నీతి కథలు (Moral stories)

నీతి కథలు

కథలు జీవిత పాఠాలని నేర్పే మహత్తరమైన సాధనాలు. ముఖ్యంగా చిన్న పిల్లల పసి హృదయాలలో మంచి నడవడి ని గురించి, ధర్మా ధర్మాల గురించి, చక్కటి ముద్ర వేసేవి ఈ చిన్ని నీతి కథలు. పిల్లలికి కథలంటే ఎంతో ఇష్టం. కథలు వింటూ ఊహాలోకంలో విహరిస్తారు. కథలో అంతర్గతంగా నీతి దాగి ఉంటుంది. విన్న కథనే ఎంతో ఆసక్తితో వినటం వలన అందులోని నీతి వారి మనస్సును హత్తుకు పోయే అవకాశం ఎక్కువే. చిన్నపిల్లలకి నీతిని బోధించే కొన్ని కధలు క్రింద ఇస్తున్నాము.

  1. చాకలివాడి గాడిద
  2. కోపం వచ్చిన కోతులు
  3. బ్రాహ్మడి మేక
  4. మూడు చేపల కథ
  5. వేరుశనగ దొంగ
  6. కప్పా, పాము
  7. నక్కా, కోడి పుంజు
  8. కాకి దాహం
  9. నిజాయితి గల ఆవు
  10. ఉల్లిపాయి దొంగ

చాకలివాడి గాడిద

అనగనగా ఒక ఊరిలొ ఓ చాకలి ఉండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలి మూటలను మోసేదీ. కుక్క చాకలి ఇంటికి కాపలా కాసి, అతనెక్కడికి వెళ్తే అక్కడకెళ్ళి తోడుండేది.  ఒక రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు చాకలి ఇంట్లోకొక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్క వేపు ఆశ్చర్యంగా చూసి, “నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు?” అనడిగింది.  “మన యెజమాని మనల్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడ పెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవలి?” అని కుక్క ఎదీ పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది.  “ఇది మనం మొరబెట్టుకునే సమయంకాదు. మన యజమానికి సహాయం చేయాలి” అని గట్టిగా గాడిద కూతపెట్టడం మొదలెట్టింది.  దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలాడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడకొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదేడు.  ఎవరి పని వాళ్ళే చేయాల నే నీతి అప్పుడు గాడిదకు అర్ధమయ్యింది.

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, ఎండా తగలకుండా కాపాడేది.  ఒక రోజు ఆకాశమంతా మబ్బు పట్టి హోరున వర్షం కురిసింది.

అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిసి గడ గడ వణుకుతున్నాయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి.  మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లాఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి.  రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విషయంలో తలదూర్చామన్న నీతి తెలుసుకుని పశ్చాత్త్తాప పడ్డాయి. 

బ్రాహ్మడి మేక

అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు వుండేవాడు. ఆ బ్రాహ్మడు యజ్ఞంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు. ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగం పన్నీరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు ప్రదేశాలకెళ్ళి నిలపడ్డారు.  మొదటి దొంగ బ్రాహ్మడు తన దగ్గరకి వస్తుండటం చూసి ఎదురొచ్చాడు. వచ్చి, “బ్రాహ్మడిని ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అనడిగాడు.గాయానికి కోపంతో బ్రాహ్మడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి” అని ఆలోచిస్తూ తన దారిన పోసాగాడు. బ్రాహ్మడు కొంత దూరమెళ్ళాక రెండొ దొంగ ఎదురొచ్చి చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని ఆలోచనలో  పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళి భుజాల మీదకు ఎక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరమెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు.వాడు బ్రాహ్మడితో “అపచారం! అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు!” అన్నాడా దొంగ.  ఇంత మంది చెపుతుంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు. ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు.

