భాషా భాగములు (parts of speech)

భాషా భాగములు

          తెలుగులో భాషా భాగాలు అయిదు అవి: 

  • నామ వాచకములు
  • సర్వనామములు
  • విశేషణములు
  • క్రియలు
  • అవ్యయములు.

నామ వాచకం నిర్వచనం

ఒక వ్యక్తిని కాని, ఒక స్థలాన్ని కాని, ఒక వస్తువుని కాని, ఒక ఊహని కాని సూచించేది నామవాచకం. 

తెలుగులో తారసపడే నామవాచకాలకి, సర్వసాధారణంగా “వచనం” (number) “లింగం” (gender) ఉంటాయి.   మనుష్యులలో మగ వారిని సూచించేది పుంల్లింగం లేదా పురుష లింగం.  ఉదాహరణ:- రాముడు, తాత, ఎరకయ్య, పిల్లడు, మొదలైనవి.  మనుష్యులలో ఆడ వారిని సూచించేది స్త్రీ లింగం.  ఉదాహరణ:- సీత, మామ్మ, రత్తాలు, పిల్ల, మొదలైనవి.  పశువులు, చెట్లు, ప్రాణం లేని పదార్థాలు అన్నీ కూడా స్త్రీ లింగమే. ఉదాహరణ:- ఆవు, గంట, అడవి, మొదలైనవి. 

నామవాచకాలు “ఏకవచనం” (singular) లోనయినా ఉంటాయి, “బహువచనం” (plural) లోనయినా ఉంటాయి. బహువచనంలో ఉన్న మాటలు సర్వసాధారణంగా “లు”తో కాని “ళ్లు”తో కాని అంతం అవుతాయి. ఏకవచనంలో ఉన్న కొన్ని నామవాచకాలకి కేవలం “లు” తగిలిస్తే బహువచనాలు అవుతాయి.

  • గోడ –> గోడలు (Wall– > Walls)
  • చేప –> చేపలు (Fish– >Fishes)
  • మాట –> మాటలు (word–> words)
  • పన్ను —> పన్నులు (tax–>taxes)

సంస్కృతం నుండి తెలుగు లోకి వచ్చినప్పుడు ఏకవచనంలో “డు” సంతరించుకున్న మాటలు బహువచనంలో “డు”ని పోగొట్టుకుని “లు” చేర్చుకుంటాయి:

  • పండితుడు –> పండితులు (Scholar– > Scholars)
  • స్నేహితుడు –> స్నేహితులు (Friend– > Friends)
  • ఆత్మీయుడు –> ఆత్మీయులు (Soul mate– > Soul mates)

బహువచనంలో “లు” చేర్చినప్పుడు, అప్పుడప్పుడు, సంధి చేయవలసి వస్తుంది:

  • పేరు –> పేరులు –> పేర్లు
  • కారు –> కారులు –> కార్లు
  • బోటు –> బోటులు –> బోట్లు
  • చెట్టు –> చెట్టులు –> చెట్లు
  • మెట్టు –> మెట్టులు –> మెట్లు
  • రోడ్డు –> రోడ్డులు –> రోడ్లు

ఏకవచనంలో ఉన్న నామవాచకం “లు”తో అంతం అయితే దాని బహువచనం “ళ్లు”తో అంతం అవుతుంది:

  • కీలు –> కీళ్లు
  • తేలు –> తేళ్లు
  • కాలు –> కాళ్లు
  • పాలు –> పాళ్లు (portion– > portions)
  • పెనిసిలు –> పెనిసిళ్లు (pencil– > pencils)

ఏకవచనం “డి”, “డు”, “లి”, “రు” లతో అంతం అయితే దాని బహువచనం “ళ్లు”తో అంతం అవుతుంది:

  • బడి –> బళ్లు (school– > schools)
  • బండి –> బళ్లు (cart– > carts)
  • పెరడు –> పెరళ్లు (backyard– > backyards)
  • ఊరు –> ఊళ్లు (villages)

కొన్ని నామవాచకాలకి “లు” తగిలించినప్పుడు మాట వర్ణక్రమంలో కొద్ది మార్పు వస్తుంది.

  • నది –> నదులు (river– > rivers)
  • గది –> గదులు (room– > rooms)
  • బంతి –> బంతులు (ball — > balls)

ప్రత్యేకమైన సందర్భాలు:-

  • మడి –> మళ్లు (field– > fields)
  • గడి –> గళ్లు (square– > squares)
  • సుడి –> సుళ్లు
  • పండు –> పండ్లు, పళ్లు (fruits)
  • పన్ను —> పళ్లు (tooth–>teeth)
  • ఇల్లు –> ఇళ్లు
  • ఎద్దు –> ఎడ్లు

కొన్ని నామవాచకాలు ఎల్లప్పుడూ బహువచనాలే

  • పాలు, నీళ్లు

లింగం (Gender)

సర్వసాధారణంగా “డు”తో అంతం అయే పేర్లు అన్నీ పుంల్లింగమే అవుతాయి.

