వెన్నెల్లో గోదారి అందం

వెన్నెల్లో గోదారి అందం

సితార పూర్ణోదయా మూవీస్ పతాకంపై వంశీ దర్శకత్వంలో, సుమన్, భానుప్రియ, శరత్ బాబు, శుభలేఖ సుధాకర్ ప్రధానపాత్రల్లో నటించిన 1984 నాటి తెలుగు చలనచిత్రం. ఒకప్పుడ గొప్పగా వెలిగి ఆరిపోయిన రాజాస్థానాలలో ఒకదాని యజమాని చెల్లెలు సితార (భానుప్రియ). ఆమెను గొప్ప జమిందారుకు ఇచ్చి పెళ్ళీ చేయాలని అనుకుంటాడు ఆమె అన్న. ఆ సంస్థానానికి పగటి వేషగాళ్ళుగా వచ్చిన వారిలో కల ఒక వ్యక్తిని (సుమన్) ప్రేమిస్తుంది సితార. కాని అతడితో పెళ్ళి మాత్రం సాద్యపడదు. తదనంతర కాలంలో ఆమె గొప్ప నటి అవుతుంది. ఆఖరున ఆమెను అతడు కలవడంతో కథ సుఖాంతమవుతుంది.

            తనకు చతుర నవలల పోటీలో బహుమతి వచ్చిన “మహల్లో కోకిల” నవల కథను తీసుకుని సితారసినిమాగా చిత్రీకరించారు వంశీ.  ఇది దర్శకునిగా వంశీ రెండవ సినిమా. అప్పటికి రీమేక్ గా మంచుపల్లకి తీశారు. అయితే తనకు రీమేక్ ఇష్టం లేకపోయినా రీమేక్ గా దాన్ని తీయాల్సివచ్చింది, పైగా సినిమాలో తనకు నచ్చినట్టు సంగీతాన్ని చేయించుకునే స్వేచ్ఛ కూడా కొరవడింది.   నవలలోని కొన్ని పాత్రలను తగ్గించి, అందులోని మెలోడ్రామా వంటి లోపాలను దిద్దుకుని స్క్రిప్ట్ తయారుచేసుకున్నారు వంశీ. నవల ముగింపును కూడా మార్చుకుని సినిమాకు వేరే క్లైమాక్స్ రాసుకున్నారు. నవలారచయితే సినిమాకు రచన, దర్శకత్వం చేయడంతో తన నవలలో ఆత్మను నిలబెట్టుకుంటూనే అవసరమైన మార్పులు చేయగలిగారు. సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు ప్రముఖ రచయిత, దర్శకుడు జంధ్యాల సహాయకుడు సాయినాథ్ తో రాయించారు.  సినిమాలో కథానాయికగా నటించిన భానుప్రియకు తెలుగులో ఇదే తొలిచిత్రం. నిర్మాత కొడుకు ఏడిద శ్రీరాం, తిలక్ అనే జర్నలిస్టుగా నటించాడు. సుమన్‌కు సాయికుమార్, భానుప్రియకు ఎస్.జానకి సోదరి లక్ష్మి డబ్బింగ్ చెప్పారు.  గోదావరి పట్ల వంశీకి ఉన్నమక్కువ టైటిల్స్ నుంచి చాలా చోట్ల కనిపిస్తుంది. అలాగే పాటల చిత్రీకరణలో వంశీ మార్కును చూడవచ్చు. కోకిలని పంజరంలో చిలుక లా చూపే సింబాలిక్ షాట్స్, చందర్ అసహాయతను చూపే సన్నివేసాలు, సినీ తార గతం పట్ల జనానికి ఉండే ఆసక్తిని చూపించే షాట్స్ వంటివి దర్శకుని ముద్రను పట్టిస్తాయి.  ‘సితార’ సినిమాలో కథానాయిక పాత్రకోసం కథానాయిక మనః స్ధితిని తెలియచేసే పాట రాసారు వేటూరి గారు. ఇళయరాజా స్వరకల్పనలో జానకమ్మ పాడేరు.

