వృత్తములు

వృత్తములు

వృత్తములు:- గణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నవాటిని వృత్తాలు అంటారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. 

  1. చంపకమాల
  2. ఉత్పలమాల
  3. శార్దూల విక్రీడితము
  4. మత్తేభ విక్రీడితమ
  5. తరళం
  6. తరలము
  7. తరలి
  8. మాలిని
  9. మత్తకోకిల
  10. ఇంద్రవజ్రము
  11. ఉపేంద్రవజ్రమ
  12. కవిరాజవిరాజితము
  13. తోటకము,
  14. పంచచామర
  15. భుజంగ ప్రయాతము
  16. మంగళమహశ్రీ
  17. మానిని
  18. మహాస్రగ్ధర
  19. లయగ్రాహ
  20. లయవిభాతి
  21. వనమయూరము
  22. స్రగ్ధర

1. చంపకమాల లక్షణములు:- ఈ పద్యమునకు నాలుగు పాదములుండును. ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 21; ప్రతి పాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ,ర.  యతి: ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము.  ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు.  పోతన తెలుగు భాగవతంలో 486 చంపకమాల వృత్త పద్యాలను వాడారు. ఉదాహరణ

పదముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్

మదగజవల్లభుండు మతిమంతుడు దంతయు గాంత ఘట్టనం

జెదరగ జిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్

వదలి జలగ్రహంబు కరివాలము మూలముజీరె గోఱలన్.

చంపకమాల వృత్త పాదము యొక్క గణ విభజన
I I II U IU I II U II U II U IU I U
పదములబట్టినందలకుబా టొకయింతయులేకశూరతన్

2. ఉత్పలమాల లక్షణములు:- ఈ పద్యమునకు నాలుగు పాదములుండును. ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య: 20; ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ; యతి స్థానం: ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము; ప్రాస నియమం పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.  ఉదాహరణ 

పుణ్యుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా
రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా
ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్

ఉత్పలమాల వృత్త పాదములో గణవిభజన
U I IU I UI I IU I IU I IU I UI U
పుణ్యుడురామచంద్రుడటపోయిముదంబునగాంచెదండకా

3. శార్దూల విక్రీడితము:- ఈ పద్యమునకు నాలుగు పాదములుండును. ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య 19   ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గ యతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు.  ఉదాహరణ

తాటంకాచలనంబుతో భుజనటద్దమ్మిల్ల బండంబుతో

శాటీముక్త కుచంబుతో సదృఢచంచత్కాంచితో శీర్ణలా

లాటాలేపముతో మనోహరకరాలగ్నోత్తరీయంబుతో

గోటీందుప్రభతో సురోజభర సంకోచద్విలగ్నంబుతోన్

శార్థూలం వృత్తమునందు గణములు
U U UI I UI U II I UU U IU U IU
తా టం కాచ ల నంభు తో, భుజ న టద్ద మ్మి ల్లబం డం బు

4. మత్తేభ విక్రీడితము:- ఈ పద్యమునకు నాలుగు పాదములుండును. ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య: 20; ప్రతిపాదంలోని గణాలు: స, భ, ర, న, మ, య, వ; యతి స్థానం: ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము; ప్రాస నియమం పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.  ఉదాహరణ

సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే

పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం

తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో

పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై

I I UU I IU I UI I IU U UI U UI U
సి రి కింజె ప్ప డుశం ఖ చక్ర యు గముం జే దోయి సం ధింప డే

5, 6. తరళం/తరలము లక్షణములు:- ఇది మత్తకోకిలకి జంట వృత్తము మత్తకోకిలలోని మొదటి గురువు తరలములో రెండు లఘువులుగా మారుతుంది. ఈ పద్యమునకు నాలుగు పాదములుండును. ప్రతిపాదంలోని గణాలు: న భ ర స జ జ గ; యతి స్థానం: ప్రతిపాదంలోనూ 12 వ అక్షరము; ప్రాస నియమం పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.  ఉదాహరణ 

ǃǃǃUǃǃUǃUǃǃUǃUǃǃUǃU
ధరణిలోగలరాజులెల్లరుదారుణక్షయకాలసా

7. తరలి లక్షణములు:- ఈ పద్యమున నాలుగు పాదములు ఉండును. ప్రతి పాదమునందు భ, స, న, జ, న, ర గణములుండును. ప్రాస నియమము కలదు.  ప్రతి పాదమునందు 11వ అక్షరము యతి స్థానము.