ఉదాహరణలు: రాముడు, తమ్ముడు, అల్లుడు, మనుమడు, ముఖ్యుడు మొదలైనవి

పుంల్లింగములు అన్నీ “డు”తో అంతం అవాలని నియమం ఏదీ లేదు.

ఉదాహరణలు: తండ్రి, అన్న, మామ మొదలైనవి

జంతువులు అన్నీ స్త్రీ లింగములే.

ఉదాహరణలు: ఆవు, ఎద్దు, మగ గుర్రం, ఆడ గుర్రం, మొసలి మొదలైనవి.

ప్రాణము లేనివి అన్నీ స్త్రీ లింగములే.

ఉదాహరణలు: చెట్టు, నది, రాయి మొదలైనవి.

కొన్ని వర్గాలలో ఆడ, మగ, వ్యత్యాసం చూపించడానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి:

ఉదాహరణలు: అమ్మ, అత్త, అక్క, కోడలు, అమ్మాయి, పిల్ల మొదలైనవి స్త్రీ లింగములు.

ఉదాహరణలు: నాన్న, మామ, అన్న, అల్లుడు, అబ్బాయి, పిల్లడు మొదలైనవి. పుంల్లింగములు.

లింగం మార్పిడి(Gender Change)

కొన్నిసార్లు పుంల్లింగం మాటని స్త్రీ లింగంలోకి మార్చాలంటే మాట చివర “-ఉడు” శబ్దాన్ని తీసేసి “-టి”ని చేర్చాలి.

  • నటుడు –> నటి
  • వంచకుడు –> వంచకి

కొన్నిసార్లు పుంల్లింగం మాటని స్త్రీ లింగంలోకి మార్చాలంటే మాట చివర “-డు” సబ్దాన్ని తీసేసి “-రాలు”ని చేర్చాలి.

  • వంచకుడు –> వంచకురాలు
  • ప్రియుడు –> ప్రియురాలు
  • భక్తుడు –> భక్తురాలు
  • స్నేహితుడు –> స్నేహితురాలు

కొన్ని మాటలు ఎల్లప్పుడు స్త్రీ లింగాలే

  • చూలాలు, ఇల్లాలు

సర్వనామము నిర్వచనం

నామవాచకం (Noun) కు బదులుగా వాడబడేది సర్వనామము (Pronoun). సర్వము అంటే అన్నీ, అంతా అని అర్ధము. ఉదాహరణలు: అతడు – ఇతడు – అది – ఇది – ఆమె – ఈమె – అన్ని – ఇన్ని – ఎన్ని – కొన్ని – కొంత – ఆ – ఈ – ఏ – నీవు – నేను – మీరు – మేము – మనము – వారు – ఎవరు – ఏది – తమరు – తాము – తాను – వాడు – వీడు.

సర్వనామము

సర్వనామము నిర్వచనం:- సర్వనామమనగా నామ వాచకములకు బదులుగా వాడబడునది.

ఉదాహరణ: నువ్వు, మీరు, నేను, వాళ్ళు, వీరు

సర్వనామములలో రకములు:

  • సంబంధ సర్వనామము
  • విశేషణ సర్వనామము
  • సంఖ్యావాచక సర్వనామము
  • సంఖ్యేయవాచక సర్వనామము
  • పురుషలకు సంబంధించిన సర్వనామం
  • నిర్దేశాత్మక సర్వనామము
  • అనిర్ధిష్టార్థక సర్వనామాలు
  • ప్రశ్నార్థక సర్వనామము.

1. సంబంధ సర్వనామము:- సంబంధం ఉండే అర్థాన్ని తెలియజేసే సర్వనామం “సంబంధ సర్వనామం”.

ఉదాహరణ: ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి. ఇందులో ఎవడు-వాడు అనే రెండు సర్వనామాలు పనిచేయడానికి దోషి           అవడానికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. కనుక ఇవి, ఇలాంటివి సంబంధ సర్వనామాలు.

2. విశేషణ సర్వనామము:- సర్వనామ రూపంలో ఉన్న విశేషణ శబ్దాలు “విశేషణ సర్వనామాలు”.