మూడు చేపల కథ

అనగనగా ఒక ఊరు  చెరువు లొ చాలా  చేపలు వుండేవి. ఒక రోజు ఇద్దరు చేపలు పట్టే వాళ్ళు  ఆ చెరువు దెగ్గిరనుంచి వెళ్ళారు. చెరువు లో చాలా చేపలు వున్నాయని గమనించి మర్నాడు  ఆ చెరువు లో చేపలు పడదామని నిర్ణయించు కున్నారు.  వాళ్ళ మాటలు విన్న ఒక పెద్ద చేప ఈ విషయం ఇంకొ రెండు చేపలకు చెబుతూ – “మనం వెంటనే మన బంధువులను తీసుకుని ఈ చెరువుని వదిలి వెళ్ళిపోవాలి – లేక పోతె రేపు మనం ప్రాణాలతో వుండము” అని వివరించింది.  ఈ మాటలు విన్న వేరే రెండు చేపలు ఆలొచన లో పడ్డాయి. రెండో చేప, “వాళ్ళు రేపు వస్తే చూద్దాం” అనుకుంది.  మూడో చేప, “ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ – ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చినా మన అదృష్టం బాగుంటే వాళ్ళేమి చేస్తారు” అనుకుంది.  మొదటి చేప రాత్రి కి రాత్రి తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్ళి పొయింది.  తెల్లవారగానే  రెండో చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్ళని చూసి తన కుటుంబంతో వేరే చెరువుకు వెంటనే వెళ్ళి పొయింది.  మూడో చేప వల లో చిక్కుకుని ప్రాణాలను వదులుకుంది.  దూరదృష్టి తో ఆలోచించిన మొదటి చేప తన బంధువులునందరినీ కాపడుకో గలిగింది. ఆపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండొ చేప కొంత వరకు తన కుటుంబాన్ని కాపాడుకుంది. ఆదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు ఏమి చేయలేక పొయింది.  అలాగే మన జీవితం లో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకుని, మన వంతు కృషి మనం చేయకపోతే, ఫలితం ఉండదు.

వేరుశనగ దొంగ

కొన్ని సంవత్సరాల క్రితం ఒక వూరిలో లక్ష్మి అనే పేరుగల ఒకావిడ వుండేది. ఆవిడకు రోజూ సాయంత్రం ఇంటి దెగ్గిర వున్న పార్కులో ఒక బెంచి మీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు. రోజూ అదే బెంచి మీద కూర్చునే అలవాటు పడిన లక్ష్మిగారికి కొద్దిరోజులకి ఆ బెంచి ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడిపోయింది. అలాగే ఒక రోజు పార్కులోకి వెళ్తుంటే అక్కడ వేడి వేడిగా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు. వాసనకి నోరూరిన లక్ష్మి గారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కుని తన మామూలు పధ్ధతి లో తన బెంచి కి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచి మీద అప్పటికే ఒక పెద్దాయిన కూర్చుని ఉన్నారు.  రుసరుసలాడుతూ తన షాల్వా, పర్సు, కూడా తెచుకున్న ఇతర సామాన్లు, చేతిలో వేరుశనగల పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది.  చదువుతూ పక్కనవున్న వేరుశనలు  అందుకుని వల్చుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు తీసుకుని తింటున్నారు. “ఎంత పొగరు, అడగకుండానే నా వేరుశెనగలు తినేస్తునాడు, ఇలాంటి వాళ్ళు వుండ బట్టే మన దేశం ఇలా వుంది” అని మనసులో లక్ష తిట్టుకుంటూ పైకి ఏమి అనలేక అలాగే కాసేపు కూర్చుంది. కొద్ది సేపటి తరువాత ఎక్కడ పెద్దాయన వేరుశనగలు అన్ని తినేస్తారో అని లక్ష్మిగారు కూడ పోటి పడి గబ గబా మిగిలిన వేరుశెనగలు వల్చుకుని తినేసింది. అన్ని అయిపోయి చివరికి ఒక్క వేరుశనగ మిగిలింది. ఫెద్దాయన చిరునవ్వుతొ “ఇది మీరు తీసుకోండి” అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయరు.లలష్మిగారు  “వేరుశనగ దొంగ!” అని చికకుగా అనుకుంది.  లేచి తన సామాను బెంచి మీద నుంచి తీసుకుంటు చూస్తే అక్కడ తన వేరుశనగల  పొట్లం భద్రంగా తన దెగ్గిరే కనిపించింది.“అయ్యో! ఐతే నేనే వేరుశనగల  దొంగనా! పాపం అయ్యిన్ని ఎన్ని మాటలనుకున్ననో!’ అని చాలా బాధ పడింది. అందుకే నిజానిజాలు తెలుసుకోకుండా నిందలు వేయరాదు.