మాత్రా శ్రేణి

  • త్రిమాత్రా శ్రేణి: U I – I I I – U I – I I I – U I – I I I – U I – U
  • చతుర్మాత్రా శ్రేణి: U I I – I I U – I I I I – U I I – I I U – I U
  • పంచమాత్రా శ్రేణి: U I I I – I U I I – I I U I – I I I U – I U
  • షణ్మాత్రా శ్రేణి: U I I I I – U I I I I – U I I I I – U I U
  • మిశ్రగతి శ్రేణి (5-4): U I I I – I U I – I I I U – I I I I – U I U

ఉత్సాహము, తరలి మాత్రా శ్రేణి భేదము

  • తరలి: UI I – I I U – I I I – I U I – I I I – U I U
  • ఉత్సాహము: UI- I I I- UI – I I I – U I – I I I – U I- U

ఉదాహరణ:-

చారుభసన భూరిజన రసాంద్రగణములన్‌ దిశా

సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్‌.

చారుభసన భూరిజన రసాంద్రగణములన్‌ దిశా

సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్‌.

UI II I UI I II U II I IU I U
చారుభసనభూరిజనరసాంద్రగణములన్‌ దిశా

8. మాలిని లక్షణము: – ఈ పద్యమున నాలుగు పాదములు ఉండును. ప్రతి పాదమునందు న న మ య య గణములుండును. ప్రాస నియమము కలదు.  ప్రతి పాదమునందు 9వ అక్షరము యతి స్థానము.

ǃǃǃǃǃǃUUUǃUUǃUU
సురపతిసభఁజూడంజూడనంగారవృష్టుల్

9. మత్తకోకిల లక్షణములు:- ఈ పద్యమున నాలుగు పాదములు ఉండును. ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య: 18 ప్రతి పాదమునందు ర స జ జ భ ర గణములుండును. ప్రాస నియమము కలదు.  ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము.  ప్రాస యతి చెల్లదు. ఉదాహరణ

UǃUǃǃUǃUǃǃUǃUǃǃUǃU
స్నాతకుండునుఋత్విజుండునుసద్గుణుండునునిష్టుడున్

10. ఇంద్రవజ్రము లక్షణములు:- ఇందు నాలుగు పాదములు.  ప్రతిపాదంలోని గణములు  త, త, జ, గా.   ప్రతిపాదంలోనూ 8 వ అక్షరము యతి స్థానము. ప్రాస నియమము పాటించవలెను.  ప్రాస యతి చెల్లదు. ఉదాహరణ

సామర్థలీలన్ తతజ ద్విగంబుల్

భూమింధ్ర విశ్రాంతుల బొంది యొప్పున్

ప్రేమంబుతో నైందవ బింబ వక్తృన్

హేమాంబురుం బాడుదు రింద్రవజ్రన్

UUIUUIIUIUU
గా
సామర్థలీలన్ తతజద్విగంబు

11. ఉపేంద్రవజ్రము వృత్త పద్యాల లక్షణములు:- . ఇందు నాలుగు పాదములు.  ప్రతిపాదంలోని గణములు  జ, త, జ, గ గ ప్రతిపాదంలోనూ 8 వ అక్షరము యతి స్ధానము. ప్రాస నియమము పాటించవలెను.  ప్రాస యతి చెల్లదు. ఉదాహరణ