ఉదాహరణ: అందరు అందరు కారు. ఇందులో అందరు అనేది విశేషణ రూపంలో ఉన్న సర్వనామం.

3. సంఖ్యావాచక సర్వనామము:– సంఖ్యలను తెలియజేసే సర్వనామాలు “సంఖ్యావాచక సర్వనామాలు”.

ఉదాహరణ: ఒకరు – ఇద్దరు – ముగ్గురు – నలుగురు మొదలైనవి సంఖ్యావాచక సర్వనామాలు.

4. సంఖ్యేయవాచక సర్వనామము:- ఇవి సంఖ్య చేత సంఖ్యగా చెప్పబడతాయి. కాని, నిర్దిష్టముగా ఎవరో ఏమిటో చెప్పవు. కనుక “సంఖ్యేయవాచక సర్వనామం”.

ఉదాహరణ: వారు ముగ్గురూ వీరే. ఇందులో ఆ ముగ్గురూ పురుషులా, స్త్రీలా అనేది చెప్పబడనందున ఇది సంఖ్యేయవాచక సర్వనామం.

5. పురుషలకు సంబంధించిన సర్వనామం:- ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషలు మూడు. వాటికి సంబంధించిన సర్వనామాలు కనుక ఇవి “పురుషలకు సంబంధించిన సర్వనామాలు”.

ఉదాహరణ: ప్రథమ పురుష : వాడు – వారు; మధ్యమ పురుష : నీవు – మీరు; ఉత్తమ పురుష : నేను – మేము – మనము

6. నిర్దేశాత్మక సర్వనామము:- నిర్దేశించటం అంటే ఇది అని నిర్దేశించి చెప్పటం – అలాంటి సర్వనామాలు “నిర్దేశాత్మక సర్వనామాలు”.

ఉదాహరణ: ఇది – ఇవి – అది – అవి

7. అనిర్ధిష్టార్థక సర్వనామాలు:- నిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పటం. అనిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పకపోవటం. ఇంత లేదా ఇన్ని లేదా ఇవి అని చెప్పకుండా ఎంతో కొంతను తెలియజేసే సర్వనామ పదాలు ఈ “అనిర్ధిష్టార్థక సర్వనామాలు”.

ఉదాహరణ: అన్ని – ఇన్ని – కొన్ని – ఎన్ని – కొంత – పలు – పెక్కు – బహు

8. ప్రశ్నార్థక సర్వనామము:- ప్రశ్నించేటట్టుగా అడుగబడే సర్వనామాలు “ప్రశ్నార్థక సర్వనామాలు”. ప్రశ్నించడం అంటే అడగడం అని అర్ధం.

ఉదాహరణ: ఎవరు? – ఎందుకు? – ఏమిటి? – ఎవతె? – ఎలా?

విశేషణము నిర్వచనం

నామవాచకాల యొక్క, సర్వనామాల యొక్క గుణములను తెలియజేయు పదములు విశేషణములు.

ఉదాహరణ: – నీలము, ఎరుపు, చేదు, పొడుగు.

విశేషణము రకములు:-

  • జాతి ప్రయుక్త విశేషణము
  • క్రియా ప్రయుక్త విశేషణము లేదా క్రియాజన్య విశేషణము
  • గుణ ప్రయుక్త విశేషణము
  • సంఖ్యా ప్రయుక్త విశేషణము.

జాతి ప్రయుక్త విశేషణము:- అనగా జాతులను గూర్చిన పదాలను తెలియచేయునది.

ఉదాహరణ: అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణము.

క్రియా ప్రయుక్త విశేషణము లేదా క్రియాజన్య విశేషణము:- అనగా క్రియా పదంతో కూడి ఉండే విశేషణం.

ఉదాహరణ:- పోవువాడు అర్జునుడు. ఇందులో “పోవు” అనేది క్రియ – కనుక పోవువాడు క్రియా ప్రయుక్త విశేషణం.

గుణ ప్రయుక్త విశేషణము:- అనగా గుణముతో కూడియున్న విశేషణము.

ఉదాహరణ: చక్కని చుక్క

సంఖ్యా ప్రయుక్త విశేషణము:- అనగా సంఖ్యని తెలియచేయు విశేషణము.

