ఆ.సు. కబుర్లు – పుచ్ఛా వారి పుస్తక వైద్యం

పుచ్ఛా వారి పుస్తక వైద్యం

ఈ శీర్షిక లో వ్రాసిన ప్రదేశాలు, పాత్రలు, సన్నివేశాలు, పేర్లు మొదలైనవి కేవలం వినోదం కోసం సృష్టించబడినవే కానీ ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కాదు. ఒకవేళ ఇందులో వ్రాసిన పై విషయాలకు సంబంధించి సరిపోలిన యెడల అది కేవలం యాదృచ్ఛికమే కానీ ఉద్దేశపూర్వకమైనవి కాదని మనవి.

నేను వృత్తిరీత్యా సైకియాట్రిస్టుని. రాష్ట్ర సైకియాట్రిస్టుల సంఘానికి అధ్యక్షుడు సతీష్ బాబు నాకు మంచి స్నేహితుడు. ఇవ్వాళ ఉదయాన్నే సతీష్ దగ్గర్నుండి ఫోన్.  “హలో బ్రదర్! తెనాలిలో ఎవరో సైకియాట్రిస్ట్‌నని చెప్పుకుంటూ పేషంట్లని ట్రీట్ చేస్తున్నాట్ట. నాకా వివరాలు కావాలి. నువ్వా సంగతేంటో కనుక్కో.”  “చూడు బ్రదర్! మనవాళ్ళ ఫీజుల బాదుణ్ని పేషంట్లు తట్టుకోలేకపోతున్నారు. అంచేత వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు, మనకెందుకులేద్దూ.” బద్దకంగా అన్నాను.  “డిగ్రీ లేకుండా వైద్యం చెయ్యడం నేరం. అర్జంటుగా తెనాలి వెళ్లి రిపోర్ట్ పంపు.” అంటూ ఫోన్ పెట్టేశాడు సతీష్. పేషంట్లు అనేక రకాలు. యేది కావాలో, యేది అక్కర్లేదో నిర్ణయించుకునే హక్కు వాళ్ళకుంది. ఫలానా వైద్యవిధానం కరెక్టా కాదా అని కూడా వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇందులోని మంచిచెడ్డలు చెప్పడానికి మనమెవరం? నాకు జ్ఞాపకశక్తి తక్కువ, బద్ధకం ఎక్కువ. అంచేత ఈ ఫోన్ విషయం మర్చిపోయాను.  రెండ్రోజుల తరవాత మళ్ళీ సతీష్ బాబు ఫోన్ – “ఆ తెనాలి సంగతి ఎక్కడిదాకా వచ్చింది?” “ఇంకా మొదలవలేదు.” నవ్వుతూ అన్నాను. “ఎల్లుండి కల్లా పూర్తి చెయ్యి.” అన్నాడు సతీష్.  “ఇది విన్నపమా? ఆజ్ఞా?” ఎన్టీఆర్ స్టైల్లో అడిగాను.  “విన్నపంగా ఇస్తున్న ఆజ్ఞ!” నవ్వాడు సతీష్.  ఆ విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో తెనాలి బయల్దేరక తప్పింది కాదు.  తెనాలికి సంబంధించి యేదో అడ్రస్ చేత బుచ్చుకుని – ‘ఫలానా వైద్యం చేసే వ్యక్తి ఎక్కడ?’ అంటూ వాకబు చేసుకుంటూ వెళ్ళాను. చివరాకరికి ఒక పుస్తకాల షాపు ముందు తేలా! చచ్చితిని, నా మిషన్ తెనాలి ఒక ‘మిషన్ ఇంపాజిబుల్’ అయ్యేట్లుంది.  సతీష్‌కి ఫోన్ చేశాను – “నాయనా! నువ్విచ్చిన అడ్రెస్ పుస్తకాల షాపుది.” ఎగతాళిగా అన్నాను.  “నా అడ్రెస్ కరక్టే! నీ పని పుస్తకాల షాపులోనే!” అన్నాడు సతీష్.  హతవిధీ! ఇంతజేసి నా పరిశోధన ఒక పుస్తకాల షాపు మీదా!!