పురారిము ఖ్యామర పూజనీయున్

సరోజనాభున్ జతజ ద్విగోక్తిన్

దిరంబుగా నద్రి యతి న్నుతింపన్

ఇరానుప్రాణేశు నుపేంద్రవజ్రన్

ఉపేంద్రవజ్రము వృత్త పాదములో గణవిభజన
IUIUUIIUIUU
గా
పురారిముఖ్యామరపూజనీయు

12. కవిరాజవిరాజితము లక్షణములు:- ఇందు నాలుగు పాదములు.  ప్రతిపాదంలోని గణములు  న, జ, జ, జ, జ , జ, జ, వ  ప్రతిపాదంలోనూ 8 వ, 14వ, 20వ అక్షరములు యతి స్ధానములు. ప్రాస నియమము పాటించవలెను.  ప్రాస యతిచెల్లదు. ఉదాహరణ

కమల దళంబుల కైవడిఁ జెన్నగు కన్నులు జారుముఖ ప్రభలున్

సమధిక వృత్తకుచంబులు నొప్పగ శైలరసర్తు విశాల యతిన్

సముచితనాన్విత షడ్జలగంబు లజానుగఁ బాడిరి చక్రధరున్

రమణులు సొం పలరం గవిరాజ విరాజితమున్ బహు రాగములన్

కవిరాజవిరాజిత వృత్త పాదము నందు గణవిభజన
IIIIUIIUIIUIIUIIUIIUIIU
కమలదళంబులకైవడిఁజెన్నగుకన్నులుజారుముఖప్రభలున్

13. తోటకము లక్షణములు:– ఇందు నాలుగు పాదములు.  ప్రతిపాదంలోని గణములు  స, స, స, స ప్రతిపాదంలోనూ 9 వ  అక్షరము యతి స్థానము. ప్రాస నియమము పాటించవలెను.  ప్రాస యతి  చెల్లదు. ఉదాహరణ

జలజోదర నిర్మల సంస్తవముల్

విలసిల్లెడుఁ దోటకవృత్తమునన్

బొలుపై స చరుష్కముఁ బొందగ నిం

పలరారఁగఁ బల్కుదు రష్టయతిన్.

తోటకము వృత్త పాదము నందు గణవిభజన
IIUIIUIIUIIU
జలజోదరనిర్మలసంస్తవముల్

 14.పంచచామరము లక్షణములు:- ఇందు నాలుగు పాదములు.  ప్రతిపాదంలోని గణములు  జ, ర, జ, ర, జ, గ ప్రతిపాదంలోనూ 10 వ  అక్షరము యతి స్థానము. ప్రాస నియమము పాటించవలెను.  ప్రాస యతి చెల్లదు. ఉదాహరణ

ప్రసన్న పింఛమాలికా ప్రభా విచిత్రితాంగుఁడుం

బ్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధ లోకుఁడుం

బ్రసన్న గోపబాల గీత బాహువీర్యుఁ డయ్యు ను

ల్లసించి యేగె గోపకు ల్చెలంగి చూడ మందకున్.

పంచచామర వృత్త పాదములో గణవిభజన
IUIUIUIUIUIUIUIU
ప్రసన్నపింఛమాలికా ప్రభా విచిత్రితాంగుఁడుం

15. భుజంగ ప్రయాతము లక్షణములు:– ఇందు నాలుగు పాదములు.  ప్రతిపాదంలోని గణములు  య, య, య, య (నాలుగు యగణములు) ప్రతిపాదంలోనూ 8 వ  అక్షరము యతి స్థానము. ప్రాస నియమము పాటించవలెను.  ప్రాస యతి చెల్లదు. ఉదాహరణ

భుజంగేశ పర్యంక పూర్ణానురాగన్

భుజంగప్రయాతాఖ్యఁ బూరించు చోటన్

నిజంబై ప్రభూతావనీ భృద్విరామం

బజస్రంబుగాఁ గూర్ప యా ద్వంద్వ మొప్పన్.