కప్పా, పాము

ఒక కప్పా, పాము మంచి స్నేహితులుగా వుండేవి. కప్ప పాముకు కప్పకూత నేర్పించింది. పాము కప్పకు బుసకొట్టడం నేర్పించింది.  పాము నీటిలోకి వెళ్ళి కప్పకూత కూస్తే చుట్టుపక్కల కప్పలు దాని దగ్గరకు వెళ్ళేవి. పాము చటుక్కున వాటిని తినేసేది.   కప్ప నీళ్ళల్లో భుస కొడుతుంటే దాని దగ్గరకు పాములు వచ్చేవి కావు. కప్ప నిర్భయంగా వుండేది. ఇలా కొంత కాలం కొనసాగింది.  కాలక్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసి అవి పాము దగ్గరకు వెళ్ళడం మానేసాయి. పాము తినడానికి ఏమి లేక చిక్కి క్షీణించుకు పోయింది. ఆకలి తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పను తినేసింది.అందుకే చెడు స్నేహం చేస్తే అది ఎప్పటికైన మనకే చేటు.

నక్కా, కోడి పుంజు

అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజూ కోళ్ళను, కోడి పిల్లలను తినేసేది. రోజూ ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచించబడ్డారు. ఒక రోజు ఆ నక్క ఒక పొలంలో చచ్చి పడున్నట్టు కనబడింది. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను ఎవరో చంపేసారని హర్షించారు. జనమంతా ఆ నక్కను చూడడానికి పొలానికి చేరుకున్నారు. ఒక కోడి పుంజు కూడా తన పిల్లలతో చూడడానికి వెళ్ళింది.  ఇంతలో ఆ నక్క లేచి, పెద్దగా ఆవలించింది. “అరే! నువ్వు చచ్చిపోయావనుకున్నామే!” అంది కోడి పుంజు.  “లేదు, అదేమి కాదు. నిన్న రాత్రి బాగా  తిన్నాను, అందుకే నిద్ర పట్టేసింది” అని జవాబు చెప్పిందా నక్క.  కోడిపుంజు వెంటనే తన పిల్లలను లెక్క పెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువ వుంది. “ఇదేమిటి, ఒక పిల్ల తక్కువ వున్నా నాకు తెలియలేదే,” అంది.  “ఏమిటయ్య! నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలీలేదు కాని ఒక క్షణం క్రితం నేను చచ్చానని తెలుస్తే వెంటనే వచ్చావు” అంది నక్క వ్యంగ్యంగా.  నిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని, తరవాత ఇతరుల విషయం పట్టించుకోవాలి.

కాకి దాహం

అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉంది.  ఒక రోజు దానికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగా  ఎండగా  వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా ఎండిపోయింది. ఎగిరే  ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది.  చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకి ముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కల  పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా ఎగిరిపోయింది.  నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది.  ఈ కధ నేను మా మనవడు బబ్బుకి  చెప్పాను. అప్పుడు మా బబ్బుగాడు నాతో అన్నాడు తాతగారు “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వేసింది  అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక ‘స్ట్రా’ వెతికి తాగేది అని”.   ఈ మాట విని నాకు చాల ఆశ్చర్యం అనిపించింది.

నిజాయితి గల ఆవు

ఒక రోజు ఒక అడవిలో వేటకు బయలుదేరిన పులికి ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు ప్రశాంతంగా అడవిలో గడ్డి మేస్తోంది. ఆ ఆవుని చూడగానే పులికి నోరూరుంది. ఈ రోజు ఆవు భోజనం బాగుంటుంది అని నిశ్చయించు కుంది. ఆ ఆవు పంజా విసరడానికి రెడీ అవుతుంటే ఆవు చూసింది.  “ఆగండి పులిగారు, ఆగండి!” అని గట్టిగా కేక పెట్టింది.  పులి నిర్ఘాంత పోయింది. ఇంత వరకు ఏ జంతువూ పులిని ఆగమని అడగలేదు. జంతువులు భయ పడడం, పరుగు పెట్టడం, వాటిని వేటాడడం, పులికి తెలుసు. కాని ఇలా ఆగమనడం? ఇది కొత్త విషయం.  సంగతేంటో తెలుసుకుందామని పులి ఆగింది.  “అడగ గానే ఆగినందుకు ధన్యవాదాలు. మీకు అడ్డు పడినందుకు క్షమించండి.” అంది ఆవు.  “విషయం ఏమిటో చెప్పు” అంది పులి.