ఉదాహరణ: ‘నూరు’ వరహాలు, ‘ఆరు’ ఋతువులు

క్రియలు నిర్వచనం

ఏ విధంగానయినా పనులను తెలియచేయడాన్ని క్రియలు అంటారు.  ఏ భాషలోనైనా ప్రాథమిక క్రియలు కొన్నే ఉంటాయి. మిగతా క్రియలన్నీ నామవాచకాల (nouns)ని విశేషణాల్ని (adjectives) రూపాంతరించగా ఏర్పడ్డవై ఉంటాయి. ఇలా క్రియల్ని కల్పించడానికి తెలుగుభాష అందిస్తున్న సౌకర్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

  • తెలుగులో క్రియా ధాతువులు అంతమయ్యే విధానాన్ని ముందు అధ్యయించాలి. “చు” తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు.

ఉదా: కాచు, గీచు, చాచు, తోచు, దాచు, దోచు, పాచు, రాచు, వాచు, వీచు, వేచు మొదలైనవి.

  • అనుస్వార పూర్వకమైన (సున్నా ముందు గల)”చు” తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు.

ఉదా: దంచు, దించు, తెంచు, మించు, ఉంచు, ఎంచు, పంచు, వంచు మొదలైనవి.

  • ద్విరుక్త (వత్తు) “చు” తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు

ఉదా: తెచ్చు, గుచ్చు, నచ్చు, నొచ్చు, పుచ్చు మొదలైనవి.

  • “చు” తో అంతమయ్యే మూడు అక్షరాల క్రియాధాతువులు.

ఉదా: నడచు, ఒలుచు, పొడుచు, విడచు మొదలైనవి.

  • “ఇంచుక్” ప్రత్యయంతో అంతమయ్యే అచ్చతెలుగు క్రియాధాతువులు.

ఉదా: గురించు (addressing), ఆకళించు (explain), సవరించు (amend), సవదరించు (edit) మొదలైనవి.

  • “ఇంచుక్” ప్రత్యయంతో అంతమయ్యే ప్రేరణార్థక క్రియా ధాతువులు.

ఉదా: చేయించు (“చేయు” కు ప్రేరణార్థకం), కదిలించు (“కదులు” కు ప్రేరణార్థకం) మొదలైనవి.

  • “ఇంచుక్” ప్రత్యయంతో అంతమయ్యే తత్సమ (సంస్కృత/ప్రాకృత)క్రియా ధాతువులు. (ఇవి లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి)

ఉదా: ధరించు, బోధించు, సంహరించు మొదలైనవి.

  • “యు” తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు.

ఉదా: ఏయు, కాయు, కోయు, కూయు, డాయు, తీయు (తివియు), తోయు, మోయు, మ్రోయు, వేయు మొదలైనవి.

  • “యు” తో అంతమయ్యే మూడు అక్షరాల క్రియాధాతువులు.

ఉదా: తడియు, వడియు, జడియు, అలియు, తెలియు, పులియు, ఉమియు, విరియు మొదలైనవి.

  • “ను” తో అంతమయ్యే క్రియాధాతువులు.

ఉదా: తిను, కను, విను, మను, అను, చను, కొను మొదలైనవి.

  • సామాన్య క్రియా ధాతువులు.

ఉదా: సాగు, వెళ్ళు, అదురు వదులు, పగులు, మిగులు మొదలైనవి.

  • విశేష క్రియా ధాతువులు (special verbs).

ఉదా: ఉండు, వు, చూచు, అగు, వచ్చు, ఇచ్చు, చచ్చు మొదలైనవి.

కర్మ క్రియలు

తెలుగులో క్రియలు రెండు విధాలుగా ఉంటాయి. 1.సకర్మక క్రియలు (transitive verbs) 2. అకర్మక క్రియలు (intransitive verbs).

సూత్రం 1 సకర్మక క్రియలకు మాత్రమే చివర “ఇంచుక్” ప్రత్యయం వస్తుంది.

ఉదా: ధరించు: ఆయన కిరీటం ధరించాడు. (ఇక్కడ ధరించు అనే క్రియకు కిరీటం కర్మ కనుక ఇది కర్మ గలిగిన సకర్మక ధాతువు)

సూత్రం-2 అకర్మక క్రియలకు చివర “ఇల్లుక్” వస్తుంది.

