ఉగాది
ఉగస్య ఆది అనేదే ఉగాది. “ఉగ” అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలు. వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’. అనగా ప్రపంచం యొక్క జన్మ, ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాదికి, వసంత కాలానికి గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు, ప్రాతః, సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.
వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారం ధరించిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కనుక సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడింది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన శకం ఆరంభకునిగా ప్రఖ్యాతి గడించిన కారణాన ఆ యోధుని జ్ఞాపకార్ధం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా ఇంచుమించుగా అచేతనావస్ధలో ఉన్న ప్రపంచంలో చైతన్యాన్ని రగిలించి మానవాళిలో నూతనమైన ఆశలను, ఆశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’.
శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.”ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు. అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరుపొందింది. తమిళులు “పుత్తాండు” అనే పేరుతో, మలయాళీలు “విషు” అనే పేరుతోను, సిక్కులు “వైశాఖీ” గానూ, బెంగాలీలు “పొయ్‌లా బైశాఖ్” గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును. తెలుగు రాష్ట్రాలలో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాలను, స్ధూలంగా తమ భావిజీవిత క్రమం తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టత చూపుతారు.
- బెల్లం – తీపి… ఆనందానికి గుర్తు.
- వేప పువ్వు – చేదు… జీవితంలో బాధకలిగించే అనుభవాలకు గుర్తు.
- చింతపండు – పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు గుర్తు.
- ఉప్పు – జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం.
- పచ్చి మామిడి ముక్కలు – వగరు కొత్త సవాళ్లుకు గుర్తు.
- కారం – సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులుకు గుర్తు.
మన ఉగాది చైత్ర మాసంతోనే ఎందుకు మొదలవుతుంది?
చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రధమేహని, శుక్ల పక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి
చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ సమయంలో బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సృష్టించాడు. ఇది ఇలా ఉంచితే మన దేశంలో పుష్య, మాఘ మాసాలు పంటలు పండి ప్రకృతి రసభరితంగా ఉండేకాలం. ప్రజలు తమ శ్రమ ఫలితాన్ని కట్టెదుట చూస్తూ పొంగి పోతారు. ఇదే మొదట్లో మన సంవత్సరాది. దీనిని సూచించే దినం మకర సంక్రమణం. ఇది మార్గశిర, పుష్య, మాఘ మాసాల మధ్యన వచ్చేది విషువత్కాలం. విషువత్కాలమంటే పగలూ రాత్రీ సరిసమానంగా ఉండే కాలం. “సమరాంత్రిందివే కాలే విషువత్” అన్నాడు అమరసింహుడు. ఈ విషువత్తులు రెండు. మకర సంక్రాంత్రి అలాంటి విషువత్తులలో ఒకటి. ఈనాటి నుంచి ప్రకృతిలో క్రొత్త క్రొత్త మార్పులు కలగడం ఆరంభం అవుతుంది. ఈ విషువత్ నిర్ణయంలోనూ మత బేధం ఉంది. కటకం నుంచి- కటక విషువత్ నుంచి- దక్షిణాయనం, మకర విషువత్ నుంచి ఉత్తరాయణం ప్రారంభమౌతాయని నేటి సాంప్రదాయం. కానిపూర్వం ఆశ్లేషారధం నుంచి దక్షిణాయనం, ధనిష్థా ప్రథమపాదం నుంచి అంటే అభిజిత్తుతో సహా లెక్కపెడితే కుంభం నుంచి ఉత్తరాయణం, సింహంనుంచి దక్షిణాయనం ఉండేవని ఇప్పుడు అవి కటకాలకు మారాయని వరాహమిహిరుడు బృహత్సంహితలో తెలిపాడు. మనకొక సంవత్సరమైతే దేవతలకొక దినం. వారి దినం మేషంతో ప్రారంభమౌతోంది; తులతో రాత్రి. కనుక నేడు మకర కటకాలనుంచి ఉత్తర దక్షిణాయనాలు చెబుతారు అని శ్రీ పత్యాచార్యుడు అన్నాడు.