“నాకు ఇంట్లో ఒక దూడ ఉంది. నేను రోజు పొద్దున్నే ఆ దూడకి పాలు ఇచ్చి, ఈ అడవిలోకి వచ్చి, రోజంతా గడ్డి మేస్తాను. సాయంత్రం మళ్ళి వెళ్లి దూడకు పాలిస్తాను. రోజు లాగానే ఈ రోజు కూడా దూడతో సాయంత్రం మళ్ళి వస్తానని, పాలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు వెళ్లక పొతే నా దూడకు పాలుండవు. జీవితమంతా అమ్మ ఏమైంది అని ఆలోచిస్తూ వుంటుంది నా బిడ్డ. మీరు నాకు ఒక్క పూట గడువిస్తే నేను ఇంటికి వెళ్లి దూడకి పాలిచ్చి, జరిగిందంతా చెప్పి, మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తాను. ప్లీజ్ ఈ సహాయం చేయండి!” అని ఆవు అడిగ్గింది.  పులి నవ్వడం మొదలెట్టింది. “బాగానే చెప్పావు కథ. నా నుంచి తప్పించుకోవడానికే కదా?” అంది.  “లేదు, పొద్దున్నే వచ్చేస్తాను కదా, నన్నూ నమ్మండి” అంది ఆవు.  పులికి ఆవు మాట నమ్మాలో, నమ్మ కూడదో అర్ధం కాలేదు. ఒక విధంగా ఆలోచిస్తే ఆవు మాటల్లో చాలా నిజాయితి కనిపించింది. కాని ఇలాంటి కథ ఎవరు నమ్ముతారు? ఒక సారి పులిని తప్పించుకున్న వాళ్ళు మళ్ళి ఆ పులి దగ్గిరకి వెళతారా? అసలు సాధ్యమా?  ఏది ఏమైనా ఆవు తెలివిని మెచ్చుకో వలసిందే. సరేలే వేరే ఆహారం ఏదైనా వెతుక్కుందాము, ఆవుని వదిలేద్దాము అని నిశ్చయించుకుంది పులి. మళ్ళీ ఆవు తిరిగి రాదని తెలిసినా ఊరికే “సరే వెళ్ళు, రేపు పొద్దున్నే ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తాను” అని ఆవుతో అంది.  ఆవు మొహం మీద సంతోషం, ఆశ్చర్యం రెండు కనిపించాయి.  ఆవు, “నేను తప్పకుండా వస్తాను, నా మాట నమ్మండి” అని ఇంటికి బయలుదేరింది.

