వేదం అణువణువున నాదం

వేదం అణువణువున నాదం

నాట్యం  ఇతివృత్తంగా తీసిన సినిమాలో నృత్యంలోనే సుఖాన్ని, దుఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఒక నిస్వార్ధ కళాకారుని కథ ఇది.  ముఖ్యంగా కథ ఏమిటంటే  బాలకృష్ణ (కమల్ హాసన్) అనే పేద యువకుడు స్వయంకృషితో నాట్యం నేర్చుకొంటాడు. కూచిపూడి, భరతనాట్యం, కథక్ రీతులలో ప్రవీణుడౌతాడు. కాని వాణిజ్యం, విచ్చలవిడితనం పెచ్చుమీరిన సినిమా రంగంలో ఇమడలేకపోతాడు. అతని ప్రతిభను గుర్తించిన మాధవి (జయప్రద) అనే యువతి అతనిని ప్రోత్సహిస్తుంది. ఢిల్లీలో మహామహుల సమక్షంలో జరిగే కార్యక్రమంలో అతని నాట్యప్రదర్శన ఏర్పాటు చేయిస్తుంది. కాని చివరిక్షణంలో బాలకృష్ణ తల్లి (డబ్బింగ్ జానకి) చనిపోవడంతో అతడు నాట్య ప్రదర్శన పోటీలో పాల్గొనలేకపోయాడు. అతనికి తోడుగా నిలచిన మాధవిపై అతనికి ప్రేమ మొదలౌతుంది కాని మాధవికి అంతకు మునుపే పెళ్ళవుతుంది. వీరి ప్రేమ గుర్చి తన భర్తకు చెప్పి అతన్ని పిలిపిస్తాడు. అతను సమర్డించినప్పతటికి బాలకృష్ణ మాత్రం వారిరివురు కలసి భార్యభర్తలుగా ఉండాలని కాంక్షించి తన ప్రేమను పక్కకు పేడతాడు. తల్లి మరణం,ప్రేమ వైఫల్యంతో ఆత్మన్యూనతభావంతో బాలకృష్ణ దాదాపు తాగుబోతు అవుతాడు.తరువాతి భాగంలో మాధవి కూతురు (శైలజ)కు బాలకృష్ణ గురువౌతాడు నాట్య కళ గొప్పతనం గురించి ఆమెకు తెలియజేస్తాడు.ఆపై ఆమె నాట్య ప్రదర్శనలో ఆమె నర్తిస్తుంది. అప్పటికే జనాల చప్పట్లు, తన విద్యను చూసి విపరీతమైన ఆనందం పోంది నాట్య ప్రదర్శన చివర్లో బాలకృష్ణ మరణించడంతో కథ ముగుస్తుంది. చివరిగా కనిపించే మాట NO END FOR ANY ART (ఏ కళకు అంతం లేదు)

సప్తపది సినిమా తరువాత నృత్య కళాకారుడి జీవిత నేపథ్యంలో కమల్ హాసన్ తో  ఓ సినిమా చేయాలని అనుకున్నారు.దర్శకుడు కె.విశ్వనాథ్. దానికి చేగొండి హరిరామజోగయ్య, అల్లు అరవింద్, వి.వి.శాస్త్రి నిర్మాతలు. సంగీత దర్శకుడిగా ఎం. ఎస్. విశ్వనాథన్ని ఎంపిక చేసుకొని సంగీత చర్చలు కూడా ప్రారంభించారు. అయితే ఆ సినిమా ఆగిపోయింది. సీతాకోకచిలుక తరువాత తనతో సినిమా చేయడానికి వచ్చిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకి ఇదివరకు ఆగిపోయిన కథను వినిపించాడు విశ్వనాథ్. కథ నచ్చడంతో వెంటనే ఆ సినిమా నిర్మాణ పనులు మొదలుపెట్టాడు నాగేశ్వరరావు.  ఈ సినిమాకు ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలను రచించారు. సీతాకోకచిలుక సినిమాకు ముందు అనుకున్న “సాగర సంగమం” అనే పేరుని ఈ సినిమాకు పెట్టుకున్నారు.