భుజంగ ప్రయాత వృత్త పాదము నందు గణవిభజన
IUUIUUIUUIUU
భుజంగేశపర్యంకపూర్ణానురాగన్

16.మంగళమహాశ్రీ లక్షణములు:- ఇందు నాలుగు పాదములు  కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు.   ప్రతిపాదంలోని గణములు  భ, జ, స, న, భ , జ, స, న, గగ.  ప్రతిపాదంలోనూ 9వ, 17వ అక్షరములు  అక్షరము యతి స్ధానములు. ప్రాస నియమము పాటించవలెను.  ప్రాస యతి చెల్లదు. ఉదాహరణ

చిత్తములఁ జూపులను జిత్తజునితండ్రి పయి జెంది గజదంతియతు లొందన్

వృత్తములతోడఁ దరుణీ మణులు గానరుచులింపుగను మంగళమహాశ్రీ

వృత్తములఁ బాడిరి సువృత్త కుచకుంభముల వింత జిగి యెంతయుఁ దలిర్పన్

మత్తిలించు నబ్భజిసనంబు లిరుచోటులఁదనర్పఁగఁ దుదన్గగ మెలర్పన్.

మంగళమహాశ్రీ వృత్త పాదము నందు గణవిభజన
UIIIUIIIUIIIUIIIUIIIUIIIUU
గగ
చిత్తములఁజూపులనుజిత్తజునితండ్రిపయిజెందిగజదంతియతులొందన్

17. మానిని లక్షణములు:- ఇందు నాలుగు పాదములు  కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు.   ప్రతిపాదంలోని గణములు  భ, భ, భ, భ, భ, భ, భ, గా (7 భగణములు, 1 గురువు)  ప్రతిపాదంలోనూ 7వ, 13వ, 19వ అక్షరములు యతి స్ధానములు. ప్రాస నియమము పాటించవలెను.  ప్రాస యతి చెల్లదు. ఉదాహరణ

క్రొన్నెల పువ్వును గోఱల పాఁగయుఁ గూర్చిన కెంజడకొప్పునకున్

వన్నె యొనర్చిన వాహిని యీతని వామపదంబున వ్రాలె ననన్

జెన్నుగ నద్రిభసేవ్యగురు న్విలసిల్లు రసత్రయ చిత్ర యతుల్

పన్నుగ నొందఁ బ్రభాసుర విశ్రమ భంగిగ మానిని భవ్యమగున్.

మానిని వృత్త పాదములో గణవిభజన
UIIUIIUIIUIIUIIUIIUIIUU
క్రొన్నెలపువ్వునుగోఱలపాఁగయుఁగూర్చినకెంజడకొప్పునకున్

18. మహాస్రగ్ధర లక్షణములు:- ఇందు నాలుగు పాదములు  కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు.   ప్రతిపాదంలోని గణములు  స త త న స ర ర గ  ప్రతిపాదంలోనూ 9వ, 16వ  అక్షరములు యతి స్ధానములు. ప్రాస నియమము పాటించవలెను.  ప్రాస యతి చెల్లదు. ఉదాహరణ

కొలిచెం బ్రోత్సాహ వృత్తిం గుతల గగనము ల్గూడ రెం డంఘ్రులం దా

బలిఁ బాతాళంబు చేరం బనిచె గడమకై బాపురే వామనుం డ

స్ఖలితాటో పాఢ్యుఁ డంచుం గరిగిరివిరమాకారిమారన్సతానో

జ్జ్వ లసోద్యద్రేఫయుగ్మాశ్రయ గురుల మహాస్రగ్ధరం జెప్ప నొప్పున్.

మహాస్రగ్ధర వృత్త పాదము నందు గణవిభజన
IIUUUIUUIIIIIIUUIUUIUU
కొలిచెంబ్రోత్సాహవృత్తింగుతలగగనముల్గూడరెండంఘ్రులందా

19. లయగ్రాహి లక్షణములు:- ఇందు నాలుగు పాదములు  కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు.   ప్రతిపాదంలోని గణములు జ, స, న, భ , జ, స, న, భ, య ప్రతిపాదంలోనూ  2వ, 10వ, 18వ, 26వ అక్షరములు యతి స్ధానములు. ప్రాస నియమము పాటించవలెను. ఉదాహరణ

ఎందు నిల నేజనులకుం దలఁపరాని తప మంది కొని చేసిరొకొ నందుఁడు యశోదా

సుందరియుఁ బూర్ణనిధిఁ బొందిరి కడు న్దొరసి పొందగును ముప్పు తఱి నందనునిగా శ్రీ

మందిరుని నంచు నిటు లందముగఁ బ్రాసములు గ్రందుకొని చెప్పు మునిబృందము లయగ్రా

హిం దనర సబ్భజసలుందగ నకారమును బొంద నిరుచోట్లను బిఱుం దభయ లొందన్.