అదొక పాత పుస్తకాల షాపు. అంటే పుస్తకాలు పాతవని కాదు. పుస్తకాలు కొత్తవి, షాపు మాత్రం పాతది. అక్కడ రకరకాల సైజుల పుస్తకాలు (సైజుల వారిగా) పేర్చి వున్నాయ్. స్టాకు ఫుల్లుగా ఉంది. కౌంటర్లో ఒక పాతికేళ్ళ కుర్రాడు ఉన్నాడు.  కొంచెం పక్కగా పడక్కుర్చీలో పడుకుని విసనకర్రతో విసురుకుంటున్న అరవయ్యేళ్ళ వృద్ధుడు. తెల్లని, బక్కపల్చటి ఆకారం. మరింత తెల్లని పంచె, లాల్చీ. మెళ్ళో రుద్రాక్షలు, విశాలమైన నుదుటిపై పెద్దబొట్టు. ఈ వృద్ధుని కోసమా నా పన్లు మానుకుని వచ్చింది!  పక్కన తాటికాయంత అక్షరాల్తో ఒక బోర్డ్.’వైద్యరత్న పుచ్చా విశ్వనాథశాస్త్రి.  మానసిక వ్యాధులకి పుస్తక వైద్యం చెయ్యబడును.

కన్సల్టేషన్ ఉచితం.’

          వావ్! దొంగ ఈజీగానే దొరికాశాడే! అక్కడ నేననుకున్నంత జనాలు లేరు. ఒక్కొక్కళ్ళుగా వచ్చి వెళుతున్నారు. నా పని గూఢాచారి 116 కాబట్టి ఒక పక్కగా నించొని ఆ వైద్యుడు కాని వైద్యుణ్ణి గమనిస్తున్నాను. ఒక నడివయసు వ్యక్తి శాస్త్రిగారికి చెబుతున్నాడు – “అయ్యా! నేను బియ్యే చదివాను, బ్యాంక్ ఉద్యోగం. గంటసేపు కూడా నిద్ర పట్టట్లేదు.”శాస్త్రిగారు అర్ధమయినట్లు తల పంకించారు.

“దేవుడంటే నమ్మకం ఉందా?” అని అడిగారు. “నోనో, నేను పరమ నాస్తికుణ్ణి.” గర్వంగా అన్నాడు బ్యాంకు బాబు.  కౌంటర్ దగ్గర నిలబడ్డ కుర్రాణ్ణి చూస్తూ “రావుఁడూ! బుక్ నంబర్ ఫోర్టీన్.” అన్నారు శాస్త్రిగారు.

రావుఁడు అని పిలవబడిన కౌంటర్లోని కుర్రాడు చటుక్కున లోపలకెళ్ళాడు, క్షణంలో ఒక దిండు కన్నా పెద్ద పుస్తకాన్ని తీసుకొచ్చి శాస్త్రిగారి చేతిలో పెట్టాడు.  “ఈ పుస్తకం పదిరోజుల్లో చదివెయ్యాలి. పగలు చదవకూడదు. రాత్రి పది తరవాత టేబుల్ లైట్ వెలుతుర్లో మాత్రమే చదవండి. నిద్రోస్తే దిండు కింద పుస్తకం పెట్టుకొని పడుకోవాలి. పుస్తకం వెల వంద రూపాయలు.” అన్నారు శాస్త్రిగారు. “ఇంత లావు పుస్తకం వందరూపాయలేనా! ఇంతకీ ఈ పుస్తకం దేనిగూర్చి?” కుతూహలంగా అడిగాడు బ్యాంక్ బాబు.  “బోల్షివిక్ విప్లవానికి పదేళ్ళ ముందు లెనిన్ తన భార్యకి వెయ్యి ప్రేమలేఖలు రాశాడు. ఆ ఉత్తరాల ఆధారంగా లెనిన్ ప్రేమలోని రివల్యూషన్ స్పిరిట్ గూర్చి ఒకాయన విశ్లేషించాడు. అదే ఈ పుస్తకం.” చెప్పారు శాస్త్రిగారు. “నా నిద్రలేమికి, లెనిన్ విప్లవప్రేమకి కనెక్షనేంటి?” ఆశ్చర్యపొయ్యాడు బ్యాంక్ బాబు.  శాస్త్రిగారు సమాధానం చెప్పలేదు. కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపొయ్యారు. ప్రశ్నలు అడగొద్దన్నట్లు సైగచేసి బ్యాంకు బాబుని పంపించాడు రావుఁడు.

