బాల గేయాలు (Telugu Folk Rhymes for Kids)

బాల గేయాలు

అ’ఆ’ల పాట

అ ఆ లు దిద్దుదాము – అమ్మమాట విందాము

ఇ ఈ లు చదువుదాము – ఈశ్వరుని కొలుద్దాము

ఉ ఊ లను దిద్దుదాము – ఉడుతలను చూద్దాము

ఎ ఏ ఐ అంటూ – అందరనూ పిలుద్దాము

ఒ ఓ ఔ అంటూ – ఓనమాలు దిద్దుదాము

అ॰ అః అంటూ – అందరమూ ఆడుదాము

గురువుగారు చెప్పిన – పాఠాలు చదువుదాము

మామగారు చెప్పిన – మంచి పనులు చేద్దాము

తాతగారు చెప్పిన – నీతి కథలు విందాము అందరము కలుద్దాం ఆనందంగా ఉందాం

చేత వెన్నముద్ద

చేతిలో వెన్నముద్ద – చెంగల్వ పూదండ

బంగారు మొలత్రాడు – పట్టుదట్టి

కొండెప సిగముడి – కొలికి నెమలిపురి

ముంగురుల్ మూగిన – ముత్తియాలు

కస్తూరికింబట్టు – కన్నులన్ కాటుక

చక్కట్ల దండలు ముక్కుపోగు

సందిట తాయెతుల్ – సరిమువ్వ గజ్జెలు

అక్కునమెచ్చుల – పచ్చకుచ్చు

కాళ్ళనందె – ఘల్లు ఘల్లు మనగ

దోగి దోగి యాడ – తాళ్లపాకన్నన్న

చిన్నికృష్ణ నిన్ను – చేరికొలుతు.

బుర్రుపిట్ట

బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది

పడమటింటి కాపురము చేయనన్నది

అత్తతెచ్చిన కొత్తచీర కట్టనన్నది

మామతెచ్చిన మల్లెపూలు ముడువనన్నది

మొగునిచేత మొట్టికాయ తింటానన్నది

ఆటలు ఆడీ పాటలు పాడీ

ఆటలు ఆడీ పాటలు పాడీ

అలసీ వచ్చానే- తియ్యాతియ్యని

తాయిలమేదో తీసీ పెట్టమ్మా


పిల్లిపిల్లా కళ్ళు మూసి పీట ఎక్కిందీ

కుక్కపిల్లా తోకాడిస్తూ గుమ్మమెక్కిందీ

కడుపులోని కాకి పిల్ల గంతులేస్తోందీ


తియ్యా తియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా

గూట్లో ఉన్నా బెల్లం ముక్క  కొంచెం పెట్టమ్మా

చేటలొ ఉన్న కొబ్బరి కోరు చారెడు పెట్టమ్మా

అటకా మీది అటుకుల కుండా అమ్మా దింపమ్మా

తియ్యా తియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా


ఆటలు ఆడీ పాటలు పాడీ

అలసీ వచ్చానే- తియ్యాతియ్యని

తాయిలమేదో తీసీ పెట్టమ్మా

కాళ్ళా గజ్జీ కంకాలమ్మా

కాళ్ళాగజ్జీ కంకాలమ్మా వేగు చుక్కా వెలగామొగ్గా

మొగ్గా కాదూ మోదుగ నీరు నీరు కాదు నిమ్మల వారీ

వారీ కాదూ వావింటాకు ఆకూ కాదూ గుమ్మడి పండూ

కాళ్లు తీసి కడగాపెట్టు

(ఈ పాటలో గజ్జి వచ్చినప్పుడు కంకోలం అనే ఆకును రుబ్బి పూయాలి. తగ్గక పోతే వేకువ ఝామున లేత వెలక్కాయలోని గుజ్జును పూయాలి. దానికీ తగ్గక పోతే మోదుగ ఆకును రుబ్బి పూయాలి. తగ్గడం ప్రారంభించాక నిమ్మరసాన్ని బాగా పలచన చేసి కడగాలి. ఇంకా మాడక పోతే వావింటాకు పూయాలి. గుమ్మడి పండులోని గుజ్జు కూడా గజ్జికి మందే. ఈ చికిత్సా విధానాలన్నిటినీ సూక్ష్మంలో మోక్షం లాగ వివరించే పాట ఇది. కాలు తీసి కడగా పెట్టు అనడంలో గజ్జి అంటు వ్యాధి కాబట్టి జాగ్రత్తగా ఉండమనే సూచన ఉంది.)

చిమడకే చిమడకే ఓ చింతకాయ

చిమడకే చిమడకే ఓ చింతకాయ

నీవెంత చిమిడినా నీ పులుపు పోదు

ఉడకకే ఉడకకే ఓ ఉల్లి పాయ

ఎంతెంత ఉడికినా నీ కంపు పోదు

కొండ మీది గుండు

కొండ మీది గుండు జారి

కొక్కిరాయి కాలు విరిగె

దానికేమ్మందు?


వేపాకు పసుపూ, వెల్లుల్లి పాయ

నూనెమ్మ బొట్టు – నూటొక్కసారి నూరి

పూటకొక్కసారి పూయవోయ్

చిట్టి చిట్టి మిరియాలు

చెట్టుకింద పోసి

పుట్టమన్ను తెచ్చి

బొమ్మరిల్లు కట్టి

అల్లవారి కోడలు నీళ్ళరేవు కెళితే

కల్లవారి కుక్క భౌ–భౌ అన్నది,

నా కాళ్ళ గజ్జెలు ఘల్లు మన్నవి

వానల్లు కురవాలి వానదేవుడా

వానల్లు కురవాలి వాన దేవుడా

వరిచేలు పండాలి వాన దేవుడా

నల్లనీ మేఘాలు వాన దేవుడా

చల్లగా కురవాలి వాన దేవుడా

మా ఊరి చెరువంత వాన దేవుడా

ముంచెత్తి పోవాలి వాన దేవుడా

కప్పలకు పెండ్లిళ్ళు వాన దేవుడా

గొప్పగా చేస్తాము వాన దేవుడా

పచ్చగా చేలంత వాన దేవుడా

పంటల్లు పండాలి వాన దేవుడా

వానల్లు కురవాలి వాన దేవుడా వరిచేలు పండాలి వాన దేవుడా

మాతాత

మా తాత అందం చందమామ చందం

మా తాత గుండు గుమ్మడి పండు

మా తాత మీసం రొయ్యల మీసం

మా తాత పిలక పంచదార చిలక

చల్ చల్ గుర్రం

ఛల్ ఛల్ గుర్రం చలాకి గుర్రం

సవారీ చేస్తే చక్కని గుర్రం

సాములు చేస్తే సర్కస్ గుర్రం

పౌరుషం ఉంటె పందెం గుర్రం

ఆగకపోతే అరబ్బీ గుర్రం

చచ్చుదైతే జట్కా గుర్రం

అరటి మొలిచింది

ఆదివారం నాడు అరటి మొలిచింది.

సోమవారం నాడు సుడివేసి పెరిగింది

మంగళవారం నాడు మారాకు తొడిగింది,

బుధవారం నాడు పొట్టి గెల వేసింది,

గురువారం నాడు గుబురులో దాగింది,

శుక్రవారం నాడు చకచకా గెలకోసి

అబ్బాయి అమ్మాయి అరటిపండులివిగో అందరికి  పంచితిమి అరటి అత్తములు

Scroll to Top