source: https://andhrabharati.com/strI_bAla/bAlabhASha/index.html
పుట్టేటి భానుడు పుష్యరాగపు ఛాయ

పుష్యరాగము మీద పొంగు బంగరు ఛాయ
శ్రీ సూర్యనారాయణా మేలుకో
హరి సూర్యనారాయణా మేలుకో
జామెక్కి భానుడు జాజి పువ్వుల ఛాయ
జాజిపూవులమీద సంపెంగ పువు ఛాయ
శ్రీ సూర్యనారాయణా మేలుకో
హరి సూర్యనారాయణా మేలుకో
మధ్యాహ్న భానుడు మల్లెపూవుల ఛాయ
మల్లెపూవులమీద మంచి వజ్రంపు పువు ఛాయ
శ్రీ సూర్యనారాయణా మేలుకో
హరి సూర్యనారాయణా మేలుకో
మూడు జాముల బాముడు మునగ పూవుల ఛాయ
మునగపువ్వులమీద ముత్యాలపొడి ఛాయ
శ్రీ సూర్యనారాయణా మేలుకో
హరి సూర్యనారాయణా మేలుకో
క్రుంకేటి భానుడు గుమ్మడీ పువు చాయ
గుమ్మడీపువుమీద కుంకుమా పువు చాయ
శ్రీ సూర్యనారాయణా మేలుకో
హరి సూర్యనారాయణా మేలుకో
ఆయురారోగ్యములు ఐశ్వర్యములనిమ్ము
శ్రీసూర్యనారాయణా!