          కొద్దిసేపటికి ఒక పెద్ద కారొచ్చి ఆగింది. అందులోంచి కోటుతో ఒక కోటేశ్వర్రావు దిగాడు. పరిసరాలని ఇబ్బందిగా గమనిస్తూ, కర్చీఫ్ ముక్కుకి అడ్డంగా పెట్టుకుని, సూటు సరి చేసుకుంటూ శాస్త్రిగారిని చూసి విష్ చేశాడు.  “నేను IIT కాన్పూర్లో చదువుకున్నాను. ఇప్పుడు అమెరికాలో పప్పీ సొల్యూషన్స్ అనే కంపెనీ నడుపుతున్నాను. పప్పీ నా భార్య ముద్దుపేరు.” అని దీనంగా చెప్పాడు. గర్వంగా చెప్పుకోవలసిన పరిచయం దీనంగా జరిగిందేమిటి!  “వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బేం చేసుకోవాలో అర్ధం కాని స్థితి. కానీ మనశ్శాంతి లేదు. అంతా గజిబిజి గందరగోళం. ఏడవాలనిపిస్తుంది, కానీ – ఏడుపు రాదు.”  (పాపం! కుర్రాడు నిజంగానే కష్టాల్లో ఉన్నాడు, వీణ్ణి ఆస్పత్రిలో పడేసి కనీసం ఓ లక్ష గుంజొచ్చు.)  శాస్త్రిగారు అర్ధమైందన్నట్లు తల ఆడించారు. ఒక్కక్షణం ఆలోచించి రావుఁడితో “బుక్ నంబర్ ట్వెంటీ వన్.” అన్నారు.

రావుడు లోపల్నించి పుస్తకం తీసుకొచ్చి కోటేశ్వర్రావు చేతిలో పెట్టాడు. అది – భగవద్గీత!  “ఈ భగవద్గీత రోజూ కనీసం గంటపాటు పారాయణం చెయ్యండి. ప్రశాంతత వస్తుంది. ఏడవాలనిపించదు, చావాలనీ అనిపించదు. పుస్తకం ఖరీదు నూటిరవై, అక్కడివ్వండి.” అంటూ కళ్ళు మూసుకున్నారు శాస్త్రిగారు.  కోటేశ్వర్రావు సిగ్గుపడుతూ బుర్ర గోక్కున్నాడు.  “అయ్యా! నా చదువు చిన్నప్పట్నించి ఇంగ్లీష్ మీడియంలో సాగింది. నాకు తెలుగు చదవడం రాదు.”  ఈమారు కళ్ళు తెరవకుండానే “బుక్ నంబర్ సిక్స్.” అన్నారు శాస్త్రిగారు. 

రావుఁడు పెద్దబాలశిక్ష తీసుకొచ్చి కోటాయన చేతిలో పెట్టి – “నూట డెబ్భై” అన్నాడు.

          ఐదు నిమిషాల్లో ఇంకో నిద్ర పట్టని రోగం వాడు. ఇతను పరమ భక్తుడు. అతనికి అరవయ్యో నంబర్ పుస్తకం. ఎవడో ఒక ఉత్సాహవంతుడు వేదాలకీ, రాకెట్ సైన్సుకీ లంకె వేసి, పురాణాల మీదుగా లంగరు వేశాడు. పదివేల పేజీల పుస్తకం రాశాడు. అతనికి ఆ శాస్త్రం తాలూకా దిండు ఇవ్వబడింది. వెల ఐదొందలు.

ఒకడు మూలశంక ఉన్నవాడిలా చిటపటలాడుతూ వచ్చాడు. ఏమీ చెప్పక ముందే వాడికి బాపు కార్టూన్లు, ముళ్ళపూడి రమణ ‘బుడుగు’ చేతిలో పెట్టి పంపించారు.  ఇంకో ‘పేషంట్’. ఆ కుర్రాడు ఏదో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాట్ట, ఉద్యోగం వస్తుందో రాదోనని భయంగా వుందిట. అతనికి ‘విజయానికి వెయ్యి మెట్లు’ పుస్తకం. వెల వంద రూపాయలు. ఆ పుస్తకాన్ని ఎగాదిగా చూశాడతను. ‘అమ్మో! ఇన్ని మెట్లు నేనెక్కలేను, ఓపిక లేదు.’ అని వేడుకున్నాడు. అలాగా! అయితే ఇంకో పుస్తకం. విజయానికి మూడు మెట్లు. ముందీ మూడు మెట్లెక్కి, తరవాత ఆ వెయ్యి మెట్లెక్కండి. వెల యాభై రూపాయలు.

          నాకు శాస్త్రిగారి వైద్యం ఆసక్తిగా అనిపించింది. నేనిక ఏమాత్రం గూఢాచారిగా ఉండదలచలేదు. విశ్వనాథశాస్త్రిగారికి నమస్కరించాను. నేనెవరో పరిచయం చేసుకున్నాను. నా కార్యక్రమాన్నీ వివరించాను. శాస్త్రిగారు కుర్చీ ఆఫర్ చేశారు, కూర్చున్నాను.  ఒక్కక్షణం ఆలోచించి ప్రశాంతంగా, నిదానంగా చెప్పసాగారు.

