పల్లెటూరు
నా పేరు అక్షయ. నేను విశాఖపట్నం కూర్మన్నపాలెంలో మా అమ్మ, నాన్నలతో ఉంటున్నాను. నేను 6 వ తరగతి చదువుతున్నాను. నేను మా తమ్ముడు వేసవి శెలవులుకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేము. వాళ్ళది పల్లెటూరు. వాళ్ళ ఊరు పేరు చల్లపేట. మా అమ్మమ్మ వాళ్లకి పొలం ఉంది. ఆ పొలంలో వరి పండిస్తారు, మా అమ్మమ్మ వాళ్లకి ఆవులు ఉన్నాయి. ఒకటి తెల్లావు ఇంకొకటి గోధుమ రంగు మచ్చలున్న ఆవు. తెల్ల ఆవుకి చిన్న దూడ ఉంది. అది చాలా ముద్దుగా ఉంది. దాని నోటికి ముట్టి కట్టి ఉంచుతారు లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి పాలు తాగేస్తుంది. మచ్చల ఆవు ఇంకా మూడు నెలలలో ఈనుతుందని అప్పుడు దానికి కూడా దూడ ఉంటుందని మా అమ్మమ్మచెప్పింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటిముందు పువ్వుల మొక్కలు ఉన్నాయి. జాజి పాదు ఉంది, మల్లె, పందిరమల్లె, గులాబీ, రకరకాల చామంతి మొక్కలు, బంతి, కనకాంబరం అందులో మళ్ళీ ఎర్ర కనకాంబరం, పచ్చ కనకాంబరం, గులాబీల్లో, తెల్ల గులాబీ, పచ్చ గులాబీ, ఎర్ర గులాబీ మొక్కలున్నాయి. పెరట్లో ఆనపపాదు, దొండపాదు, బీరపాదు, గోరుచిక్కుడు, పందిరి చిక్కుడు, పొడుగు చిక్కుడు పాదులున్నాయి, ఇంకా వంగ మొక్కలు, బెండ మొక్కలు, మిరప మొక్కలు, గోంగూర, తోటకూర మొక్కలున్నాయి. నాలుగు కొబ్బరిచెట్లు, మందార, నందివర్ధనం పువ్వుల చెట్లు, మారేడు చెట్టు ఉన్నాయి. మా తాతగారు, పాలేరు రోజూ ఉదయాన్నే లేచి నాగలి, ఎద్దులను తీసుకుని పొలానికి వెళతారు. అక్కడ పని ముగించుకుని ఇంటికి వచ్చి స్నానాలు చేసి చల్ది అన్నం తింటారు. పల్లెటూళ్లలో టిఫిన్లు చేసుకుని తినడం అలవాటు లేదని చల్దిఅన్నమే ఆరోగ్యమని మా అమ్మమ్మ చెప్పింది. అది తెలుసుకుని నేను, తమ్ముడు కూడా చల్దిఅన్నమే తిన్నాము. చల్దిఅన్నంలో మాగాయి టెంక నంచుకుని తింటుంటే చాలా బాగుంది. మా తమ్ముడైతే జుర్రుకుని మరీ తిన్నాడు. మా పిన్ని ఉదయాన్నే గుమ్మం కడిగి ముగ్గులేసింది. మా పిన్ని వేసిన ముగ్గులు నాకు నచ్చి నాక్కూడా ముగ్గులు వేయడం నేర్పమన్నాను అలాగే నేర్పుతానంది. మా మామయ్యా ఆవుల దగ్గర పాలు పితికేడు. మా అత్త నాకు, తమ్ముడికి అప్పుడే తీసిన పాలు తాగమని ఇచ్చింది. నేను తమ్ముడు పచ్చి పాలు తాగేము. చాలా తియ్యగా, కమ్మగా ఉన్నాయి. మధ్యాహ్నం భోజనాలప్పుడు పప్పు అన్నంలో అమ్మమ్మ వేసిన నెయ్యి చాల రుచిగా ఉంది. అది పసుపు రంగులో ఉంది. ఎందుకని ఆలా పచ్చగా ఉందని అడిగితే అమ్మమ్మ వెన్నలో పసుపు వేసి కాచుతాను కాబట్టి పచ్చగా ఉంటుంది అని చెప్పింది. మా ఇంట్లో కొనుక్కున్న నెయ్యి తప్ప ఇంట్లో చేసుకోలేదు. నాకు నెయ్యి బాగా నచ్చింది. అలాగే పెరుగు కూడా చాలా బాగుంది. పెరుగులో మీగడ తరకలు తింటుంటే చాలా కమ్మగా ఉన్నాయి. మేము శెలవులు అయిపోయి ఇంటికి వస్తున్నప్పుడు మా అమ్మమ్మ, అత్తా కలసి మినప సున్ని ఉండలు, అరిసెలు, జంతికలు, చేగోడీలు చేసి ఇచ్చేరు. చాలా బాగున్నాయి. మాకు అమ్మమ్మ వాళ్ళ ఊరు, వాతావరణం బాగా నచ్చేయి. మంచి రుచికరమైన భోజనం కూడా తిన్నాము. మనం పల్లెటూరు వదిలి వచ్చి పట్టణాల్లో బ్రతుకుతున్నాం కానీ చాలా ఆరోగ్యకరమైన వాతావరణాన్నికోల్పుతున్నామని, సహజసిద్ధంగా పండిన ఆహారాన్ని తినలేకపోతున్నామని నా అభిప్రాయం. ఈ విధంగా మా వేసవి శెలవులు పల్లెటూరులో గడిపే గొప్ప అనుభవాన్నిచ్చాయి. ఇకపై ఎప్పుడు శెలవులు వచ్చినా మా అమ్మమ్మ వాళ్ళింటికే వెళతాము.