సామవేదం నుండి ఉద్భవించింది సంగీతం.  నాలుగు వేదములను ప్రామాణికంగా తీసుకుని నిర్వచింవ్హాబడినది నాట్యము.  నాట్యాన్ని తన ఊపిరిగా భావించి, తన జీవితాన్ని నాట్యకళకి అంకితం చేసిన ఒక కళాకారుడు ఆనందంతో తాండవమాడే లయకారునిలో లీనమవడం అన్నది కూడా  నది సముద్రాన్ని కలిసే సాగర సంగమం వంటిదే. జీవితమంతా నాట్యమయంగా గడిపిన ఒక  నాట్యకారుడు, తన జీవితపు ఆఖరి రోజుల్లో తనకు తెలిసిన సమస్త విద్యను తనకు ఇష్టమైన అమ్మాయికి ధారాదత్తం చేసి ఆమె నాట్యంలో తనను చూసుకుని త్ర్పతిగా కనుమూసే సందర్భానికి ఒక పాట కావాలి.    సంగెతం,నాట్యం, సాహిత్యం మీద పట్టు ఉన్న కవి ఆ పాటని ఎలా ప్రారంభించేరో చూడండి.

వేదం అణువణువున నాదం

నా పంచ ప్రాణాల నాట్య వినోదం

నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై

నాట్యం వేద సంహిత. ఇక్కడ ప్రారంభం ఎలాచేసేరంటే ఒక నాట్య కళాకారుడు/కళాకారిణి సంపూర్ణంగా మనసు తాను చేయాల్సిన నాట్య ప్రక్రియపై లగ్నం చేసి నాట్యం చేస్తుంటే వారి శరీరం లోని అణువణువున  బిందు రూపంలో నిక్షిప్తంగా ప్రసరించే నాదం వారు నాట్యంద్వారా చేసే అభిషేకం వల్ల బయల్పడి ప్రేక్షకులకు కమివిందు చేస్తూ ఆ నాట్యంలో లీనమై తన్మయత్వం పొందేటట్లు చేస్తుంది.  అందుకే నాట్యం వేదగౌరవం పొందింది  ఆ ప్రణవ నాదం తాను మాత్రమే ఆ పని చేయగలనన్నట్లు పంచ భూతాల్లోనూ నిండి రక్తి కట్టిస్తూ హంసానంది రాగంగా పులకిస్తునాదిట.  ఇక్కడ ‘హంసానంది’ రాగం గురించి తెలుసుకుందాం.  సంగీతజ్ఞులు ‘హంసానంది’ రాగాన్ని సాయం సంధ్యారాగం గా చెప్పేరు. అంటే సూర్యాస్తమయం జరుగుతూ కారు చీకట్ల తెర ప్రపంచాన్ని కప్పడం ప్రారంభమవుతున్న వేళ.  ఇంక కధ ప్రకారంగా నాయకుడి జీవితంలో వెలుగు తగ్గుతూ తాను అస్తమించే సమయంలో ప్రారంభమయ్యే పాట మరి వేటూరి గారు అక్షర ప్రయోగంలో తన ప్రావీణ్యాన్ని ప్రయోగించకుండా ఉంటారా అదుగో అదే ‘నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై’.

సాగర సంగమమే ఒక యోగం

క్షార జలధులే క్షీరములాయె

ఆ మధనం ఒక అమృత గీతం

జీవితమే చిరనర్తనమాయె

పదములు తామే పెదవులు కాగా

గుండియలే అందియలై మ్రోగా

నది సాగరాన్ని చేరి అందులో లీనమవటం ప్రకృతి ధర్మం. ‘నది’ని స్త్రీ గా చెప్తాము.  సాగరాన్ని పురుషుడు గా చెవుతాం.  క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము చెప్పేది ప్రకృతి పురుషులు, క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానము.   చినుకులన్ని కలిసి చిత్ర కావేరిగా మారి చివరికా కావేరి కడలి దేవేరి గా వచ్చి సాగరాన్ని చేరుకోవడంతో పరిపూర్ణమవుతుంది.  సాగర జలం యొక్క రుచి ఉప్పదనం అంతా ఉప్పనీరు. ఆ ఉప్పునీరంతా క్షీరం అంటే పాలుగా మారింది.  ఆ క్షీర సాగరాన్ని చిలకగా అమృతమొచ్చింది. ఈ చిత్ర నాయకుడు నాట్య కళని ఊఇరిగా చేసుకుని బ్రతుకుతున్నవాడు కదా తన జీవితం చివరి ఘడియలలో కూడా ఆ కళే కనిపిస్తోంది.  తన జీవితమంతా ఒక్కసారి కళ్ళముందు తిరిగింది. తన పాదాలు పెదవులుగా పడగా తన గుండె మువ్వల రవళి సంగీతాన్ని అందిస్తుండగా సాగిన తన జీవన నాట్యం సాక్షాత్కరించింది.

మాతృ దేవోభవ….పితృదేవోభవ….