మనం ఉత్తరధ్రువ ప్రాంతం నుంచి బయలుదేరామనువాదం నిజమైతే, మేషవిషువత్తునుంచి మనకు దినం ప్రారంభం కావడం -6 నెలలు చీకటి 6 నెలలు వెలుతురు ఉండే దినం మొదలుకావడం నిజం. మనం ఉత్తరార్ధ గోళం వారం కనుక మేషంలోనే మనకు సూర్యోదయం. భూమధ్య రేఖపై సూర్యుడుండే దినం విషువత్. మానవుడు ఋతువులు తన లెక్కలకు ముందు వెనుకలుగా రావడం చూచి, సూర్యచారాన్ని తక్కిన గ్రహాల చారాన్ని లెక్కలు కట్టసాగాడు. సూర్యుడు విషువత్తులో ప్రవేశించిన నాటినుంచి లెక్కకట్టి రాసులు విభజించాడు. ఈవిధంగా నభో మండలం- 12 భాగాలు అయినది. ఆ రాసులతోనే మాస సంకేతం చేసుకున్నాడు. సూర్యుడు ఒక రాశినుంచి మరొక రాశికి ప్రవేశించడానికి దాదాపు 30, 31 దినాలవుతుంది. కాని చంద్రుని వృద్ధి, క్షయాలతో ఏర్పడిన నెలకు, తర్వాత సూర్యమానపు నెలకూ క్రమంగా నెల వారా రావడం మొదలైంది. చంద్రమానానికి 19 సంIIలకు ఏడు అదనపు నెలలు చేర్చి రెండు మానాలను సర్దుకోవలసి వచ్చింది. కనుకనే ప్రతి మూడోఏటా చంద్రమాన సంIIలో ఒక అధిక మాసం వస్తూవుంటుంది.
నిజానికి చంద్రమానమే వేదకాలం నుంచి ఆచరణలో ఉన్నదేమో!! సౌరమానం వ్యవహారంలో ఉన్న ప్రాంతాలలోనూ వైదిక కర్మలకు చంద్రమానాన్ని అనుసరించడమే దీని ప్రాచీనతకు ప్రమాణం. అగ్ని పూజకులైన ఫార్సీలు ఎప్పుడో మననుంచి విడిపోయినవారు. వారి సంవత్సరాది నౌరోజ్. అది కూడా వసంతమాసంలో దాదాపు ఉగాది దరిదాపులలోనే రావడం కూడా చంద్రమానం ప్రాచీనతకు నిదర్శనం. ముస్లింలు ఏదేశం వారైనా పూర్తిగా చంద్రమానాన్ని వాడేవారే. కనుకనే వారి పండుగలు ఒకసారి చైత్రంలో, మరొకసారి వైశాఖంలో మారుతూ ఉంటాయి. చాళుక్యుల కాలంలో మాత్రం సూర్యమానం ఆంధ్రదేశంలో అధికవ్యాప్తిలో ఉండేదట. ఇప్పుడు మనదేశంలో సౌరమానాన్ని వంగ, తమిళ, కేరళ, పంజాబు, సింధు, అస్సాం వారు అనుసరిస్తున్నారు.