లయగ్రాహి వృత్త పాదము నందు గణవిభజన
UIIIUIIIUIIIUIIIUIIIUIIIUIIIUU
ఎందునిలనేజనులకుందలఁపరానితపమందికొనిచేసిరొకొనందుఁడుయశోదా

20. లయవిభాతి లక్షణములు:- ఇందు నాలుగు పాదములు  కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు.   ప్రతిపాదంలోని గణములు  న, స, స, న, స, న, న, స, న, న, న, గ ప్రతిపాదంలోనూ  2వ, 11వ, 20వ, 29వ అక్షరములు యతి స్ధానములు. ప్రాస నియమము పాటించవలెను. ఉదాహరణ

పడయరె తనూభముల న్బడయుదురు గాక పెర పడతులును భర్తలును బడసిరె తలపన్

బుడమి గల నందుడును బడతుక యశోదయును గడపున జగత్రయ మునిడికొనిన పుత్రున్

బడసి రట యంచు బెడ గడరు నసనత్రివృతి గడనసగము ల్పొసగనిడ లయవిభాతిన్

నొడువుదురు సత్కవు లెపుడును విరితేనియలు వడియు పగిది న్రనము గడలు కొనుచుండున్.

లయవిభాతి వృత్త పాదములో గణవిభజన
IIIIIUIIUIIIIIUIIIIIIIIUIIIIIIIIIU
గా
పడయరెతనూభములన్బడయుదురుగాకపెరపడతులునుభర్తలునుబడసిరెతలపన్

21. వనమయూరము లక్షణములు:- ఇందు నాలుగు పాదములు. ప్రతిపాదంలోని గణములు  భ, జ, స, న, గగ ప్రతిపాదంలోనూ  9వ అక్షరము యతి స్థానము. ప్రాస నియమము పాటించవలెను. ప్రాస యతి చెల్లదు. ఉదాహరణ

ఉన్నతములై వనమయూర కృతు లోలిన్

ఎన్నగ భజంబులపయి న్సనగగంబుల్

చెన్నొదవ దంతియతి జెంది యలవారున్

వెన్నుని నుతింతురు వివేకు లతి భక్తిన్.

వనమయూర వృత్త పాదము నందు గణవిభజన
UIIIUIIIUIIIUU
గగ
ఉన్నతములైవనమయూరకృతులోలిన్

22. స్రగ్ధర లక్షణములు:- ఇందు నాలుగు పాదములు.   ప్రతిపాదంలోని గణములు మ, ర, భ, న ,య, య, య ప్రతిపాదంలోనూ  8వ, 15వ అక్షరములు యతి స్ధానములు.  ప్రాస నియమము పాటించవలెను. ప్రాస యతి చెల్లదు.  ఉదాహరణ

తెల్లంబై శైల విశ్రాంతిని మునియ తినిం దేజరిల్లు న్ధృఢంబై

చెల్లెం బెల్లై మకారాంచిత రభన యము ల్చెందమీద న్యకారం

బుల్లంబార న్బుధా రాధ్యు నురుగశ యను న్యోగివంద్యుం గడు న్రం

జిల్లంజేయం గవీంద్రు ల్జితదనుజ గురుం జెప్పెదర్ స్రగ్ధరాఖ్యన్.

స్రగ్ధర వృత్త పాదము నందు గణవిభజన
UUUUIUUIIIIIIUUIUUIUU
తెల్లంబైశైలవిశ్రాంతినిమునియతినిందేజరిల్లున్ధృఢంబై

Further Reading