ఆచార్యదేవోభవ….అతిథిదేవోభవ

తల్లి, తండ్రి, గురువు, అతిధి దేవునితో సమానమని చెప్పిన తైత్తరీయోపనిషత్తు లోంచి తాను గురువు వద్ద నేర్చుకున్న విద్యను ప్రదర్శించే క్రమంలో  వేదిక మీద వందనా సంస్కారం చేస్తోంది శిష్యురాలు

ఎదురాయె గురువైన దైవం….ఎదలాయె మంజీర నాదం

గురుతాయె కుదురైన నాట్యం….గురుదక్షిణై పోయె జీవం

నటరాజ పాదాల తల వాల్చనా….నయనాభిషేకాల తరియించనా

నటరాజ పాదాన తల వాల్చనా….నయనాభిషేకాల తరియించనా

సుగమము…….. రసమయ……..

సుగమము రసమయ నిగమము భరతముగానా

సాక్షాత్తు ఆ నటరాజస్వామి గురువు రూపంలో తనకి నాట్యం నేర్పడానికి వచ్చేడన్న భావంతో ఆమె ఏడ సవ్వడి మువ్వల సవ్వడిగా తోస్తున్నాది. తనకి గొప్ప కుదురైన నాట్యాన్ని నేర్పిన గురువుకు ‘గురుదక్షిణగా తనేమివ్వగలదు? తన జీవితాన్ని గురువు నేర్పిన నాట్యానికి తప్ప. ఇంకా తానేమైనాచేయ్యగలదా…. లేదు తానింతకంటే ఏమి చెయ్యలేదు సాక్షాత్తు ఆ నటరాజ స్వరూపుడైన ఆయన పాదాలపై తలవాల్చి నా కన్నీటితో అభిషేకించడంఒక్కటే తాను చేయగలిగింది. సులభమైనది, రసస్పహూర్తి కలిగినది, వేదమయమైనది అయినా తన నాట్యాన్ని తన శిష్యురాలిలో చూస్తూ అందులోనుండి స్రవించే ఆ ప్రణవ నాదాన్ని వింటూ తనలోని పంచ భూతాత్మకమైన ప్రాణ నాడులు ప్రకృతిలోని పంచభూతాలలో కలిసిపోయేయి.

జయంతితే సుకృతినో రస సిద్దా: కవీశ్వరా :

నాస్తిక్లేశాం యశ: కాయే జరా మరణంచ భయం

నాస్తి జరా మరణంచ భయం

నాస్తి జరా మరణంచ భయం

ఇక్కడ వేటూరి సుందర రామ్మూర్తి గారి గురించి చెప్పాలి.  ఆయన ఒక చక్కనిఅక్షర శిల్పి మాత్రమే కాదు. అత్యద్భుతమైన పదాలతో మాల కట్టగల నేర్పరి.  బహుశా వేటూరి గారంత నేర్పుగా ఆయన ముందుతరం కవులెవరు సినిమా పాటకి గొప్ప ‘పదమాల’ వెయ్యలేదేమో!  దేవుపల్లి కృష్ణశాస్త్రి గారి పదలాలిత్యాలను పుణికిపుచ్చుకుని వాటిని వరుసలో ఉచడం వేటూరి నేర్పరితనం. చూడండి ఇక్కడ భర్తృహరి ‘నీతి శతకంలోని శ్లోకాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంత అర్ధవంతంగా ఉపయోగించేరో. గొప్పవైన రస స్పూర్తి ని  కలిగించే రచనలను చేసిన కవులు వారు వారి రచనల ద్వారా మానవాళికి కలిగించిన రససిద్ధి కారణంగా జరామరణాలు లేని కైవల్య స్ధితిని పొందుతారని శ్లోక భావం.ఇక్కడ సినిమాలో నాయకుడు తన నాట్యం ద్వారా ప్రజల్లో రససిద్ధి కలిగించి, తాను లేకపోయినా తన నాట్యం బ్రతికుండేలా తనకొచ్చిన నాట్యకళ పూర్తిగా తన శిష్యురాలికి నేర్పి ఆమె ద్వారా తన నాట్యం ఎల్లప్పుడూ సజీవంగా ప్రజలకు రససిఇది కలిగించి  కైవల్యాన్ని పొందినట్లుగా అన్వయించేరు.  ‘హంసానంది’ రాగంలో ఇళయరాజా స్వరపరిచిన ఈ పాట శైలజ, బాలు పాడేరు. ముఖ్యంగా ‘మాతృ దేవోభవ’ అనడానికి ముందు వచ్చేశైలజ ఆలాపన జనాన్ని కట్టిపడేస్తుంది.

Scroll to Top