మేషవిషువత్తే దైవతదినానికి అంటే సంవత్సరార్ధానికి ప్రారంభమైనప్పుడు భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిలో సూర్యుడు లంకానగరంలో వసంతఋతువు శుక్లపక్ష ప్రతిపత్తునాడు ఉదయించడంవల్ల (భూ మధ్య రేఖపై ఉండడాన్ని బట్టి) అనాడే ఉగాది అనడంవల్ల సంవత్సరం వసంత ఋతువుతో ప్రారంభమౌతుందని యజుర్వేదం ఒకవైపు ఘోషిస్తుండగ ధర్మసింధు, నిర్ణయసింధు నిర్ణయకారులు ఈ ఉగాది పండుగ సంవత్సరాది పండుగ అనడం మాత్రమే కాక, నిర్ణయసింధుకారుడు శుద్ధపాడ్యమి నుంచి అమావాస్య వరకు గల కాలమే నెల అని నిర్ణయించినప్పుడూ; వివిధ విధాల సంవత్సరాదులేమిటి? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కాని ఋతునిర్ణయం లోను, సంవత్సరాది నిర్ణయంలోనూ ప్రాచీనకాలంలో వివిధాచారాలున్నాయనడమే దానికి సమాధానం. ఒకప్పుడు కార్తులను బట్టి ఋతు నిర్ణయం జరిగేది. వేదాంగ, జ్యోతిష కాలంలో ధనిష్ఠా కార్తితో ప్రారంభమైన శిశిర ఋతువుతో మాఘ పూర్ణిమ నుండి రెండు నెలలతో మొదటి ఋతువు సంవత్సరం ప్రారంభమయ్యేది. ఇది ఉత్తరాయణ ప్రవేశం కాలం కూడాను. ఇది పరాశరుడు మతం. ఈ రోజున వేపపువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణము, మిత్రదర్శనము, ఆర్యపూజనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు.
క్రమ సంఖ్య | తెలుగు సంవత్సరం పేరు | English Translation | Year | సంవత్సర ఫలితము |
1 | ప్రభవ | Prabhava | 1867, 1927, 1987, 2047 | ప్రభవించునది అంటే పుట్టుక.యజ్ఞములు విరివిగా జరుగుతాయి. |
2 | విభవ | Vibhava | 1868, 1928, 1988, 2048 | వైభవంగా ఉండేది. జనులు సుఖముగా ఉంటారు. |
3 | శుక్ల | Shukla | 1869, 1929, 1989, 2049 | అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక పంటలు సమృద్ధిగా పండుతాయి. |
4 | ప్రమోదూత | Pramoduta | 1870, 1930, 1990, 2050 | ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత ప్రజలందరు ఆనందంగా ఉంటారు |
5 | ప్రజోత్పత్తి | Prajotpati | 1871, 1931, 1991, 2051 | ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి అంతటా అభివృద్ధి కనిపిచును |
6 | అంగీరస | Angirasa | 1872, 1932, 1992, 2052 | అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థంభోగములు కలిగి ఉంటారు |
7 | శ్రీముఖ | Sri Mukha | 1873, 1933, 1993, 2053 | శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం లోకమంతా సౌఖ్యముగా ఉంటుంది |
8 | భావ | Bhava | 1874, 1934, 1994, 2054 | భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు ఉన్నత భావమును కలిగిస్తుంది |
9 | యువ | Yuva | 1875, 1935, 1995, 2055 | యువ అనేది బలానికి ప్రతీక ఇంద్రుడు వర్షములు కురిపించుట వలన లోకమంతా సస్యశ్యామలముగా ఉంటుంది |
10 | ధాత | Dhatu | 1876, 1936, 1996, 2056 | అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు. అన్ని ఔషధులు (మొక్క ధాన్యాలు)పండును |
11 | ఈశ్వర | Eshwara | 1877, 1937, 1997, 2057 | పరమేశ్వరుడు. అందరికీ క్షేమము ఆరోగ్యము కలిగించును |
12 | బహుధాన్య | Bahudhanya | 1878, 1938, 1998, 2058 | సుభిక్షంగా ఉండటం.అన్ని రకాల పంటలూ విరివిగా పండటం దేశమంతా సుభిక్షముగా ఉంటుంది |