వెన్నెల్లో గోదారి అందం..

నది కన్నుల్లో కన్నీటి దీపం

అది నిరుపేద నా గుండెలో..

చలి నిట్టూర్పు సుడిగుండమై..

నాలో సాగే మౌనగీతం

          వెన్నెల రాత్రి గోదావరిని చూడటం ఒక అనుభూతి అలా వెన్నెల రాత్రి గోదావరి అందాలని చూస్తూ మైమరచిపోయేందుకు కళాత్మక హృదయం ఉండాలి. ఇక్కడ నదియొక్క వెలుగు ఎలావుందీ అంటే నది కార్చిన కన్నీరు ఆధారంగా నది కన్నుల్లో దీపం వెలుగుతోందిట.  కథానాయిక తన జీవితంలో ఎదురైన చేదు  అనుభవాలు తలుచుకుంటూ వైరాగ్య భావనతో ఉంటుంది.  ఆ సందర్బంగా వచ్చే పాట.  పాత్రోచిత సందర్బంగా ఎంత గొప్పగా ప్రారంభించారు పాటని. నది కార్చిన కన్నీటితో వెలుగుతోన్న దీపం నాయిక హృదయంలో నిట్టూర్పు చలి సుడిగుండమై తిరుగుతోందిట. నిట్టూర్పు అంటే నిచ్వాస అది ఎప్పుడు వేడిగా ఉంటుంది. ఆ  నిచ్వాస  చల్లబడి సుడిగుండమై లోపలే తిరుగుతుంటే? ఆ బాధని ఎవరికి చెప్పాలి? ఎలా వ్యక్తపరచాలి?  అందుకే ఆ చలి నిట్టూర్పు సుడిగుండం నాయిక హృదయంలో మౌనగీతమై సాగుతోంది  అది విషాదకర హృదయావిష్కరణ అని ప్రత్య్మగా చెప్పనక్కర లేదు కదా.

జీవిత వాహిని అలలై…ఊహకు ఊపిరి వలలై…

 బంధనమై జీవితమే.. నిన్నటి చీకటి గదిలో..

ఎడబాటే.. ఒక పాటై.. పూలదీవిలో సుమవీణ మోగునా

          నదిలో కనిపించేవేమిటి? అలలు, వలలు. జీవితం అలలు మాదిరి సాగుతుంది.  మన  ఊహలకు ప్రతిరూపమే మన జీవితం అంటే ఊహలు మరి జీవితానికి ఊపిరి వంటివి కదా.  ఆ ఊహలకి వలలు అడ్డం పడుతుండటంతో ఊపిరి అందటం లేదు. గతం అనే చీకటి గదిలో జీవితం బందీ అయిపొయింది. ఎడబాటు అనేది జీవితానికి పాట అయిపోయినప్పుడు పూలతీగతో ఆనందం కలుగచేసే రాగాలు పలికించడం సాధ్యమా?  సినిమాలో నాయిక గతం అంతా చీకటిమయం.  ఆమె తన గతాన్ని చీకటిలోనే ఉంచాలనుకుంది కానీ అది సాధ్యపడలేదు.  ఇప్పటి వరకు నాయిక పరిచయం, ఆమె అంతరంగ భావనలు, ఆమె గతం తాలూకు పరిస్ధితులను ప్రస్తావించడం జరిగింది.ఇప్పుడు ఆమె జీవితంలో ఏమిటి కోల్పోయిందనేది తలుచుకుంటోంది.

నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి..

కన్నీరే పొంగి పొంగి.. తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై..

యవ్వనాలు అదిమి అదిమి.. పువ్వులన్ని చిదిమి చిదిమి

వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే..