ఉదా: ఆమె హృదయేశ్వరిగా విరాజిల్లింది. (ఈ వాక్యానికి కర్మ లేదు కనుక “విరాజిల్లు” అకర్మక ధాతువు) కాబట్టి మనం ఇంచుక్ బదులు ఇల్లుక్ చేర్చడం ద్వారా సకర్మక ధాతువుల్ని అకర్మక ధాతువులుగా మార్చడానికి తెలుగుభాష అవకాశం కల్పిస్తోంది. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు

ఇంచుక్ = చేయు

ఇల్లుక్ = అగు

ఈ మార్గంలో కల్పించదగిన కొన్ని పదాలు:

సన్నగిల్లు – సన్నగించు (సన్నగా అయ్యేలా చేయు)

పరిఢవించు – పరిఢవిల్లు

తొందఱించు – తొందఱిల్లు మొదలైనవి

ఇంచుక్, ఇల్లుక్ లని తెలివిగా పదాలకు చేర్చడం ద్వారా అంతులేనన్ని కొత్త క్రియాధాతువుల కల్పనకు తెలుగుభాష అవకాశమిస్తోంది. రెండూ ముఖ్యమైనవే. “ఇల్లుక్” చేర్పు తెలుగు నుడికారానికి స్వాభావికం కాని కర్మార్థక (passive voice) ప్రయోగాల ఆవశ్యకతని గణనీయంగా తగ్గిస్తుంది.

సవరిత వాడుక – modified usage:- ఆ వేగుతో అతను హెచ్చరిల్లాడు (హెచ్చరించబడ్డాడు- మేలుకున్నాడు. He got alert with the mail)

నిష్పన్న వాడుకcoined usage:- భవిష్యత్తులో వంద డాలర్ల లోపలే కంప్యూటర్లు అందుబాటిల్లుతాయి. (అందుబాటులోకి వస్తాయి-దొరుకుతాయి. In future computers could be accessed/accessible at just $ 100) ఇక్కడ కొన్ని నియమాలు వర్తిస్తాయి. మనం కల్పించే పదాల శ్రావ్యతని బట్టి వాటిని పాటించడమో మానుకోవడమో చెయ్యొచ్చు.

ఉర్దూ పదాలకు “ఇంచుక్/ఇల్లుక్” చేర్చడానికి ముందు ఆ పదాల చివర “ఆయ్” చేరుతుంది.

ఉడ్ (ఎగరడం) – ఉడ్ + ఆయ్ = ఉడాయ్ + ఇంచుక్ = ఉడాయించు (to decamp)

బనా (తయారు చెయ్యడం) – బనా + య్ = బనాయ్ + ఇంచుక్ = బనాయించు (to frame a criminal charge)

సంస్కృత పదాలకు ఇంచుక్ చేరే విధానం మనకందరికీ కొద్దో గొప్పో తెలుసు కనుక సవిస్తరంగా ఆ జోలికి పోను. విశేష వివరణలు కావాల్సినవారు చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణంలోని క్రియాపరిచ్ఛేదం చదవండి. అయితే ప్రస్తుతం ఈ మార్గంలో కూడా అవసరమైన పదాల కల్పన జరగడంలేదు. దీనికి సామాజిక కారణాలున్నాయి. సంస్కృత భాషా పరిజ్ఞానం చాలావరకు బ్రాహ్మణులకే పరిమితమైనది. ప్రస్తుతం మన తెలుగు బ్రాహ్మణులకు తెలుగే సరిగా రాదు. సంస్కృతం సంగతి చెప్పనక్కరలేదు. ఇలాంటి పరిస్థితిలో వారు ఎవరికీ ఏమీ నేర్పే సావకాశం లేదు. మిగతావారికేమో సంస్కృతంతో సంపర్కం ఎప్పుడూ లేదు. We are apparently living in the age of cultural disconnect with our history and past. ఏతావతా మనం ఇంగ్లీషు పదాలకు దీటైన దేశిపదాల్ని పట్టుకోవడంలో విఫలమౌతున్న దశాపరిణామం గోచరిస్తోంది.

“ఇంచుక్” ఉపయోగించి ప్రసిద్ధ సంస్కృత వ్యక్తుల/దేవతల పేర్లని కూడా క్రియాధాతువులుగా మార్చొచ్చు.అలాంటివి ఒకటి రెండు ఇప్పటికే సుప్రసిద్ధం. ఉదా: భీష్ముడు – భీష్మించుట, శివాలెత్తుట మొదలైనవి.  మఱికొన్నిటిక్కూడా అవకాశముంది. కాని అలాంటి క్రియాధాతువులు అర్థం కావాలంటే వారి గుణగణాలు కొంచెమైనా తెలియాలి.

విక్రమార్కించు = పట్టువదలకపోవు

జయచంద్రించు = విదేశీయులకు తోడ్పడు

కుంభకర్ణించు = లోకోత్తరంగా నిద్రపోవు మొదలైనవి.

అవ్యయములు

అవ్యయము అనగా లింగ, వచన, విభక్తులు లేని పదములను అవ్యయములు అందురు.

ఉదాహరణ: భలే, అక్కడ,అయ్యో,అమ్మో

Scroll to Top