13 | ప్రమాది | Pramadi | 1879, 1939, 1999, 2059 | ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు. ప్రమాదో ధీమతామపి అన్నారు. |
14 | విక్రమ | Vikrama | 1880, 1940, 2000, 2060 | విక్రమం కలిగిన వాడు. మధ్యమ వర్షపాతము ఉంటుంది |
15 | వృష | Vrusha | 1881, 1941, 2001, 2061 | చర్మం. అంతటా వర్షములు కురుస్తాయి |
16 | చిత్రభాను | Chitrabhanu | 1882, 1942, 2002, 2062 | భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం. సూర్యునిలో మార్పులకు అవకాశం వుంటుంది. చిత్రవిచిత్ర అలంకారములను ఇస్తుంది |
17 | స్వభాను | Swabhano | 1883, 1943, 2003, 2063 | స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం క్షేమము ఆరోగ్యము ఇస్తుంది |
18 | తారణ | Tarana | 1884, 1944, 2004, 2064 | తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం. పంటలకు అనుకూలముగా వర్షములు కురుస్తాయి |
19 | పార్థివ | Parthiva | 1885, 1945, 2005, 2065 | పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.సస్యములు సంపదలు సమృద్ధి ఔతాయి |
20 | వ్యయ | Vyaya | 1886, 1946, 2006, 2066 | ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం అతివృష్ఠి కలుగుతుంది |
21 | సర్వజిత్తు | Sarvajit | 1887, 1947, 2007, 2067 | సర్వాన్ని జయించినది ప్రజలు సుఖించునట్లు వర్షాలు పడతాయి. |
22 | సర్వధారి | Sarvadhari | 1888, 1948, 2008, 2068 | సర్వాన్ని ధరించేది. సుభిక్షముగా ఉంటుంది. |
23 | విరోధి | Virodhi | 1889, 1949, 2009, 2069 | విరోధం కలిగినట్టువంటిది. మేఘాలను హరించి వర్షము పడకుండా చేద్తుంది |
24 | వికృతి | Vikruti | 1890, 1950, 2010, 2070 | వికృతమైనటువంటిది. భయంకరముగా ఉంటుంది |
25 | ఖర | Khara | 1891, 1951, 2011, 2071 | గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.పురుషులు వీరులౌతారు |
26 | నందన | Nandana | 1892, 1952, 2012, 2072 | కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది. ప్రజలు ఆనందముగా ఉంటారు |
27 | విజయ | Vijaya | 1893, 1953, 2013, 2073 | విశేషమైన జయం కలిగినది. శత్రువులను హరించును |
28 | జయ | Jaya | 1894, 1954, 2014, 2074 | జయాన్ని కలిగించేది. శత్రువులు, రోగముల మీద విజయము కలుగుతుంది |
29 | మన్మథ | Manmatha | 1895, 1955, 2015, 2075 | మనస్సును మధించేది. జ్వరాఫ్హిబాఫ్హలు కలుగును |
30 | దుర్ముఖి | Durmukhi | 1896, 1956, 2016, 2076 | చెడ్డ ముఖం కలది.ప్రజలు దుష్కర్మలు చేస్తారు |
31 | హేవిలంబి (లేదా) హేమలంబ | Hevilambi or Hemalambi | 1897, 1957, 2017, 2077 | సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం సంపదలు కలుగును |
32 | విలంబి | Vilambi | 1898, 1958, 2018, 2078 | సాగదీయడం. సుభిక్షముగా ఉంటుంది |
33 | వికారి | Vikari | 1899, 1959, 2019, 2079 | వికారం కలిగినది. శత్రువులకు కోపము కలిగించును |
34 | శార్వరి | Sharvari | 1900, 1960,2020, 2080 | రాత్రి అక్కడక్కడా పంటలు పండును |