          నాయిక తన  గత జీవితమంతా బాణములతో చేసిన పంజరంలో గడిపింది.  దాన్ని ఛేదించుకుని వచ్చి స్వరపంజరంలో నిలబడి ఉంది. శరముల నుంచి స్వరముల లోకి మారినా అదికూడా పంజరమే కదా! స్వేచ్ఛలేదు.హృదయాంతరాల నుండి పొంగుకొస్తున్న కన్నీళ్లు తెరలు కట్టడంతో ఆమె ఏమీ చూడలేని మంచుబొమ్మగా మారింది.  అంటే గడ్డకట్టుకు పోవడమే కాకుండా కరిగి నీరైపోతోంది.  ఇన్నాళ్లు తన యవ్వనాన్ని అదిమి మనసుకి ఆహ్లాదంగా కొరికాలిచ్చే పువ్వుల్ని చిదిమి; వెన్నెలలా చల్లగా, ప్రశాంతంగా, మనోహరంగా ఉండే యవ్వనాన్ని వ్యర్థం చేసుకుంది. మామూలుగా అయితే వెన్నెల వ్యర్ధమైనపుడు ‘అడవిని కాచిన వెన్నెల’ అంటారు. కానీ ఈ పాట నది గురించి  – నది లాంటి నాయిక గురించి కదా అందుకని ‘వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే’ అన్నారు.   

నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం ..

నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం ..

ఆశలు మాసిన వేసవిలో… ఆవేదనలో రేగిన ఆలాపన సాగే ..

మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే .. మనసు వయసు కరిగే

మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో ..తిరిగే.. సుడులై ..

ఎగసే ముగిసే కథనేనా .. ఎగసే ముగిసే కథనేనా..

          జీవితమంతా కన్నీటిమయమైపోయి వయసు, వలపు వ్యర్ధమైపోయిన తర్వాత చివరకు మిగిలిందేముంది? విరాగియై విలపించడం తప్ప!  తనకి తన మీద ప్రేమ, ఇష్ట లేదు జీవించి ఎదో సాధించాలని లేదు… అసలు తన మనసును తనకిష్టమైన వైపు మళ్లించే అవకాశమే లేదు.  వసంత కాలం ఉత్సాహం కానీ మనసుని ఆహ్లాద పరచే ప్రకృతి శోభాయమైన అందాలని చూసి ఆనందించగలిగే స్పందించే హృదయం వేసవి లోని వడగాడ్పుల మాయమైపోయినప్పుడు ఆలపించే ఏ శబ్దమైనా ఆవేదనా భరితమైనదే. తాను హృదయంలో కన్నా కలలు నదిలోని సంభవించే వెల్లువలా  పొంగి అణగారిపోయాయి. స్పందించే మనసు, తుళ్ళిపడే వయసు కరిగిపోయాయి. జీవితాన్ని మధురంగా మలచుకోవాలని మదించిన ప్రయత్నాలన్నీ వృధా అయేయి.  జీవితం అనే గానంలో సరియైన రాగం కుదరక తన వలపులన్నీ బాధను పెంచి ఆ బాధ సూదులుగా మారి తనని ఆ సుడిగుండంలో తిప్పుతూ పైపైకి ఎగసి తన కథను ముగిస్తున్నాయి.

          రాణివాసంలో రహస్య జీవితం గడిపి, ఒక విషాదాంతమైన ప్రేమానుభవాన్ని గృదాయంలో దాచిపెట్టి, నటిగా కొత్త జీవితం మొదలుపెట్టిన అమ్మాయి మీద ఆమె గతం పగబాట్టి, వెంటాడి వేధిస్తే? జీవితంలో తనలో దాచి ఉంచుకోవాల్సిన రహస్యాలు బహిరంగమై తనని వెక్కిరిస్తుంటే ఆమెకి జీవితం మీద విరక్తి గాక అనురక్తి ఎలా కలుగుతుంది?  ఆ పాత్ర యొక్క ఔచిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని పదాల్ని పరవళ్లు తొక్కించిన వేటూరి వారి ఈ పాట సాహిత్యం గాఢత ఎంత గొప్పదో కదా.

Scroll to Top