ఇంట్లో దూడకి పాలు ఇచ్చి, జరిగింది చెప్పింది. అమ్మ లేకపోయినా పరవాలేదు, నీకు అందరు సహాయం చేస్తారు నువ్వు మంచిగా ఉండాలి, అని దూడకి ధైర్యం చెప్పింది.  గ్రామంలోని తన బంధువులు, మిత్రులు అయిన ఇతర ఆవులకి కూడా జరిగిన సంగతి చెప్పి, “నేను లేనప్పుడు నా దూడని కూడా మీ బిడ్డ లాగా చూసుకోండి,” అని కోరింది.  ఇతర ఆవులన్నీ కలిసి ఈ ఆవుని తిరిగి వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నం చేసాయి. “పులినుంచి తప్పించుకుని మళ్ళి వెళతానంటావేంటి? అసలు ఇందులో అర్ధముందా?” అని చాలా నచ్చ చెప్పడానికి చూసాయి. కాని మన ఆవు, “లేదు, నేను మాట ఇచ్చాను, నా దూడకి పాలు ఇచ్చి, ఎవరికైన అప్ప చెప్పి తప్పకుండా తెల్లారగానే వచ్చేస్తానని మాట ఇచ్చాను” అని చెప్పింది.  పొద్దున్నే ఆవు దూడ విడిపోతూ బాగా ఏడిచాయి. మరొక సారి ఆలోచించుకోమని బంధు మిత్రులు చెపుతున్నా తాను మాట మీద నిలపడాలని ఆవు అడవిలోకి వెళ్ళింది. కాని మనసు మట్టుకు భారంగానే వుంది. బాగా భయ పడుతూ అడవి చేరుకుంది.  అడవిలో పులికి ఆవు వస్తుందని ఏ మాత్రం నమ్మకం లేదు! అయినా ఎందుకో ఒక ఉత్సుకత. ఆవు వస్తుందా రాదా అని తెలుసుకోవాలనే ఆసక్తి. అందుకని అనుకున్న సమయానికి మళ్ళి ఆ ఆవును కలుసుకున్న చోటికి వెళ్ళింది.  అక్కడ ఆవుని చూసి చాలా ఆశ్చర్య పోయింది. “నువ్వు నిజంగా వస్తావనుకో లేదు! నీ దూడకి చెప్పావా?” అని అడిగింది.   ఆవు కళ్ళ ల్లో నీళ్ళు తిరుగుతున్నా, ధైర్యంగా సమాధానము చెప్పింది, “మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలండి  – నేను దూడకి పాలిచ్చి, జరిగినది చెప్పి, సెలవు తీసుకుని వచ్చాను.”   “మరి నేను నిన్ను తినేస్తే నీ దూడకి పాలు ఏవరు పడతారు?” అని పులి అడిగింది.   “నా బంధు మిత్రులకు అప్ప చెప్పి వచ్చాను” అంది ఆవు.  “మరి వాళ్లకి ఏం చెప్పావు?” అంది పులి. “నిజమే చెప్పాను,” అంది ఆవు. “వాళ్ళు నిన్ను ఆపలేద? వెళ్ళద్దని అనలేదా?” అని ఆశ్చర్యంగా అడిగింది పులి. ‘అన్నారు కాని, నేను మీకు మాట ఇచ్చాను కదా. అందుకే అందరికి సర్ది చెప్పి వచ్చాను” అంది ఆవు.  పులికి ఆవు నిజాయితి చాలా నచ్చింది. “ఇంత వరకు నేను నీ లాంటి జంతువును ఎప్పుడు కలవ లేదు. నీ లాగా ఇలా మాట మీద నిలపడ డానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. నీ లాంటి మంచి ఆవుని నేను తినలేను. నువ్వు నిర్భయంగా రోజు ఈ అడవిలోకి వచ్చి వెళ్ళచ్చు” అని చెప్పి, ఆవుని ఏమి చేయకుండా వెళ్ళిపోయింది.  ఆవుకి బాధ, ఏడుపు, మనసులోని భారం, అన్ని చప్పున  తగ్గిపోయాయి. ఆ రోజు గడ్డి మేయకుండానే పరిగెత్తుకుంటూ మళ్ళి ఇంటికి వెళ్లి దూడని గట్టిగా వాటేసుకుంది.  మనం నిజం చెబుతూ, నిజాయితీగా వుంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదుర్కోగలము.

ఉల్లిపాయి దొంగ

ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలిస్తుంటే ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు. న్యాయమూర్తి దెగ్గిరకు   తీసుకుని వెళ్ళారు.  న్యాయమూర్తి ఆ అబ్బాయిని మూడు శిక్షలలో ఒకటి ఎంపిక చేసుకో మన్నాడు – ఒకటే ఒకసారి దొంగలించిన ఉల్లిప్పాయలన్నీ తినడమా; వంద కొరడా దెబ్బలు భరించడమా, జరిమానా చెల్లించడమా?  ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించ కుండా ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు.  ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు. కాని అది అనుకున్నంత సులువైన పని కాదు. ఒక్కటి కూడా పూర్తి గా తినకుండానే కళ్ళల్లోంచి, ముక్కు లోంచి నీళ్ళు కారడం మొదలైంది. ఐనా మొండి గా ఇంకో రెండు తిన్నాడు, కాని ఇక వీలు కాలేదు.  సరే ఇది కాదు, కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు. సైనికులు కొరడాతో కొట్టడం మొదలు పెట్టారు. కొరడా దేబ్బాలంటే మాటలా? నొప్పి తట్టుకో లేక పోయాడు.  బాబోయి! బాబోయి! జరిమానా కట్టేస్తాను, ఆపండి! అని ఏడుపు మొదలెట్టాడు.  ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు.  ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్ధం అయ్యింది. ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పు తిప్పలూ పెడుతుందని. ఆ తరువాత ఆ అబ్బాయి ఎప్పుడు దొంగతనం కాని, వేరే టప్పుడు పనులు కాని చేయలేదు.  కొంత మంది ఈ కథలో ఇంకో నీతి కూడా చెప్తారు. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి, ప్రత్యామ్నాయాలు పరిశీలించాలీ. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి.

Scroll to Top