35 | ప్లవ | Plava | 1901, 1961, 2021, 2081 | తెప్ప. కప్ప, జువ్వి… దాటించునది అని అర్థం కష్టాలనుంచి దాటిస్తుంది సమృద్ధిగా జలం ప్రవహించును |
36 | శుభకృతు | Shubhakrutha | 1902, 1962, 2022, 2082, | శుభాన్ని చేసి పెట్టేది ప్రజలు శుభముంగా ఉంటారు |
37 | శోభకృతు | Shobhakrutha | 1903, 1963, 2023, 2083 | శోభను కలిగించేది ప్రజలు శుఖంగా ఉంటారు |
38 | క్రోధి | Krodhi | 1904, 1964, 2024,2084 | క్రోధాన్ని కలిగినది కోపస్వభావం పెరుగుతుంది |
39 | విశ్వావసు | Vishvavasu | 1905, 1965, 2025, 2085 | విశ్వానికి సంబంధించినది ధనసమృద్ధి కలుగుతుంది |
40 | పరాభవ | Parabhava | 1906, 1966, 2026, 2086 | అవమానం. ప్రజలు ఒకరిని ఒకరు అవమానించుకుంటారు |
41 | ప్లవంగ | Plavanga | 1907, 1967, 2027, 2087 | కోతి, కప్ప. జలసమృద్ధి అధికంగా ఉంటుంది |
42 | కీలక | Keelaka | 1908, 1968, 2028, 2088 | పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య. సస్య సమృద్ధి అధికంగా ఉంటుంది |
43 | సౌమ్య | Saumya | 1909, 1969, 2029, 2089 | మృదుత్వం.ప్రజలకు శుభములు కలుగుతాయి |
44 | సాధారణ | Sadharana | 1910, 1970, 2030, 2090 | సామాన్యంగా వుండునట్టిది. ప్రజలకు సామన్య శుభములు కలుగుతాయి |
45 | విరోధికృతు | Virodhikrutha | 1911, 1971, 2031, 2091 | విరోధాలను కలిగించేది ప్రజలలో విరోధభావం పెరుగుతుంది |
46 | పరీధావి | Paridhavi | 1912, 1972, 2032, 2092 | భయకారకం. ప్రజలలో భీతి అధికం ఔతుంది |
47 | ప్రమాదీచ | Pramadicha | 1913, 1973, 2033, 2093 | ప్రమాద కారకం. |
48 | ఆనంద | Ananda | 1914, 1974, 2034, 2094 | ఆనందమయం ప్రజలు ఆనదంగా ఉంటారు |
49 | రాక్షస | Rakshasa | 1915, 1975, 2035, 2095 | రాక్షసత్వాన్ని కలిగినది. ప్రజలులో క్రూర స్వభావం అధికమైరుంది |
50 | నల | Nala | 1916, 1976, 2036, 2096 | నల్ల అనే పదానికి రూపాంతరం. |
51 | పింగళ (లేదా) పింగల | Pingala or Pingalu | 1917, 1977, 2037, 2097 | ఒక నాడి, కోతి, పాము, ముంగిస. |
52 | కాళయుక్తి (లేదా) కాలయుక్తి | Kalyukti or Kalayukti | 1918,1978, 2038, 2098 | కాలానికి తగిన యుక్తి. |
53 | సిధ్ధార్థి | Siddhartha | 1919, 1979, 2039, 2099 | కోర్కెలు సిద్ధించింది. |
54 | రౌద్రి | Roudri | 1920, 1980, 2040, 2100 | రౌద్రంగా ఉండేది. ప్రకృయి విపత్తులు సంభవిస్తాయి |
55 | దుర్మతి | Durmati | 1921, 1981, 2041, 2101 | దుష్ట బుద్ధి. ప్రజలకు దుర్బుద్ధులు అధికమౌతాయి |
56 | దుందుభి | Dundubi | 1922, 1982, 2042, 2102 | వరుణుడు. |
57 | రుధిరోద్గారి | Rudhirambara | 1923, 1983, 2043, 2103 | రక్తాన్ని స్రవింప చేసేది. రక్తధారలు ప్రవహిస్తాయి |
58 | రక్తాక్షి | Raktakshi | 1924, 1984, 2044, 2104 | ఎర్రని కన్నులు కలది. ప్రజలకు ప్రకృతికారక కోప విపత్తులు కలిగే అవకాశం వుంటుంది |
59 | క్రోధన | Krodhana | 1925, 1985, 2045, 2105 | కోప స్వభావం కలది. ప్రజలలో క్రోధం అధికమౌతుంది |
60 | అక్షయ | Akshaya | 1926, 1986, 2046, 2106 | నశించనిది. ప్రజలు సుభిక్షంగా ఉంటారు |