రామచక్కని సీతకి

రామచక్కని సీతకి

జగతికి సుగతిని సాధించిన తల

దిగంతాలకవతల వెలిగే తల….

అచ్చెరువున అచ్చెఱువున 

విచ్చిన కన్నుల చూడ

పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయాలు

అల్లన మ్రోవికి తాకితే గేయాలు

ప్రతి భారత సతి మానం

చంద్రమతీ మాంగల్యం

మాగాయే మహా పచ్చడి  పెరుగేస్తే మహత్తరి

అదివేస్తే అడ్డా విస్తరి మానిన్యాం మహాసుందరి

ఇటువంటి విన్యాసాలు చేసి ముక్కున  వేలేయించగల, గుండెలు జలదరించి, మనసు పునాదుల్ని కుదిపేసినా, గోపాలా మ స జ స త త గ శార్దూలా అంటూ చాందసించినా ఆయన కలానికి చెల్లింది. ఎందుకంటే అక్షరం ఆయన లక్షణం.  నిరంతర అక్షర నాదం సృష్టించే అక్షర బ్రహ్మ. ‘కామాక్షి’ల కారుణ్యాన్ని ప్రభవించినా, ‘మీనాక్షి’లా మలయమారుతా వీచికలు ప్రసరించినా, ‘విశాలాక్షి’లా విశ్వాన్ని వీక్షించినా కవితా ఉత్తుంగ తరంగాలను సృష్టించగల విరూపాక్షుడాయన.  సరస్వతి ఆయన హృదయానువర్తి, ఆయన కరస్పర్శతో పులకించిన శర్వాణి తెలుగు పదానికి జన్మదినమవుతుంది. రాతిని నాతిని చేసినది  సీతారాముడైతే  రాతిని గీతి గా చేయగల వాడు సుందర రాముడు.  ప్రణవ స్వరూపాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్న మహర్షి వేటూరి సుందర రామ్మూర్తి.

ఒక గాయకుని గొంతు కైనా ఆయు: పరిమితి ఉంటుందేమో, ఒక దర్శకుని ప్రతిభకి నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుందేమో, ఒక సంగీత దర్శకుని కైనా పరిమితులు ఉంటాయేమో కాని, ఒక కవి భాష యొక్క పదునికి, కవి ఆలోచన/ఊహా శక్తికి వయో పరిమితి ఉండదు. అందుకు నిదర్శనమే వేటూరి సుందర రామ్మూర్తి.  ఈ పాట గొప్పతనం ఏమిటి అని అడిగితే ఒక్క మాటలో చెప్పలేము. కానీ ఖచ్చితం గా మనసును తాకి ఆహ్లాద పరిచే పాట, సీతా రాముల జంటని ఊహింప చేసే పాట. రామాయణం మొత్తం ఒక్క సారి స్పృశించే పాట, గోదావరి తో ఉన్న అనుభందం జ్ఞాపికకు వచ్చేలా చేసే పాట. ఒక కవి తన ఊహా శక్తి తో పదాలను తన గుప్పిట ఉంచుకొని ఎటు పడితే అటు అందంగా ఉపయోగించుకొనే పాట, విన్న శ్రోత పరవశం  చెందే పాట. ఇలా అంతులేని అనుభూతుల్ని ఇచ్చి శ్రోతలతో ఆనంద భాష్పాలు రాల్చే పాట. ఈ పాట తెలుగు సినీ చరిత్రలో ఒక అధ్యాయం లోని చివరి పంక్తుల నుంచి జాలువారిన పాట.  ఆ ఆధ్యాయమే వేటూరి సుందర రామ్మూర్తి గారు.