“డాక్టరు గారు! నేను తెలుగు ఎమ్మేని. తెలుగు లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యాను. ఈ షాపు మా బావగారిది. అయన పోయినేడాది కాలం చేశారు. బావగారికి ముగ్గురు ఆడపిల్లలు. చెల్లి చేతిలో చిల్లిగవ్వ లేదు. అంచేత నేను ఈ షాపు నిర్వహణ బాధ్యత తీసుకున్నాను. మొదట్లో బోణీ కూడా అయ్యేదికాదు.” అన్నారు శాస్త్రిగారు.

ఈలోపు ఒక బక్కపలచని వ్యక్తి దీనంగా అడిగాడు.  “అయ్యా! నా భార్య నన్ను కుక్కకన్నా హీనంగా చూస్తుంది.” రావుడు ఆ దీనుడి చేతిలో ‘శతృవుని జయించడం ఎలా?’ పుస్తకం పెట్టి వంద రూపాయలు తీసుకున్నాడు.  శాస్త్రిగారు చెప్పడం కొనసాగించారు. “క్రమేపి షాపు మూసేసుకునే పరిస్థితి వచ్చింది. ‘డాక్టర్ల ప్రాక్టీసులు బాగున్నయ్. మందుల షాపులు కళకళలాడుతున్నాయ్. ఆఖరికి ఆకుపసరు వైద్యులు కూడా బిజీగా ఉంటున్నారు. కానీ తెలుగునాట పుస్తకాల షాపులు మూసేసుకునే దుస్థితి ఎందుకొచ్చింది?’ ఈ విషయం తీవ్రంగా ఆలోచించాను.”  ఇంతలో నలుగురు వ్యక్తులు ఆటోలో ఒక యువకుణ్ణి తీసుకొచ్చారు. అతను బాగా కోపంగా ఉన్నాడు. పెద్దగా అరుస్తున్నాడు. “ఇతనికి నా వైద్యం పని చెయ్యదు. గుంటూరు తీసుకెళ్ళీ సైకియాట్రిస్టుకి చూపించండి.” అని ఆ యువకుడి బంధువులకి సలహా చెప్పి పంపించేశారు శాస్త్రిగారు.  శాస్త్రిగారు తన సంభాషణ కొనసాగించారు.

          “మన తెలుగువారికి సంపాదించే యావ ఎక్కువై పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గిందన్న విషయం అర్ధం చేసుకున్నాను. సమాజంలో సగం రోగాలు మానసికమైనవనీ – అందుకు కారణం ఏదో సాధించేద్దామనే స్పీడు, హడావుడి వల్లనేనన్న అభిప్రాయం నాకుంది. నా మటుకు నాకు మంచి పుస్తకం దివ్యౌషధంగా పని చేస్తుంది. ఒక పుస్తకం నాకు ఔషధం అయినప్పుడు ఇతరులకి ఎందుకు కాకూడదు? ఈ ఆలోచనల నుండి పుట్టిందే నా ‘పుస్తక వైద్యం’.”  “వెరీ ఇంటరెస్టింగ్. చిన్న సందేహం. ఇందాక మీరు కొన్ని లావు పుస్తకాలు ఇచ్చారు. ఎందుకు?” కుతూహలంగా అడిగాను.  శర్మగారు నవ్వారు. “నాక్కొన్ని పుస్తకాల్ని చూస్తుంటేనే నిద్రొస్తుంది. నాకు నిద్రొచ్చే పుస్తకం అందరికీ నిద్ర తెప్పిస్తుందని నా విశ్వాసం.”  కొంతసేపు నిశ్శబ్దం.  “ఈ ‘పుస్తక వైద్యం’ చట్టవ్యతిరేకం అవుతుందంటారా?” అడిగారు శాస్త్రిగారు.

          వచ్చిన పని పూర్తయింది. లేచి నిలబడ్డాను. “పూర్తిగా చట్టబద్దం, పైగా సమాజహితం కూడా. మీ ‘ప్రాక్టీస్’ చక్కగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.” అంటూ నమస్కరించి బయటకి నడిచాను.

ఆ రోజే నా రిపోర్ట్ మా సతీష్‌కి పంపాను.

          ‘పుస్తక వైద్యం అనేది మంచి ఆలోచన. మన సైకియాట్రిక్ సొసైటీవారు ఈ ఐడియాని మరింత విస్తృతంగా పరిశోధించి, ప్రయోగాత్మకంగా కొన్ని సెంటర్లలో అమలు చెయ్యాలని భావిస్తున్నాను. శ్రీపుచ్చా విశ్వనాథశాస్త్రి గారిని మన రాష్ట్ర సదస్సుకి ప్రత్యేక ఉపన్యాసకునిగా ఆహ్వానించి, వారి అనుభవాలని మనతో పంచుకునే విధంగా ఏర్పాట్లు చెయ్యవలసిందిగా కోరుతున్నాను.’

Scroll to Top