస్తున్న ఇబ్బందుల మూలంగా చనిపోతున్న మానవాళిని కాపాడుకునే ప్రయత్నంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు తమ నిజాయితీని ప్రదర్శించుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తించి ఉత్తర కొరియా అధ్యక్షుడైన ‘కిమ్’ ని కలిసి మీ దేశంలో ‘కరోనా’ ప్రవేశించలేకపోయింది ఎందువలనా? అని ప్రశ్నించగా తనకు ముందు చూపు ముందు జాగ్రత్త వగైరా కలగడానికి కారణం భారత దేశంలో ఉన్న ‘ప్రతిబోధ భట్టు’ అని ఆయన బోధనల ద్వారా తాను ఉత్తేజితమయి ఆయన చరిత్రను కధగా మార్చి దాన్ని ప్రతి ఆసుపత్రియందు, మరియు విద్యార్థులకు పాఠ్యఅంశంగాను ప్రవేశపెట్టి ప్రజలందరికి బోధించుట వలన ‘కరోనా’ తమ దేశంలోకి అడుగు పెట్టె సాహసం చేయలేకపోయిందని చెప్పేరట.  అంత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ప్రజలందరికి కూడా ఈ విధానాన్ని ఆచరించమని సూచించింది.  అయితే మన భట్టుగారు మాత్రం తనకి సన్మానం అంటూ హడావిడి చేస్తారన్న ముందు చూపుతో ఎవరికి దొరక్కుండా స్వీయ భూగర్భ గృహ నిర్బంధం లోకి వెళ్లి ఉండొచ్చని ప్రపంచ మేధావులంతా అనుకుంటున్నారు.

Scroll to Top