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే

ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే

ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో

రామ చక్కని సీతకి

రామ చక్కని సీతకి అరచేత గోరింట

ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట

రామ చక్కని సీతకి

                ఈ పాటని సినిమాలో ప్రవేశ పెట్టినందుకు దర్శకుడు శేఖర్ కమ్ములని అభినందించక తప్పదు. సంగీతం అందించిన K.M . రాధాకృష్ణన్ ఎక్కువ  సినిమాలకి సంగీతం అందించి శ్రోతల చేత తిట్టించుకునే కన్నా, ఇటువంటి చిరాయువు కలిగిన పాట ఒక్కటి చేసినా సినిమా చరిత్ర లో చిరంజీవిగా నిలబడొచ్చు  అని నిరూపించాడు.   సినిమా విషయానికి, ఈ పాట సందర్భానికి వస్తే, శ్రీ రామ్ తనకు తాను కొన్ని నియమాలు పెట్టుకుని వాటిని పాటిస్తూ జీవితాన్ని తనకు నచ్చిన విధంగా వెళ్లదీస్తున్న వ్యక్తి. తన మరదలు తో పెళ్లి కోసం ఆశ పడతాడు కాని ఆమె తల్లి తండ్రులు రామ్ దగ్గర ఏమి లేదని ఒక ఐ పి ఎస్ ఆఫీసర్ కి ఇచ్చి భద్రాచలం లో పెళ్లి చెయ్యటానికి నిశ్చయిస్తారు. నిరాశతో ఆ పెళ్ళికి వెళ్ళటం ఇష్టం లేక పోయినా  తప్పని సరి అయి రాజమండ్రి నుంచి లాంచిలో వెళ్ళటానికి సిద్దమవుతాడు. ఇంకో పక్క సీతా మహాలక్ష్మి (సీత) జీవితం లో కలిగిన వైఫల్యాలతో విసిగి విశ్రాంతి  కోసం అదే లాంచి లో భద్రాచలానికి వెళ్తుంది. ఆ ప్రయాణం అనేక మలుపులు తిరుగుతూ ఆడ వాళ్ళందరూ గోరింటాకు పెట్టుకోవటానికి లాంచి ఒక చోట ఆగుతుంది, అప్పుడు అందరి మధ్య జరిగే సంభాషణల నేపధ్యం లో వచ్చే పాట ఇది. అందరు బామ్మల లాగానే ఒక జంట పెళ్ళికి సిద్దంగా ఉన్నారంటే వాళ్ళ దృష్టి ఆ జంట మీదే ఉంటుంది. అందులో తనవాళ్ళు అయితే ఇంక వాళ్ళకి అడ్డే ఉండదు. మన సినిమాలో బామ్మ ,కూడా అంతే అచ్చం మన ఇంట్లోని అమ్మమ్మ, బామ్మల్లాగా అభిమానంగా ప్రవర్తిస్తుంటుంది.

ఈ సినిమాలో పాటలోనే కాదు సినిమా  మొత్తం గోదావరి అందాలు చాలా బాగా చూపించాడు దర్శకుడు.  ఇది మాటల్లో వివరించలేనిది. ఆ లాంచీ రేవు, గోదావరి గట్టు, గోదావరి ప్రవాహం, నది మధ్యలో లంకలు, తెర చాపలు, చుట్టూ ఉండే పచ్చదనం, నది ఒడ్డులో పిల్లల ఈతలు, పాపి కొండల మెరుపులు, ఇవన్ని గోదావరితో జీవితం ముడిపడి ఉన్న వాళ్ళ మధురానుభూతులు. గోదావరి ఘోషని వేదంతో పోల్చేరు కవులు ఉప్పొంగి ఉడుకుతుంది అన్నారు బాపిరాజు గారు.  అలా ఉప్పొంగిపొలాల్ని పచ్చగా పండించి రైతుల  కష్టాలు తీరుస్తుంది, బ్రతుకు తెరువు కలిగిస్తుంది, అటువంటి గోదావరి తలచుకున్నప్పుడల్లా గోదావరితో అనుబంధం ఉన్న వాళ్ళ కళ్ళలో ఆనందభాష్పాయాలు వస్తాయి. ఇంక వేటూరి గారి పాటలోకి వెళ్దాము.

నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ

మధుర వదన నలిన నయన మనవి వినరా రామా

సంగీత దర్శకుడు  ఈ పాటకి అడుగడునా న్యాయం చేకూర్చారు. గాయని, వాయిద్యం, నేపధ్యం అన్ని చక్కగా సమకూరాయి ఈ పాటలో. ప్రతి చరణం ముగించిన తీరు చాల బాగుంటుంది. ప్రశాంతంగా ఉండే గోదావరి లాగ ప్రారంభించి  మనసు తట్టి లేపి ఉప్పొంగిన గోదావరి లాగ చుట్టుముట్టి, నెమ్మదిగా ప్రశాంతంగా సాగుతున్న నావ ఒక్క సారి జోరు అందుకున్నట్టు ప్రతి చరణం సాగుతుంది. మధ్యలో వచ్చే సంగీతం అలల మాదిరి  పలకరించి వెళుతుంది.  నీల గగన అంటే నీల ఆకాశ వర్ణం కలిగిన సీత, మనోహరమైన (రమ) ఘన విచలన అనగా భారంగా అయినా నెమ్మదిగా నడిచేది అని, ఇక్కడ నెమ్మదిగా అంటే సున్నితంగా, వయ్యారంగా, దీన్నే మార్చి మంద గమన అంటారు చివర్లో. ధరణిజ అంటే భూదేవికి కూతురు, మధుర వదన, ఇందు వదన అన్ని సీతమ్మ వారికి ఉపమానలే. నలిన నయన అంటే పద్మము వంటి కనులు కలదానా అని. సీతమ్మ వారి గురించి ఇంత వివరించి, అటువంటి మా సీతమ్మ మనవి వినవా రామ అని పాట ప్రారంభిస్తారు వేటూరి గారు. సీతమ్మ మనవి ఏంటి అనేది మనకి తెల్సిందే రాముడిని కలవాలని, చూడాలని.

రామచక్కని సీతకి అరచేత గోరింట

ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట 

తెలుగు నాట గోరింటాకు పెట్టుకోవటం ఒక చెప్పలేని అనుభూతి. ప్రతి వనిత ఎంతో కష్టపడి ఆకులు కోసి ఆ ఆకులని రుబ్బి, ఇష్టపడి చేతికి పెట్టుకొనేది గోరింటాకు. ఇది పెట్టుకోనని మారాము చేసిన కన్యల కోసమే అన్నట్టు గోరింటాకు పండిన విధానంకి ఆ కన్యకి రాబోయే వరుడికి ముడి పెట్టి ప్రోత్సహిస్తారు పెద్దలు. ఆ కన్య తన ఊహల్లో తనకి వచ్చే రాకుమారుడిని ఊహించుకుంటూ పండిన చెయ్యిని చూస్తూ మురిసిపోతుంది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు ‘మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు, సింధూరం లా పూస్తే చిట్టి చేయంట అందాల చందమామ అతడే దిగి వస్తాడు’ అన్నారు. వేటూరి గారిక్కడ రాముడు మెచ్చిన, రాముడికి నచ్చిన సీతకి అరచేత గోరింటాకు పెడితే ఆ గోరింటాకు పండిన చెయ్యి మెరిసిపోతే చక్కని సీతకి మొగుడు గా ఎవరు వస్తారో అని అడుగుతూనే  రాముడు కాక ఇంకా ఎవరు వస్తారు అని చెప్పకనే చెప్తారు. రామచక్కని సీత అంటూ. ఈ రెండు వాక్యాలతో సీత కళ్యాణం ముందు ఉన్న ఘట్టాలన్నీ అలాగే కల్యాణం ముందు సీత ఏమి ఊహించుకొని ఉంటుందో అన్న ఊహ లోకి తీసుకెళ్తారు వేటూరి గారు. ఈ పాట పాడిన గాయత్రి మొత్తం పాట అద్బుతగా పాడినా అరచేత గోరింట అన్నప్పుడు గోరింట అన్నప్పుడు స్పష్టం గా ఉండదు. ఇంత చక్కని కవిత్వానికి చెయ్యగలిగిన న్యాయం ప్రతి మాట స్పష్టం గా వినపడేలా పాడటమే.

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే

ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే

ఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలో         

ఈ మూడు వాక్యాలు విన్నవారికి వేటూరి గారి కల్పనా శక్తి అమోఘమనిపిస్తుంది. రాముడు అత్యంత బలవంతుడు, శక్తివంతుడు అని అందరికి తెలిసిన విషయమే. ఆ బలం పరాక్రమం ఎటువంటివో సీతా కళ్యాణ సమయంలో  ఎవ్వరూ  ఎత్తలేని శివ ధనుస్సుని  ఎడమ చేత్తో ఎత్తి ప్రపంచానికి తన బల, పరాక్రమాలు ప్రకటించేడు కోదండ రాముడు. ఇంక రాముడు సీతాన్వేషణలో లంకకి వెళ్ళేటప్పుడు సముద్రం మీద వంతెన నిర్మిస్తున్నపుడు అందరూ శక్తి వంచన లేకుండా రామకార్యం అని తలచి చేతనైన సహాయం చేసారు. ఆ క్రమంలో ఒక ఉడత కూడా సహాయం చెయ్యటం చూసి సంతోషంతో ఉప్పొంగిన రాముడు ఆ ఉడతని ఆప్యాయంగా చేత్తో తీసుకొని వీపు మీద వేళ్ళతో నిమురుతాడు. అప్పుడు పడిన గీతలు ఉడత జాతి మీద ఉండి పోతాయి. ఈ  రెండు ఉదంతాలు ఎంత అద్బుతమైన పదాలతో చెప్తారో వేటూరి గారు. ఇంక  ముగింపు వింటే ఆయన కవితా పటిమకి అబ్బుర పడవలసిందే. శక్తి వంతమైన రాముడు ఎడమ చేత్తో శివధనస్సు ఎత్తుతాడు, ఉడత వీపున వేలు విడుస్తాడు, అటువంటి రాముడు సీతని పెళ్లాడతాడు అన్న అర్థం వచ్చేలా చెప్తారు పుడమి అల్లుడు రాముడే అని. సీత భూదేవి కుమార్తె కదా మరి సీతను పరిణయమాడిన రాముడు భూదేవికి అల్లుడు కదా.   అయితే ఇంత బల, పరాక్రమశాలి అయినా రాముడు సీత మెడలో తాళి కట్టే సమయంలో మరి ఎడమ చేత్తో సీత జడను ఎత్తగలడా అన్న ప్రశ్న  సంధిస్తారు ఇదే అయన ఊహ శక్తికి నిదర్సనం. ఎందుకంటే తాళి కట్టానికి రెండు చేతులు కావాలి, మరి తాళి కట్టేటప్పుడు తనంతట తానే జడని ఎత్తటం ఎవరికీ కుదరదు ఎంతటి బలవంతుడి కైనా శక్తిమంతుడి కైనా. ఉన్న రెండు చేతులతో తాళి కడితే  జడ ఎత్తటం ఎలా సాధ్యం? ఇటువంటి అద్భుతమైన ధర్మ సందేహం కలగటం వేటూరి గారి చమత్కారం అది కూడా నిఘూడం గా.

ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే

చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే

నల్లపోశైనాడు దేవుడు నల్లని రఘురాముడు   

లంకకి ఇటువైపు రాముడుంటే ఆవల సీతమ్మ లంకలో ఉంది.  రాముని జాడ హనుమ ద్వారా తెలిసినా ఎప్పుడొస్తాడో తనని ఎప్పుడు ఈ రాక్షస చెర నుండి విడిపిస్తాడో తెలీని పరిస్థితి. సీతమ్మ వారిని ఎర్రని జాబిలితో పోలుస్తారు.  ఇది ఇంకో చమత్కారం. ఎర్ర జాబిలి  చెయ్యి గిల్లటం ఏమిటి అని అనిపించక మానదు.బాధ, ఉక్రోషం కలిగినప్పుడు కందిపోయిన ముఖం ఎరుపు రంగులోకి మారుతుంది. జాబిలి లాంటి సీతమ్మని రాముడు ఏడి అని అడుగుతుంటే మాట ఒకటి అంటే కళ్ళు ఇంకోటి చెప్తున్నాయి. మనం ఏదైనా చెప్పొచ్చు కాని కళ్ళు అబద్దాన్ని దాచవు అంటారు. కళ్ళు ఏమి చెప్తున్నాయో చెప్తే మనం గమనించొచ్చు. ఇక్కడ రాముడి జాడ లేదు కనపడకుండా పోయాడు, ఆ మాట పెదవితో చూడలేదు అని చెప్పినా కళ్ళు నిజం చెప్పేస్తాయి రాముడు ఎక్కడున్నాడో తెలియదు అని. నల్ల పూసై నాడు దేవుడు నల్లని రఘు రాముడే. నీల మేఘ శ్యాముడు రాముడే గా అందుకని నల్లని రఘురాముడు అన్న ప్రయోగం అలాగే మనతో ఉండి కనపడకుండా పోయిన వాళ్ళని నల్లపూస అయ్యావు అంటారు. ఇది వాడుక భాషలో గోదావరి జిల్లాల్లో బాగా ప్రయోగిస్తారు. అమావాస్య తరువాత చంద్రుడు వచ్చినా కనపడడు, అలాగే రాముడు ఉన్నాడు కాని కనపడడు అని సీతమ్మ అనుకుంటోంది అని అందం గా చెప్తారు.

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా

నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే

చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా 

వేటూరి గారు చక్కని చుక్క అని సీతమ్మ వారిని అంటారు కానీ ఇక్కడ రాముడి కోసం సీత పడే తపన ఈ చరణం. చుక్కలని, దిక్కులని అడిగా రాముడు ఏడని, ఇంక బాధతో కూడిన కన్నులని అడిగితె అవి నీటి తో చెమ్మగిల్లాయి, వాటి నిండా కన్నీరే, ఏదైనా చెప్పటానికి ఆ కన్నీరే అడ్డుపడింది, మనసు నిండా ఉన్న రాముడుని చూసుకోవటానికి అడిగితె చెప్పటానికి రాముడు కనపడటం లేదని బాధ తో ఉన్న మనసు నుంచి మాటలు రావటం లేదుగా – ఎంతో ఆర్తితో రాసిన వేటూరి గారు, అంతే  ఆర్తి ధ్వనిస్తుంది ఈ చరణం లొ.

ఇందువదన కుందరదన మందగమన భామ

ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ

వేటూరి గారు ఇందువదన కుందరదన అన్న పదాలతో ప్రయోగం చేసిన పాట ( చాలెంజ్ సినిమా లో ) వింటే ఆ పాట కి ఈ పాట కి ఎంత వ్యత్యాసమో కదా. మరల అవే పదాలు అటు ఇటు మార్చి ఒకసారి సీతని వర్ణిస్తే ఇంకో సారి ప్రశ్నిస్తారు ఎందుకమ్మా నీకు ఇంత  వేదన, ప్రేమ వలెనే కదా అని. అది పదాల మీద ఆయనకి ఉన్న పట్టు. సీతమ్మ వారిని చందమామ తో పోలుస్తారు ఒక సారి ఎర్ర జాబిలి  అంటారు ఇంకోసారి చంద్రుని వదనం కల దాన అంటారు ఒక సారి మంద గమన అంటారు ఇంకో సారి ఘన విచలన  అంటారు. అతిలోక సుందరి సీతమ్మ వారు నడిస్తే అత్యంత వయ్యారం గా ఉంటుంది, ఆ నడక చూస్తే కందిపోతుందేమో సీతమ్మ పాదం అన్నట్టు ఉంటుంది. అటువంటి లక్షణాలు ఉన్న సీతమ్మ నీకు ఎందుకమ్మా ఇంట విచారం, రాముని మీద ప్రేమ వలెనే కదా? అయినా సీతమ్మని వర్ణించాలంటే ఒక జీవితం సరిపోతుందా? ఈ మాటల మాంత్రికుడి చేతిలో పదాలు మారి అర్థం మారేది శ్రోతల్ని అలరించటానికే సుమీ అన్నట్టు ఉంటాయి.

జయంతితే సుకృతినో

రససిద్ధా కవీశ్వరా 

నాస్తి తేషామ్ యశహ్ కాయే

నాస్తి జరామరణజం భయం

Scroll to Top